US Green Card: గ్రీన్ కార్డు కోసం భారతీయులు 195 ఏళ్ల పాటు నిరీక్షణ.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-11-26T18:00:19+05:30 IST

అమెరికా గ్రీన్ కార్డుల కోసం భారతీయులు సగటున 195 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన దుస్థితికి కారణాలేంటంటే..

US Green Card:  గ్రీన్ కార్డు కోసం భారతీయులు 195 ఏళ్ల పాటు నిరీక్షణ.. కారణం ఇదే..

ఎన్నారై డెస్క్: మాంద్యం కమ్ముకొస్తోందన్న భయాలతో ప్రముఖ టెక్ కంపెనీలు మేటా(Meta), అమెజాన్(Amazon), ట్విటర్(Twitter).. ఖర్చులు నియంత్రణ పేరిట ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి(Massive Layoffs). ఈ తొలగింపుల ప్రభావం అమెరికా హెచ్-1బీ(H-1B Visa) వర్క్ వీసాగల ఉద్యోగులపై పడింది. అందునా భారతీయులు అత్యధికంగా ప్రభావితమయ్యారు. హెచ్-1బీ వీసాదారులు తమ ఉద్యోగం పోయాక 60 రోజుల లోపు వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో చేరాలి. లేకపోతే స్వదేశానికి పయనం కాకతప్పదు. ఏళ్ల తరబడి హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా తమ భవిష్యత్తుపై భద్రత లేకుండా పోయింది. దశాబ్దాల పాటు అమెరికాలో ఉంటున్నా గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడుతున్న వారికి తాజా తొలగింపుల పర్వం ఓ భారీ కుదుపు.

ఎందుకిలా..

రిపబ్లికన్ పార్టీ నేత, అమెరికా పెద్దల సభ సభ్యుడు మైక్ లీ(Senetor Mike Lee) ప్రకారం.. భారతీయులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు దక్కాలంటే కనీనం 195 ఏళ్ల పాటు వేచి చూడాలి. వారి పిల్లలకు కూడా దేశపౌరులయ్యే అవకాశాలు తక్కువ. అమెరికా చట్టాల ప్రకారం.. గ్రీన్ కార్డుల(Green Card) జారీపై దేశాల వారీగా పరిమితులు ఉన్నాయి. ప్రతి దేశానికి ఏటా ఏడు శాతం గ్రీన్ కార్డులు మాత్రమే మంజూరు అవుతాయి. అయితే.. వర్క్ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య 5,00,000లకు పైగానే ఉంది. కానీ.. ఏటా పది వేల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ అవుతుంటాయి. దీంతో.. గ్రీన్ కార్డు కోసం వేచి చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వీళ్లకు అమెరికాలో శాశ్వతనివాసార్హత దక్కాలంటే సగటు 195 ఏళ్లు నిరీక్షించాల్సిన విపరీత పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-26T18:07:50+05:30 IST