Pediatric Surgery : పసికందులకు సురక్షితమైన సర్జరీలు

ABN , First Publish Date - 2022-12-19T23:44:06+05:30 IST

గర్భంలో పెరిగే పిండంలో సమస్యలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అబార్షన్‌ చేయించుకోవలసిన అవసరం లేదు. ప్రసవం జరిగిన వెంటనే పసికందుల్లోని

Pediatric Surgery : పసికందులకు సురక్షితమైన సర్జరీలు

గర్భంలో పెరిగే పిండంలో సమస్యలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అబార్షన్‌ చేయించుకోవలసిన అవసరం లేదు. ప్రసవం జరిగిన వెంటనే పసికందుల్లోని ఆయా సమస్యలను సురక్షితంగా సరిదిద్దే పిడియాట్రిక్‌ సర్జరీలున్నాయి. కాబట్టి తల్లితండ్రులు నిర్భయంగా బిడ్డలకు సర్జరీలను చేయించుకోవచ్చు.

టిఫా స్కాన్‌ కీలకం...

20 వారాలకు కడుపులో పెరిగే బిడ్డలోని అన్ని అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ సమయంలో టిఫా స్కాన్‌ ద్వారా బిడ్డలోని లోపాలను కచ్చితంగా కనిపెట్టవచ్చు. అలాగే బిడ్డలో సరిదిద్దలేని లోపాలుండి, ప్రసవం తర్వాత బిడ్డ పెరుగుదల సవాళ్లతో కూడుకుని ఉంటుందని వైద్యులు నిర్ధారించినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తికి భారత ప్రభుత్వం అనుమతిస్తోంది. కాబట్టి 20 వారాల గర్భంలో టిఫా స్కాన్‌ చేయించుకోవడం అత్యవసరం.

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ ఉంటాం. కానీ పండంటి బిడ్డ కోసం గర్భధారణకు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా మసలుకోవాలి. ఒకవేళ మేనరికం లాంటి వివాహమైతే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి అవసరమైన జెనెటిక్‌ స్టడీ చేసి సమస్యలను ముందుగానే సరిదిద్దుకోవాలి. అలాగే గర్భం దాల్చాలనుకునే యువతులలోని విటమిన్‌ లోపాలను కూడా సరిదిద్దుకోవాలి. సాధారణంగా గర్భధారణ తర్వాత గర్భిణులు ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవడం మొదలుపెడతారు. కానీ అంతకంటే ముందే ఆ లోపాన్ని గుర్తించి, మందులతో సరిదిద్దుకోవాలి. అలాగే థైరాయిడ్‌ లోపాలను కూడా సరిదిద్దుకోవాలి. థైరాయిడ్‌ సమస్యలతో గర్భం దాల్చినప్పుడు బిడ్డ మెదడు ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నప్పుడు బిడ్డలో వెన్నుపాము లోపాలు ఏర్పడాయి. ఇలా గర్భంలోని బిడ్డలో ఏర్పడే ఏర్పడే లోపాలకు ముందస్తు జాగ్రత్తలతో అడ్డుకట్ట వేయడం మన చేతుల్లోనే ఉంది. ఇలా ముందు నుంచీ ఎంతో జాగ్రత్తగా గర్భధారణను ప్లాన్‌ చేసుకోగలిగితే గర్భంలోని బిడ్డలో ఏర్పడే లోపాలను 90ు కట్టడి చేయవచ్చు.

ప్రసవం తర్వాత పసికందులకు సర్జరీ..

కొన్ని సందర్భాల్లో గర్భంలో పెరిగే బిడ్డల్లో లోపాలున్నప్పటికీ, వాటిని ప్రసవానంతరం సర్జరీ ద్వారా సరిదిద్దే వీలుంటుంది. గైనకాలజిస్టు, వైద్య బృందం, కౌన్లెసర్ల సహాయంతో తల్లితండ్రులకు కౌన్సెల్‌ చేసి, ప్రసవమైన వెంటనే పసికందులకు సర్జరీ చేయవచ్చు. గర్భంలో పెరిగే కొందరు పిల్లల్లో అవయవాల లోపం ఏర్పడడం, పేగులు మడత పడడం, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడు ఎదగకపోవడం, మెదడులో నీరు చేరడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే మెదడు ఎదగని స్థితి ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్‌ను వైద్యులు సూచిస్తారు. మెదడులో నీరు చేరుకుంటున్నట్టు టిఫా పరీక్షలో తేలినప్పటికీ, యధాతధంగా గర్భాన్ని కొనసాగించి, ప్రసవం తర్వాత మెదడు ఎదగడానికి జాగా కల్పించేలా మెదడులోని నీరు పొట్టలోకి చేరేలా స్టెంట్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే పేగులు మడతపడడం, మూత్రపిండాలు, కాలేయం , గుండె లాంటి ఇతరత్రా సమస్యలను ప్రసవమైన వెంటనే సర్జరీతో సరిదిద్దుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్లపాటు పిల్లల కోసం ప్రయత్నించి, ఇన్‌ఫెర్టిలిటీతో బిడ్డలను కనలేక, అంతిమంగా ఐవిఎఫ్‌ ద్వారా గర్భం దాల్చిన సందర్భాల్లో ఇలాంటి అపురూపమైన పిల్లల విషయంలో కూడా పిడియాట్రిక్‌ సర్జన్లు కీలక పాత్ర పోషిస్తారు.

అందరు పిల్లల్లా ఆరోగ్యకరంగా...

లోపంతో పుట్టి, సర్జరీతో సమస్యను సరిదిద్దిన తర్వాత పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారో లేదోననే భయాలు తల్లితండ్రులకు ఉంటాయి. కానీ ఈ కోవకు చెందిన పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగే ఆరోగ్యంగా ఎదుగుతారు. ఈ విషయాల గురించి, 20వ వారంలో టిఫా స్కాన్‌లో లోపాలు బయట్పడినప్పుడే, ఆయా లోపాల ఆధారంగా నియోనాటాలజిస్ట్‌, పిడియాట్రిక్‌ సర్జన్‌, గైనకాలజిస్టులు గర్భిణికి కౌన్సెలింగ్‌ చేయడం జరుగుతుంది. ప్రసవం తర్వాత చేసే పిడియాట్రిక్‌ సర్జరీల విజయాలు వెంటిలేటర్‌, పెయిన్‌ కిల్లర్‌ మేనేజ్‌మెంట్‌, నర్సింగ్‌ కేర్‌, థర్డ్‌ లెవెల్‌ ఐసియుల మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి వెసులుబాట్లు ఉన్నప్పుడు పిల్లల సర్వైవల్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇలా సమర్థమైన పిడియాట్రిక్‌ సర్జరీలతో బిడ్డలోని లోపాలను సరిదిద్దగలిగితే, ఈ పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగే పెరిగి పెద్దయి, ఆటపాటల్లో, చదువులో ముందంజలో ఉంటారు.

సర్జరీ తర్వాత...

సర్జరీ జరిగి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి బిడ్డ ఇంటికి చేరుకున్న తర్వాత బిడ్డలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు, రాకపోవచ్చు. వాటిని తేలికగానే పరిష్కరించుకోవచ్చు. సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న పిల్లలు నిండు ఆరోగ్యంతో సాధారణ పిల్లల్లాగే ఎదుగుతారు.

గర్భం నుంచి బయటకు తీసి...

గర్భంలో ఉన్నప్పుడే సమస్యను సరిదిద్దే అత్యాధునిక సర్జరీలు ప్రపంచంలో ఒకటి రెండు చోట్ల అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎగ్జిట్‌ ప్రొసిజర్స్‌ అంటారు. ఈ ప్రొసిజర్‌లో భాగంగా గర్భం నుంచి బిడ్డను బయటకు తీసి, బొడ్డు తాడును కత్తిరించకుండా బిడ్డలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్ది, తిరిగి గర్భాశయంలో ఉంచి, సర్జరీని ముగిస్తారు. అయితే ఈ తరహా సర్జరీలు అంతగా విజయం సాధించలేదు. ఇప్పటికీ ఈ సర్జరీలు ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి.

డాక్టర్‌ మధు మోహన్‌ రెడ్డి

సీనియర్‌ పిడియాట్రిక్‌ సర్జన్‌,

మెడికవర్‌ ఉమెన్‌

అండ్‌ చైల్డ్‌ హాస్పిటల్స్‌,

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - 2022-12-19T23:44:08+05:30 IST