Adani : ‘ఆరోగ్యం’పైనా అదానీ కన్ను!

ABN , First Publish Date - 2023-08-31T03:17:20+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదానీ గ్రూపు హవా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగని ప్రాజెక్టు లేదు. తాజాగా ఆరోగ్య శాఖలో ఏదో ఒక ప్రాజెక్టు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం కూడా ఆ శాఖలో అదానీ గ్రూప్‌ చేయగల ప్రాజెక్టు కోసం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అదానీ భారీ హెల్త్‌ ప్రాజెక్టు స్టెమీని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరింది.

Adani : ‘ఆరోగ్యం’పైనా అదానీ కన్ను!

ఏపీ ఆరోగ్య రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నం

ప్రతిష్ఠాత్మకమైన ‘స్టెమీ’ ఇవ్వాలని ఒత్తిడి

పరిశీలించాలని ఆ శాఖకు సర్కారు ఆదేశం

గ్రూపు ప్రతినిధులతో అధికారుల భేటీలు

ఆరోగ్య రంగంలో అనుభవం లేని అదానీ

ప్రాజెక్టు ఇవ్వడంపై అధికారుల తర్జనభర్జన

ఈసీజీ మిషన్లూ ఇస్తామని అదానీ పట్టు

కొనుగోలుకు సిద్ధమైన ఆరోగ్య శాఖ

ఇప్పటికే ఏపీలో అదానీకి రెడ్‌ కార్పెట్‌

అదానీ గ్రూప్‌ అడగడమే ఆలస్యమన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేస్తోంది. ఏదడిగినా కాదనకుండా కట్టబెడుతోంది. ఇప్పటికే కొండలు. గుట్టలు, భూములు, ప్రాజెక్టులు, పోర్టులు అదానీ పరం చేసేసింది. ఇప్పుడు ఆ గ్రూప్‌ కన్ను ఆరోగ్య శాఖపై పడింది.

ఆరోగ్య రంగంలో అదానీ గ్రూప్‌నకు కనీస అవగాహన లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘స్టెమీ’ని తమకు అప్పగించాలని కోరుతోంది. ప్రభుత్వం కూడా అదానీ కోరిక తీర్చేందుకు సుముఖంగా ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు అడ్డు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అదానీ మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతానికి అదానీ నుంచి ఈసీజీ మిషన్ల కొనుగోలుకు అధికారులు సిద్ధమయ్యారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదానీ గ్రూపు హవా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగని ప్రాజెక్టు లేదు. తాజాగా ఆరోగ్య శాఖలో ఏదో ఒక ప్రాజెక్టు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం కూడా ఆ శాఖలో అదానీ గ్రూప్‌ చేయగల ప్రాజెక్టు కోసం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అదానీ భారీ హెల్త్‌ ప్రాజెక్టు స్టెమీని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ గ్రూప్‌ అడుగుతున్న దానిని పరిశీలించాలని, సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదానీ గ్రూపు ప్రతినిఽధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వారు ఒక ప్రాజెక్టుకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీన్ని చూసి ఉన్నతాధికారులు షాక్‌ అయ్యారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్టెమీ ప్రాజెక్టును తమకు అప్పగించాలని అదానీ ప్రతినిధులు అధికారులను కోరారు. తొలుత పైలెట్‌ ప్రాజెక్టు చేస్తామని, ఆ తర్వాత ప్రాజెక్టును నిర్వహిస్తామని వివరించారు. ఈ మాట విన్న ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. స్టెమీ అంటే చిన్న ప్రాజెక్టు కాదు. ఆరోగ్య రంగంలో కనీస అవగాహన లేని అదానీకి ఈ ప్రాజెక్టు ఇవ్వడం సాధారణ విషయం కాదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏదో ఒక ప్రాజెక్టు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. చేసేది లేక ఆరోగ్యశాఖ అధికారులు అదానీ ప్రతినిధులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారు మాత్రం స్టెమీ ప్రాజెక్టును తమకు ఇవ్వాలని ఇప్పటికి కోరుతూనే ఉన్నారు. 2017 నుంచి రాష్ట్రంలో స్టెమీ ప్రాజెక్టు ఐసీఎంఎస్‌ సహకారంతో తిరుపతిలో అమలవుతోంది. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టును విస్తరించారు. ఐదేళ్ల నుంచి తిరుపతిలో అమలు చేస్తున్న విధానాన్ని ఇప్పుడు మిగిలిన మూడు సెంటర్లకూ విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును తమకు ఇచ్చేయాలని అదానీ గ్రూప్‌ పట్టుపడుతోంది. మరో గుజరాత్‌ ప్రభుత్వానికి ఈసీజీ మిషన్లు సరఫరా చేస్తున్నామని, ఏపీకి కూడా సరఫరా చేస్తామని చెబుతున్నారు. అదానీకి ప్రభుత్వ అండదండలు ఉండటంతో ఈసీజీ మిషన్లు అయినా కొనుగోలు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. స్టెమీ ప్రాజెక్టులో కనీసం 70 నుంచి 80 ఈసీజీ మిషన్లు అవసరం. ఆ మిషన్లు మొత్తం తామే సరఫరా చేస్తామని అదానీ ప్రతిపాదనలు పెట్టింది. ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు దగ్గరుండి ఈ మొత్తం కాంట్రాక్టు వ్యవహారం చూసుకుంటున్నారు. ఆరోగ్య శాఖలో అడుగు పెట్టాలన్న అదానీ గ్రూప్‌ ప్రయత్నాలకు ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అండదండలు అందిస్తున్నారు.

‘స్టెమీ’ ప్రాజెక్టు అంటే..

స్టెమీ అంటే.. ఎస్‌టీ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫాక్షన్‌. ఇది గుండెకు సంబంధించినది. గుండెపోటు రెండు, మూడు రకాలుగా వస్తుంది. అందులో స్టెమీ ఒకటి. స్టెమీ వచ్చినవారిలో మరణశాతం ఎక్కువ. కాబట్టి అ మరణాలను తగ్గించేందుకు కేంద్రం ఈ ప్రాజెక్టును ఐసీఎంఆర్‌ నేతృత్వంలో అమలు చేస్తోంది. దీనిలో భాగంగా పెద్దాసుపత్రుల్లో హబ్స్‌, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో స్పోక్స్‌ను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో ఎవరైనా గుండెపోటుకు గురైతే వెంటనే స్థానికంగా ఉన్న స్పోక్‌ సెంటర్‌కు తీసుకెళ్లవచ్చు. అక్కడి సిబ్బంది ఈసీజీ తీసి, హబ్స్‌లో ఉండే కార్డియాలజి స్ట్‌కు పంపిస్తారు. వారు స్టెమీకేసుగా గుర్తిస్తే, వెంటనే స్పోక్‌ సెంటర్‌ సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే త్రాంబోలైసిస్‌ అనే ఇంజక్షన్‌ను బాధితుడికి ఇస్తారు. దీంతో తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. వెంటనే బాధితుడిని ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా హబ్స్‌కు తరలిస్తారు. అక్కడ వైద్యపరీక్షల అనంతరం బాఽధతుడికి స్టంట్‌ వేయాలా? ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలా? అనేది కార్డియాలజి్‌స్టలు నిర్ణయిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్నే స్టెమీ ప్రాజెక్టు అంటా రు. ఎంతో అనుభవమున్న కంపెనీలే ఈ ప్రాజెక్టు చేయడానికి ముందుకు రావడం లేదు. అలాంటిది అవగాహన లేని అదానీ గ్రూప్‌ ప్రాజెక్టు మొత్తం తామే చేస్తామంటూ సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తోంది. స్టెమీ ప్రాజెక్టుపై ఆరోగ్య శాఖ దాదాపు చివరి దశకు వెళ్లిపోయింది. అదానీ గ్రూప్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌ మాత్రం మొదటి దశలోనే ఉంది.

Updated Date - 2023-08-31T08:21:23+05:30 IST