Autobiography of a Yogi: 75 ఏళ్ల ఈ పుస్తకం ఎన్ని జీవితాలను మార్చిందో...
ABN , First Publish Date - 2022-12-18T11:31:55+05:30 IST
గురువు మౌనంగా తన సాధనలో ఉంటూనే ఆత్మజ్ఞామనమనే వెలుగుని చూపుతారు.
ఆత్మసాక్షాత్కారం పొందిన వారు తన నుంచి తరంగాలను వెదజల్లుతారు. ఆ తరంగాలకు ఎందరో భక్తులు ఆకర్షితులవుతారు. ఏ గుహలోనో మౌనంగా కూర్చుని ఉన్నాసరే.. సత్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు విని ఉన్నాసరే.. ఆ తరంగాలతో భక్తుడి మనసు పరవశమై ఆ తరంగాలనే మార్గంగా చేసుకుని ప్రయాణించాలని భక్తుడు నిర్ణయించుకుంటాడు. అసలు విషయం ఏమిటంటే గురువు మౌనంగా తన సాధనలో ఉంటూనే ఆత్మజ్ఞామనమనే వెలుగుని చూపుతారు. అదే పరమసత్యంగా ప్రకాశిస్తుంది. అలా గురువులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద ప్రకాశింపజేసిన వెలుగే నేటికీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒకయోగి ఆత్మకథ పుస్తకం. ఈ పుస్తకమే ఎందరో సాధకులను ఆధ్యాత్మిక మార్గంలో నడిచే విధంగా సహకరించింది. ఈ అపూర్వమైన గ్రంథం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు నిండినా ఇంకా ఆ వాక్యాలలోని మాధుర్యం వెంట నడిచి ఎందరో చైతన్యవంతులవుతున్నారు. వారి మనసులను కాంతితో నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకయోగి ఆత్మకథ చదివి వారి అనుభవాలను చెప్పుకొచ్చిన కొందరు సాధకులను గురించి తెలుసుకుందాం. వారిని ఈ పుస్తకం ఎలా ప్రభావితం చేసిందో వారి మాటల్లోనే...

దివ్య, విద్యార్థిని.
నేను ఐదేళ్ళున్నప్పుడే మా అమ్మగారు నాకు ఒకయోగి ఆత్మకథ పుస్తకాన్ని పరిచయం చేసారు. అది నాకు అర్థం కావడం లేదని చిన్న చిన్న కథలుగా రోజూ చెప్పేది. అలా నాకు ఈ పుస్తకం మీద ఆసక్తి పెరిగింది. తరువాత నాకు పదేళ్ళ వయసులో ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాను. పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అయిన అనుభవం ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ తన డైలీ లైఫ్ లో దేవుణ్ణి అనుభవం చెందవచ్చు అనే విషయం అర్థం అయింది. అలానే ఆయన ఎందరో మహానుభావులను కలిసారు. అలానే నేను కూడా గొప్పవారిని, జ్ఞానులను భవిష్యత్ లో కలవాలని అనుకున్నాను. గురూజీ నా లైఫ్ లో ఉన్నాడని, నాకు చిన్న కష్టం వచ్చినా నాతో ఉండి నన్ను నడిపిస్తాడని నా నమ్మకం. నా ప్రమేయం ఉండి జరిగే మంచి చెడులు గురూజీ ఆమోదంతోనే జరుగుతాయి. లాభనష్టాలనే వాటి వెనుక బలమైన కారణాలు ఉంటాయని నేను నమ్ముతాను.

నిర్మల.. గృహిణి
చాలామంది ఈ పుస్తకం ద్వారానే యోగదా మెంబర్లవడం, ఈ పుస్తకం చదివి అడ్రస్ కనుక్కుని వెతుక్కుంటూ వచ్చినవారు నాకు తెలుసు. ఈ పుస్తకంలో చాలా సమాధానాలు దొరుకుతాయి. ఒకేసారి అంతా అర్థం అయిపోదు, చదువుతున్న కొద్దీ లోతు తెలుస్తుంది. చదివిన ప్రతి సారీ ఏదో సమాధానం దొరుకుతుంది. ఆ కథలన్నీ మనకు ఒక్కో మెసేజ్ లానే స్వామి మనకు ఇచ్చారు. మా నాన్నగారు ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని ఎక్కువగా చదివేవారు. అది చదువుతుంటే ఆ కవర్ మీద ఆ ఫోటో చూసినప్పుడు ఆ కళ్ళు నన్ను చాలా ఆకర్షించాయి. ఆ చూపులో చాలా ప్రేమ దాగి ఉంది. అది చూసి నేను చాలా స్పూర్తి చెందాను. కానీ అప్పట్లో నాకు ఇలాంటి మార్గం ఒకటి గురువుగారిని ఇంకా దగ్గర చేస్తుందని తెలియలేదు. ఎప్పుడైతే నేను నా తండ్రిని కోల్పోయానో అప్పుడు నేను గురువు కోసం వెతకడం మొదలు పెట్టాను. అనుకోకుండా హైదరాబాద్ బేగంపేట చికోటీ గార్డెన్స్‌లోని వైఎస్ఎస్ కేంద్రానికి రావడం జరిగింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కల్నల్ డాక్టర్ నయ్యర్ తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు ఈ పుస్తకం చాలా సాయం చేసిందన్నారు. ఆ మాట నా మనసుకు తాకింది. అదే మాట నాకు ఒక మెసేజ్ లా అనిపించింది. అంతే ఫాం తీసుకుని పూర్తి చేసి, మా నాన్నగారు చదివిన ఆ పుస్తకాన్నే తెచ్చుకుని చదవడం మొదలుపెట్టాను. ఆత్మకథలో కొన్ని అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చేవి. కాకపోతే ఇక్కడ ఒకమాట చెప్పాలి.
ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని విషయంగా మరో సంగతి పంచుకుంటాను. మా ఇంట్లో అంతా ఈ మార్గంలోనే ఉన్నాం.. కానీ మా కోడలు తను ఇంటికి కొత్త అయినా మొన్న అడిగింది. నేను మెంబర్ అయిపోతాను అని. స్వామీజీ అడిగారు... "ఎందుకు ఇప్పుడు మెంబర్ అవుదామనుకుంటున్నావ్" అంటే మా అత్తగారిని చూసి ఆ నిర్ణయం తీసుకున్నానంది. అది చాలా ఆనందంగా అనిపించింది.

సౌజన్య.. ఉద్యోగిని
2013 పెళ్ళి తరవాత మా శ్రీవారి ద్వారా నాకు ఒకయోగి ఆత్మ కథ పుస్తకం పరిచయం అయింది. అలా పరమహంస యోగానంద స్వామి వారు గురించి నాకు తెలిసింది. ఆదివారాలు ఇద్దరం ధ్యానానికి వచ్చేవాళ్ళం. ఈ పుస్తకం చదివాకా నాలో నాపై చాలా నమ్మకం ఏర్పడింది. ఈ రూల్స్ అవి పాటించడం భక్తి, ఇలా ఉండాలి, అలాగే చేయలనే వాటికి భయపడేదాన్ని. కానీ నాలో భయాలన్నీ దూరంచేసేస్తూ పూర్తి నమ్మకాన్ని నింపింది ఈ పుస్తకం. అలా నేను ఈ పుస్తకాన్ని చదవమని చెప్పినవారు కూడా ఈ పుస్తకానికి చాలా బుణపడి ఉన్నామని తమకు చాలా సాయపడిందని చెప్పారు. ఆమాట విన్నాకా చాలా సంతోషంగా అనిపించింది.

సాయి పుష్యమి.. విద్యార్ధిని
నేను 2005లో కాలేజ్ రోజుల్లో.. వివేకానందుని ఆశ్రమానికి వెళుతున్న సమయంలో ఒకయోగి ఆత్మకథ పుస్తకం నాకు పరిచయమై చదివాను. అక్కడి లైబ్రరీలో భక్తి పుస్తకాల మధ్య కనిపించిన ఈ పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాక నాకు తెలియకుండానే దానిలో లీనమైపోయేదానిని. ఎంత చదువుతున్నా ఇంకా చదవాలనే అనిపించేది. ఈ పుస్తకం చెప్పేదంతా మన జీవితం గురించే.. మామూలుగా మనం ఏ పని చేసినా కూడా మన జీవితాన్ని మనం జీవిస్తూనే స్వామి మార్గంలో నడవవచ్చు అనేది చెపుతుంది. ఆ ప్రయాణించే మార్గాలు కూడా ఎలా ఉండాలనేది ఈ పుస్తకం చెపుతుంది. నాకు తెలిసిన వారికి కూడా ఈ పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు వాళ్ళ జీవితాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించామని చెప్పడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. జీవితాన్ని జీవించడానికి, ఈలోకంలోకి ఎందుకు వచ్చాం అనేది తెలుసుకోవడానికి, మన ప్రశ్నలన్నీంటికీ ఇందులో సమాధానాలను వెతికి పట్టుకోవచ్చు.

శశి.. వ్యాపారవేత్త
గత ముఫ్పై ఏళ్ళుగా ఈ యోగదా సత్సంగ్ లో సభ్యురాలిగా ఉంటున్నాను. నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా స్నేహితురాలు నాకు ఒకయోగి ఆత్మకథ పుస్తకం నాకు ఇచ్చింది. ఈ పుస్తకం నాకు మంచి స్నేహితుడిలా నన్ను గైడ్ చేస్తుందని చెప్పచ్చు. ఒకయోగి ఆత్మకథ అనేది పరమహంస యోగానంద ఆత్మకథ అని అంతా అనుకుంటారు. కానీ ఆ పుస్తకంలో ఆయన గురించి తక్కువ ఉంటుంది మన భారత దేశంలో ఇంత ఆధ్యాత్మిక సంపద ఉందా అనేది తెలుస్తుంది. నిజంగా ఈ దేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా మన దేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద గురించి నేను తెలుసుకోగలిగాను. అంతే కాకుండా గురువుగారు కలిసిన వ్యక్తులు గాంధీగారు, లూథర్ బర్బాంక్, వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడి వరకూ వీరందరికీ యోగానంద క్రియాయోగాను నేర్పించారు. భారతదేశము ఆధ్యాత్మికంగా వెలుగులు నింపుతుందని నేను నమ్మాను. అలాగే నా జీవితంలో కూడా ఈ పుస్తకం కొత్త వెలుగును తెచ్చింది. గురూజీ కూడా ఒకమాట అన్నారు నేను వెళిపోయిన తరువాత ఈ పుస్తకం చాలామందికి చేరి అది భగవంతుడి వైపునకు లాగుతుందని చెప్పారు,. ఆయన అన్నట్టుగానే మీరు ఆ పుస్తకం తెరవగానే భగవంతుని మీదకు లాగడం మొదలు పెడుతుంది. ఒకయోగి ఆత్మకథ పుస్తకాన్ని ఎందరికో ఇస్తూ ఉంటాను. ప్రతి సందర్భానికి గురూజీ రూపంలో ఈ పుస్తకం అందరికీ చేరాలని పంచుతూ ఉంటాను.
స్వామి మాటలు..
స్వామి శ్రీ యుక్తేశ్వర స్వామీజీ అన్నమాట ఏమిటంటే..
ఆధ్యాత్మిక దారి నేను ఇప్పుడే పట్టాలా లేక రిటైర్మెంట్ అయ్యాకా చూసుకోవచ్చుకదా అని అనుకోకూడదు. మీరు ఎప్పుడు ధ్యాన మార్గాన్ని ఎంచుకుంటారో, మొదలు పెడతారో అప్పటి నుంచే మీ జాతకం మారుతుందని ఆయన అన్నారు.

పద్మావతి.. గృహిణి
నేను ఒకయోగి ఆత్మకథ పుస్తకాన్ని 1988 మా అక్కయ్య ఇచ్చినప్పుడు చదివాను. ఆమె డాక్టర్. ఉమాదేవి. ఆమె మరో మతాన్ని ఫాలో అవుతూ మా ఇంట్లో కాస్త ఇబ్బంది వాతావరణానికి కారణమయ్యారు. ఇదే కరెక్ట్, ఇలాగే చేయండి. మీరంతా పూజలు చేయకండి అనేవారు. ఆమె ఈ పుస్తకం చదివాకా తిరిగి మళ్ళీ మావైపునకు రావడం వల్ల నేను దానిని చదవడం జరిగింది. ఆ తరువాత నేను ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని 1989లో మెంబర్ గా చేరాను. అలాగే ధ్యానం మీద కూడా చాలా మక్కువ ఉండేది. ఈ పుస్తకం చదివాక నాకు ఒకమార్గం దొరుకింది అనిపించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా రకాల అనుమానాలు కలుగుతాయి. వాటికి కూడా సరిగ్గా వెతికితే అందులో సమాధానాలు దొరుకుతాయి. గురూజీ అన్నింటినీ వివరిస్తారు. ఆయన చెప్పిందంతా అనుభవించి రాసింది కనుక నమ్మకం ఉంచి చదవడమే మన పని. ప్రశ్నించే వాళ్ళకోసం ప్రశ్నలకు తగిన సమాధాలు అందులోనే ఉన్నాయి. వెతికి పట్టుకుందాం.

డాక్టర్ విజయలక్ష్మి ..
నేను స్వామిని చేరడం అనేది చాలా చిత్రంగా జరిగింది. దానిని వివరించడం కూడా కష్టమే.. ఎందుకంటే 1993 వరకూ ఆయన గురించి నాకు ఏమీ తెలీదు. కనీసం గురూజీ ఫోటో కూడా నేను చూడలేదు. యోగానంద గురించి వార్తన్నా వినలేదు. కానీ మా ఇంటికి ఎదురుగా ఒకరు ఉండే వారి ఇంటికి పని మీద వెళ్ళినపుడు వాళ్ళ గోడకు గురూజీ ఫోటో వేలాడుతూ కనిపించింది. వివరాలు అడిగి తెలుసుకున్నాను. సరే.. అప్పటినుండి నన్ను ఆయన ఆలోచన వెంటాడింది. వెంటనే పుస్తకం తెప్పించుకుని చదివాను. చదివాక నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేనిది. ఎంతటి తన్మయత్వమో.. పుస్తకాన్ని మొత్తం పూర్తిచేసాకా కలిగిన పారవశ్యాన్ని తెలిపేందుకు మాటలు సరిపోవు. ఆ భగవంతుని తెలుసుకోవడం ఇంత తేలికా అనే పరమానందం పొందాను, కానీ అందరూ ఈ మార్గంలోకి రాలేరు.. ఏకాగ్రత కలిగిన వారు మాత్రమే రాగలరు అని అనిపించింది.

స్వామి స్మరణానంద గిరి వై. ఎస్. ఎస్. ఉపాధ్యక్షులు..
ఒకయోగి ఆత్మకథ పుస్తకం మనలో మనో వివేకాన్ని పెంచుతుంది. ఈ పుస్తకం దాదాపు 75 ఏళ్ళుగా ఎందరో భక్తుల దగ్గరకు చేరుతూనే ఉంది. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే గొప్ప సంగతి. ఒకయోగి ఆత్మకథ ఎందరినో ప్రభావితం చేసింది. ఎవరైతే ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాన్ని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతారో వారు చాలా ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ఈ పుస్తకం చెప్పేదేమంటే జీవితానికి లక్ష్యం ఉండాలని చెపుతుంది. అంతేనా ఈ పుస్తకాన్ని చదువుతున్న కొద్దీ, క్రియాయోగాకు కనెక్ట్ అయ్యేలా దీనిలో టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఈ పుస్తకంలో ఉన్న జీవితాలనే తీసుకుంటే మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయ, స్వామి యుక్తేశ్వర్ జీ, పరమహంస యోగానంద జీ వీరంతా క్రియాయోగ శాస్త్రాన్ని ఇప్పటి లోకానికి పరిచయం చేయడం కోసమే జన్మించారు అనిపిస్తుంది. శతాబ్దాలపాటు అంధ యుగాల్లో మరుగున పడిపోయిన క్రియాయోగ శాస్త్రం మహావతార్ బాబాజీ ద్వారా ఆధునిక యుగంలో పునరుద్ధరించబడింది. ఆయన శిష్యులైన లాహిరీ మహాశయులు (1828–1895) మన యుగంలో క్రియాయోగాన్ని బాహ్య ప్రపంచానికి బోధించిన మొదటి వ్యక్తి. ఆ తరువాత, లాహిరీ మహాశయుల శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిని (1855-1936), ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే ఈ ప్రక్రియలో శ్రీ పరమహంస యోగానందగారికి శిక్షణ ఇవ్వమనీ, ఈ ప్రక్రియను ప్రపంచానికి అందించేట్టు చేయమనీ బాబాజీ కోరారు. మనిషి ఎలా జీవించాలి, ఎలా పని చేయాలి, ఎలా ఇతరులతో మెలగాలి అనేది ఇక్కడే తెలుసుకుంటాం.
జీవితంలోని సమస్యలకు సమాధానాలు పొంది, అప్పుడు అన్వేషించు భగవంతుని కోసం.
పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు ప్రతి ఒక్కరికీ నేర్పేదేమిటంటే మన ఆత్మలోనే దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, దివ్యానందాన్ని మన ఆనందంగా సొంతం చేసుకోవడం. వీటిని అంకితభావంతో సాధన చేసినప్పుడు ఆత్మ అన్ని బంధాల నుండి విముక్తి చెంది దైవసాక్షాత్కారం పొందుతుంది. ఇది రాజోచితమైన లేదా మహోన్నతమైన యోగ పద్ధతి, దివ్య సంయోగం.
“భక్తితో కూడిన ప్రార్థన అనేది, స్వేచ్ఛగా ప్రవహించే భగవంతుని ఆశీర్వాదాలకు తనను తాను తెరుచుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం, ఇది మానవుని జీవితానికి, అన్ని ప్రయోజనాలను అందించే అనంతమైన మూలానికి మధ్య అవసరమైన సంబంధం. కానీ మనస్సు బాహ్యంగా తిరుగుతున్నప్పుడు ప్రార్థన ప్రభావవంతంగా ఉండటానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఒక గంట క్రియాయోగ ధ్యానం ఇరవై నాలుగు గంటల సాధారణ ప్రార్థన కంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. _ పరమహంస యోగానంద.
ఒకయోగి ఆత్మకథ ఒక్క పరమహంస యోగానంద ఆత్మకథ మాత్రమే కాదు. అది ఎందరో యోగుల ఆత్మసంబంధమైన పూల మాల. యోగానంద తెలిపిన క్రియాయోగ ప్రక్రియ అనుసరించాలంటే మనసుకు, ఆత్మకు క్లిష్టమైన పనే. అయినా కూడా ఈ దారిలో నడవాలనుకునేవారు, నడుస్తున్నవారు ధన్యులు. ఒక యోగి ఆత్మకథ పుస్తకంగా వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.
_ శ్రీశాంతి మెహెర్.