Manchi Pustakam: పిల్లల కోసం 500లకు పైగా...

ABN , First Publish Date - 2022-12-20T10:35:40+05:30 IST

పిల్లల కోసం పుస్తకాల లోకాన్ని సృష్టించారు ఆయన. దానిలో కాస్తంత మమకారాన్ని, గారాన్ని, మారాన్ని చేర్చి "మంచి పుస్తకంరా నాయనా చదవరా" తండ్రీ..

Manchi Pustakam: పిల్లల కోసం 500లకు పైగా...
Manchi Pustakam

పిల్లల కోసం పుస్తకాల లోకాన్ని సృష్టించారు ఆయన. దానిలో కాస్తంత మమకారాన్ని, గారాన్ని, మారాన్ని చేర్చి "మంచి పుస్తకంరా నాయనా చదవరా" తండ్రీ.. అంటూ బుజ్జగించే పిల్లల పుస్తకాలు ఇవి, పెద్దోళ్ళను చేయి పట్టుకుని మరీ ఆ పుస్తకాల గని దగ్గరకు పిల్లలే లాక్కొస్తారు. వాళ్ళలోకంలో తేలిపోతూ పుస్తకాలను చేతిలోకి అందుకుంటారు. ఇది బుక్ ఫెయిర్ సీజన్ కనుక మళ్ళీ పిల్లల పండుగ జరిపేందుకు మంచిపుస్తకం ముస్తాబవుతుంది. ఆకర్షణీయమైన రంగురంగు బొమ్మలతో పిల్లల మనసుదోచే విధంగా, కంటికి ఇంపుగా అక్షరాలను అలంకరించి పిల్లలముందుంచబోతున్నారు. రానున్న పుస్తక మహోత్సవంలో పసి హృదయాలను ఆకట్టుకునేందుకు మరిన్ని మంచికథలను, కబుర్లను వాళ్ళకోసం తెస్తుంది మంచిపుస్తకం. దీని గురించి మంచిపుస్తకం ప్రచురణకర్త సురేష్ గారిని పలకరించినపుడు ఆయన పంచుకున్న సంగతులివిగో..

1. మంచి పుస్తకం పుస్తక ప్రచురణ సంస్థ పుట్టుకకు వెనక ఉన్న కారణం? మంచి పుస్తకం పుట్టి ఎన్నేళ్ళవుతుంది. బుక్ ఫెయిర్ లో ఎన్నేళ్ళుగా ఈ పుస్తకాలు ఉంటున్నాయి?

పిల్లల కోసం తెలుగులో పుస్తకాలను ప్రచురించాలనే ఉద్దేశంతోనే మంచి పుస్తకం ట్రస్ట్‌గా ఏర్పడింది. అయితే, దీని కంటే ముందు ఇదే ఉద్దేశంతో బాల సాహితి అనే పేరుతో పని చేశాం. తెలుగులో పిల్లల పుస్తకాల కోసం ప్రత్యేక సంస్థ ఉండాలన్న పరుచూరి సుబ్బయ్య ఆలోచనతో బాల్ రెడ్డి, రాజేంద్ర, నేను (సురేష్) కలిసి బాల సాహితిని 1989లో ప్రారంభించాం. అందరం ఉద్యోగాలు చేసుకుంటూ ఈ పనిని చేసేవాళ్లం. పదేళ్ల కాలంలో దాదాపు 40 దాకా పుస్తకాలు ప్రచురించాం. కొన్ని పుస్తకాలు మినహాయించి ఈ పుస్తకాలన్నీ వివిధ సంస్థల ద్వారా ముద్రణలో ఉన్నాయనేది చాలా సంతోషం కలిగించే విషయం.

తెలుగులో పిల్లల పుస్తకాల కోసం మంచి పుస్తకం ప్రయాణం 2002లో హైదరాబాదు బుక్ ఫెయిర్‌తో ప్రారంభం అయ్యింది. ఆ సంవత్సరం వివిధ ప్రచరుణకర్తల దగ్గర నుంచి తెలుగులో ఉన్న పిల్లల పుస్తకాలను తెచ్చి ‘పుస్తకాలతో స్నేహం’ అన్న పేరుతో స్టాల్ పెట్టాం. ఆ సంవత్సరం 600కి పైగా టైటిల్స్ ప్రదర్శించాం. అమ్మకాల తోపాటు పుస్తకాల గురించి, చదవటం గురించి తల్లిదండ్రులతో, టీచర్లతో మాట్లాడటం కూడా ఒక ప్రధాన అంశంగా ఉండేది. బుక్ ఫెయిర్‌లోనే కాకుండా తరవాత కూడా పుస్తకాలు అందుబాటులో ఉంటే బాగుంటుందని అడిగేవారు. అప్పట్లో అది సాధ్యం కాలేదు.

2004లో మంచి పుస్తకం ట్రస్ట్‌గా రిజిస్టరు అయ్యింది. ఇప్పుడు ట్రస్టీలుగా రవీంద్ర, ఎస్. ఎస్. లక్ష్మి, నేను ఉన్నాం. మంచి పుస్తకం సొంత ప్రచురణలు మొదలు కావటంతో అప్పుడు నేను పని చేస్తున్న ‘వాసన్’ అనే స్వచ్ఛంద సంస్థలో ఒక బీరువాలో పరిమిత పుస్తకాలు అందుబాటులో ఉండేవి. మంచి పుస్తకంలో మొదటి ఉద్యోగి విమల. ప్రచురణల సంఖ్య పెరగటంతో విడిగా అద్దెకు ఇల్లు తీసుకున్నాం. 2007లో పూర్తి కాలం పని చెయ్యటానికి భాగ్యలక్ష్మి (నా భార్య) మంచి పుస్తకంలో చేరింది. ఎం.వి. ఫౌండేషన్ నల్గొండ జిల్లాలో 100 పాఠశాలల్లో చేపట్టిన క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు కోసం పుస్తకాల ఎంపిక, గ్రంథాలయ కార్యక్రమాల నిర్వహణకు భాగ్యలక్ష్మి పని చేయటం మొదలు పెట్టింది.

మంచి పుస్తకం ట్రస్ట్ అయినప్పటికీ ఎటువంటి గ్రాంటులు లేకుండా పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతోనే నడుస్తోంది. మొదట్లో ఇతర ఖర్చులు పెద్దగా లేవు, అందరం సమయం ఇచ్చేవాళ్లం. మంచి పుస్తకం కోసం నేను పూర్తి కాలం పని చెయ్యటం మొదలుపెట్టి పది సంవత్సరాలు కావస్తోంది.

మంచి పుస్తకం అంటే ముఖ్యంగా భాగ్యలక్ష్మి, నేను కనపడతాం. కానీ ఈ పని వెనక ఎంతో మంది ఎటువంటి పేరు, ప్రతిఫలం ఆశించకుండా చేస్తున్న కృషి ఉంది. ఈ ఇరవై ఏళ్ల కాలంలో మంచి పుస్తకం షుమారుగా 400 పుస్తకాలు ప్రచురించింది. ఎంపిక చేసిన ఇతర సంస్థల పుస్తకాలను పంపిణీ చేస్తోంది. పిల్లల కోసం తెలుగులో పుస్తకాలు ఎంచుకోటానికి దాదాపు 500 టైటిల్స్ ఉంటాయి.

2. పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలంటారు ?

పిల్లల పుస్తకాలు అనగానే చాలామందికి నీతి పుస్తకాలు గుర్తుకు వస్తాయి. లేదా ఈ మధ్య స్ఫూర్తి దాయకం, వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, పర్యావరణ అవగాహన అంటున్నారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ చిన్నప్పుడే నీతిని నేర్పిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, పిల్లల్ని నిజాయితీపరులుగా తీర్చి దిద్ది సమాజాన్ని మార్చెయ్యవచ్చని అనుకుంటారు. ఇది జరిగే పని కాదు. చుట్టుపక్కల సమాజం నుంచి పిల్లలు నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ట్రాఫిక్ నియమాల గురించి ఎన్ని పాఠాలు చెప్పినా సమాజంలో వాటిని పాటించక పోవటమే పద్ధతిగా చెలామణి అవుతోంది. సమాజం ఎలా ఉంది అనేది గమనించి ఎవరికి కావలసినది వారు నేర్చుకుంటారు.

నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లలే దేశ భవిష్యత్తు అంటారు కానీ పెద్ద వాళ్లకి అనుభవం ఎక్కువని, వాళ్లకి అన్నీ తెలుసని, పిల్లల మంచి కోసమే చెబుతారని, కాబట్టి పెద్ద వాళ్లు చెప్పింది పిల్లలు వినాలని చాలా కథలు రాస్తుంటారు. ఇది హేతుబద్దం కాదనే నా అభిప్రాయం.

చదవటంలో పిల్లలకు ఆసక్తి కలిగించేలా బాల సాహిత్యం ఉండాలి, పుస్తకాల పట్ల ప్రేమను కలిగించాలి. ధారాళంగా, భావ యుక్తంగా, వేగంగా చదవటం నేర్పించాలి. వాళ్లని చదువరులను చెయ్యాలి. అంతిమంగా ఏం చదువుతారు, ఏం నేర్చుకుంటారు అన్నది వ్యక్తులకు, పిల్లలకు వదిలి వెయ్యాలి.

బాల సాహిత్యంలో జానపద కథలకు (ఫోక్ టేల్స్) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన మైథాలజీ పిల్లలకి తెలియాలి. ఇవి కాక హాస్యంగా, వినోదంగా, సరదాగా, సాహసవంతమైన, అద్భుత కథలు ఉండాలి.

జీవితానికి, భావోద్వేగాలకు సంబంధించిన కథలు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒక ఆర్. కె. నారాయణ్, ఒక రస్కిన్ బాండ్ లాంటి రచయితలు కావాలి. తెలుగులో బాల్యం కథలు చాలామంది రాశారు. అట్లాంటి అనుభవాలు, జీవం ఉన్న కథలు, నవలలు కావాలి. ప్రతి కథలోనూ వాస్తవ అనుభవం కొంత, ఊహ కొంత ఉంటాయంటారు. పెద్దవాళ్ల కథలు, నవలలకి ఏ సూత్రాలు వర్తిస్తాయో అవే సూత్రాలు బాల సాహిత్యానికీ వర్తిస్తాయి.

WhatsApp Image 2022-12-20 at 9.45.12 AM.jpeg

3. మంచి పుస్తకాలు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వస్తున్నాయా? మంచి పుస్తకం పుస్తకాలు ఎన్ని భాషల్లో దొరుకుతాయి?

పిల్లల కోసం తెలుగులో పుస్తకాల ప్రచురణ, ప్రోత్సాహం అన్న ఉద్దేశంతో మంచి పుస్తకం ట్రస్ట్‌గా ఏర్పడింది. అంటే మా దగ్గర తెలుగులోనే పుస్తకాలు ఉంటాయి. ఈ రకంగా పుస్తక ప్రదర్శనలలో మా స్టాల్, మా సంస్థ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

అయితే 20 పుస్తకాల దాకా (ఒకే పుస్తకంలో) తెలుగు-ఇంగ్లీషు భాషలతో బైలింగువల్ ఫార్మాట్‌లో ఉన్నాయి. చిన్న పిల్లలకు ఇంగ్లీషు నేర్చుకోటానికి A Bagful of Stories అన్న 50 స్టోరీ కార్డులు, ఫన్ విత్ ఫోనిక్స్ అన్న పుస్తకాలు ఇంగ్లీషులో ఉన్నాయి.

Permanent Green అన్న ఇంప్రింట్ పేరుతో ప్రత్యామ్నాయ వ్యవసాయం గురించి తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పుస్తకం కొన్ని పుస్తకాలను ప్రచురించింది.

4. కరోనా వల్ల పుస్తకాల విక్రయాలు చాలా వరకూ తగ్గాయి. మంచి పుస్తకం మీద దాని ఎఫెక్ట్ ఎంతవరకూ ఉందంటారు?

మన జీవితాలను కరోనా పూర్తిగా మార్చి వేసిందనటంలో సందేహం లేదు. మాది చిన్న సంస్థ కావటం వల్ల ఓవెర్‌హెడ్ ఖర్చులు తక్కువ. ఆ కారణంగా కరోనా ప్రభావాన్ని చాలావరకు తట్టుకుని నిలబడ గలిగాం.

5. పుస్తకం విక్రయాలు తగ్గాయి, చదివేవారు తగ్గారు, మరి పుస్తకం ఇప్పటి పరిస్థితి ?

చాలా మంది జీవితాల్లో సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. వెరసి మనుషుల జీవితాలలో స్క్రీన్ టైం పెరుగుతోంది, పుస్తకాలు చదవటం తగ్గుతోంది. అందరికీ బాగా చదవటం రాక ముందే ఈ గాడ్జెట్స్ ప్రాముఖ్యతను సంతరించుకోవటం సమస్యే అని నా అభిప్రాయం. పాఠశాలల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్న పిల్లలు అటు తెలుగు గానీ, ఇటు ఇంగ్లీషు గానీ ధారాళంగా చదవ లేకపోతున్నారు.

6. భవిష్యత్ లో పుస్తకాలను పట్టుకుని చదివేవారు ఉండరు అనేది వింటున్నాం. దీనిమీద మీ అభిప్రాయం?

రాసేవాళ్లు, ప్రచురణలు పెరుగుతున్నా మొత్తంగా అచ్చు పుస్తకాలను చదవటం తగ్గుతోంది అని నాకు అనిపిస్తోంది. కానీ, మాబోటి పాత తరం వాళ్లకి చేతిలో పుస్తకం పట్టుకుని చదివే అనుభూతి వేరు. కనీసం చిన్న పిల్లలకు ముద్రిత పుస్తకమే మంచిదని నా అభిప్రాయం. ముద్రిత పుస్తకం నిలవాలని కోరుకునేవాళ్లల్లో నేను ఒకడిని.

7. తెలుగు చదవడం రాని పిల్లలు, తెలుగు చదవమని కోరుకోని తల్లి తండ్రులు ఉన్నారు. అసలు తెలుగు భాష మనుగడ ప్రమాదంలో ఉందంటారా?

చిన్న వయస్సులోనే కనీసం రెండు భాషలు బాగా నేర్పవచ్చు. ఇంగ్లీషు ఒక భాషగా, తెలుగు మాధ్యమంలో చదువులు బాగా చెప్పవచ్చు. ఒకప్పటి మధ్య, ఎగువ మధ్య తరగతి ఎదగటానికి కారణం కుటుంబాల నేపధ్యం. ఇంగ్లీషు మీడియం అయినంత మాత్రాన ఇంగ్లీషు బాగా వచ్చెయ్యాలని లేదు. జీవితంలో ఎదగటానికి ఇంగ్లీషు భాష అవసరమే. కానీ, అందు కోసం తెలుగుని విస్మరించాల్సిన, తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదు. కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవలసింది పోయి ఉన్న తెలుగు పదాలనే వాడటం లేదు. ఒకప్పటి తెలుగు అయితే ఉండదనే అనిపిస్తోంది, చాలా ఇంగ్లీషు పదాలు తెలుగులోకి వచ్చేశాయి. తెలుగులో రాసినప్పుడే చాలా ఇంగ్లీషు పదాలు ఉంటున్నాయి. అనువాదం చేసేటప్పుడు పట్టి పట్టి తెలుగు పదాలు ఇస్తున్నారేమో కాని తెలుగు భాషలో తెలుగుదనం తగ్గిపోతోంది. బహుశా టెంగ్లిష్‌కి మనందరం అలవాటు పడాలేమో.

భాష అంటే సంస్కృతి కూడా. విదేశాల్లో స్థిరపడిన వాళ్లే కాకుండా ఇక్కడి ప్రజలు, ప్రభుత్వాలు, సమాజం కృషి చెయ్యాలి. లేకపోతే తెలుగు భాష మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు.

8. ఈ సంవత్సరం కొత్తగా వస్తున్న పుస్తకాలేమిటి?

ప్రతి సంవత్సరం తిరిగి ముద్రించే పుస్తకాలు 30 దాకా ఉంటే దాదాపు 20 కొత్త పుస్తకాలు ఉంటాయి. ఈసారి బొమ్మల కథల పుస్తకాలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఉన్నాయి. పిల్లల కేస్ స్టడీస్ కథలతో పసిడి మనసులు అన్న పుస్తకం వెలువడింది (దీనిని మొదట వాహిని బుక్ ట్రస్ట్ ప్రచురించింది). హెచ్.బి.టి. ప్రచురించిన బారిస్టర్ పార్వతీశం, బుడుంగు అన్న పుస్తకాలను తిరిగి ముద్రించాం. పఠనాసక్తిని, పఠనా సామర్థ్యాన్ని పెంచటానికి చేస్తున్న పుస్తకాలతో స్నేహం అన్న సిరీస్‌లో రెండు కొత్త సెట్లు (యుద్ధం, తల్లి – పిల్ల) వెలువడ్డాయి.

9. నేరుగా రాలేని వారికి ఇంటర్నెట్ ద్వారా సైట్స్ ద్వారా మంచి పుస్తకాలను తెప్పించుకునే వీలుం'టుందా. మీ సైట్ వివరాలు, ఫోన్ నంబర్స్..?

మంచి పుస్తకం వెబ్ సైట్‌లో (www.manchipustakam.in) మా పుస్తకాల వివరాలు ఉన్నాయి. అందులోని షాపింగ్ కార్ట్ నుంచి పుస్తకాలు ఆర్డర్ చేయవచ్చు. ఫోను చేసి, డబ్బులు చెల్లించి కూడా ఇండియా పోస్ట్ ద్వారా పుస్తకాలు తెప్పించుకోవచ్చు. ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. పిల్లల పుస్తకాలను వాళ్ళ చిట్టి మెదళ్ళకు బలవంతంగా ఎక్కించనవసరం లేదు. వాళ్ళ అభిరుచిని ప్రోత్సహిస్తే చాలు.

*

_ శ్రీశాంతి మెహెర్. ( srisanthi.meher@gmail.com)

Updated Date - 2022-12-21T15:22:21+05:30 IST