Jesus Sacrifice : త్యాగానికి ప్రతిరూపం

ABN , First Publish Date - 2022-11-10T22:27:05+05:30 IST

‘ఏసు’ అనే పేరులోనే ‘రక్షణ’ అనే అర్థం... ఒక పరమార్థంగా దాగి ఉంది. ప్రజలకోసం కావలసినంత సందేశాన్ని ఆయన ఇచ్చాడు.

Jesus Sacrifice : త్యాగానికి ప్రతిరూపం
JESUS

‘ఏసు’ అనే పేరులోనే ‘రక్షణ’ అనే అర్థం... ఒక పరమార్థంగా దాగి ఉంది. ప్రజలకోసం కావలసినంత సందేశాన్ని ఆయన ఇచ్చాడు. తాను దైవకుమారుడినేననే నమ్మకం ప్రజల్లో కలిగేలా... కొన్ని అద్భుతాలను ప్రకటించాడు. అయినా విశ్వసించని ప్రజల కోసం కల్వరగిరిపై నిర్దాక్షిణ్యంగా హతమయ్యాడు.

మరొకరికి ఆనందం కలిగించడం కోసం ఏదైనా వస్తువులు వదులుకొనేవారిని మనం చూస్తూ ఉంటాం. తమ్ముడి కోసం రాజ్యం త్యాగం చేయవచ్చు. సంపదలన్నీ దానం చేయవచ్చు, సర్వ సుఖాలనూ త్యజించవచ్చు. ప్రాణ స్నేహితుడి కోసం ప్రేమను వదులుకోవచ్చు. కానీ పరుల సుఖం కోసం, పరులను రక్షించడం కోసం ఎవరైనా ప్రాణ త్యాగం చేస్తారా? తనను తాను బలిగా సమర్పించుకుంటారా? అది త్యాగానికి పరాకాష్ట కదా! అలాంటి త్యాగమూర్తి మరెవరో కాదు ఏసు ప్రభువే.

‘ఏసు’ అనే పేరులోనే ‘రక్షణ’ అనే అర్థం... ఒక పరమార్థంగా దాగి ఉంది. ప్రజలకోసం కావలసినంత సందేశాన్ని ఆయన ఇచ్చాడు. తాను దైవకుమారుడినేననే నమ్మకం ప్రజల్లో కలిగేలా... కొన్ని అద్భుతాలను ప్రకటించాడు. అయినా విశ్వసించని ప్రజల కోసం కల్వరగిరిపై నిర్దాక్షిణ్యంగా హతమయ్యాడు. తనను తాను రక్షించుకోగలిగే మహత్తు ఆయనకు ఉంది. కానీ తండ్రి చిత్తాన్ని అనుసరించి... మరణాన్ని ప్రేమతో స్వీకరించాడు. అదే ఆయన త్యాగం. మరి, తనను అనుసరించేవారికి ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి? పరులతో ప్రేమగా బతకాలని. ఏసును అనుసరించినవారు ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఆయనను లోకానికి చూపించడం కోసం, ఆయన వాక్కును లోకానికి ప్రకటించడం కోసం బాధలు, హింసలు అనుభవించారు. ఏ పరిణామాలకైనా సిద్ధపడ్డారు. కొందరు మరణించారు కూడా.

నేటి లోకంలో ప్రభువు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతామని చెప్పేవారు ఉంటారు. కానీ ఆయన కోసం చిన్న బాధనైనా వారు భరించలేరు. ప్రాణత్యాగం చేస్తామనేవారికి ఈ వేదనలు, బాధలు, కష్టాలు, హింసలు, సహనం... ఇవన్నీ ఒక లెక్కా? ప్రాణదానంలోనే అన్ని త్యాగాలూ దాగి ఉండవా? ‘‘నేను మీకోసం మరణించాను. మీరు ఈ మాత్రం ఓర్చుకోలేరా? బాధను అనుభవించలేరా?’’ అని కల్వరగిరి నుంచి ఆయన అంతిమ స్వరం మాటిమాటికీ హెచ్చరిస్తోంది.

‘త్యాగం అంటే ఇది’ అని క్షణ క్షణం గుర్తు చేస్తోంది. సుఖ భోగాలకు అలవాటు పడిన శరీరం, రుచి కోసం వెంపరలాడే జిహ్వ... ఇవి త్యాగాన్ని నిర్వచించలేవు, త్యాగం చేసి చూపనూ లేవు.

ఎవరినీ మరణించాలని ప్రభువు చెప్పలేదు. బాధల్ని ఓర్చుకోవాలనీ, కష్టించి పని చెయ్యాలనీ, బద్ధకంతో సోమరుల్లా మారవద్దనీ, శరీరాలను సైతానుకు నివాసంగా చేసుకోవద్దనీ మాత్రం పిలుపునిచ్చాడు. కష్టంలోనే మనో వికాసం ఉంటుందనే సందేశం ఇచ్చాడు. ‘ఇతరులను అన్యాయంగా నిందించడం, కటువుగా మాట్లాడడం, మానసికంగా హింసించడం మహా పాపం’ అని చెప్పాడు. తనను అనుసరించేవారు నిందలు భరించడానికైనా, ఇతరుల బాధలు పంచుకోవడానికైనా సిద్ధపడాలనీ సత్కార్యాలకు పూనుకోవాలనీ బోధించాడు.

సాటి మనిషికి చేతనైనంత సాయం, పొరుగువారిపై ప్రేమ, ప్రతికార్యంలోనూ త్యాగం... ప్రభువు చెప్పిన ఈ సూత్రాన్ని మరచి, ప్రార్థనల్లో మునిగిపోతే ఆయన సంతోషించడు. కల్వరగిరి నుంచి మృత్యుఘోషనూ, మరణయాతననూ విశ్వానికి వినిపిస్తూనే ఉంటాడు.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-11-10T22:28:43+05:30 IST

Read more