ధర్మాన్ని ఎరుకపరిచిన నైతిక యాత్ర

ABN , First Publish Date - 2023-02-03T01:30:32+05:30 IST

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (7 సెప్టెంబర్ 2022– 30 జనవరి 2023) కన్యాకుమారిలో ప్రారంభమై జమ్మూ–కశ్మీర్‌లో ముగిసింది...

ధర్మాన్ని ఎరుకపరిచిన నైతిక యాత్ర

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (7 సెప్టెంబర్ 2022– 30 జనవరి 2023) కన్యాకుమారిలో ప్రారంభమై జమ్మూ–కశ్మీర్‌లో ముగిసింది. కశ్మీర్‌ ప్రజలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో మొత్తం పాదయాత్రకు ఒక విశేషమైన ప్రాధాన్యం వచ్చింది. కశ్మీర్‌ ప్రజలు కొంతకాలంగా గాలి పీల్చుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి నుంచి సామాజిక సామరస్యత పేర ఒక ప్రముఖ పార్టీ రాజకీయ నాయకుడు పాదయాత్ర చేస్తూ తమ మధ్యకు రావడం వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని కలిగించినట్లు కనిపించింది. ఒక్క కశ్మీర్‌లోనే కాదు దేశవ్యాప్తంగా గత దశాబ్దకాలం నుంచి ఒక భయానక పరిస్థితి నెలకొంది. రాజ్యం తన అన్ని ఏజెన్సీలని, అన్ని నిర్బంధ చట్టాలని తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దురుపయోగించడమే కాక ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి రంగం మీద దాడి చేస్తున్నది. ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు, సామాజిక సంస్థల కార్యకర్తలు, కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ అవార్డులు పొందినవారితో సహా అందరూ ప్రభుత్వ ఏజెన్సీల నిర్బంధానికి గురి అయ్యారు, అవుతున్నారు. తమ రాజకీయాలతో విభేదించిన వారిని అర్బన్‌ నక్సలైట్లు అని ముద్ర వేసి జైళ్లపాలు చేస్తున్నారు. దీనికి భీమా కోరెగాం ఒక కొట్టవచ్చిన ఉదాహరణ.

రాజకీయాలు ప్రజల జీవన్మరణ సమస్యలను పరిష్కరించే బదులు అభివృద్ధి నినాదంతో గతంలో ఎన్నడూ లేని అసమానతలను సృష్టించాయి. ఈ అభివృద్ధి నమూనాకు బీజాలు వేసింది కాంగ్రెస్‌ పార్టీయే. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇచ్చి పెంచి పోషించారు. ఒక దశాబ్దకాలం నిరాఘాటంగా నియోలిబరల్‌ ఆర్థిక నమూనాని అమలుచేశారు. ఈ నమూనా సృష్టించిన భిన్న చిక్కుముడులలో చిక్కుకొని చివరకు 2014లో అధికారాన్ని కోల్పోయారు. ఇదే అభివృద్ధి నమూనాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరింత నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నది. కాంగ్రెస్‌కు లేని కొన్ని శక్తులు బీజేపీకి అనుకూలించాయి. ప్రధానంగా, ఈ రాజకీయ పక్షం మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌, దాని అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయి దాకా విస్తరించి ఉన్నాయి. దీనికితోడు కార్పొరేటు మీడియా, సోషల్‌ మీడియా విపరీతంగా విస్తృతి చెందింది. ఈ పార్టీకి మతపరమైన భావజాలముంది. ఆర్థిక వనరులు అపరిమితంగా అందుబాటులో ఉన్నాయి. రాజకీయాలు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించే స్థితిలో లేనప్పుడు ప్రజల దృష్టిని వాస్తవమైన సమస్యల నుంచి ఇతర అంశాలకు మళ్లించడం ప్రపంచవాప్తంగా చూస్తున్నాం. ఇప్పుడు మన దేశ రాజకీయాలలో కూడా జరుగుతున్నది అదే. సమాజ పరిణామక్రమంలో మతం పాత్ర ఇంకా మిగిలే ఉన్నది. గురజాడ చెప్పిన ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటె మిగిలి వెలుగును’ అనే స్థాయికి సమాజం చేరుకోలేదు. రాజ్యం, మార్కెట్‌, శాస్త్రీయ విజ్ఞానం మతంతో చాలా తలపడ్డాయి. దీనివల్ల పాశ్చాత్య దేశాల్లో మతం చాలా వరకు వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాల్లో భిన్నమైన అంతరాలు, అసమానతలు, ఆధిపత్యాలు తగినన్ని అవకాశాలు లేకపోవడం, విద్య వైద్యం వంటివి అందుబాటులో లేకపోవడం వల్ల మతవిశ్వాసాలు బలపడుతున్నాయి.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నియోలిబరల్‌ ఆర్థిక నమూనా సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టినకొద్దీ రాజకీయాల్లో భావజాలం మారి రాజ్యాంగ విలువలకు భిన్నంగా మత విశ్వాసాలని విద్వేషాలుగా మార్చడంతో సహజీవనం, సమభావనం అనే ఉదాత్త విలువలకు విఘాతం కలిగింది. మతాల మధ్య, సమూహాల మధ్య నిచ్చెనమెట్ల కులాల మధ్య హింస పెరిగింది. దళితుల, ఆదివాసీల, మహిళల మీద కూడా హింస పెరుగుతున్నది. అన్నిరకాల సామాజిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో చిక్కుకున్నాయి. తమ జీవితంలో ఉండే అసమగ్రతకు, ఆందోళనకు, అభద్రతకు లోపభూయిష్ట వ్యవస్థలో కారణాలు చూసే బదులు వీటికి కారణం ఇతర మతస్థులని, సమూహాలనే ప్రచార రాజకీయాల విషవలయంలో చిక్కుకున్నారు. ఈ సమాజం ఎటుపోతున్నది అన్న మౌలిక ప్రశ్న అడగనంతకాలం ఈ సంక్షోభం ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది.

ఈ రాజకీయ, సామాజిక, ఆర్థిక సందిగ్ధకాలంలో, అన్ని సమస్యలను కాకపోయినా సమాజంలో సహజీవన అవసరాన్ని, సమ్మిళిత సంస్కృతి విలువని ఎత్తిపట్టడం రాహుల్‌ గాంధీ తన పాదయాత్ర లక్ష్యంగా పేర్కొన్నారు. పాదయాత్రకు ఊహించిన దానికంటే ప్రజల నుంచి విస్తృత స్పందన వచ్చింది. దీనిని తాను కూడా ఊహించలేదని రాహుల్‌ గాంధీ కశ్మీర్‌లోని పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు. ఈ సుదీర్ఘ పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి, అన్ని సమూహాల నుంచి స్పందన వచ్చింది. ఈ స్పందన లోతుపాతులను ఇంకా లోతుగా పరిశీలించవలసి ఉంది. కానీ సహజీవన ఆకాంక్ష సమాజంలో ఇంకా మిగిలి ఉన్నదన్న ఒక విశ్వాసాన్ని ఈ పాదయాత్ర కలిగించింది.

రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభం కాక ముందు గత మే నెలలో హైదరాబాద్‌ వచ్చినప్పుడు స్థానిక కాంగ్రెస్‌ కోరిక మేరకు ఐదారుమంది మిత్రులం ఆయనను కలిసి ఒక గంటసేపు మాట్లాడాం. ఈ సందర్భంలో పౌరహక్కుల కార్యకర్తగా దేశంలోని నిర్బంధ చట్టాల గురించి చెపుతూ, ఈ చట్టాలు కాంగ్రెస్‌ కాలంలోనే ప్రవేశపెట్టారని, వాటికి భారతీయ జనతాపార్టీ మరింత పదునుపెట్టి దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, పౌరహక్కులకు ఇవి చాలా ప్రమాదకరమని చెపుతూ, ఉపా వంటి చట్టం ప్రభుత్వ యంత్రాంగానికి ఎంత విచ్చలవిడి అధికారాలిచ్చిందో వివరిస్తూ, ఈ చట్టాలను ఎత్తివేయాలని సూచించాం. ఇదే అంశాన్ని తెలంగాణ పౌరహక్కుల సంఘం లిఖిత రూపంలో ఇచ్చిన పత్రాన్ని నేను మూడవ పర్యాయం కలిసినప్పుడు ఆయనకు ఇచ్చాను. ఆ పత్రాన్ని జాగ్రత్తగా తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. రెండవ పర్యాయం పాలమూరు అధ్యయన వేదిక సభ్యులం ఆయనను కలిశాం. ఈసారి సూటిగా కాంగ్రెస్‌ పార్టీ అభిమానులం కాదని, కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పుడు విధానాలను నిరంతరంగా విమర్శిస్తూ మాట్లాడాం, రాశాం అని చెపుతూ... ‘మీరు ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద నియోలిబరల్‌ అభివృద్ధి నమూనా ప్రజలకు హాని చేయడం వల్ల మీరు 2014 ఎన్నికలలో ఓడిపోయారు’ అని అన్నప్పుడు మేం అమలుచేసిన నియోలిబరలిజం ఎంత కాదన్నా సాఫ్ట్‌ నియోలిబరలిజం, కాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నియోలిబరలిజాన్ని నిర్దాక్షిణ్యంగా అమలుచేస్తున్నా రెండవ పర్యాయం కూడా ఎందుకు గెలిచారు అనే ప్రశ్న వేశారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజా ఉద్యమాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయనను కలవడానికి చాలామంది ఎదురు చూస్తుండడంతో సమయాభావం వల్ల లోతైన విశ్లేషణ సాధ్యం కాలేదు. కాంగ్రెస్‌ పార్టీ విధానాల పట్ల మాకు విమర్శ ఉన్నా, ఫాసిజం అందరి ఇంటి తలుపులు తడుతున్నప్పుడు ఏ చిన్న ప్రజాస్వామ్య ప్రయత్నాన్నయినా సమర్ధించాలనే ఉద్దేశంతో ఆయనను కలుస్తున్నాం అని చెప్పాం. అలాగే తెలంగాణలో ఆయన యాత్ర ముగుస్తున్న సందర్భంలో మరోసారి కలిసినప్పుడు దక్షిణ భారతదేశంలో తన పరిశీలనను వివరిస్తూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆలోచనలు చాలా అస్పష్టంగా ఉన్నాయి, ఎందుకు? అనే ప్రశ్న అడిగాడు. ఈ పర్యాయం చర్చ కొంత విస్తృతంగానే జరిగింది.

ఈ మూడు పర్యాయాలు ఆయనతో చర్చించినప్పుడు మేం గమనించింది, మనిషి నిరాడంబరంగా, స్నేహపూరితంగా మాట్లాడటమే కాక సమస్యలను అవగాహన చేసుకోవడానికి నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. చోటా మోటా రాజకీయ నాయకులు అహంకారపూరితంగా మారి, మాట్లాడటానికే సిద్ధంగా లేని కాలంలో ఒక ప్రముఖ పార్టీ నాయకుడికి ఈ లక్షణాలుండడం హర్షించదగ్గ విషయమే. ఆయన అధికారపీఠం మీద కూర్చుంటే ఎలా మారుతారో చూడవలసిందే.

సాధారణ సమయాల్లో ఈ పాదయాత్రకి ఇంత ప్రాముఖ్యత ఉండేది కాదు. కాని ఒక దశాబ్దకాలం రాజకీయాలు, సామాజిక సంబంధాలలో చాలా తీవ్రమైన వక్రీకరణకు గురైనప్పుడు ఈ ప్రయోగానికి ఒక ప్రాయోజికత ఉంది. భారత ప్రజల సహజీవన సంస్కృతిని కాపాడడమే కాక మత, కుల, లింగపర వివక్షతో పాటు, నిచ్చెనమెట్ల సంబంధాలు ప్రజాస్వామ్యీకరించాలి అనే స్వాతంత్రోద్యమ ఆకాంక్ష, అలాగే స్వాతంత్ర్యానంతరం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటాల ఆశయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే సందిగ్ధ దశలో మనం ఉన్నాం. ఈ విలువలని కాపాడి వీటిని ఆచరణాత్మకం చేయడానికి ఏ చిన్న ప్రయత్నానికైనా మనందరం సహకరించవలసిందే. ‘భారత్‌ జోడో – నఫ్రత్‌ ఛోడో’ అన్న నినాదంలో అంతర్గతంగా ఈ ఆకాంక్ష ఉన్నది అని భావించే వారందరూ తమ తమ విభేదాలు పక్కకుపెట్టి ఏదో మేరకు సహకరించారు. కొందరు పరోక్షంగానైనా హర్షించారు.

భారతీయ జనతాపార్టీ ఎంత విమర్శించినా ఈ యాత్రను రాహుల్‌ గాంధీ పూర్తిగా రాజకీయపరం చేయకుండా, దీనికి ఒక నైతికకోణాన్ని చేర్చారు. ఎన్నికలలో మాకు ఓటు వేయండనో, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండనో ప్రజలను అడగలేదు. విచ్ఛిన్నమవుతున్న మతపర సంబంధాల నుంచి బయటపడాలని, దేశంలో ప్రజలు కలిసి జీవించాలని, ఏ దేశ అభివృద్ధికైనా ఈ సామరస్య సామాజిక వాతావరణం అవసరమనే సందేశం ఈ యాత్ర ద్వారా ఇచ్చారు. ఈ యాత్ర వల్ల ఏ కారణం లేకుండా మతద్వేషాలు పెంచుకుంటున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో ఒక వర్గమైనా కొంత ఆలోచించడానికి ఒక వాతావరణం ఏర్పడింది.

సమాజంలో ప్రజాస్వామ్యశక్తులు, దేశభవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి. సామాజిక మార్పు చైతన్యవంతమైన ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఈ యాత్ర నియోలిబరలిజానికి ప్రత్యామ్నాయం లేదని, రాజకీయ ప్రత్యామ్నాయం లేదని, మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు లేడని, ప్రశ్నించే గొంతుకలు మూగపోతున్నాయని నిరాశ చెందుతున్న వారికి కొంత వెసులుబాటును కల్పించింది. ఈ యాత్ర కాంగ్రెస్‌ పార్టీ విజయానికి ఎంత దోహదపడుతుందో తెలియదు కాని ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించడానికి మాత్రం దోహదం చేసింది. ప్రజాపోరాటాలు దీనిని ముందుకు తీసుకుపోవాలి.

ప్రొ. జి.హరగోపాల్‌

Updated Date - 2023-02-03T01:30:34+05:30 IST