అన్నిటికీ మూలం

ABN , First Publish Date - 2022-12-01T23:46:50+05:30 IST

ప్రతి మనిషిలో సగం మంచి ఉంటుంది, సగం చెడు ఉంటుంది. చీకటీ లోపలే ఉంటుంది, వెలుగు కూడా లోపలే ఉంటుంది. సందేహాలు లోపలే ఉంటాయి, స్పష్టతా లోపలే ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం దారి తప్పితే... అది మనలోనే జరుగుతుంది. మనల్ని మనం పొందినట్టయితే

అన్నిటికీ మూలం

ప్రతి మనిషిలో సగం మంచి ఉంటుంది, సగం చెడు ఉంటుంది. చీకటీ లోపలే ఉంటుంది, వెలుగు కూడా లోపలే ఉంటుంది. సందేహాలు లోపలే ఉంటాయి, స్పష్టతా లోపలే ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం దారి తప్పితే... అది మనలోనే జరుగుతుంది. మనల్ని మనం పొందినట్టయితే అది కూడా మనలోనే జరుగుతుంది. అన్నింటికీ మూలం మనలోనే ఉంది. బయటెక్కడో లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదో చేయడం వల్ల, దేన్నో చూడడం వల్ల ఆనందంగా అనిపిస్తుందని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఆనందానికి మూలం మనలోనే ఉంది. అది ఏ వస్తువులోనూ ఉండదు. ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా అర్థం కావడం లేదంటే, అందుకు మూలం మీలోనే ఉందని గ్రహించాలి. ఏ దైవాన్ని మీరు అన్వేషిస్తున్నారో ఆ దైవం మీలోనే ఉంది. ఏ భూతం నుంచి మీరు తప్పించుకోవాలని అనుకుంటున్నారో అది కూడా మీలోనే ఉంది. మీరు ఎక్కడికి వెళ్లినా ఆ రెండూ మీలోనే ఉంటాయి. ఎన్నోసార్లు మీరు ఏకాంతంగా గడపాలని గదిలోకి వెళ్ళి, తలుపుకి గొళ్ళెం పెట్టుకుంటారు. అయినప్పటికీ మీరు ఏకాంతంగా ఉండరు. ఇంతకుముందు చెప్పినవన్నీ మీతోనే ఉంటాయి. ప్రకాశం మీలోనే ఉంటుంది, అంధకారం కూడా మీలోనే ఉంటుంది.

ఈ యావత్‌ సృష్టిని రచించిన ఆ సృష్టికర్త కూడా మీలోనే ఉన్నాడు. అలాగే యావత్‌ ప్రపంచాన్ని వేధిస్తున్న పెనుభూతం కూడా మీలోనే ఉంది. ఏం జరుగుతున్నా సరే... రెండూ మీలోనే ఉంటాయి... మంచీ ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఒకవేళ చెడు బయటికి వచ్చినా, దాన్ని అంతమొందించే మంచి కూడా మీలోనే ఉందని తెలుసుకోవడం చాలా అవసరం. శాంతి అనేది వేరెక్కడి నుంచో వచ్చేదయితే, దాన్ని పొందడం కష్టమయ్యేది. కానీ నేను శాంతిని ఎక్కడైనా అనుభూతి పొందగలను. ఎందుకంటే అది నాలోనే ఉంది కాబట్టి. ‘‘యుద్ధభూమిలో సైతం మీరు శాంతి తాలూకు అనుభూతి పొందగలరు’’ అని నేను చెబితే... ‘‘అదెలా సాధ్యమవుతుంది?’’ అని నన్ను చాలామంది ప్రశ్నిస్తుంటారు. గమనించాల్సిందేమిటంటే... మీరు చేసే ఆ పోరాటం బాహ్యంగా జరుగుతున్నది, కానీ ఆ స్థితిలో కూడా మీలోపల జరుగుతున్నదేమిటి? యుద్ధమా లేక శాంతా? ‘‘చంద్రమండలానికి మానవులు వెళ్లవచ్చు’’ అని కొందరు చెప్పినప్పుడు ఎంతోమంది అది అసాధ్యమన్నారు. కానీ చంద్రమండలం మీదకు మానవులు అడుగుపెట్టారు కదా! ఎవరైతే అసాధ్యమని అనుకున్నారో వాళ్ళు వెళ్లారా లేక ఎవరైతే సాధ్యమని అనుకున్నారో వాళ్ళు వెళ్లారా? కాబట్టి అసాధ్యం అనేవారు ఎంతో మంది ఉండవచ్చు. దాని వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సాహసంతో ప్రయత్నిస్తేనే జరుగుతుంది. శాంతి పొందడానికి సైతం సాహసం కావాలి. ఆ సాహసం మీ లోపలి నుండే వస్తుంది. ప్రస్తుత కాలంలో అందరికీ కావలసింది వ్యక్తిగతమైన శాంతి కాదు, సామాజిక శాంతి. దానికోసం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, వేటిని తెలుసుకోవడం వల్ల మీ జీవితం, సమాజం శాంతిమయం కాగలదో వాటిని గ్రహించడానికి ప్రయత్నించండి. అసలైన సుఖ సంతోషాలతో జీవనం సాగించండి.

ప్రేమ్‌ రావత్‌, 9246275220

www.premrawat.com

Updated Date - 2022-12-01T23:46:52+05:30 IST