అన్ని ‘ఇజా’ల కలబోత గద్దర్‌!

ABN , First Publish Date - 2023-09-26T02:34:20+05:30 IST

గుమ్మడి విఠల్‌రావు జననాట్యమండలికి పూర్తికాలం పనిచేస్తూ, తెలంగాణాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల సాంస్కృతిక శక్తిగా స్థిరపడ్డాడు...

అన్ని ‘ఇజా’ల కలబోత గద్దర్‌!

గుమ్మడి విఠల్‌రావు జననాట్యమండలికి పూర్తికాలం పనిచేస్తూ, తెలంగాణాలో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల సాంస్కృతిక శక్తిగా స్థిరపడ్డాడు. తెలుగునేల మీద జన నాట్యమండలి ద్వారా కళాకారులకు ప్రత్యేకమైన ఆహార్యాన్ని, అభినయాన్ని, ఆలాపనను, మాదిగ డప్పుకు జతచేశాడు. పీడిత ప్రజల వ్యధలను, దోపిడీని, వివక్షతను ప్రజలు వాడుకభాషలో పాడి, ఆడి, అభినయించి ప్రజలను విప్లవోద్యమం వైపు అడుగులు వేసే వారధిగా మారాడు. పీపుల్స్‌వార్‌ ఇచ్చిన ప్రొగ్రాంను జన నాట్యమండలి సక్సెస్‌ఫుల్‌గా నెరవేర్చింది. జననాట్యమండలి సభ్యులు, గద్దర్‌, దివాకర్‌, సంజీవ్‌, ఈవి, రాజనర్సు, డప్పు రమేష్‌, ఏసన్న అద్భుతమైన కళాకారులు, గాయకులు. వీరిలో గద్దరన్నది విలక్షణమైన శైలి. కోట్లమంది పీడిత ప్రజల కన్నీటి వ్యధలను తన గొంతు ద్వారా ప్రవహించిన ఈ శతాబ్దపు అద్భుతం గద్దర్‌.

1972 నుండి 1992 వరకు పీపుల్స్‌వార్‌ అనుబంధ సంస్థలు నిషేధించబడేంతవరకు జననాట్యమండలి ప్రదర్శనలలో దేశవ్యాప్తంగా పాడిన పాటలు అన్నీ, ఆ పాటల రచయితలు ఎవరయినా కానీ, జననాట్యమండలి పాటలుగానే ప్రచారం అయ్యాయి లేదా గద్దర్‌ పాటలుగా ప్రచారం అయ్యాయి. ఎందరో కవులు రాసిన పాటలను గద్దర్‌ పాడి, ఆ పాటలద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలను తన ఎకౌంట్లో వేసుకున్నాడనే విమర్శ కూడా ఉన్నది. జననాట్యమండలి వేదికల మీద గద్దరన్న పాడిన పీడిత ప్రజల హిట్టయిన పాటలకు వచ్చిన ‘రాయల్టీ’గా ప్రజల స్పందనతో పాటు అజ్ఞాత జీవితం, నిర్భంధ జీవితం, అవమానాలు, తుపాకీ తూటాలు పొందాడు గద్దర్‌.

ఎన్నో సంవత్సరాల పాటు గద్దరన్న కుటుంబం తాము గద్దర్‌ భార్య బిడ్డలం అని చెప్పుకోలేని దుస్థితి. గ్రేహౌండ్స్‌, గ్రీన్‌టైగర్స్‌, ఇంటెలిజెన్స్‌ వాళ్ళ బెదిరింపులు, నిఘా మధ్య కొన్ని వేల రాత్రులు గడిపారు. మందిపిల్లలు అడవుల్లో గద్దర్‌ పిల్లలు అమెరికాలో అని విష ప్రచారం చేశారు. గద్దర్‌ పాటలు విని వేలాదిమంది నక్సలైటు ఉద్యమంలో ప్రాణాలు వదిలితే గద్దర్‌ మాత్రం విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడని, అమరవీరుల త్యాగాలను సొమ్ము చేసుకుంటున్నాడని వ్యక్తిత్వ హననం చేసారు. సమసమాజ స్థాపనకు సాయుధపోరాటం సరి అయిన మార్గం అని నమ్మిన విద్యావంతులూ అనేకమంది విప్లవోద్యమంలోకి వెళ్ళారు. వీరంతా గద్దరన్న హిట్టు పాటల ద్వారా ఎమోషన్‌తో వెళ్ళిన వాళ్ళు కాదు. అమరవీరులకు స్పష్టమైన రాజకీయ అవగాహన ఉంది. తాము ఎంచుకొన్న మార్గంలో ప్రాణ త్యాగం చేయాల్సి వస్తుందని, తమ కుటుంబాలు పోలీసు వత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుందని, తాము దొరికితే ‘‘థర్డ్‌ డిగ్రీ’’ ప్రయోగిస్తారని తెలుసు. అంత హింసను భరించి పీడిత ప్రజల విముక్తి కోసం చిరునవ్వుతో ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను, గద్దరన్న పాట ద్వారా సాయుధ పోరాటంలోకి వెళ్ళారని ప్రచారం చేయటం అజ్ఞానం, అవివేకం.


1992లో పీపుల్స్‌వార్‌తోపాటు ఆరు ప్రజా సంఘాలను ప్రభుత్వం నిషేధించింది. గద్దర్‌ రాజకీయ ఖైదీల విడుదల పోరాటం, బూటపు ఎన్‌కౌంటర్ల వ్యతిరేక ఉద్యమం, అమర వీరుల బంధుమిత్రుల కమిటీ, యస్‌.సి రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పనిచేశారు. 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై కాల్పులు జరిగాయి. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. 2004లో జనశక్తి, పీపుల్స్‌వార్‌, ప్రభుత్వం శాంతి చర్చలలో భాగంగా నక్సలైట్ల ప్రతినిధిగా పాల్గొన్నాడు. చర్చలలో పాల్గొన్న నక్స్‌లైట్‌ ప్రతినిధులు అందరకూ అంబేడ్కర్‌‌ రచనలు అధ్యయనం చేయమని అప్పటికి అందుబాటులో ఉన్న 10 వాల్యూమ్స్‌ నాతో ఇప్పించాడు. పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్‌లో భాగంగానే ‘‘తెలంగాణ ప్రజా ఫ్రంట్‌’’ స్థాపించాడు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో భాగంగానే ప్రొగ్రసివ్‌, డెమోక్రాటిక్‌, సెక్యులర్‌ శక్తులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో వేదికలు పంచుకున్నాడు. ప్రజాకవి జైరాజ్‌తో కలసి తెలంగాణా అంతటా అనేక నిర్భంధాలను ఎదుర్కొంటూ శాంతియాత్ర చేశాడు. అప్పుడు గద్దరన్న ఎర్రజెండాతో పాటు ‘పంచశీల’ జెండాను తన గుండెలకు హత్తుకున్నాడు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ‘జమాయితే ఉలేమా ఎ హింద్‌’తో కలసి దేశవ్యాప్తంగా ‘జాతీయ సమైక్యత’ కోసం అనేక సభలలో పాల్గొన్నాడు. తెలంగాణ, దండోరా ఉద్యమాలను బలపరచటం వలన ఆంధ్రప్రజలకు, మాలలకు దూరమయ్యాడు. గద్దర్‌ లేని తెలంగాణా ఉద్యమం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే లేదు. రాజ్యానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాలలో జరిగిన ప్రతి ఉద్యమంలో తుపాకులకు ఉద్యమకారులకు మధ్య గద్దర్‌ తన ఛాతిని రక్షణ కవచంగా ఉంచాడు. అంబేడ్కర్‌‌, జగజ్జీవన్‌రాం జయంతులలో పాల్గొన్నందుకు పార్టీ నుండి షోకాజ్‌ నోటీసులు అందుకున్నాడు. అమరవీరుల కుటుంబాల పట్ల మావోయిస్టు పార్టీ ఎలాంటి దృక్పథాన్ని అవలంబించిందో గద్దర్‌ పట్ల కూడా అదే వైఖరి అవలంబించింది.

చైనా విముక్తి పోరాటంలో చైర్మన్‌ మావో అనుసరించిన విధానాలనే గద్దర్‌ ఆచరించాడు. విభిన్న రాజకీయ దృక్పథాలు గల పార్టీలు, వ్యక్తులు సమూహాలతో కలిసి పనిచేశాడు. భద్రాద్రి, వేదాద్రి వేదిక ఏదయినా కానీ తుదివరకూ రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కవులు, కళాకారులు వివిధ సంఘాల నాయకులు తనను దూషించినా ద్వేషించినా తల్లికోడిలా, రెక్కల కింద కాచి కాపాడుకున్నాడు.

యస్‌సి వర్గీకరణ అంశంలో గద్దర్‌ చివరి వరకూ లేడని, మాల మాదిగల విషయంలో సమధర్మం పాటించలేదని, ధర్మాన్ని పాటించటం అంటే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించటం కాదని, సామాజిక న్యాయం విషయంలో గద్దర్‌ మాల పక్షపాత ధోరణి అవలంబించినాడని ఆరోపణలు ఉన్నాయి. యస్‌సి వర్గీకరణ వాదుల సామాజిక న్యాయ సిద్ధాంతం పసలేనిది. సామాజిక న్యాయం చలనశీలమైనది. స్థల, కాలాలకు విస్తరిస్తుంది. భిన్న రూపాల్లోని అంతస్సార సాపేక్షతను ప్రదర్శిస్తుంది. ఇది సామాజిక న్యాయ సాధనలో ప్రాథమిక దశ, అంటే దోపిడీ కులాలకు, శ్రామిక కులాలకు మధ్య సామాజిక సమానత్వ సాధన దశ. తరువాత పీడిత కులాల మధ్య అంతరాలను పరిష్కరించుకొనే దశ. చివరి దశ డా॥. బిఆర్‌ అంబేడ్కర్‌‌ ఆశించిన మహోన్నతమైన సంపూర్ణ సామాజిక న్యాయ దశ. సామాజిక న్యాయం పేరుతో దండోరాకు మద్దత్తునిచ్చిన మేధావులు సామాజిక న్యాయ భిన్న దశలను అర్ధం చేసుకోకపోవటమే సమస్య. యస్‌సిలు ఐక్యంగా దోపిడీ కులాలపై ఎక్కుపెట్టాల్సిన పోరాట ఆయుధాన్ని తమతోటి సైనికుడిపై ఎక్కుపెట్టటానికి కొందరు యస్‌సి దళారులు వ్యాపింపచేసిన తప్పుడు చైతన్యం కొంత కారణమైతే, కుహానా మేధావుల మద్దతు నిజమైన సామాజిక న్యాయ చైతన్యాన్ని వికృతపరచి తాత్విక భ్రమలను వ్యాపింపజేసింది. 2005లో సుప్రీంకోర్టు యస్‌సి వర్గీకరణ చట్టం రాజ్యాంగబద్ధం కాదని కొట్టివేసింది. 18 సంవత్సరాల తరువాత గద్దర్‌ మరణానంతరం నెపం వేయటం ఏ ప్రయోజనాన్ని ఆశించి? సమాధానం చెప్పుకోవటానికి గద్దర్‌ లేడు కదా?

గద్దర్‌ తుదిశ్వాస వరకూ వేదిక ఏదయినా రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే ఆడి, పాడాడు. లక్షలాది మంది స్వచ్ఛందంగా గద్దర్‌ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కోట్లాది మంది టివిలలో చూసి విలపించారు. 2017లో పార్టీకి రాజీనామా చేసాడు. అనంతరం బుద్దుని పంచశీలను భుజానికెత్తుకున్నాడు. కుల, మత రాజకీయాలకు అతీతంగా ఆ ప్రజావిప్లవ గాయకుని అంతిమ యాత్ర జరిగింది. ప్రభుత్వ గౌరవ లాంఛనాలు, విప్లకారుల ఎర్రజెండాలు, అంబేద్కరిస్టుల నీలిజెండాలు, బుద్ధుని పంచశీలతో అంతిమ సంస్కారం జరగటం ప్రపంచ చరిత్రలో అత్యంత అపురూపమైన అరుదైన ఘటన. ఈ యుగం విప్లవ గాయకుడు గద్దర్‌. కువిమర్శకులు ఎన్నో నిందారోపణలు చేయవచ్చు, అసూయా ద్వేషాలతో విషపు రాతలు రాయవచ్చు. కానీ, జ్ఞానం, శీలం, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, ప్రజల సమస్యల పట్ల స్పష్టమయిన అవగాహన, స్త్రీల పట్ల అపారమైన గౌరవం వున్న నిఖార్సయిన అంబేడ్కర్‌‌ వాది గద్దర్‌. బుద్ధిజం, కమ్యూనిజం, సోషలిజం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, అంబేడ్కరిజం కలబోత గద్దర్‌. జై భీమ్‌, రెడ్‌ శాల్యూట్‌.

మల్లెల వెంకట్రావు

మాల మహాసభ వ్యవస్థాపకులు

Updated Date - 2023-09-26T02:34:20+05:30 IST