Munshiram Manoharlal Publishers: మాది ఏడు తరాల కథ

ABN , First Publish Date - 2022-12-29T00:04:51+05:30 IST

తెలుగులో వావిళ్ల వారిలా భారతీయ తాత్విక శాస్త్రాల ప్రచురణలో ‘మున్షీరాం మనోహర్‌లాల్‌ పబ్లిషర్స్‌’కు ఘనమైన పేరుంది. దీనిది 150 ఏళ్ల చరిత్ర. 19 రకాల అంశాలపై మూడు వేలకు పైగా టైటిల్స్‌తో...

Munshiram Manoharlal Publishers: మాది ఏడు తరాల కథ

తెలుగులో వావిళ్ల వారిలా భారతీయ తాత్విక శాస్త్రాల ప్రచురణలో ‘మున్షీరాం మనోహర్‌లాల్‌ పబ్లిషర్స్‌’కు ఘనమైన పేరుంది. దీనిది 150 ఏళ్ల చరిత్ర. 19 రకాల అంశాలపై మూడు వేలకు పైగా టైటిల్స్‌తో... అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రచురణ సంస్థ ఇది. తాతముత్తాతల సంకల్పాన్ని ఒక చేత్తో... పుస్తకాలను మరొక చేత్తో పట్టుకొని తరాల ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మాధురి జైన్‌. హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవంలో ప్రత్యేక స్టాల్‌ నిర్వహిస్తున్న ఆమెను ‘నవ్య’ పలకరించింది.

‘‘భారతీయ సంస్కృతి, చరిత్రల అధ్యయన గ్రంథాల ప్రచురణలో మాది ఏడు తరాల కథ. సుమారు 150 ఏళ్లకు పైగా మా కుటుంబమంతా ప్రచురణ రంగంతో మమేకమైంది. దీన్నొక వ్యాపారంగా చూడకుండా, ఈ నేల మూలాలను భావితరాలకు పరిచయం చేయాలనేది మా పూర్వీకుల సంకల్పం. మా తాత ముత్తాతలు నడిచిన అదే బాటలో తర్వాత మా నాన్న అశోక్‌జైన్‌, ఇప్పుడు నేను నడుస్తున్నందుకు గర్విస్తున్నాను. అదీ తరతరాల వారసత్వ బాధ్యతను తొలిసారిగా ఓ ఆడపిల్ల స్వీకరించడమంటే, మారుతున్న కాలానికి నిదర్శనమని చాలామంది అంటుంటారు. కానీ నేను మాత్రం అవసరమైతే కాలానికి ఎదురీదగలననే నమ్మకంతోనే ఈ రంగంలోకి అడుగు పెట్టాను. అనుకున్నట్టుగానే, కరోనా నాకు పెద్ద పరీక్షే పెట్టింది. అదే సమయంలో పుస్తక ప్రపంచంలో నన్ను వేలు పట్టుకొని నడిపిస్తున్న మా నాన్న దూరమయ్యారు. పుస్తకాల మార్కెట్‌ కూడా కుదేలైంది. గోరుచుట్టు మీద రోకలిపోటు అన్నట్టు కాగితం, ఇంక్‌ ధరలు పెరిగి ముద్రణ ఖర్చులు ఒకటికి రెండింతలు అయ్యాయి. అయినా ఎక్కడా ఆగలేదు. ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు నడిచాను. వాటన్నింటినీ తట్టుకొని ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాం.

విదేశాల నుంచీ...

మా ప్రచురణలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. మావద్ద మాత్రమే లభించే కొన్ని అరుదైన పుస్తకాల కోసం వివిధ దేశాలకు చెందిన చరిత్ర అధ్యయనకారులు, వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు చాలామంది మమ్మల్ని సంప్రతిస్తుంటారు. అందులోనూ ఒకటా, రెండా... మావి 3000కు పైగా టైటిల్స్‌ కదా! చరిత్ర, పురాణాలు, సమస్త వేద సాహిత్యం, భారతీయ కళలు, తత్త్వ, పురాతత్త్వ, శిల్ప, వాస్తు శాస్త్రాలు, సంగీ తం, నృత్యం, రంగస్థలం, ఎపిగ్రఫీ, సంప్రదాయ వైద్య పద్ధతులు, యోగా, రాజకీయ విశ్లేషణలు, వివిధ మతాల చరిత్రలు వంటి 19 రకాల అంశాలకుపైగా అరుదైన రచనలను ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రించాం. మున్షీరాం మనోహర్‌లాల్‌ అంటే జాతీయ నాయకులు మొదలు విశ్వవిద్యాలయాల పరిశోధన విద్యార్థుల వరకు... అందరికీ సుపరిచితమే! ఢిల్లీ- రాణి ఝాన్సీ రోడ్డులోని మా కార్యాలయానికి పుస్తకాల కోసం అప్పుడప్పుడు కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా వస్తుంటారు. టీఎస్‌ రుక్మిణి, హరీష్‌ జోహార్‌, కిసారి మోహన్‌ గంగూలీ, ఆనంద్‌ కుమార్‌ స్వామి లాంటి ప్రసిద్ధ రచయితలు, ప్రముఖ స్కాలర్ల పుస్తకాలను ప్రచురించాం. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌’ వంటి ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, విభాగాలతో కలిసి సమకాలీన పరిశోధనలను కూడా ప్రచురిస్తుంటాం.

పరిచయం చేసేందుకే...

హైదరాబాద్‌ పుస్తక మహోత్సవం ప్రారంభమైన నాటి నుంచి ఏటా మా ప్రచురణలతో ఇక్కడ స్టాల్‌ను నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా నేను పదేళ్లుగా వస్తున్నాను. తెలుగు పాఠకులు మమ్మల్ని అంతగా ఆదరిస్తున్నారు. అలాగే ఢిల్లీ వరల్డ్‌బుక్‌ ఫెయిర్‌తో పాటు కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, ఢిల్లీ వంటి దేశంలోని అన్ని ప్రముఖ పుస్తకాల ప్రదర్శనల్లోనూ పాల్గొంటాను. మా వద్ద ఇండాలజీకి చెందిన పుస్తకాలే ఉంటాయి. కనుక, ఆ అభిరుచి, ఆసక్తి ఉన్నవాళ్లే మా స్టాళ్లను సందర్శిస్తుంటారు. బుక్‌ ఫెయిర్‌ల ద్వారా మా ప్రచురణలను పాఠకులకు పరిచయం చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. కనుక లాభనష్టాలను పరిగణలోకి తీసుకోలేం. వివిధ బుక్‌ ఫెస్ట్‌లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో మాత్రం నాకెన్నడూ ఎలాంటి సమస్యా తలెత్తలేదు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వ్యాప్తి వంటి క్లిష్ట సమయాల్లోనూ సందర్శకుల సంఖ్య తగ్గకపోవడం ఇక్కడి ప్రత్యేకత. న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా తర్వాత అతిపెద్ద బుక్‌ఫెయిర్‌ అంటే ఇదే!

పైరసీనే అదిపెద్ద సమస్య...

పుస్తక ప్రచురణలో మాకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య పైరసీ. కొందరు ప్రచురణకర్తలు మా వద్ద ఒక పుస్తకం కొని, దాన్ని దొంగతనంగా ముద్రించి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఏ ప్రచురణకర్తకైనా ఒక రచనపై అరవై ఏళ్ల వరకు హక్కులుంటాయి. ఆ తర్వాత ఎవరైనా పబ్లిష్‌ చేయవచ్చు. అయితే, ఆ రచయితకు రాయల్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో మేం ఒక పద్ధతిగా, హుందాతనంతో వ్యవహరిస్తుంటాం. కానీ కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరం. మా పుస్తకాలను డిజిటల్‌ మార్కెట్లోకి విడుదల చేయమని ఒకరిద్దరు పెద్ద కంపెనీలవాళ్లు సంప్రతించారు. అందుకు నేను అంగీకరించలేదు. అంతకంతకు లాభాలొస్తాయని అన్నారు. అక్కర్లేదన్నాను. ‘మేము కాగితాన్ని, అక్షరాన్ని నమ్ముకున్నవాళ్లం. మేము పుస్తకాన్ని ప్రచురిస్తాం కానీ ఈ-బుక్స్‌ను కాదు’ అని కాస్త గట్టిగానే చెప్పాను. అంతెందుకు, మొత్తం పాఠకుల్లో మేము ప్రచురించే పుస్తకాలు చదివేవారి సంఖ్య పదిశాతం కూడా ఉండదేమో! కనుక కథలు, నవలలు వంటి కాల్పనిక సాహిత్యం కూడా ప్రచురించమని శ్రేయోభిలాషులు సూచించారు. అదీ ఇష్టంలేదన్నాను. భారతీయ సంస్కృతి, చరిత్ర అధ్యయన గ్రంథాలంటే మొదట గుర్తొచ్చేది, ప్రముఖంగా వినిపించేదీ ‘మున్షీరాం మనోహర్‌లాల్‌ పబ్లికేషన్స్‌’. మా పూర్వీకులు నిలబెట్టిన ఈ పేరును నేను చెడగొట్టలేను.

ఇప్పుడంతా గడ్డుకాలమే...

‘హరేరామ హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మా తాతయ్య మనోహర్‌లాల్‌ను సంప్రతించి, కొన్ని పుస్తకాలు తీసుకున్నారట. అవి తనకెంతో సహాయపడ్డాయని ఆయన విశ్లేషణతో వచ్చిన ‘భగవద్గీత’ పుస్తకంలోనూ ప్రస్తావించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో లాలా లజపతిరాయ్‌ వంటి చాలామంది ప్రముఖ నాయకులు మా బుక్‌ స్టోర్‌ను సందర్శించారని విన్నాను. తర్వాత కాలంలో మా తాతయ్య జనసం్‌ఘతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. అలా అప్పుడప్పుడు మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మా ఇంటికి రావడం, తాతయ్యతో ఆయన పుస్తకాల గురించి సంభాషించడం నాకు లీలగా గుర్తుంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాలు చదివేవారి సంఖ్య బాగా తగ్గింది. పదేళ్ల ముందు వరకు ప్రచురణా రంగానిది స్వర్ణ యుగం. ఇప్పుడు మాత్రం గడ్డుకాలమే! తిరిగి పుస్తకం శోభ సంతరించుకోవాలంటే ప్రచురణకర్తలు, రచయితలు అంతా కలిసి ఒక ఉద్యమంలా పనిచేయాలి. పాఠకులతో గ్రంథాలయాలు కళకళలాడాలి. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.’’

చరిత్ర చాలానే ఉంది...

మా పూర్వీకులది అవిభాజ్య భారతదేశం, లాహోర్‌లోని షహెద్‌ మిట్ట. మాది పంజాబీ జైన కుటుంబం. మా ముత్తాత తండ్రి పేరు మెహర్‌ చంద్‌ లక్ష్మణ్‌దాస్‌ జైన్‌. ఆయన 1840కు పూర్వం సిక్కుల పవిత్ర గ్రంఽథం ‘గురు గ్రంథ సాహిబ్‌’ను ఆంగ్లంలోకి అనువదించారు. అందుకు మెహర్‌చంద్‌ గారిని మహారాజా రంజిత్‌సింగ్‌ సత్కరించారు. ఆ తర్వాత మహారాజా వారసులు కూడా కొంత నజరానా బహూకరించడంతో, ఆ నగదుతో 1870లో మెహర్‌చంద్‌ పుస్తకాల ప్రచురణ ప్రారంభించారు. తర్వాత ఆయన కుమారుడు మున్షీరాం, మనవడు మనోహర్‌లాల్‌ కూడా అదే వారసత్వాన్ని కొనసాగించారు. అయితే, దేశ విభజన సమయంలో ఓ అల్లరి మూక మా ఇంటితో పాటు పబ్లికేషన్‌ కార్యాలయాన్నీ, పుస్తకాల గోడౌన్‌ను తగలబెట్టింది. దాంతో మా కుటుంబం తరతరాలుగా భద్రం చేసుకున్న విలువైన రాత ప్రతులు, ప్రచురించిన పుస్తకాలన్నీ ఆహుతయ్యాయి. అప్పటికే మా నాన్నమ్మ పిల్లలతో సహా అమృత్‌సర్‌ చేరుకుంది. తర్వాత ఇరుగుపొరుగున ఉండే కొందరు ముస్లింల సహకారంతో మా తాతయ్య కట్టుబట్టలతో ఢిల్లీకి పారిపోయారు. వారంతా కలిసి ఢిల్లీలోనే కొన్నాళ్లు శరణార్థుల్లా గడిపారు. తర్వాత, 1948లో మా నానమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి తాతయ్య తిరిగి ‘మున్షీరాం మనోహర్‌లాల్‌’ పేరుతో ప్రచురణ సంస్థను ప్రారంభించారు. అలా దగ్ధమైన మా వారసత్వం మళ్లీ పుంజుకుంది. పుస్తకం మా చెంతకు చేరింది. మా తాతయ్య మనోహర్‌లాల్‌ తదనంతరం మా నాన్న అశోక్‌జైన్‌ దాన్ని మరింత వృద్ధి చేశారు.

కె.వెంకటేశ్‌

ఫొటోలు: లవకుమార్‌

Updated Date - 2022-12-29T04:29:03+05:30 IST