హోదా ఏదైనా ‘విజయం’ ఆయన సంతకం!
ABN , First Publish Date - 2023-03-31T01:09:32+05:30 IST
పోలీసు శాఖలో 36 ఏళ్లపాటు విశేష సేవలందించి విజయ పరంపరలతో సార్థక నామధేయునిగా నిలిచిపోయిన విజయరామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగత క్రమశిక్షణ...
పోలీసు శాఖలో 36 ఏళ్లపాటు విశేష సేవలందించి విజయ పరంపరలతో సార్థక నామధేయునిగా నిలిచిపోయిన విజయరామారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగత క్రమశిక్షణ, నీతినిజాయితీలు, నిరంతర కృషి, అంకితభావం ఆయనను ఉత్తమ వ్యక్తిగా, ఉత్తమ అధికారిగా తీర్చిదిద్దాయి.
పోలీసు ప్రతిష్టను పెంచడానికి విజయరామారావు నిరంతరం కృషి చేశారు. ఆ తపనలోంచి పుట్టిందే ‘సురక్ష’ మాస పత్రిక. 1981 నవంబరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పత్రికను ప్రారంభించి, వ్యవస్థాపక సంపాదకునిగా 20ఏళ్ళపాటు ఎనలేని సేవలు అందించారు. ‘సురక్ష’ పత్రిక విజయ ప్రస్థానంలో అసిస్టెంట్ ఎడిటరుగా నేను పాలు పంచుకోవడం మరచిపోలేని అనుభవం. వ్యవస్థాపక సంపాదకునిగా (ఫౌండర్ ఎడిటర్) విజయ రామారావు 1981లో పత్రికకు ప్రభుత్వపరంగా వార్షిక బడ్జెట్‌ను కేటాయింపు చేయించి ఆర్థికంగా బలమైన పునాది వేశారు. తర్వాత కాలానుగుణంగా పత్రికకు ఒక్కొక్కటిగా హంగులు, సౌకర్యాలు, సిబ్బందిని కల్పిస్తూ ప్రభుత్వ డిపార్టుమెంటల్ మేగజైన్లకే దీన్ని తలమానికంగా తీర్చిదిద్దారు. పై అధికారులను కలవడానికే జడుసుకునే కిందిస్థాయి పోలీసులకు ‘సురక్ష’ ద్వారా ఒక చక్కటి ఆలంబన దొరికింది. తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవడానికి, పరిష్కరించుకోవడానికి పత్రిక వారధిగా మారింది. ఈ పత్రికలో తమ సమస్య ప్రచురితమైతే తప్పకుండా పరిష్కారమవుతుందనే ధీమా కిందిస్థాయి పోలీసులందరిలో ఏర్పడింది. పత్రికలోని ప్రతి పేజీ, ప్రతి అంశం పోలీసులకు ఉపయోగపడేదిగానో – ప్రజలతో వారి సంబంధాలను పెంపొందించేదిగానో ఉండాలన్నది విజయరామారావు అభిప్రాయం. జంటనగరాల పోలీసు కమీషనర్‌గా ఎంత బిజీగా ఉన్నా, వృత్తిపరంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ఈ పత్రిక పట్ల ఆయన శ్రద్ధ తగ్గేది కాదు.
ప్రజాబాహుళ్యంలో పోలీసుల పట్ల అనాదిగా నాటుకుపోయిన దురభిప్రాయాలను తొలగించి, పోలీసు ప్రతిష్టను పెంచడానికి ఆయన అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు చేశారు. పోలీసు ప్రజా సంబంధాలకు పోలీసు స్టేషన్ మొదటి మెట్టు. అందువల్ల వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్లకు వచ్చేవారితో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారుల వద్దకు పంపించడం కోసం నగర పోలీసు కమీషనర్‌గా ప్రతి పోలీసు స్టేషన్‌లో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారు. ‘మే ఐ హెల్ప్ యు’ లాంటి బోర్డులను అన్ని పోలీసు స్టేషన్‌లలో ప్రవేశ ద్వారం వద్దనే పెట్టించారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ళ యూనిఫాంను మార్పు చేయడంలో గాని, పోలీసు ట్రెయినింగులో ఆధునిక శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో గాని, సిబ్బంది జీతభత్యాలను, సౌకర్యాలను పెంచడంలోగాని ఆయన చేసిన కృషి అనితరసాధ్యం.
సినిమాల్లో పోలీసుల్ని జోకర్లుగా, లంచావతారులుగా, అసాంఘిక శక్తులకు వంతపాడే వారిగా చూపించినప్పుడల్లా విజయరామారావు ఆవేదనతో సత్వరం స్పందించేవారు. వాస్తవ పరిస్థితులను వివరించడానికి ప్రయత్నించేవారు. ‘పోలీసోడి పెళ్ళాం’ అనే టైటిలుతో ఒక సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఆ సినిమా వారితో మాట్లాడి, సెన్సార్ ఆఫీసు తలుపు తట్టి, సినిమా పేరును ‘పోలీసుభార్య’గా మార్పించారు.
ఒకప్పుడు పోలీసు శాఖలో హోంగార్డులుగా నియమితులైనవారు హోంగార్డులుగానే రిటైరయ్యేవారు. ఎంతో కాలంగా పోలీసు శాఖకు సేవలందిస్తున్న వీరిలో అర్హులైనవారికి కానిస్టేబుల్‌గా అవకాశం కల్పించడానికి విజయరామారావు పోలీసు రిక్రూట్మెంటులో వారికి కొంత రిజర్వేషన్ కల్పించారు. దీంతో ఎంతో మంది హోంగార్డులు కానిస్టేబుల్స్ అయ్యారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఐజీగా ఉన్నప్పుడు ఆయన పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టి అందరి ప్రశంసలూ అందుకున్నారు. శారీరక దారుఢ్యం, రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి, ప్రతిభ ఆధారంగా వేలాదిమందిని ఎంపిక చేసి, వారికి విజయవంతంగా శిక్షణ ఇప్పించారు. పోలీసు శిక్షణాకేంద్రాలను పటిష్టంచేసి, శిక్షణలో ఆధునిక అంశాలను ప్రవేశపెట్టి పోలీసు రిక్రూట్లను మెరికల్లాగా తీర్చిదిద్దారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి వారి కుటుంబాలు, పిల్లల సంక్షేమానికి విజయ రామారావు నిరంతరం కృషి చేశారు. పోలీసు క్వార్టర్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పాటుపడ్డారు. కొత్త క్వార్టర్లను నిర్మించడంలో, ఉన్నవాటికి మరమ్మత్తులు చేయించడంలోగాని ఆయన కృషి మరువలేనిది.
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పాటించడం, నివాళులు అర్పించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే పోలీసు అమర వీరుల జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం అంటూ ఏదీ ఉండేది కాదు. ఈ లోటును పూడ్చడానికి విజయరామారావు నగర పోలీసు కమీషనర్‌గా ఉన్నప్పుడు చొరవ తీసుకున్నారు. కొంతమంది చిత్రకారులను, శిల్పులను సంప్రదించి వారిచేత పోలీసు అమరుల త్యాగాలను ప్రతిబింబించే రీతిలో ఒక స్మారక చిహ్నాన్ని డిజైన్ చేయించారు. దీని ఆధారంగా ఒక స్మారక స్తూపాన్ని రూపొందింపజేశారు. దానిపై ‘ఈనాటి మీ ఆత్మార్పణం – రేపటి మా కోసం’ అన్న అర్థం వచ్చే విధంగా ఇంగ్లీష్‌లో చక్కని నినాదాన్ని రాయించారు. నగరం నడిబొడ్డున గోషా మహల్ పోలీసు స్టేడియంలో ఈ స్తూపాన్ని నెలకొల్పి, అక్టోబర్ 21నాడు నాటి హోంమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ప్రతి ఏటా నగర పోలీసులు అక్టోబర్ 21న ఇక్కడే పరేడ్ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించడం సంప్రదాయంగా మారింది. పోలీసు అధికారిగా విజయరామారావు సేవలకు నిలువెత్తు సాక్ష్యం ఇది.
పదవీ విరమణ తర్వాత విజయ రామారావు రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా సేవలందించారు. రాజకీయ జీవితంలో కూడా మచ్చలేకుండా అంకితభావంతో పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీగా పని చేసినప్పుడు ఆ సంస్థను లాభాల బాట పట్టించారు. ఏ శాఖలో, ఏ హోదాలో పని చేసినా ఆ శాఖ పని తీరును మెరుగుపర్చటంలో అపూర్వ విజయాలు సాధించిన సార్థక నామధేయుడు ఆయన.
పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు విజయ రామారావును సీబీఐ డైరక్టరుగా నియమించి ఢిల్లీ తీసుకువెళ్లారు. ఆ పదవిలో ఆయన అనేక సంచలనకర కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. 36ఏళ్ళ సర్వీసులో ఎన్నో ఉన్నత పదవులను విజయవంతంగా నిర్వహించిన విజయ రామారావు తమ అనుభవాన్నంతా రంగరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు ‘పోలీసు మాన్యువల్’ను పునర్లిఖించారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు అదే ప్రామాణికం. విజయ రామారావు వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ మచ్చలేని వ్యక్తి. నలుగురికీ ఆదర్శప్రాయుడు. పోలీసు యూనిఫాంకు ఎంతో గౌరవం తెచ్చిన విజయరామారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఎస్. బాల్‌రెడ్డి
మాజీ సహాయసంపాదకులు, ‘సురక్ష’ మాస పత్రిక
(రేపు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో
విజయరామారావు సంస్మరణసభ)