Hero Srinath Maganti : జనాలకు నచ్చితే వాళ్లే హీరోలను చేస్తారు

ABN , First Publish Date - 2022-12-18T00:31:39+05:30 IST

పరిశ్రమలో రాశి కన్నా వాసి ముఖ్యమని నమ్మే యువ హీరో శ్రీనాథ్‌ మాగంటి. తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నారు. ఎస్‌పీ అభిలాష్‌గా ఆయన కీలకపాత్ర పోషించిన

Hero Srinath Maganti : జనాలకు నచ్చితే వాళ్లే హీరోలను చేస్తారు

పరిశ్రమలో రాశి కన్నా వాసి ముఖ్యమని నమ్మే యువ హీరో శ్రీనాథ్‌ మాగంటి. తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నారు. ఎస్‌పీ అభిలాష్‌గా ఆయన కీలకపాత్ర పోషించిన ‘హిట్‌ 2’ చిత్రం నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. ఈ సందర్భంగా ఆయన ‘చిత్రజ్యోతి’తో ముచ్చటించారు.

  • నేను రొటీన్‌ జాబ్‌ చేయలేను. చేసే పనిలో ఏదైనా ఎగ్జైట్‌మెంట్‌ ఉండాలి. అది లేనప్పుడు పని చేయబుద్దికాదు. అది నాకు నటనలో దొరికింది. అందుకే వ్యాపారం నుంచి నటన వైపుకు వచ్చాను.

  • సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను అని ఇంట్లో చెప్పినప్పుడు వద్దన్నారు. కొన్ని రోజులు మాట్లాడడం మానేశారు. తర్వాత నాన్నగారే సత్యానంద్‌గారి దగ్గరకు పంపించారు. ‘శిక్షణ వరకూ నేను ఇప్పిస్తాను. తర్వాత సినిమా కూడా నిర్మించాలంటే మాత్రం కుదరదు’ అని చెప్పారు.

  • గతంలో దర్శకుడు శైలేష్‌ కొలనుతో కలసి ఒక లఘుచిత్రం చేశాను. నేను ఏం చేయగలనో అప్పుడే ఆయనకు అర్థమైంది. తర్వాత ఆడిషన్స్‌ చేసి ‘హిట్‌’లో అభిలాష్‌ పాత్ర ఇచ్చారు. ‘హిట్‌ 2’లో నా పాత్ర కొనసాగింపు ఉంటుందని ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే శైలేష్‌ చెప్పారు. ఆయనకు ఉన్న క్లారిటీతో నా పాత్రను సులువుగా పోషించేలా చేశారు.

  • కొత్తవాళ్లని పరిశ్రమ బాగానే ప్రోత్సహిస్తోంది. ఒకప్పుడు సుహాస్‌ కామెడీ సినిమాలు చేశాడు. ఇప్పుడు హీరో. మనం జనాలకు నచ్చితే వాళ్లే హీరోలను చేస్తారు. తెల్లగా ఉన్న ప్రతి వ్యక్తి హీరో అవ్వలేడు. టైమొస్తుంది. ఆ రోజు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండాలి. అప్పటిదాకా కష్టపడుతుండాలి.

  • సినిమాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక గోల్‌ ఉంటుంది. అది లేకుండా ఇక్కడ ఎక్కువ కాలం మనలేరు. ప్రతి రోజూ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేక్షకులు మనల్ని ఎలా ఆదరిస్తున్నారు అనేదాన్ని బట్టి ఎదుగుదల ఉంటుంది. అందుకు సమయం పడుతుంది. విత్తనం వేయగానే చెట్టు కాదు. మన టైమ్‌ వచ్చేదాకా ఓపిక, సహనంతో ఉండాలి. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్లాలి. అయినా కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి. కొంతమంది ‘నువ్వు హీరోకు సరిపోవు’, ‘నీకు నటన రాదు’ అంటారు. ఇంకొందరు ‘నీకు అన్నీ వచ్చు’ అంటారు. ఎదుటివాళ్ల దృష్టిని బట్టి మనం వాళ్లకు కనిపించే విధానం ఉంటుంది.

  • నటుడిగా నా బలం డిసిప్లిన్‌. సినిమాల్లో రాణించాలంటే అన్నింటికంటే క్రమశిక్షణ ముఖ్యం. శుక్ర, శని, ఆదివారాలు పబ్బుల్లో తిరిగి, సోమవారం ‘మాకు అవకాశాలు రావడం లేదు’ అని అరిచే బ్యాచ్‌కు అవకాశాలు రావు. కోరుకున్న అవకాశం తలుపుతట్టేసరికి లావు అవ్వడమో, తాగేసి కళ్లకింద క్యారీ బ్యాగులు తెచ్చుకుంటే, ఆ అవకాశం కూడా చేజారిపోతుంది. టైమ్‌కు తిని పడుకున్నామా?, వారంలో నాలుగు రోజులన్నా వ్యాయామం చేశామా?, కొత్త సినిమాలు చూశామా, కొత్త పుస్తకం చదివామా, అద్దం ముందు నిల్చొని ఏదైనా డైలాగ్‌ ప్రాక్టీస్‌ చేశామా?అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవేవీ చేయకుండా, నేను అందంగా, పొడవుగా ఉన్నాను కాబట్టి అవకాశాలు రావాలంటే కుదరదు.

  • సినిమా విజయంలో స్టార్‌ స్టేటస్‌ కన్నా కంటెంట్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కథ బాగుండాలి. అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉండాలి.

  • నాకు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలు కూడా మాట్లాడగలను కాబట్టి పరభాషా చిత్రాల్లోనూ నటించే ఆలోచన ఉంది. నా సినిమాలకు సంబంధించి త్వరలోనే పెద్ద న్యూస్‌ చెబుతాను.

Updated Date - 2022-12-18T00:31:40+05:30 IST