బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఉపాధ్యాయుడి మృతి

ABN , First Publish Date - 2023-04-21T03:03:28+05:30 IST

దో తరగతి మూల్యాంకన క్యాంప్‌లో మౌలిక వసతుల లేమి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహాయింపు ఇవ్వకపోవడం, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచకపోవడం..

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఉపాధ్యాయుడి మృతి

మౌలిక వసతులు కల్పించాలని ఉపాధ్యాయుల ఆందోళన

బాపట్ల టౌన్‌, ఏప్రిల్‌ 20: పదో తరగతి మూల్యాంకన క్యాంప్‌లో మౌలిక వసతుల లేమి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహాయింపు ఇవ్వకపోవడం, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచకపోవడం.. వెరసి ఓ ఉపాధ్యాయుడి ప్రాణాలను బలిగొన్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందిన ఘటన బాపట్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన బోడావుల శ్రీనివాసరావు (45) పర్చూరులోని వైఆర్‌ హైస్కూల్‌లో మ్యాథ్స్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఆయన బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌లో మూల్యాంకన విధులకు హాజరయ్యారు. మూల్యాంకనం చేస్తుండగా మానసిక ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించాలని వైద్యులు సూచించారు. గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే శ్రీనివాసరావు ప్రాణాలు విడిచారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూల్యాంకనం క్యాంప్‌లో మౌలిక వసతులు లేకపోవని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మినహాయింపు ఇవ్వలేదని, అంబులెన్స్‌ కూడా అందుబాటులో ఉంచలేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. క్యాంప్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు.

Updated Date - 2023-04-21T03:03:28+05:30 IST