అమ్మగా ఆ వేదన తెలుసు!

ABN , First Publish Date - 2022-10-26T00:08:53+05:30 IST

నాలుగేళ్ల తన పిల్లాడికి ఆటిజమ్‌ అని తెలిసి తల్లడిల్లిపోయింది. కొడుకు కోసం ఎంతో శ్రమపడింది. అతడిలా బాధపడుతున్న మరికొంతమంది పిల్లలకు

అమ్మగా ఆ వేదన తెలుసు!

నాలుగేళ్ల తన పిల్లాడికి ఆటిజమ్‌ అని తెలిసి తల్లడిల్లిపోయింది. కొడుకు కోసం ఎంతో శ్రమపడింది. అతడిలా బాధపడుతున్న మరికొంతమంది పిల్లలకు తల్లయింది. వారందరి కోసం తన ఉద్యోగాన్ని వదిలేసి... ఆటిజమ్‌ కేంద్రాన్ని నెలకొల్పిన శ్రీనగర్‌ టీచరమ్మ కుల్సుమా సేవా పథం ఇది...

‘‘అబ్బాయి పుట్టాడని ఆనందపడేలోపే విధి మా జీవితాలను తలకిందులు చేసింది. మేం కన్న కలలన్నీ మాయమైపోయాయి. ఎంతగొప్పగా ఊహిచుకున్నాం.. వాడి భవిష్యత్తుని! పిల్లాడైతే పెరుగుతున్నాడు కానీ... మానసికంగా పరిపక్వత మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇది మమ్మల్ని కలచివేసింది. వాడికి నాలుగేళ్లు వచ్చాయి. చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాడంతట వాడు ఏ పనీ చేసుకోలేకపోతున్నాడు. వాడిలో వాడు బిగ్గరగా నవ్వుకొంటున్నాడు. అంతలోనే ఏడుస్తున్నాడు. శ్రీనగర్‌ మా స్వస్థలం. మా అబ్బాయి ఫర్మాన్‌ను స్థానిక వైద్యులకు చూపించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో ఢిల్లీకి వెళ్లి అక్కడి ఓ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో డాక్టర్లను సంప్రతించాం. వాళ్లు ‘ఆటిజమ్‌’గా నిర్థరించారు.

ఢిల్లీ చుట్టూ ఆరేళ్లు...

ఫర్మాన్‌ చికిత్స కోసం తరచూ కశ్మీర్‌ నుంచి ఢిల్లీ వెళ్లివచ్చేదాన్ని. అలా ఆరేళ్లు తిరిగాను. అదే సమయంలో నేను కూడా ఆటిజమ్‌పై క్రాష్‌ కోర్స్‌ ఒకటి చేశాను. ఆక్యుపేషనల్‌, స్పీచ్‌ థెరపీల్లో శిక్షణ తీసుకున్నాను. గురుగ్రామ్‌లో ఆటిజమ్‌పై జరిగిన అనేక వర్క్‌షాపుల్లో పాల్గొన్నాను. పలు సంస్థల్లో వాలంటీర్‌గా పని చేసి, అనుభవం గడించాను. ఇవన్నీ ఇంటి దగ్గర మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోవడానికి. ఢిల్లీలో చికిత్స తరువాత వాడిని ఇంటికి తీసుకువచ్చాం. అయితే లోయలో ఆటిజమ్‌ కేంద్రమే లేదు. ఆరా తీస్తే ఫర్మాన్‌లాంటి పిల్లలు మా ప్రాంతంలో చాలామందే ఉన్నారని తెలిసింది.

మావాడి కోసం...

నేనైతే మా అబ్బాయిని ఢిల్లీకి తీసుకువెళ్లి చికిత్స చేయించాను. వాడి కోసమే ఆటిజమ్‌ కోర్స్‌ కూడా చదివాను. కనుక వాడిని ఎలా చూసుకోవాలో... అలాంటి పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది అందరు తల్లితండ్రులకూ సాధ్యం కాదు కదా! మరి వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనతోనే శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో ‘ఎక్సెప్షనల్‌ మైండ్స్‌’ పేరిట ఆటిజమ్‌ సెంటర్‌ ఒకటి నెలకొల్పాను. దాంతోపాటు మూడేళ్ల కిందట స్కూల్‌ కూడా ప్రారంభించాను. ఇప్పుడు ఫర్మాన్‌కు పదహారేళ్లు. వాడితోపాటు మరో ఇరవై మంది పిల్లలున్నారు. నాకు మా అబ్బాయి ఎంతో... మిగిలినవారు కూడా అంతే! వీళ్లందరినీ చూసుకోవడానికి నా టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఇప్పుడు ఈ కేంద్రంలో నాతోపాటు మరొక మహిళ కూడా సేవలందిస్తున్నారు.

ముందుగానే గుర్తిస్తే...

పిల్లల్లో ఆటిజమ్‌ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే... వారిలో మార్పు తీసుకురావచ్చు. విద్య, పునరావాసం ద్వారా ప్రత్యేక లక్షణాలుగల పిల్లల సాధికారతే నా లక్ష్యం. మా కేంద్రంలో కొంతమంది పిల్లలు ఆటిజమ్‌తో పాటు నరాల సంబంధిత రుగ్మతలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా దగ్గర బిహేవియరల్‌, ఆక్యుపేషన్‌, స్పీచ్‌, లాంగ్వేజ్‌, ఓరల్‌ ప్లేస్‌మెంట్‌, ఫిజియో, మ్యూజిక్‌- ఆర్ట్‌ థెరపీలు అందిస్తున్నాం. వీటివల్ల వారిలో మానసిక పరివర్తన వస్తుంది. స్నానం చేయడం, డ్రెస్‌లు వేసుకోవడం, తినడంలాంటి పనులు వేరొకరి సాయం లేకుండా వారే చేసుకోగలుగుతారు.

వారి కోసమే...

ఈ పునరావాస కేంద్రం కోసం ఒక భవనం అద్దెకు తీసుకున్నాం. పిల్లల్ని చూసుకోవడానికి కొంతమందిని నియమించాం. కేంద్రానికి వచ్చే పిల్లల తల్లితండ్రుల నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తున్నాం. ఆ మొత్తాన్ని భవనం అద్దె, స్టాఫ్‌ జీతాలకు వెచ్చిస్తున్నాం. అయితే స్కూల్‌లో సేవలకు ఫీజు తీసుకోవడంలేదు. ప్రభుత్వం నుంచి గానీ, కార్పొరేట్‌ సంస్థల నుంచి గానీ మాకు ఎలాంటి సహకారం లేదు. దాని కోసం నేను ఎదురుచూడను. దీని నిర్వహణకు మావారు డబ్బు సమకూరుస్తున్నారు. తల్లితండ్రులను నేను కోరేది ఒక్కటే... ఒకవేళ మీ పిల్లలకు ఆటిజమ్‌ అని తెలిస్తే, వారిని తక్కువ చేసి చూడవద్దు. ఒక భారంగా భావించకుండా... ప్రేమను పంచండి. వాళ్లు ప్రత్యేకమైన పిల్లలు... కనుక వారిపై ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరమని మరువకండి.

Updated Date - 2022-10-26T00:11:45+05:30 IST