ఆత్మగౌరవ పోరాట పతాక

ABN , First Publish Date - 2023-09-27T01:52:45+05:30 IST

కొండా లక్ష్మణ్‌ బాపూజీ – ఈ పేరు ఉద్యమాలకు చిరునామా. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సహకారోద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం...

ఆత్మగౌరవ పోరాట పతాక

కొండా లక్ష్మణ్‌ బాపూజీ – ఈ పేరు ఉద్యమాలకు చిరునామా. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సహకారోద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం, దళిత–బహుజన ఉద్యమం... వీటన్నింటికీ అండగా, జెండాగా నిలిచినవారు కొండా లక్ష్మణ్‌ బాపూజీ. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన బహు అరుదైన నాయకుల్లో బాపూజీ ఒకరు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి, సీమాంధ్ర వలస పాలకుల దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలను బంధ విముక్తులను చేయడానికి రాజీలేని సమరం చేసిన యోధుడు. చేనేత, ఇతర చేతివృత్తుల కార్మికుల బతుకుల్లో అన్నం మెతుకయ్యారు.

ఆధిపత్యాన్ని సహించని వ్యక్తిత్వం బాపూజీ సొంతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, బహుజనులకు రాజ్యాధికారం అనే రెండు ప్రాథమిక లక్ష్యాల కోసం తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఆదిలాబాద్‌ జిల్లా ‘వాంకిడి’ గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్‌ 27న కొండా లక్ష్మణ్‌ జన్మించారు. 16 సంవత్సరాల ప్రాయంలో చాందా పట్టణంలో మహాత్మాగాంధీ చేసిన ప్రసంగానికి ముగ్ధుడై తన తెల్ల షరాయిని చించి గాంధీ టోపీగా కుట్టుకుని ధరించారు. ఆ రోజుల్లో గాంధీ టోపీ ధరించడమంటే నిజాం ప్రభుత్వంపై ధిక్కారమే. నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు గాంధీ టోపీతోనే ఆయన దర్శనమిచ్చేవారు.

1938లో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్లీబౌలిలో అరెస్టయ్యారు. వందేమాతరం ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1940లో ఆంధ్ర మహాసభలో చేరి ఖద్దరు వస్త్రాల ప్రచారం, అమ్మకం చేపట్టారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్‌ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు బాపూజీ. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తాను అధ్యక్షునిగా ‘సిటిజన్‌ ప్రొటెక్షన్‌ కమిటీ’ ఏర్పాటుచేసి ప్రజాచైతన్య కార్యక్రమాలు రూపొందించారు.

నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైదరాబాద్‌ సంస్థాన ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌పై బాంబు దాడికి వ్యూహం రచించారు. నారాయణరావ్‌ పవార్‌, గండయ్య, గూడూరు నారాయణ స్వామి, జగదీష్‌ ఆర్య అనే నలుగురు యువకులకు షోలాపూర్‌ క్యాంపులో శిక్షణ ఇచ్చారు. 1947 డిసెంబర్‌ 4న నిజాం కారుపై సుల్తాన్‌ బజార్‌లో నారాయణరావు పవార్‌ బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. అంతే... పవార్‌ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్‌ చేశారు.

నిజాం వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూనే క్రిమినల్‌ లాయర్‌గా బాపూజీ పేరు ప్రఖ్యాతులు గడించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు పార్టీలతో నిమిత్తం లేకుండా ఉచిత న్యాయసహాయం చేశారు. విస్నూరు దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్‌ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ‘నయాజిందగీ’ పత్రిక సంపాదకులు ఆచార్య జె.ఎన్‌. శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు.


హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ స్వాతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపసభాపతిగా, మంత్రిగా, శాసనసభ్యునిగా మచ్చలేని నాయకుడిగా సేవలందించారు. తెలుగునేలపై సైకిల్‌ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది బాపూజీయే కావడం గమనార్హం. 1961లో మూసీ నదికి వరదలు వచ్చి జనబాహుళ్యానికి నష్టం వాటిల్లినపుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో 220 మైళ్ల పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు అండగా నిలిచిన మానవతావాది. 1952లో వీరు రూపొందించిన ‘సహకార సంఘాలు’ దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952లో ‘హైకో’ను ఏర్పాటు చేశారు. ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి– కొండా లక్ష్మణ్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. తొలి, మలి తరం ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. విశేషమేమంటే– బాపూజీ తొలినాళ్లలో సమైక్యవాది. విశాల హృదయంతో విశాలాంధ్రకు మద్దతు ప్రకటించినా ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని మునుపటి తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా ఊతకర్రగా నిలిచారు. ‘తెలంగాణ పీపుల్స్‌ పార్టీ’ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం ‘జలదృశ్యం’ లోనే పురుడు పోసుకుంది. తెలంగాణ నినాదం ఎత్తుకున్న దేవేందర్‌ గౌడ్‌, ఆలె నరేంద్ర, గద్దర్‌, విమలక్క లాంటి వారందరికీ అండగా నిలిచారు. 96 సంవత్సరాల పండు ప్రాయంలో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో తెలంగాణ కోసం దీక్ష చేశారంటే ఈ ప్రాంతం పట్ల వారికున్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ఆయన పాటించిన విలువలు, త్యాగం, లక్ష్యశుద్ధి, పట్టుదల, అంకితభావం, నిజాయితీ, నిబద్ధతలు సర్వకాలాల్లో ఆచరణీయం.

వంగరి భూమయ్య

(నేడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి)

Updated Date - 2023-09-27T01:52:45+05:30 IST