Bhagavad Gita : శాశ్వత మార్గప్రదాత... భగవద్గీత

ABN , First Publish Date - 2022-12-01T23:51:01+05:30 IST

ప్రపంచంలోని ప్రస్తుత జనజీవన సమస్యలు, యుద్ధాలు, తీవ్రమైన పోటీ, నేలను తాకుతున్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సూచికలు, జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు...

Bhagavad Gita : శాశ్వత మార్గప్రదాత... భగవద్గీత

రేపు గీతా జయంతి

ప్రపంచంలోని ప్రస్తుత జనజీవన సమస్యలు, యుద్ధాలు, తీవ్రమైన పోటీ, నేలను తాకుతున్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సూచికలు, జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు... ఇలాంటివన్నీ ఊహించని పరిణామాలని చెప్పలేం. వాస్తవానికి శాస్త్ర వివరణల ప్రకారం ఈ సమస్యలన్నీ ఆశ్చర్యకరమైనవేమీ కావు. ఇటువంటివి గతంలోనూ సంభవించాయి, ప్రస్తుతం సంభవిస్తున్నాయి, భవిష్యత్తులోనూ సంభవిస్తూనే ఉంటాయి.

ఐదు వేల సంవత్సరాల క్రితం ఇదే తరహాలో భావోద్వేగాలకు లోనైన అర్జునుడి గురించి ‘భగవద్గీత’ వివరించింది. అత్యంత పరాక్రమశాలి, సమస్త అస్త్ర శస్త్ర సంపన్నుడు, రణరంగ ధీరుడైన అంతటి అర్జునుడు సైతం కురుక్షే త్ర సంగ్రామ ఆరంభంలో... తనముందున్న పరిస్థితిని గ్రహించిన మరుక్షణం భావోద్వేగాలకు లోనయ్యాడు. తీవ్ర ఒత్తిడితో ఒళ్ళంతా కంపించి, చేతిలోని గాండీవాన్ని జారవిడిచి, రథంలో కుప్పకూలిపోయాడు. యుద్ధాన్ని విరమించాలనుకున్నాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకొనే వాదనలు వినిపించసాగాడు.

కొన్నిసార్లు పరిస్థితుల ఒత్తిడిని భరించలేక... మనం ఆచరించవలసిన విద్యుక్త ధర్మాలను విడిచిపెట్టి, మారుమూల ప్రదేశానికి పారిపోయేలా పలు సందర్భాలు ప్రేరేపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితి అర్జునుడంతటి యోధునికీ తప్పలేదు. అర్జునుడి మాటలను విన్న కృష్ణుడు ‘‘అనార్యజుష్టమస్వర్గ్యమ్‌ అకీర్తికరమర్జున... ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి నీకు ఎలా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుచేస్తుంది’’ అని హితవును బోధిస్తూ కొనసాగించిన సంభాషణే ‘భగవద్గీత’గా విశ్వవిఖ్యాతమై నిలిచింది. ఆ భగవద్గీతను విన్న అర్జునుడు ధృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సును చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడి, విజయాన్ని సాధించాడు. అసలు అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి?

శ్రీకృష్ణుడు భగవద్గీతలో అస్త్ర శస్త్రాల గురించి కానీ, యుద్ధ నైపుణ్యాల గురించి కానీ ప్రస్తావించలేదు. జీవిత సత్యాలను ఉపదేశించాడు. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునుడికి ఉన్న అపోహలను మార్చేశాడు.

శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించిన అర్జునుడు...

‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని వేడుకున్నాడు. (భగవద్గీత- 2:7)

జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలంటే... ఒక ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతిఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యులు కచ్చితంగా విశుద్ధ కృష్ణభక్తులై వుండాలి.

సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలనీ, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహాలలో బందీల్లా జీవిస్తున్నారన్న సత్యాన్ని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు.

‘‘ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం, యౌవనం, వార్థక్యాలలోంచి సాగిపోతుందో, అదే విధంగా మరణ సమయంలో... జీవాత్మ మరో దేహం (శరీరం) లోనికి ప్రవేశిస్తుంది. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహం చెందడు’’ అని చెప్పాడు. (భగవద్గీత- 2:13)

మన నైపుణ్యాలు, నేర్పరితనాలు మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేం. కాబట్టి కేవలం ఈ భౌతిక దేహానికి, భౌతిక జీవనానికి సంబంధించిన నైపుణ్య, ప్రావీణ్యతల మీద మాత్రమే మనం దృష్టి సారిస్తే సరిపోదు. ఆత్మ స్వరూపులమైన మనం ఉన్నతమైన ఆనందం, జ్ఞానం, శాశ్వత జీవనం కోసం పరితపించడం సహజం. కానీ, ఈ భౌతిక ప్రపంచం వాటిని అందివ్వలేదు.

భగవద్గీతను పఠించిన తర్వాత అర్జునుడిలా ప్రతి ఒక్కరూ పై విధమైన నిర్ధారణకు రావాలి. తనతో పాటు తన ముందున్న శత్రువులంతా పైకి కనిపిస్తున్న భౌతిక దేహాలు కారనీ, భగవంతుని అంశలైన ఆత్మస్వరూపులేనని గ్రహించిన అర్జునుడి దృక్పథం ఒక్కసారిగా మారిపోయింది. శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడని, పరమ సత్యమని, దేవాధిదేవుడని గ్రహించి... సంపూర్ణ శరణాగతి చేశాడు. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన అర్జునుడు అంతిమంగా ఈ నిర్ధారణకు వచ్చాడు: ‘‘ఓ అచ్యుతా! నీ కృపవల్ల నా మోహభ్రాంతి నిర్మూలన అయింది. నేను జ్ఞానంలో స్థితుడినై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు. నీ ఉపదేశాల ప్రకారం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను’’ అని చెప్పాడు. (భగవద్గీత- 18:73)

భగవద్గీత జీవన పోరాటాల నుంచి పలాయనాన్ని బోధించదని చెప్పేందుకు ఇదే నిదర్శనం. శ్రీకృష్ణుణ్ణి శరణు వేడి... జీవన పోరాటాన్ని కొనసాగించమనే ప్రోత్సహిస్తుంది. భగవద్గీతలోని శ్రీకృష్ణుని ఉపదేశాలను, శ్రీల ప్రభుపాదుల లాంటి ఆచార్యుల బోధనలను అనుసరిస్తే... మోహభ్రాంతుల నుంచి దూరమై, జీవితంలో సరైన విధంగా నడుచుకోగలం. జీవితంలోని నిరాశ, నిస్పృహల నుంచి ఉపశమనాన్ని పొందే మార్గం ఇదే.

ఇప్పుడూ భగవద్గీత ఉపయోగపడుతుందా?

‘‘కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అప్పటి పరిస్థితులను అనుసరించి చెప్పిన భగవద్గీత... ఈనాటి పరిస్థితులకు, ఇప్పటి జీవన విధానాలకు, ప్రస్తుతం నడుస్తున్న కాలానికి కూడా ఉపయోగపడుతుందా? అంటే మార్గదర్శనం ఇవ్వగలదా?’’ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. అప్పటికీ, ఇప్పటికీ దేశ కాల పరిస్థితులకు, సామాజిక విషయాలకు మధ్య ఎంతో తేడా ఉండచ్చు కానీ, యుగం మారి ఎంతో కాలం గడిచినా మానవుల భావోద్వేగ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితులు ఇంకా సంక్లిష్టంగా మారాయి. మరి ఈనాటి పరిస్థితులలోనూ మార్గదర్శనం అందించేది ఏమిటి? కేవలం భగవద్గీత మాత్రమే! నాడు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత అర్జునుణ్ణి ఏవిధంగా విజయమార్గంవైపు నడిపిందో... ఈనాడూ అదే భగవద్గీత మనకున్న ఎన్నో సందేహాలను, సందిగ్ధతలను పటాపంచలు చేసి మార్గనిర్దేశం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

అటువంటి శాశ్వత మార్గదర్శి అయిన భగవద్గీత ఆవిర్భవించిన రోజును మనం ‘గీతాజయంతి’గా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా, ప్రతిఒక్కరూ ‘భగవద్గీత’ గ్రంథాన్ని కూలంకషంగా చదివి, ఆకళింపు చేసుకోవాలి. అలాగే పిల్లలకు పసితనం నుంచే భగవద్గీతను బోధించాలి. అది వారికి కర్తవ్యబోధ చేస్తుంది. జీవితంలో ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులనైనా చాకచక్యంగా ఎదుర్కొని విజయం సాధించగల స్థైర్యాన్ని కచ్చితంగా అందిస్తుంది.

సత్యగౌర చంద్రదాస ప్రభూజీ,

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌, హైదరాబాద్‌, 9396956984

Updated Date - 2022-12-01T23:51:02+05:30 IST