USA: అది వండేందుకు చాలా సమయం పడుతోంది.. కోర్టులో మహిళ కేసు..

ABN , First Publish Date - 2022-11-29T20:09:30+05:30 IST

మాకరోనీని మూడున్నర నిమిషాల్లోనే వండుకోవచ్చంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిన్తూ అమెరికా మహిళ కోర్టును ఆశ్రయించింది.

USA: అది వండేందుకు చాలా సమయం పడుతోంది.. కోర్టులో మహిళ కేసు..

ఎన్నారై డెస్క్: మనందరికీ ఇన్‌స్టంట్ నూడుల్స్ గురించి తెలిసిందే. ఇట్టే వండుకుని తినేయచ్చంటూ కంపెనీలో తమ యాడ్లతో ఊదరకొడుతుంటాయి. నిమిషాల్లోనే రుచికరమైన ఆహారం రెడీ అంటూ ప్రకటనలను హోరెత్తిస్తుంటాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి(Florida) చెందిన అమాండా రమీరెజ్ అనే మహిళ కూడా సరిగ్గా ఇలాంటి ఓ ప్రకటన చూసి సంబరపడిపోయింది. మార్కెట్లో దొరికే వెల్‌వీటా బ్రాండ్(Velveeta) ఇన్‌స్టంట్ మాకరోనీని( Instant Macaroni-గోధుమ పిండితో చేసే ఆహారపదార్థం)కొనుగోలు చేసింది.

వెల్‌వీటా ప్రకటన ప్రకారం.. ఈ మాకరోనీని కేవలం మూడున్నర నిమిషాల్లోనే వండుకోవచ్చు. కానీ.. ఇంట్లో దాన్ని వండేందుకు మూడున్నర నిమిషాలకంటే ఎక్కువే పట్టిందని గుర్తించిన ఆమె అగ్గిమీద గుగ్గిలమైంది. తనలా ఎంతో మందిని ఆ కంపెనీ తప్పుదారి పట్టిస్తోందంటూ వారందరి తరపునా ఉమ్మడిగా(Class action lawsuit) కేసు వేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనతో(Misleading Ads) వెల్‌వీటా బ్రాండ్ మాతృసంస్థ క్రాఫ్ట్ హైన్జ్(Kraft Heinz)..ఆ మాకరోనీని ఇతర బ్రాండ్ల కంటే ఎక్కువ ధరకే అమ్మి సొమ్ముచేసుకుంటోందని ఆమె ఆరోపించింది. తద్వారా భారీగా లాభాలు గడించిందని చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ విషయంపై క్రాఫ్ట్ హైన్జ్ కూడా స్పందించింది. ఈ నిరర్థక వ్యాజ్యం గురించి తమ దృష్టికి వచ్చిందని వ్యాఖ్యానించిన సంస్థ.. దీనికి తగిన రీతిలో స్పందిస్తామని పేర్కొంది.

Updated Date - 2022-11-29T20:11:43+05:30 IST