Swami Smaranandagiri: దేవుడు అంటే... అవధులు లేని పారవశ్యం

ABN , First Publish Date - 2022-12-15T22:21:17+05:30 IST

మన దేశంలోని ఆధ్యాత్మిక సంస్థల్లో ‘యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు అనేక ప్రత్యేకతలున్నాయి. 1917 శ్రీ పరమహంస యోగానంద స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి ‘క్రియ యోగ’ ద్వారా ధ్యానాన్ని పరిచయం చేసింది.

Swami Smaranandagiri: దేవుడు అంటే... అవధులు లేని పారవశ్యం

మన దేశంలోని ఆధ్యాత్మిక సంస్థల్లో ‘యోగాదా సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు అనేక ప్రత్యేకతలున్నాయి. 1917 శ్రీ పరమహంస యోగానంద స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమందికి ‘క్రియ యోగ’ ద్వారా ధ్యానాన్ని పరిచయం చేసింది. శ్రీ యోగానంద రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న స్వామి స్మరణానందగిరి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘నివేదన’ ఆయనను పలకరించింది.

ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకొనేవారికి ఇప్పుడు అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తమకు ఏది సరిపోతుందో గుర్తించటం ఎలా?

యువత

‘‘ప్రస్తుతం యువత విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. పోటీతత్త్వం హద్దుల్లో ఉంటే మంచిదే. దాన్ని ‘ఆరోగ్యకరమైన పోటీ’ అంటాం. అది ఒక హద్దు దాటితే అశాంతిని కలగజేస్తుంది. సంఘర్షణకు కారణమవుతుంది. దురదృష్టవశాత్తు తల్లితండ్రులు ఒకటవ తరగతి నుంచి పిల్లల్లో ఈ పోటీతత్వాన్ని నూరిపోస్తున్నారు. మన సంపద, హోదా, ఆరోగ్యం, చదువు- ఇవన్నీ మనను మనం మెరుగుపరుచుకోవటానికే. అంతే తప్ప ఇతరులతో పోల్చుకోవటానికి కాదు. ఈ విషయాన్ని యువతీ, యువకులకు చెప్పాల్సిన అవసరముంది.’’

‘యోగాద సత్సంగ సొసైటీ’ గురించి...

‘‘క్రియా యోగాను కృష్ణుడు అర్జునుడుకు బోధించాడు. మనువు, ఇక్ష్వాకు, పతంజలి లాంటి గురువులకు ఈ జ్ఞాన సంపద అందింది. ఆ తర్వాత అనేక మంది మహాత్ములు దీన్ని ప్రజలకు బోధించారు. ఈ పరంపరలో - ఈ క్రియా యోగాను వ్యాప్తి చేయటానికి పరమహంస యోగానంద సంస్థను స్థాపించారు. ప్రతి మనిషి తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందే శాస్త్రీయ విధానం ఇది. యోగానంద తమ దేహాన్ని వదిలేముందు యోగా టెక్నిక్స్‌ గురించి 18 పాఠాలు బోధించారు. అందులో ధ్యానానికి సంబంధించిన సూక్ష్మ విషయాలు వివరించారు. దాంతోపాటు శరీరం, మనసు, ఆత్మల అభివృద్ధికి అవసరమైన మార్గాలను వివరించారు. వ్యసనాల నుంచి విముక్తి, జ్ఞాపకశక్తి మెరుగుదల, ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు, ఒత్తిడి, కుంగుబాటును అధిగమించడం, సృష్టికి, సృష్టికర్తకు ఉన్న సంబంధం లాంటి పలు అంశాలు ఈ పాఠాల్లో మనకు కనిపిస్తాయి. ఈ ఏడాది ‘గీతాజయంతి’ నుంచి ఈ పాఠాలు తెలుగులోనూ లభ్యమవుతున్నాయి. (ఆసక్తి ఉన్నవారు సంప్రతించాల్సిన నెంబర్లు: 7093720623, 040-27767261)

ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కేవలం ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే లేవు. అన్నింటా ఉన్నాయి. వీటి వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతోంది. ఆధ్యాత్మిక రంగంలో అన్వేషణ చాలా ముఖ్యం. ఈ అన్వేషణ ఎక్కడ ఫలిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి వెంటనే ఫలించవచ్చు. మరి కొందరికి ప్రయత్నం తప్పకపోవచ్చు. అలా అన్వేషణ కొనసాగుతున్నప్పుడు - మనకు ఏది సరిపోతుందో అది మనకే తెలుస్తుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఉంటుంది. అది ఒకరు చెబితే అర్థమయ్యేది కాదు.

అందుబాటులోని సమాచారాన్ని ఆకళింపు చేసుకుంటే మంచి మార్గంలో ప్రయాణించగలమా?

ఆధ్యాత్మికత బుద్ధికి మాత్రమే పరిమితం కాదు. అది మనిషికి సంబంధించిన ఒక అంతర్గత సంబంధం. ఈ అనుబంధానికి మూలం... అనుభవం. ఒకసారి అనుభవమయితే - అది బుద్ధికి అతీతంగా ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మికత సాధనలో ప్రయాణించాలనుకొనేవారు సమాచారాన్నీ, మేధస్సును మాత్రమే నమ్ముకుంటే కుదరదు. ఆధ్యాత్మికత వెనుక ఉన్న ఆంతర్యం అనుభవంలోకి రావాలి. అలా కొద్ది ప్రయాణం చేసిన తర్వాత- నడవాలనుకున్న మార్గం ఇదేననే నమ్మకం కలుగుతుంది.

ఆధ్యాత్మికత మార్గంలో మీ అనుభవాలను చెప్పండి...

- నేను అనుకోకుండా ఈ మార్గంలోకి వచ్చా. నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రీసెర్చ్‌ చేస్తూ ఉండేవాణ్ణి. చాలా బిజీ లైఫ్‌. మొదట్లో ఏకాగ్రత కోసం ధ్యానం చేయాలనుకున్నా. ‘యోగద సత్సంగ సొసైటీ’లో చేరా. శ్రీ పరమహంస యోగానంద బోఽఽధించిన సూత్రాలు ఆకళింపు చేసుకున్నా. మొదట్లో ఉదయం, సాయంత్రం 20 నిమిషాల చొప్పున ధ్యానం చేసేవాణ్ణి. కొన్ని రోజులకే నా హృదయపు లోతుల్లోని పారవశ్యం అనుభవంలోకి వచ్చింది. ఏకాగ్రతతో పాటుగా ప్రశాంతత కూడా వచ్చింది. ఆ సమయంలో ‘ఒక యోగి ఆత్మకథ’ చదివా. దీనిలో ఉపనిషత్‌, వేదాల సారాంశమంతా ఉంది. ఇది చదివిన తర్వాత మరింత స్పష్టత వచ్చింది. దేవుడు అంటే అవధులు లేని పారవశ్యమని అర్థమయింది. ‘దేవుడు’ మన ఆనందానికి ఒక ప్రతీక. ఆ దేవుణ్ణి పొందటానికి మనం చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత. ఈ దేవుడికి- ప్రేమ, ఆనందం, జ్ఞానం, శబ్దం, మంత్రం- ఇలా రకరకాల రూపాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు. అనుభూతి చెందుతారు. ఇలా మొదలైన నా ప్రయాణం ఆనందంగా సాగుతూనే ఉంది.

ఆధునిక సమాజంలో ‘ధ్యానం’ అనే పదాన్ని అనేక మంది గురువులు రకరకాలుగా వాడుతున్నారు కదా...

నకిలీ నోట్ల మాదిరిగానే నకిలీ గురువులు కూడా మన సమాజంలో చెలామణిలో ఉన్నారు. వారి ఉచ్చులో పడకుండా ఉండటం మంచిది. మేము బోధించే ‘క్రియా యోగ’- శ్రీ యోగానంద కనిపెట్టింది కాదు. ఆయన కూడా ఈ యోగ విధానం నాదేనని ఎప్పుడూ ప్రకటించలేదు. ‘క్రియా యోగ’ అనేది మనకు గురుపరంపరలో భాగంగా వచ్చింది. అది ప్రాచీన ఋషులు కనిపెట్టినది. ధ్యానానికి మూలం ప్రాణాయామం. ప్రాణాయామం అనేది ‘ప్రాణ... యమ’ అనే రెండు పదాలు కలయిక నుంచి ఏర్పడింది. జీవ శక్తిని నియంత్రించడం అని ఈ రెండు పదాల అర్థం. భౌతిక, వైద్య, విజ్ఞాన శాస్త్రాలు పునాదులుగా మన పూర్వీకులు దీన్ని కనిపెట్టారు. మనసు, శ్వాస... ఈ రెండింటి మఽధ్యా అవినాభావ సంబంధం ఉంది. శ్వాస మీద పట్టు సాధించడం ద్వారా మనసుపైన నియంత్రణ సాధించవచ్చని కనుగొన్నారు. దానికి ‘ప్రాణాయామం’ అనే రూపం ఇచ్చారు.

ఇది కొన్ని వేల క్రితం కనుగొన్న పద్ధతి. ఇప్పుడు ఎవరైనా వచ్చి- కొత్తగా యోగా పద్ధతిని కనిపెట్టానని చెబితే వాళ్లను నమ్మకూడదు. దానిపై ఆరా తీయాలి. దీనికి ఇంకో కోణం కూడా ఉంది. చరిత్రను తరచి చూస్తే బలరామకృష్ణులు, అర్జునుడు, పతంజలి, ఆదిశంకరాచార్యులు, జీసస్‌ వంటి వారు యోగమార్గాన్ని అవలంభించారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. ఆహార, నియమాలు వేరు. వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, సంస్కృతి వేరు. ఆధునిక యుగంలో ఇవన్నీ మారిపోయాయి. వాటికి తగ్గట్టుగా జీవన విధానాలు ఉన్నాయి. కానీ అప్పటికీ, ఇప్పటికీ మారనిది ధ్యానమార్గమొక్కటే!

మన ప్రాచీనులు గురుశిష్య పరంపరలో విద్యను నేర్పేవారు. ప్రస్తుతం చాలా సందర్భాలలో అలాంటి వెసులుబాటు లభించటం లేదు. యోగాను కూడా ఆన్‌లైన్‌లో నేర్పేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

‘గురువు’ అంటే ‘అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడ’ని అర్థం. తన వద్ద విద్యను నేర్చుకొనేవాడి అజ్ఞానాన్ని తొలగించటానికి ఆయన కొంత సమాచారాన్ని శిష్యుడికి అందిస్తాడు. అంటే సమాచార మార్పిడి ఉంటుంది. ఆధునిక కాలంలో ఈ మార్పిడి పద్ధతులు మారాయి. ఒకప్పుడు నేరుగా నేర్చుకున్నది- ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా నేర్పుతున్నాం. ప్రజల వద్దకు చేరుకోవాలంటే ఆధునిక పద్ధతులను వాడుకోవాల్సిందే. దీనివల్ల గురు, శిష్య సంబంధానికి వచ్చిన ఇబ్బందేమి లేదు. కానీ కొన్ని గురువు దగ్గర నేరుగా నేర్చుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి. క్రియాయోగాలో కూడా ఒక స్థాయి వరకే ఆన్‌లైన్‌లో నేర్పుతాం. ఆ తర్వాత గురువు దగ్గరకు వెళ్లి నేర్చుకోవాల్సిందే!

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏది?

ప్రతి మనిషిలోను దైవత్వముంటుంది. దాన్ని కనుగొనటంలో మనిషి చూపిస్తున్న నిర్లక్ష్యమే మానవాళి ముందున్న ప్రధాన సమస్య. మనుషులు ప్రాపంచిక విషయాల ఆధారంగా గుర్తింపు ఏర్పరుచుకుంటున్నాడు. కానీ తనలో ఉన్న దేవుణ్ణి చూడగలిగితే- దృష్టి కోణమే మారిపోతుంది. ప్రపంచమంతా ఆనందమయంగా కనిపిస్తుంది. ఇతరులతో స్నేహంగా ఉండగలుగుతాడు. ఎటువంటి సంఘర్షణలూ ఉండవు.

-సివిఎల్‌ఎన్‌

Updated Date - 2022-12-16T15:47:05+05:30 IST