Inspiration : ఇది అమ్మ వేసిన బాట...

ABN , First Publish Date - 2022-12-07T00:02:40+05:30 IST

‘విద్యాధనం సర్వధన ప్రధానం’ అన్నారు భర్తృహరి. ఆ ధనాన్ని అభాగ్యులెందరికో పంచి... సమాజంలో ఉన్నతులుగా నిలబెడుతున్నారు డాక్టర్‌ అపర్ణ యలమంచిలి.

 Inspiration : ఇది అమ్మ వేసిన బాట...
డాక్టర్‌ అపర్ణ యలమంచిలి

‘విద్యాధనం సర్వధన ప్రధానం’ అన్నారు భర్తృహరి. ఆ ధనాన్ని అభాగ్యులెందరికో పంచి... సమాజంలో ఉన్నతులుగా నిలబెడుతున్నారు డాక్టర్‌ అపర్ణ యలమంచిలి. అమ్మను ఆదర్శంగా తీసుకుని... ఆమె నడిచిన బాటనే తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. లండన్‌లో వైద్యురాలిగా బహుముఖ సేవలు అందిస్తున్న అపర్ణను ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ‘నవ్య’ పలుకరించింది...

89 మంది రైతులకు... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించి...

ఆరేళ్ల కిందట... ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి- ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దీన గాథలు చూసి మా నాన్న చలించిపోయారు. ఆత్మహత్యలతో ఆ కుటుంబాలు దిక్కులేనివై, పిల్లల్ని చదివించలేక పడుతున్న అవస్థలు తెలుసుకొని కన్నీరు పెట్టుకున్నాం. వారికి కొంతైన భరోసా కల్పించాలన్న ఆలోచనతో ఒక్కో రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున 89 మందికి ఆర్థిక సాయం అందించాం. ఆ కుటుంబాల్లో పిల్లలు, ముఖ్యంగా బాలికల చదువు ఆగిపోకూడదన్నదే మా ఉద్దేశం. అలాగే ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’లోనే వచ్చిన మరో కథనానికి స్పందించి ఒకరికి రూ.40 వేలు సాయం చేశాం. ఉండడానికి షెడ్‌ వేసి ఇచ్చాం.

‘‘మా అమ్మ ఆనందకుమారి... ‘ఎవరికైనా మనం ఇవ్వాల్సింది డబ్బు కాదు... చదువు’ అని ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఎందుకంటే ఆమె దృష్టిలో డబ్బు కన్నా... అన్నిటికన్నా శక్తిమంతమైనది... విద్య! దాన్ని ఎవరూ అపహరించలేరని అనేది. అందుకు తగినట్టుగానే అమ్మ బతికనన్ని రోజులూ అనాథలు, పనివారి పిల్లల్ని చదివిస్తూ ఉండేది. డాక్టర్‌ కావాలన్నది ఆమె బలమైన కోరిక. కానీ ఒక్క మార్కులో మెడిసిన్‌ సీటు పోయిందట. దాంతో పట్టుబట్టి నన్ను డాక్టర్‌ని చేసింది. అమ్మ ఒక్క క్షణం కూడా తీరిగ్గా గడిపేది కాదు. పెళ్లికి ముందు మచిలీపట్నం హిందూ కాలేజీలో సోషియాలజీ లెక్చరర్‌గా పాఠాలు చెప్పింది. 1975లో పెళ్లి తరువాత మకాం హైదరాబాద్‌కు మారింది. అప్పుడు మా నాన్న శ్రీరామచంద్రరావు యలమంచిలి ఆల్విన్‌ బస్‌ బాడీ డివిజన్‌లో మెకానికల్‌ ఇంజనీర్‌గా చేసేవారు. అదే సమయంలో అమ్మ పరిశ్రమల శాఖలో సూపరింటెండెంట్‌గా ఉన్నారు.

ఇల్లంతా పిల్లలే...

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో పధ్నాలుగు మంది పిల్లలుండేవారు. అమ్మ, నాన్నల చెల్లెళ్లు, అన్నయ్య పిల్లలతో ఇల్లంతా ఒకటే సందడి. నేను, చెల్లి రాగిణి... అప్పుడు చిన్నవాళ్లం. అమ్మ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి, అందరికీ వంట వండి పెట్టేది. హోమ్‌వర్కులు కూడా చేయించి, తను అబిడ్స్‌లో ఉన్న ఆఫీ్‌సకు బస్సులో వెళ్లేది. అంత కష్టపడేది. ఆ పిల్లలందరినీ చదివించి, పెద్ద చేసింది. ఇప్పుడు వారంతా అమెరికా, యూకేల్లో ఇంజనీర్లు, డాక్లర్లుగా బాగా స్థిరపడ్డారు.

వారం రోజులు బ్రెడ్డే ఆహారం...

నేను ఇక్కడ ఎంబీబీఎస్‌ తరువాత పై చదువుల కోసం 2002లో లండన్‌ వెళ్లాను. గైనకాలజీలో పీజీ చేశాను. మొదట్లో అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాను. ఒక బ్యాగ్‌, చిన్న సూట్‌కేస్‌ తీసుకొని వెళ్లాను. లండన్‌లో చదువుతూనే క్లినికల్‌ అటాచ్‌మెంట్‌... అంటే ఏదైనా హాస్పిటల్‌లో పని చేయాలి. అందుకు రిఫరెన్స్‌ అవసరం. కానీ నాకు అక్కడ తెలిసినవారు ఎవరూ లేరు. రిఫరెన్స్‌ ఇస్తానన్న ఆవిడ చివరకు కుదరదన్నారు. కాలేజీకి ఏడు మైళ్ల దూరంలో ఒకరింట్లో పేయింగ్‌ గెస్ట్‌గా దిగాను. రోజూ అంత దూరం చలిలో చెప్పులతో నడిచివెళ్లేదాన్ని. షూస్‌ కొనుక్కోవాలంటే మళ్లీ అమ్మా నాన్నలను డబ్బు అడగాలి. వాళ్ల పరిస్థితీ బాలేదు. నాన్న సొంతంగా బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ పెట్టి బాగా నష్టపోయారు. చుట్టూ ఉన్నవారే మోసం చేశారు. దాచుకున్న డబ్బంతా ఆవిరై, మాకంటూ ఏమీ లేకుండా పోయింది. అదే సమయంలో నాన్న మేడపై నుంచి పడి, ఆరు నెలలు మంచానికే పరిమితం అయ్యారు. అమ్మ మళ్లీ ఉద్యోగంలో చేరింది. ఇవన్నీ చూసి పెద్ద కూతురిగా ఇంటి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. అందుకే లండన్‌ వెళ్లాను. అక్కడ రాను... పోను రోజుకు పధ్నాలుగు మైళ్ల నడక. 17 పౌండ్లకు బ్రెడ్‌ దొరికేది. కొనుక్కుని వారంపాటు అదొక్కటే తిన్నాను. దేశం కాని దేశంలో రెండు నెలలు నరకం అనుభవించాను. చివరకు నా బాధలు చూసిన గైనకాలజీ విభాగంలో డాక్టర్‌ ఫిలిప్‌ హేగన్‌... నన్ను పిలిచి మరీ రిఫరెన్స్‌ ఇచ్చారు. అలా నాటింగ్‌హామ్‌ హాస్పిటల్‌ గైనిక్‌ విభాగంలో నా తొలి ఉద్యోగం మొదలైంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.

నాలుగు డిగ్రీలు...

మేం అన్ని కష్టాల్లో ఉంటే మా ఇంట్లో చదువుకున్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తిరిగి చూడలేదు. లండన్‌ వెళ్లి ఫోన్‌ చేస్తే... కనీసం స్పందించలేదు. నేను, చెల్లి చాలా బాధపడ్డాం. కానీ అమ్మ మాత్రం... ‘వాళ్ల నుంచి మనం ఏమీ ఆశించలేదు కదా! చదివించి, ప్రయోజకులను చేయాలనుకున్నాను... చేశాను అంతే’ అంది. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. నేను లండన్‌ వెళ్లాక ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. పీజీ గైనకాలజీ అయిపోగానే ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, డయాబెటి్‌సల్లో డిగ్రీగలు పూర్తి చేశాను. డెర్మటాలజీలో 14 పుస్తకాలు రాశాను. ప్రస్తుతం లండన్‌లో డయాబెటిస్‌, డెర్మటాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఎగ్జామినర్‌గా కూడా ఉన్నాను. యూకే మొత్తం నుంచి ఏడుగురిని ఈ ప్యానల్‌కు ఎంపిక చేస్తారు. అకడమిక్‌ పాఠాలు కూడా చెబుతున్నాను. ఏదైనా చాలా కష్టాల తరవాత ఇప్పుడు బాగా స్థిరపడ్డాను.

అదే నాంది...

ఎంతో ఉత్సాహంగా కనిపించే అమ్మ 2010లో ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించింది. అప్పుడు నేను బర్మింగ్‌హామ్‌ హాస్పిటల్‌లో ఉన్నాను. రాత్రి సర్జరీ చేస్తుంటే ఫోన్‌ వచ్చింది. చెల్లి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. మేం ఇంటికి వెళ్లేసరికి చాలామంది ఉన్నారక్కడ. ‘మీ అమ్మ వల్ల మా పిల్లల్ని చదివించుకున్నాం... ఆవిడ సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లబట్టే మా ఇంటి పెద్దను బతికించుకున్నాం..’ అంటూ ఒక్కొక్కరూ వచ్చి చెబుతుంటే మాకు కన్నీళ్లు ఆగలేదు. ఇంతమంది హృదయాల్లో కొలువైన అమ్మ పేరును చిరస్థాయిగా నిలబెట్టాలని నేను, నాన్న, చెల్లి ఆ క్షణమే అనుకున్నాం. కానీ అమ్మ లేదనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. అలాగని బాధపడుతూ కూర్చోలేదు. రెండు నెలల్లో... అంటే 2011 జనవరిలో అమ్మ పేరు మీద ‘కానూరి ఆనందకుమారి మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్టు’ నెలకొల్పాం.

లక్ష్యం... విద్య.. వైద్యం...

ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా నాన్న పెన్షన్‌తో పాటు నేను, మా చెల్లి చూసుకొంటున్నాం. నా సంపాదనలో 75 శాతానికి పైగా ట్రస్టుకే వెళుతుంది. ఇప్పటి వరకు 174 మందిని ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదివించాం. ట్రస్టు ప్రధాన ఉద్దేశం విద్య, వైద్యం. డబ్బు లేదన్న ఒక్క కారణంతో పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదు. అత్యవసర ఆపరేషన్లు ఆగిపోకూడదు. ఎవరైనా మా దృష్టికి తెస్తే... వెంటనే వెళ్లి సాయం అందిస్తున్నాం. ఏటా స్కాలర్‌షి్‌పలు ఇస్తున్నాం. పారదర్శకంగా ఉండాలని ప్రతిదీ మా వెబ్‌సైట్‌లో పెడుతున్నాం. అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఇలా ఎన్నో!

ఈ జన్మ మళ్లీ రాదు...

నేను లండన్‌లో ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా ట్రస్టు కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంటాను. ఏడాదికి రెండు నెలలు ఇక్కడికి వచ్చి పిల్లల్ని పలుకరించి, వారి బాగోగులు తెలుసుకొంటాను. మిగిలిన సమయంలో వ్యవహారాలన్నీ మా నాన్న, చెల్లి చూసుకొంటారు. చెల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటోంది. నాకంటూ పెద్దగా లక్ష్యాలేమీ లేవు. నాన్న, నేను ఉన్నంత కాలం దీన్ని నడిపిస్తాం. నా జీవితాన్ని సేవకే అంకితం చేశాను. ఆ పిల్లల్లోనే అమ్మను చూసుకొంటున్నాను. ఈ జన్మ మళ్లీ రాదు! ఇలా సేవ చేసే అవకాశమూ దొరకదు! పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేను. కానీ వెనక్కి తిరిగి చూసుకొంటే ఇంతమంది జీవితాల్లో సంతోషం నింపానన్న సంతృప్తి నాకు ఉంటుంది. అది చాలు నాకు... మా కుటుంబానికి!

హనుమా

Updated Date - 2022-12-10T00:30:46+05:30 IST