AP Politics: జగన్‌కు విధేయురాలైన ఈ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి ఇప్పుడేంటంటే..
ABN , First Publish Date - 2022-11-10T21:09:30+05:30 IST
వైఎస్ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. వైఎస్‌ఆర్ (YSR) ఆశీస్సులతో కాంగ్రెస్ ద్వారా..
గుంటూరు (ఆంధ్రజ్యోతి): వైఎస్ కుటుంబానికి ఎంతో విశ్వసనీయురాలైన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. వైఎస్‌ఆర్ (YSR) ఆశీస్సులతో కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన సుచరిత ప్రత్తిపాడు (Prathipadu) నుంచి 2009 ఎన్నికల్లో బరిలోనికి దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ చనిపోయే వరకు ఆమె కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నారు. ఆ తరువాత ఆయన కుమారుడు జగన్ (Jagan) వెంట నడిచారు. ఆయన కోసం చేతిలో ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుని ఉప ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పటి వరకు కూడా పార్టీ పట్ల జగన్‌పై విశ్వాసంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఆయన అధికారంలోకి రాగానే హోం మంత్రి పదవిని కట్టబెట్టారు.
సామాజిక అంశం, సీనియారిటీ కూడా ఆమెకు కలిసొచ్చాయి. కీలకమైన హోంమంత్రి పదవిని కట్టబెట్టినప్పటికీ ఆమెకు ఎటువంటి అధికారాలు లేకుండా చేశారు అనే ప్రచారం జరిగింది. ఆమె హోం మంత్రిగా ఉన్నపుడు సొంత జిల్లాలోనే ఆమెకు తెలియకుండానే సీఐ, డీఎస్పీ పదవుల నియామకాలు జరిగాయి. అయితే మంత్రి పదవి ఇచ్చారులే అనే తృప్తి మాత్రం ఆమెకు మిగిలింది. ఆమె సొంత నియోజకవర్గంలో ఆమెను నమ్ముకున్న పార్టీ శ్రేణులు కూడా ఈ విషయంలో బహిరంగంగా పలుమార్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే మంత్రి అయినా తమకు ఎటువంటి పనులు కావడం లేదని వాపోయేవారు. ఇక సొంత శాఖలో కానిస్టేబుళ్లు సైతం బదిలీల విషయంలో ఆమె వద్దకు వెళ్లినా ప్రయోజనం ఉండదులే అని జాలిపడేవారు.
ఉన్నపళంగా మంత్రి పదవి తొలగింపు
మంత్రివర్గ విస్తరణలో కొందరికి మినహాయింపునిచ్చి హోం మంత్రిగా ఉన్న సుచరితను తప్పించడంతో ఆమె షాకుకు గురయ్యారు. తమ సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఎవరినీ తొలగించకుండా తనను మాత్రమే తప్పించారని ఆమె కొంతకాలం కుమిలిపోయారు. పైగా హోం మంత్రి గా కొనసాగినంత కాలం శాఖాపరంగా ఆమెపై వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. వివాదాస్పదంగా వ్యవహరించిన దాఖలాలు కూడా లేవు. ఒక వేళ కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాలో వేరే ఒకరికి ఇవ్వడం కోసం ఆమెను తప్పించారా అంటే అదీ లేదు. గుంటూరు జిల్లాలో కొత్త మంత్రి వర్గంలో ఎవరికి చోటు దగ్గని విషయం తెలిసిందే.
ఊరడించేందుకు ఇచ్చిన జిల్లా అధ్యక్ష పదవి మూడునాళ్లే
మంత్రి పదవి నుంచి తొలగించారనే అసంతృప్తితో ఉన్న మేకతోటి సుచరితకు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను ఇచ్చి ఊరడించేందుకు ప్రయత్నించారు. ఆ పదవి కూడా మూడునాళ్ల ము చ్చటి గానే మారే పరిస్థితిని పార్టీలో ఆమెకు కల్పిస్తున్నారు. ఆ పదవి నుంచి త్వరగా ఆమెను తప్పించి వేరే ఒకరికి ఇవ్వాలనే ఆలోచనలో అది ష్టానం ఉన్న విషయం ముందుగానే తెలుసుకున్న సుచరిత తానే ఆ పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయించకున్నట్లు తెలిసింది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోకున్నట్లు ప్రకటించారు. అంటే త్వరలో ఆమె తప్పుకోవడమో.. తప్పించడమో జరగనుంది.
ఎంపీ టిక్కెట్టును ఆశిస్తున్న భర్త
ఇన్‌కంట్యాక్స్ కమిషనర్‌గా పనిచేసిన సుచరిత భర్త దయాసాగర్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇటీవల పదవీ విరమణ చివరి దశలో విజయవాడ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. ఆ సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. ఇందులో ఢిల్లీలో చక్రం తిప్పే ఓ వైసీపీ ఎంపీ పాత్ర ఉందని అప్పట్లోనే వార్తలు వెలువడ్డాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన దయాసాగర్ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఎంట్రీకి జగన్ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. వచ్చే ఎన్నికల బరిలో సుచరిత రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడే అవకాశం ఉందని చెపుతున్నారు.