లైంగిక శక్తిని పెంచే దొండకాయ కూర!

ABN , First Publish Date - 2022-10-29T01:04:57+05:30 IST

పాక శాస్త్రవేత్త క్షేమశర్మ కూరగాయల్లో రెండో స్థానాన్ని బింబీఫలం... అంటే దొండకాయకు ఇచ్చాడు.

లైంగిక శక్తిని పెంచే దొండకాయ కూర!

పాక శాస్త్రవేత్త క్షేమశర్మ కూరగాయల్లో రెండో స్థానాన్ని బింబీఫలం... అంటే దొండకాయకు ఇచ్చాడు. మనం కూడా వంకాయ తరువాత అంతటి ప్రాముఖ్యతని దొండకాయకే ఇస్తాం. ఆరోగ్యం విషయంలో వంకాయంటే కొందరికి భయం ఉండవచ్చు... పడుతుందో పడదో అని! కానీ, దొండకాయతో అలాంటి భయం ఎవరికీ ఉండదు.

బింబీ ఫలం స్వాదు శీతం రక్తపిత్తప్రణాశనం!

స్తంభనం లేఖనం చాతివిబంధాధ్మానకారకమ్‌!!

అంటే దొండకాయ వల్ల ఎటువంటి హాని ఉండదని ఈ శ్లోకార్థం. లేత దొండకాయల్నే కూరకి ఎంచుకోండి. ఉప్పు కలిపిన నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి, బాగా కడగండి. పొడి వస్త్రంతో తుడిచాకే ముక్కలు తరగండి. చక్రాల్లా, నిలువుగా, చిన్నచిన్న ముక్కల్లా... కూర వండే తీరునుబట్టి దొండను ఎలాగైనా తరగొచ్చు. అలా తరిగిన ముక్కల్ని ఉప్పు వేసి పిండితే అందులో నీరు పోయి, కూర పొడిపొడిగా ఉంటుంది. నీటిని తీసేయటం అనేది తప్పనిసరేమీ కాదు. నేతిలోనో, నూనెలోనో వేయించేటప్పుడు నీటిని పిండిన ముక్కలైతే నూనెని పీల్చకుండా, మెత్తగా తినడానికి అనుకూలంగా ఉంటాయి. పిండకుండా వేయిస్తే నూనె పీలుస్తాయి. గట్టి చెక్కల్లా ఉంటాయి. ఇలాంటి ఇంకొన్ని కూరలు ఎలా చేయాలో చూద్దాం...

ఇంగువ- మిరియాలతో కూర...

బాండీలో కాగుతున్న నూనెలో కొద్దిగా ఇంగువనీ, లేత దొండ ముక్కల్ని వేసి దోరగా పైపైన వేగనివ్వండి. నల్లగా మాడేలా వేగితే అది అనారోగ్యకరం. బ్లాటింగ్‌ పేపర్‌ లేదా టిష్యూ పేపర్‌ మీద ఈ ముక్కలుంచి నూనెని తుడిచేస్తే మరీ మంచిది. ఈ ముక్కల్ని మళ్లీ బాండీలోకి తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి, మిరియాల పొడి, ఉప్పు ఈ ముక్కల మీద చల్లి, తేలికగా వేయించి దించేయండి. ఇలా వండిన దొండకాయ వేపుడు కూర జీర్ణ శక్తిని పెంచుతుంది. ఏ కూరగాయనైనా దానికి మించిన ఉష్ణోగ్రత ఇచ్చి వేయించినా, ఉడికించినా అది హానికరం అవుతుందని, సన్న సెగన తేలికగా వండాలని గుర్తుంచుకోవాలి.

మజ్జిగతో ముద్ద కూర...

ఒక చిన్న కప్పులోకి వేడివేడి నెయ్యి తీసుకుని, అందులో ఒక్కొక్క దొండకాయని రెండుమూడుసార్లు ముంచి తీయండి. బాండీలోకి ఈ నేతి దొండకాయల్ని తీసుకుని, సన్న సెగన కలియబెడుతూ పైపైన వేగనివ్వండి. మూడు వంతులు వేగిన తరువాత మీకు కావలసిన సుగంధ ద్రవ్యాలు, సైంధవ లవణం తగు మోతాదులో కలిపి మరికొద్దిసేపు వేయించండి. ఇప్పుడు చక్కగా చిలికిన చిక్కటి మజ్జిగని ఈ ముక్కలు మునిగేవరకూ పోసి, తడి ఆరేదాకా ఉడకనివ్వండి. ముద్ద కూరలాగా దగ్గరకు వచ్చాక కొత్తిమీర వగైరా కలిపి పొయ్యి మీద నుంచి దించేయండి. ఇలా చేసిన దొండ కాయకూర జాఠరాగ్నిని పెంచుతుందన్నాడు క్షేమశర్మ.

దొండకాయ పెరుగుపచ్చడి...

వంకాయతో బజ్జీ పెరుగు పచ్చడి చేసుకున్నట్టే లేత దొండకాయతోనూ చేసుకోవచ్చు. దొండకాయల తల, తోక భాగాలు తరిగి, నూనె లేదా నెయ్యి పట్టించి ‘అంగారభర్జితం బింబీఫలం’... అంటే ఈ దొండకాయల్ని నిప్పుల మీద లేదా గ్రిల్‌ సాయంతో గ్యాసు పొయ్యి మంట మీద ఉంచి, మరీ నల్లగా మాడకుండా లోపలి భాగం సమంగా ఉడికేలా తిప్పుతూ కాల్చండి. ఉడికిన తరువాత మెత్తగా నూరి, పెరుగులో ఉంచి తగినంత ఉప్పు, కొత్తిమీర, ఆవపిండి వగైరా కలిపి, ఇంగువ తాలింపు పెట్టిన కమ్మని పెరుగు పచ్చడి జీర్ణశక్తిని పెంచుతుంది. అమీబియాసిస్‌ లాంటి వ్యాధులు, అల్సర్లతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.

నిప్పుల మీద కాల్చే అవసరం లేకుండా దొండకాయ ముక్కల్ని ఉప్పు కలిపిన నీళ్లలో ఉడికించి, పెరుగులో కలిపి కొద్దిగా ఆవపిండి, కొత్తిమీర వగైరా చేర్చి, ఇంగువ తాలింపు పెట్టిన పెరుగు పచ్చడి కూడా కమ్మగా ఉంటుంది. పై గుణాలనే కలిగి ఉంటుంది. దొండకాయ కూరకు నెయ్యి, ఇంగువ, పెరుగు... ఈ మూడూ ఆరోగ్యదాయక సహచరులు.

దొండకాయ చాలా రుచిగా ఉంటుంది. చలవనిస్తుంది. రక్తస్రావం అయ్యే జబ్బుల్లో తప్పనిసరిగా తినదగిన ఔషధం. పురుషుల్లో లైంగిక శక్తిని పెంచుతుంది. దీనికి లేఖనం (జిడ్డుని తొలగించే) గుణం ఉంది. అంటే, రక్తనాళాల్లో కొవ్వు పేరకుండా చేస్తుంది. గుండె జబ్బులున్నవారు, బీపీ, మధుమేహం వ్యాధులున్నవారికి మేలు చేస్తుంది. అతిగా తింటే విరేచనాన్ని బంధిస్తుంది... ఉబ్బరాన్ని కలిగిస్తుందని క్షేమశర్మ హెచ్చరించాడు. చింతపండు, అల్లంవెల్లుల్లి మసాలాలు లేకుండా క్షేమశర్మ చెప్పిన పద్ధతిలో దొండకాయల్ని వండుకుంటే ఉబ్బరంలాంటి చెడు కలగకుండా ఉంటుంది.

Updated Date - 2022-10-29T01:04:59+05:30 IST