కెనడా నేర్చుకోవాల్సిన పాఠం

ABN , First Publish Date - 2023-09-26T02:36:57+05:30 IST

ఏదేశ భూభాగాన్నీ, ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించరాదని జీ20 దేశాల న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసిన దేశాలలో కెనడా ఒకటి...

కెనడా నేర్చుకోవాల్సిన పాఠం

ఏదేశ భూభాగాన్నీ, ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించరాదని జీ20 దేశాల న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసిన దేశాలలో కెనడా ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గత కొన్ని దశాబ్దాలుగా కెనడాలో భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోద్బలం లభిస్తోంది. 1980లలో ఖలిస్తాన్ కోసం కొందరు ఉగ్రవాద సిక్కులు పంజాబ్‌లో వేర్పాటు వాద ఉద్యమాన్ని నిర్వహించి వేలాది మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. కెనడాలో సిక్కుల ఉగ్రవాద కార్యకలాపాలు జరగకండా చూడాలని ప్రధాని ఇందిర 1982లో కెనడా ప్రభుత్వాన్ని కోరారు. కెనడా ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియర్రీ ట్రూడో అప్పుడు ప్రధానిగా ఉన్నారు. 1984లో ఉగ్రవాద ప్రభావితులైన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే ఇందిర బలి అయ్యారు. ఆమె చనిపోయిన ఏడాదికి 1985లో కెనడా నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని సిక్కు ఉగ్రవాదులు బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా పౌరులతో సహా మొత్తం 329 మంది మరణించారు. ఈ పేలుడుకు కారకులయిన వారు కెనడాలో స్థిరపడిన సిక్కు ఉగ్రవాదులు అని తేలినప్పటికీ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా కెనడా ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గత జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే సిక్కు ఉగ్రవాదిని సర్రే అనే ప్రాంతంలోని గురునానక్ సిక్కి గురుద్వారా వెలుపల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత అధికారులు ఉన్నారని ప్రధాని జస్టిన్ భారత్‌ను నిందిస్తున్నారు. నిజానికి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయడం మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన దేశానికి వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను ఏ మాత్రం సహించకూడదనే దృక్పథాన్ని అవలంబిస్తున్నారు. ఈ ఏడాదే పంజాబ్‌లో వేర్పాటు వాద నాయకుడు అమృతపాల్ సింగ్‌ను మూడునెలల వేట తర్వాత అరెస్టు చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో నిజ్జార్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని మన అధికారులు 2020లోనే కెనడాకు తెలిపారు. పంజాబ్‌లో ఇప్పటికీ ఖలిస్తాన్ కోసం ఉద్యమిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అనే నిషిద్ధ ఉగ్రవాద సంస్థతో నిజ్జార్‌కు సంబంధాలున్నాయి. నిజ్జార్ గురించే కాక, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయి, పాకిస్థాన్ తదితర దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 మంది ఉగ్రవాదుల గురించి కూడా ఎన్‌ఐఏ ఆయా దేశాలకు సమాచారం పంపింది.

ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు తావివ్వరాదని, ఖలిస్తాన్ ఉగ్రవాదులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ప్రధానమంత్రులను కోరారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని తాము ఎప్పుడో నిషేధించామని, ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని ఆయన వారికి తెలిపారు. విచిత్రమేమంటే కెనడా వంటి దేశాల్లో ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకం కాదు. పైగా భావ ప్రకటనా స్వేచ్ఛ క్రింద వాటికి రక్షణ లభిస్తుంది. పంజాబ్‌ను మత ప్రాతిపదికపై స్వతంత్ర దేశంగా ప్రకటించాలని. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు మద్దతునీయాలని ఖలిస్తాన్ రెఫరెండమ్ పేరుతో ప్రచారం చేస్తున్న గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను ఉగ్రవాదిగా భారత్ 2019 లో ప్రకటించింది. నిజ్జార్‌తో కలిసి పన్నూన్ ఎన్నో సంవత్సరాలుగా కెనడా నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కెనడాలోని భారతీయ హిందువులు వెనక్కి వెళ్లిపోవాలని ఇటీవలే పన్నూన్ హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్‌ను కూడా విడదీసేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారని ఎన్‌ఐఏ తన నివేదికలో పేర్కొంది. గురుపత్వంత్‌పై పంజాబ్, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లోనే మూడు దేశద్రోహ కేసులతో పాటు పలు ఇతర కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. అనేకమంది కెనడా జాతీయులకు నిషేధిత అంతర్జాతీయ సిక్కు సమాఖ్య, ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్‌తో సంబంధాలున్నాయని ఇటీవలే మన ఇంటెలిజెన్స్ సంస్థ కెనడా ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఎవరెవరు ఖలిస్తాన్ ఉద్యమానికి చేయూత నిచ్చేందుకు నిధులు సమకూరుస్తున్నారో, ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో పేర్లతో సహా వివరించింది.


కెనడాలో 8 లక్షలమంది సిక్కులు ఉన్నారు. ఆ దేశ మొత్తం జనాభాలో వారు 2 శాతం మేరకు ఉంటారు. పంజాబ్‌, చండీఘర్ తర్వాత ఎక్కువ మంది సిక్కులు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోనే ఉన్నారు. ఖలిస్తాన్ మద్దతుదారైన జగ్మీత్ సింగ్ నాయకత్వంలోని ఎన్‌డిపి పార్టీ 2021లో జరిగిన ఎన్నికల్లో 24 సీట్లు గెలుచుకున్నది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మైనారిటీ ప్రభుత్వం జగ్మీత్ సింగ్ మద్దతుపై ఆధారపడి మనుగడ సాగిస్తుంది కనుకే రాజకీయ కారణాల వల్ల ఆయన ఖలిస్తానీలకు మద్దతు నిస్తున్నారని స్పష్టమవుతోంది. ట్రూడో సీనియర్ సలహాదారులు, కేబినెట్ మంత్రులు కొందరు ఖలిస్తానీ మద్దతుదారులే. నిజానికి ఆయన ఫెడరల్ లిబరల్ పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకునేందుకు పంజాబీ సిక్కులు ఆయనకు బలంగా మద్దతునిచ్చారు.

అమెరికాలోని ఎఫ్‌బిఐ– కెనడాలోని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి)కు కుదిరిన ఒప్పందం మాదిరే భారతదేశానికి చెందిన ఎన్ఐఏ, ఆర్‌సిఎంపిల మధ్య ఉగ్రవాద కార్యకలాపాల గురించి పరస్పర సహకారం అందించుకునే విషయంలో 2020లో ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది. ఉగ్రవాద నిర్మూలన, భారతదేశ సమగ్రత, సమైక్యత విషయంలో మోదీ రాజీపడే అవకాశాలు లేవని ట్రూడోకు ఇప్పటికైనా తెలిసి ఉండాలి.

నిజ్జార్ హత్యలో భారత్‌కు సంబంధం ఉన్నదన్న ఆరోపణలను పక్కనపెడితే ఏ దేశమూ తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను సహించబోదు. 2010లో పాకిస్థాన్‌లో ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్‌ను, 2020లో ఇరానియన్ జనరల్ ఖాస్సెం సోలిమనీని అమెరికా సైనికులు వధించిన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ కూడా అనేకమంది పాలస్తీనా మిలిటెంట్లను వధించింది. ఇంతెందుకు? బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ పాలకులు పాల్పడుతున్న మానవ హక్కుల హననం, ఊచకోత గురించి ప్రపంచానికి తెలియజేసిన మానవ హక్కుల కార్యకర్త కరామీ బలోచ్‌ను కెనడాలోని టొరంటోలో హత్య చేసినప్పుడు ఇదే కెనడా ప్రభుత్వం పాకిస్థాన్‌ను ఎందుకు నిందించలేదు? మోదీ నాయకత్వంలో భారత్ ఎంత మాత్రమూ మెతకగా వ్యవహరించదని ప్రపంచంలో అనేక దేశాలకు తెలుసు, అందుకే కెనడా ప్రభుత్వ వైఖరిని ఏ దేశమూ సమర్థించడం లేదు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2023-09-26T02:36:57+05:30 IST