Share News

అవాస్తవాలతో అరసంపై దాడి!

ABN , First Publish Date - 2023-11-02T01:47:30+05:30 IST

‘అర్ధసత్యాల అరసం’ పేరిట ఎస్.రామ్, ఎన్.అజయ్‌లు ఆంధ్రజ్యోతిలో అక్టోబరు 19న చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ...

అవాస్తవాలతో అరసంపై దాడి!

‘అర్ధసత్యాల అరసం’ పేరిట ఎస్.రామ్, ఎన్.అజయ్‌లు ఆంధ్రజ్యోతిలో అక్టోబరు 19న చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ సెప్టెంబరు 30 నాడు ‘ప్రశ్నించే ప్రజల గొంతుక అరసం’ అనే శీర్షికతో వ్యాసం రాస్తే వీరు భరించలేకపోయారు. నిజాం నిరంకుశ పాలనను ఈసడిస్తే సహించలేకపోయారు.

వేల్పుల నారాయణ తన వ్యాసంలో చరిత్రాధారిత విషయాలనే పేర్కొన్నారు. 13, 14 ఫిబ్రవరి 1943న తెనాలిలో జరిగిన అరసం ప్రథమ మహాసభకు హైదరాబాదు నుంచి ప్రముఖ రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి హాజరయ్యారు. ఆనాటి చర్చల్లో చురుకుగా పాల్గొని, హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు నాటి నిజాం పాలనలో ఎట్లా నిరాదరణకు గురవుతున్నాయో తెలిపారు. ప్రజాస్వామ్యానికి, భావ వ్యక్తీకరణకు, పాలకులను ప్రశ్నించేందుకు కనీసం స్వేచ్ఛలేదన్నారు. నిజాం పాలనలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేశారని, తెలుగు వారి సభలకు, సమావేశాలకు, గ్రంథ ప్రచురణలకు ఓ మానాన అనుమతులను ఇవ్వలేదని, కనీసం పెళ్ళి ఊరేగింపులు జరుపుకోవాలన్నా గస్తీ నిషాన్ పేరిట అనుమతి తీసుకోవాలని, దొరలు, జమీందారులు గ్రామాల్లో అరాచకాలు సృష్టించారని ఆవేదన చెందాడు.

ఆ కాలంలో ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, బ్రహ్మ సమాజం, ఆంధ్రమహిళా సంఘం వంటి ఎన్ని సంఘాలు ఉన్నా వాటిపై గట్టి నిఘాలే వుండేవి. ఆర్యసమాజం నాయకుడు పండిట్ నరేంద్రజీ ఒకసారి ‘హైదరాబాదు రాజ్యం ఒక సువిశాల చెరసాల’ అని పేర్కొన్నందుకు అతనిపై రాజద్రోహ నేరం మోపి జైలులో వేశారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కానీ, రామ్ అండ్ అజయ్‌‍లు మాత్రం నిజాం రాజుపై ఈగ వాలనీయరు! వారు మరో విచిత్రమైన విషయం చెప్పారు: 1944–46 మధ్య కాలంలో అడవి బాపిరాజు అధ్యక్షుడిగా అరసం హైదరాబాదు దక్కనుశాఖ ఉనికిలో ఉన్నదంటున్నారు. ఉంటే గింటే ఆ కార్యవర్గంలోని వారి పేర్లు చెబితే ఈ పరిశోధకులకు సలాములు చెప్పి తెలుసుకుంటాం. నాకు తెలిసిన విషయమేమంటే, ఆంధ్ర అరసంలో కార్యవర్గ సభ్యుడైన ఆళ్వారు స్వామి తెనాలి మహాసభ నుంచి రాగానే తెలుగు మీజాన్ పత్రికకు సంపాదకుడిగా ఉన్న అడవి బాపిరాజుతోను, ఆ పత్రికలోనే పనిచేస్తున్న రాంభట్ల కృష్ణమూర్తి, సింగరాజు లింగమూర్తి, విద్వాన్ విశ్వంలతోను చర్చించి హైదరాబాదులో అరసం యేర్పాటు కోసం యత్నించాడు. రాంకోఠిలోని దివ్య జ్ఞాన సమాజం హాలులో సభ జరుగుతుందని ఆళ్వారు స్వామి, భాస్కరభట్ల, ఇల్లిందల సరస్వతీదేవి సంతకాలతో సమావేశం నోటీసు విడుదలైంది. కానీ, ఆ సమావేశం ఆనాటి నిర్బంధ పరిస్థితులవల్ల జరుగలేదు. అట్లా ఆళ్వారుస్వామి ప్రయత్నం ముందుకు సాగలేదు.

ఇంకో ముఖ్యమైన అంశం: రామ్ అజయ్‌లు ‘తరతరాల బూజు నైజాం రాజు’ అనే రాత దాశరథి కృష్ణమాచార్యులు 1949లో రాశాడని వాక్రుచ్చారు. ఇది చరిత్ర వక్రీకరణలో భాగమే. దాశరథిని 30 డిసెంబరు 1947న వరంగల్లు సెంట్రల్ జైలు నుంచి, కాజీపేట రైల్వే స్టేషన్ ద్వారా నిజామాబాదు జైలుకు తరలించినారు. అంటే ఆయన 1948 ప్రారంభం రోజుల నుంచీ అదే జైలులో ఉన్నాడు. అక్కడే ఆళ్వారు స్వామి సైతం ఉన్నాడు. 17 సెప్టెంబరు 1948 నాడు నిజాం రాజు తన పాలనకు కనుమరుగైనాడు. అంటే నిజామాబాదు జైలులో దాశరథి ఎనిమిదిన్నర నెలలు నిజాం ప్రభుత్వ క్రూరత్వంలో మ్రగ్గి ఉన్నాడు. కానీ, మన మిత్రులు జైలు గోడలపై బొగ్గుతో ఆ కాలంలో రాసిన ఆ రాతను 1949లో నిజాం ప్రభుత్వ పతనానంతరం రాశాడని ఎలా నిర్ధారించారో తెలియదు. ‘వాస్తవానికి నైజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ఉన్నామని దాశరథి సోదరులు కూడా ఏనాడూ చెప్పుకోలేదు. అది తరువాత ప్రచారంలోకి వచ్చిన అంశం,’ అని వారు పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వ్యాఖ్య. దాశరథి సోదరులు ఇరువురూ నైజాం వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగానూ, కలాల పోరులోనూ సమరాలు చేసినవారే. కష్ట నష్టాలను భరించినవారే. కృష్ణమాచార్యులు నైజాంను ‘ముసలి నక్క’ అని ధిక్కరించాడు. రంగాచార్యులు నిజాం రాజు కాలం నాటి వ్యవస్థ దుర్మార్గాలపై పదునైన నవలలు రాశాడు. అలాంటి మహనీయుల భావాలను తప్పుదోవలో పయనించిన వారిగా చూపడం క్షంతవ్యం కానేకాదు. వేల్పుల నారాయణ అన్నట్లు, ఈ మధ్య వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్తేజిత సాహిత్యాన్ని, అరసం కలాల పోరాట సందర్భాలను మరుగున పడేసే ప్రయత్నం కొందరు కావాలనే చేస్తున్నారు. అరసంపై, ప్రగతివాదులపై మితవాదులు, దుందుడుకువాదులు జరుపుతున్న ఎదురు దాడులు కొత్తవేం కాదు. వాటిని అరసం భవిష్యత్తులోనూ ఎదిరించి నిలబడుతుంది.

డా. పల్లేరు వీరాస్వామి,

అరసం అధ్యక్షులు, తెలంగాణ

Updated Date - 2023-11-02T01:47:30+05:30 IST