Mirabai Chanu: భళా.. చాను!.. వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్.. గాయంతోనూ అద్భుతం..
ABN , First Publish Date - 2022-12-07T22:16:07+05:30 IST
ఇండియన్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) మరోసారి మెరిసింది. మణికట్టు గాయం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా అద్భుత ప్రదర్శనతో ‘2022 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్’లో (2022 World Weightlifting Championship) రజతం (Silver) సాధించింది.
ఇండియన్ స్టార్ వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) మరోసారి మెరిసింది. మణికట్టు గాయం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా అద్భుత ప్రదర్శనతో ‘2022 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్’లో (2022 World Weightlifting Championship) రజతం (Silver) సాధించింది. కొలంబియా వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్ కీలక పోరులో చైనా క్రీడాకారిణి హౌ జిహూయిని వెనక్కి నెట్టి సిల్వర్ మెడల్‌ను ముద్దాడింది. 49 కేజీల కేటగిరిలో పోటీ పడిన మీరాబాయి చాను.. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు లిఫ్ట్ చేసింది. చైనా క్రీడాకారిణి జియాంగ్ హివూవా లిఫ్ట్ చేసిన 208 కేజీల కంటే చాను 8 కేజీలు తక్కువ లిఫ్ట్ చేయడంతో రజతానికే పరిమితమైంది. మరో చైనా క్రీడాకారిణి హౌ జిహూయి (198 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.
శెభాష్ చాను..
మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన మీరాబాయి చాను సెప్టెంబర్ నెలలో ట్రైనింగ్ సెషన్‌లో మణికట్టు గాయానికి గురైంది. ఆ ఇబ్బందిని ఏమాత్రం లెక్కచేయకుండా కొలంబియా వేదికగా జరుగుతున్న 2022 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ బరిలో పాల్గొంది. మెడల్ సాధించకుండా స్వదేశం వెళ్లకూడదని బలంగా నిర్ణయించుకున్న చాను అద్భుత పోరాటపటిమను ప్రదర్శించింది. కాగా ఈ అద్భుత విజయంపై ఆమె ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘ ఈ విజయం పట్ల చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఒలింపిక్ స్వర్ణం సాధించాలనే లక్ష్యం దిశగా ఇదొక చిన్న అడుగు. నా కోచ్ విజయ్ సార్, ఐడబ్ల్యూఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సహదేవ్ యాదవ్ సార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భాగస్వాములందరు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరినీ గర్వింపజేస్తా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ఫొటోలను జోడించింది. అద్భుత విజయాన్ని సాధించిన మీరాబాయి చానుకు పలువురు క్రీడ, రాజకీయ ప్రముఖలు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.