మరి వినిపించని మధురగళం
ABN , First Publish Date - 2023-02-05T01:04:32+05:30 IST
సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గాయని వాణీ జయరాం. చిన్నతనం నుంచి శాస్ర్తీయ సంగీతం నేర్చుకున్న ఆమెకు లలిత సంగీతం అంటే చాలా ఇష్టం...

సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గాయని వాణీ జయరాం. చిన్నతనం నుంచి శాస్ర్తీయ సంగీతం నేర్చుకున్న ఆమెకు లలిత సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె ధ్యాస ఎప్పుడూ సినిమా పాటలపైనే ఉండేది. ముఖ్యంగా లతామంగేష్కర్ పాటలు బాగా వినేవారు. వాణీ జయరాం మాతృభాష తమిళం అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడేవారు. అందువల్లే ఆమె ఏ తెలుగు పాట నయినా చాలా భావయుక్తంగా పాడేవారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాణీ జయరాంకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ శుభవార్త తెలిసి శుభాకాంక్షలు తెలుపడానికి ఆమెకు చాలాసార్లు ఫోన్ చేస్తే కలవలేదు. మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాను. అది చూసి ఆమె చాలా సంతోషించారు. వెంటనే ఫోన్ చేశారు. ‘‘ప్రసాద్, మద్రాస్ వస్తానన్నావు కదా, ఎప్పుడు వస్తున్నావు’’ అని అడిగారు. గత నెల 31న కుటుంబ సమేతంగా చెన్నై వెళ్లాను. ఆమె నివాసంలో బస చేశాను. ఎప్పటి లాగానే మంచి అతిథి మర్యాదలు చేశారు. మాకు ఆమె స్వయంగా వడ్డించారు. ఆమెను స్వయంగా చూసి, మాట్లాడి నాలుగు రోజులే అయింది. ఇంతలో శనివారం మధ్యాహ్నం ఆమె మరణ వార్త వినవలసి రావడం చాలా బాధగా ఉన్నది. వాణీ జయరాం లేరు అనే వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను.
నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దక్షిణాది రాష్ర్టాలకు సంచాలకుడిగా పనిచేశాను. 2015లో ఉద్యోగ విరమణ పొందాను. అంతకుముందు దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధిగా పనిచేశాను. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నాకు సన్నిహితులు. వాణీజయరాంను నాకు పరిచయం చేసింది కూడా ఆయనే. 1979లో దక్షిణ భారతావని అంతటా సంచలనం సృష్టించిన ‘శంకరాభరణం’ సినిమాకు పలు జాతీయ అవార్డులు ప్రకటించారు ఈ కళాఖండం స్రష్ట కె. విశ్వనాథ్ కూడా రెండురోజుల క్రితమే మరణించడం చాలా దురదృష్టకరం. ఆ సినిమాలో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాంకి జాతీయ ఉత్తమ గాయనీ గాయకులుగా అవార్డులు లభించాయి. ఆ అవార్డులు ప్రకటించిన రోజున నేను చెన్నైలో బాలసుబ్రహ్మణ్యం గృహంలోనే ఉన్నాను. అప్పుడు ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిగా పనిచేస్తున్నాను. ఆ శుభ సందర్భంలో బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాను. అయితే నాది కాదు, వాణి జయరాం ఇంటర్వ్యూ తీసుకోమని ఆయన ప్రోత్సహించారు. అప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేశాను. అలా ఆమెతో నా పరిచయం మొదలయింది.
ఆనాటి పరిచయం క్రమంగా దృఢమయింది. మా కుటుంబాలు సన్నిహితమయ్యాయి. నాకు సంగీతంలో శ్రద్ధాసక్తులు ఉన్నాయి. సంగీతానికి సంబంధించి ఎన్నో విషయాలను మేమిరువురం చర్చించుకునేవాళ్లం. వాణీ జయరాం తమ కుటుంబ నేపథ్యం చెప్పేవారు. మా కుటుంబం గురించి అడిగేవారు. ఇలా ఎంతో సన్నిహితులయ్యాం. ఆ తర్వాత రఘునాథ్ చెఠ్ స్వరపరచిన మీరా భజన్స్ ఎల్పీ రికార్డును నాకు బహుమతిగా ఇచ్చారు. నేను మద్రాస్ వెళ్లినప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్లేవాడిని. వాణీ జయరాం సంగీత కార్యక్రమాలకు విజయవాడ వస్తే మా ఇంటికి తప్పక వచ్చేవారు. అలా మా కుటుంబాల మధ్య సాన్నిహిత్యం బలపడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సమాచార అధికారిగా నేను తిరుమలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు వాణీ జయరాం తిరుమలకు సంగీత కచేరిలో పాడేందుకు వచ్చారు. అప్పుడు ఆమె కుటుంబంతోపాటు మా కుటుంబం రెండు రోజులు తిరుమలలో గడిపిన మధురానుభూతులు చాలా ఉన్నాయి. సంగీతంలో నాకు కొంచెం ప్రవేశం ఉండడంతో ఆమె నన్ను తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచేవారు.
వాణీ జయరాం 19 భాషల్లో వెయ్యి చిత్రాల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. ఆమె అసలు పేరు కళావాణి. తమిళనాడులోని వెల్లూరు ఆమె కన్న ఊరు. మద్రాస్‌లో డిగ్రీ విద్యను పూర్తి చేశారు. తర్వాత స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. 1969లో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆమెకు వివాహం జరిగింది. భర్త జయరాం ఆర్కిటెక్ట్. ఆయన సితార వాయిద్యం వాయించేవారు. వాణీ జయరాం దంపతులు ముంబైలో స్థిరపడ్డారు. ముంబై వెళ్లే నాటికే కర్ణాటక సంగీతాన్ని ఆమె బాగా నేర్చుకున్నారు. హిందూస్థానీ సంగీతం నేర్చుకోమని జయరాం ఆమెను ప్రోత్సహించారు. అబ్దుల్ రెహమన్ ఖాన్ దగ్గర ఆమె హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. రోజుకు 10గంటలపాటు చాలా కఠోరంగా సాధన చేసేవారు. అక్కడికి వెళ్లిన తొలినాళ్లలోనే ప్రముఖ సంగీత దర్శకుడు వసంత దేశాయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన ఒక హిందూస్థాని ఆల్బమ్ చేస్తుంటే వాణీ జయరాం గొంతు బాగుంటుందని యుగళగీతం పాడించారు. కుమార గంధర్వతో పాటు కలిసి పాడించారు. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ఆ పాట ‘రుణాను బంధచా..’ అని వస్తుంది. దీంతో 1971లో ‘గుడ్డి’ అనే సినిమాలో జయబాధురికి వాణి జయరాంతో పాడించారు. ఆ పాటలు ఎంతో ఆదరణ పొందాయి. బోల్‌రే పప్పిహరా.. హంకో మాన్ కీ శక్తి దేనా.. అనే రెండు పాటలకు ఎన్నో అవార్డులు లభించాయి. సినిమాలో పాడిన మొదటి పాటలకే అవార్డులు అందుకున్న ప్రతిభావంతురాలు వాణీ జయరాం. ఆ తరువాత ఆమెకు ప్రతిష్ఠాత్మక తాన్‌సేన్ సన్మాన్ అనే పురస్కారం కూడా లభించింది. తొలిపాటలకే అవార్డులు రావడంతో హిందీ సినిమా రంగంలోని చాలామంది డైరెక్టర్లు ఆమెతో పాటలు పాడించారు. పండిట్ రవి శంకర్ ‘మీరా’ చిత్రాన్ని 1979లో హేమమాలినితో తీశారు. ఆ సినిమాకు 12 మీరాబాయి కృతులను వాణి జయరాంతోనే రవి శంకర్ పాడించడం విశేషం. తెలుగులో ఆమె మొదట ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాడారు. ఇది 1973లో జరిగింది. అప్పటికే జేసుదాసు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుప్రసిద్ధ గాయకులుగా ఉన్నారు. వారిరువురూ ఆమెను బాగా ప్రోత్సహించారు. అమ్మాయి శపథం, పూజ, శంకరాభరణం తదితర తెలుగు సినిమాల్లో ఆమె పాడారు. శంకరాభరణం చిత్రంలో పాడిన పాటలకు ఉత్తమగాయని అవార్డుతో పాటు నంది అవార్డును కూడా ఆమె అందుకున్నారు. 1992లో ‘స్వాతికిరణం’ సినిమాలో పాడిన పాటకు ఆమె మరోసారి ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. 1975లో తమిళ సినిమా ‘అపూర్వ రాగంగళ్’ లోని పాటకు కూడా ఆమెకు ఉత్తమ గాయని అవార్డు లభించింది. తెలుగులో ముఖ్యంగా రాజన్ నాగేంద్ర, ఇళయరాజా, చక్రవర్తి, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆమె పాటలు పాడారు. తమిళంలో ‘పులి మురుగన్’ అనే సినిమాలోని జ్వాలపాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. పండిట్ బిర్జు మహారాజ్‌తో కలిసి హోలీ పాటలు, భజన్స్ ప్రయివేట్ ఆల్బమ్స్ రికార్డు చేసి విడుదల చేశారు.
ఎంవిఎస్ ప్రసాద్
విశ్రాంత పాత్రికేయులు