అవార్డులు పండించిన రాళ్ళలో నీర్ఙు

ABN , First Publish Date - 2022-10-27T06:00:12+05:30 IST

ప్రతిష్ఠాత్మక మిలాన్‌ గోల్డ్‌ అవార్డు వేదికపై ఏడాది కిందట ‘రాళ్ళలో నీరు’ సినిమాకు రజత పురస్కారం దక్కింది.

అవార్డులు పండించిన రాళ్ళలో నీర్ఙు

ఒకటి కాదు, రెండు కాదు... పాతికకుపైగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అరుదైన గౌరవాన్ని అందుకుంది ‘రాళ్ళలో నీరు’ సినిమా. అంతకు మించి సినిమా విమర్శకుల అభినందనలనూ పొందింది. ప్రపంచ తెరపై ప్రశంసల జల్లును అందుకుంటున్న ‘రాళ్ళలో నీరు’ విశేషాలను దర్శక, నిర్మాత ఇంద్రగంటి కిరణ్మయి ‘నవ్య’తో ముచ్చటించారు.

ఇటలీ చిత్రోత్సవం, ప్రతిష్ఠాత్మక మిలాన్‌ గోల్డ్‌ అవార్డు వేదికపై ఏడాది కిందట ‘రాళ్ళలో నీరు’ సినిమాకు రజత పురస్కారం దక్కింది. అక్కడ నుంచి ఇప్పటి వరకు ప్రపంచ తెరపై పాతికకు పైగా అవార్డు వేడుకల్లో మా సినిమాకు ప్రత్యేక స్థానం లభించింది. అందుకు ఓ ఫిల్మ్‌మేకర్‌గా గర్విస్తున్నాను. నిజానికి ‘రాళ్ళలో నీరు’ నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. దీనికి కథ, స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాను. అదొక పెద్ద సాహసమే అయినా, సినిమా పట్ల ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. కొవిడ్‌ కాలానికి పూర్వమే ఈ సినిమా చిత్రీకరణ పనులు పూర్తి అయ్యాయి. ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడానికి ముందు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నా సినిమాను నిలబెట్టాలనుకున్నాను. అలా మొదట గ్రీస్‌, నెదర్లాండ్స్‌, అమెరికా దేశాల చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నమ్మకంతో మిగతా దేశాల ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు పంపాను.

ఆరు గ్లోబల్‌ సినిమాల్లో ఇదొకటి...

కొసావా దేశంలోని ప్రిస్టీనా అంతర్జాతీయ చిత్రోత్సవంలోనూ గ్లోబల్‌ కాంపిటేషన్‌లో వివిధ దేశాలకు చెందిన ఆరు సినిమాలు ఎంపికయ్యాయి. అందులో జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ అమెరికాతో పాటు... కేవలం భారత్‌ నుంచే కాదు, యావత్‌ ఆసియా దేశాల నుంచి ‘రాళ్ళలో నీరు’ ఒకటి కావడం సంతోషదాయకం. ఇవిగాక ఈస్ట్రన్‌ యూరప్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఉత్తమ స్ర్కీన్‌ - ప్లే అవార్డు అందుకున్నాను. దీన్నొక ప్రత్యామ్నాయ సినిమాగా గుర్తిస్తూ ఉత్తమ నిర్మాతగా అనల్ప ప్రొడక్షన్‌కు హాలీవుడ్‌ గోల్డ్‌ అవార్డు లభించింది. యాక్టింగ్‌ అవార్డ్స్‌ ఫిల్మ్‌ఫె్‌స్టలోనూ ఉత్తమ నటుడిగా ఆల్తఫ్‌ హసన్‌, సహాయ నటుడిగా సీఎస్‌ ప్రసాద్‌ లకు పురస్కారాలు వచ్చాయి. అవెన్‌ కీ ఫెస్ట్‌లో బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌ అవార్డు దక్కింది. ఇలా ఒకటా, రెండా... డల్లాస్‌ మూవీ అవార్డ్స్‌, లండన్‌ క్లాసిక్‌ ఫిల్మ్‌ ఫెస్ట్‌, రోసారిటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, బ్రైట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్ట్‌ తదితర ప్రతిష్ఠాత్మక వేదికలపై ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గానూ, బెస్ట్‌ ఉమెన్స్‌ ఫిల్మ్‌గానూ మా సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. మరో ఏడు అంతర్జాతీయ వేడుకలకు ఎంపికైంది.

సందేశాలు, ఉపన్యాసాలు లేని సినిమా...

ఇంగ్లండ్‌లోని లేస్టర్లో పబ్లిక్‌ వర్సిటీ ఫీనిక్స్‌ సినిమా ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యామ్నాయ భారతీయ సినిమాలను ప్రదర్శించారు. అందులో తెలుగు నుంచి ‘రాళ్ళలో నీరు’ ఉండటం విశేషం. దాంతో పాటు వాళ్లు నాతో ప్రత్యేకంగా చర్చాగోష్ఠిని నిర్వహించారు. అప్పుడు కొందరు సినిమాను విశ్లేషిస్తూ, అందులోని కథాంశం, చిత్రీకరణ, నేటివిటీ, సంగీతం తదితర విషయాలు ఆకట్టుకున్నాయని వివిధ దేశాలకు చెందిన సినిమా విమర్శకులు ప్రశంసించడం ఒక మధుర జ్ఞాపకం. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం ఇతివృత్తంగా సాగే హెన్రిస్‌ ఇబ్సన్‌ ‘డాల్స్‌హౌస్‌’ నాటకం వచ్చి వందేళ్లు అవుతుంది. అయినా, ఆ ఇతివృత్తం సమకాలీనతకు అద్దంపడుతుందనడంలో సందేహం లేదు. పైగా అందులో సందేశం అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది. అంతకు మించి జీవితానికి సంబంధించిన కథ ఇది. కనుక నన్ను అమితంగా ఆకర్షించింది. నా సినిమాలోనూ సందేశాలు, ఉపన్యాసాలుండవు. సినిమా సంభాషణలు సైతం ఉద్భోధాత్మకంగా లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమా ఆద్యంతం సున్నితమైన భావోద్వేగాలతో, ఒకలాంటి భావుకతతో సాగుతుంది. అందుకు తగినట్టుగా బ్యాగ్రౌండు మ్యూజిక్‌ను ప్రత్యేకంగా ముంబాయిలో రికార్డు చేయించాం.

సగటు ప్రేక్షకులకు...

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీయడం చాలా సులువు. దాన్ని విడుదల చేయడమే కష్టం. ఒక సినిమా విడుదల వెనుక అనేక లెక్కలు పనిచేస్తుంటాయి. అయితే ‘రాళ్ళలో నీరు’ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రత్యేక గుర్తింపు పొందినది. పైగా శ్రీనివాస్‌ అవసరాల వంటి దర్శకులు సైతం మా సినిమా చూసి, కథనం సాగే తీరు తనకు బాగా నచ్చిందని చెప్పారు. ‘రాళ్ళలో నీరు’ సినిమా అంతా కాకినాడలో చిత్రీకరించాం. కనుక అక్కడా ఒకసారి ప్రదర్శించాం. అప్పుడు సినిమా చూసిన సామాన్యులు చాలామంది వాస్తవిక జీవితాలను చిత్రీకరించినట్లుందని అనడం సగటు ప్రేక్షకులకు ఈ మూవీ కనెక్టు అవుతుందనే నమ్మకాన్ని మరింత పెంచింది. ఇప్పుడు మా సినిమాను ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాను. కనుక త్వరలోనే విడుదల అవుతుంది. అయితే, అది ఓటీటీనా, థియేటర్‌ ద్వారానా అనేది ఆలోచిస్తున్నాను.

అది మరిచిపోలేని అనుభూతి

సినిమా జీవితం నుంచి వచ్చినట్టు ఉండాలి. అంతేకానీ సందేశాల కోసం కాకూడదు. కథనంలోనూ, పాత్రల రూపకల్పన, సంభాషణల ద్వారా ఆదర్శాలను, ఉదాత్తతను చొప్పించడం వల్ల కథ, నవల, సినిమా... ఏదైనా సహజత్వాన్ని కోల్పోతాయి. నా మూవీలోనూ ఎలాంటి ఇజాలు వంటివి లేకుండా జాగ్రత్తపడ్డాను. బాలచందర్‌, కె. విశ్వనాథ్‌ వంటి దర్శకులు సినిమాల్లో ఒక భిన్నమైన ఫార్ములాను అనుసరించారు. వాళ్లు చాలా కాన్షియ్‌సగా ఆడవాళ్ల పట్ల ఉన్న మూసపాత్రను బ్రేక్‌ చేశారు. అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు ‘రాళ్ళలో నీరు’ సినిమాలోనూ కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా మా సినిమాను కొందరు ఇరానియన్‌ సినిమాలతో పోలుస్తూ, మరీ ముఖ్యంగా ఫర్హాదీ సినిమాల్లా ఉందని అభినందించడం నాకొక మరిచిపోలేని అనుభూతి.

ఇంద్రగంటి కిరణ్మయి ప్రస్తుతం మణిపాల్‌ యూనివర్సిటీ, సృష్టి ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అందులో పీహెచ్‌డీ స్టూటెండ్స్‌కు గైడ్‌గానూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆమెకు అమితాశక్తి. టొరొంటోలో ఫిల్మ్‌మేకింగ్‌పై మూడేళ్లు కోర్సు అభ్యసించారు. తర్వాత ఇంగ్లండు లోని నాటింగ్హామ్‌ యూనివర్సిటీలో ‘తొలినాళ్లలో భారతీయ సినిమా 1945-55’ అంశంమీద పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్లే బ్యాక్‌సింగింగ్‌మీద ఇదొక లోతైన పరిశోధన అని చెప్పచ్చు.

ఈ థీసె్‌సను ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రెస్‌ ‘‘హర్‌ మెజిస్ట్రిక్‌ వాయిస్‌’’ పేరుతో ప్రచురించింది. కిరణ్మయి ప్రముఖ కవి ఇస్మాయిల్‌ మీద రూపొందించిన డాక్యుమెంటరీరి మంచి గుర్తింపు లభించింది. వలస పక్షులపై ఆమె తీసిన ‘సీజన్‌ ఆఫ్‌ లవ్‌’ డాక్యుమెంటరీ ప్యారిస్‌ ఫెస్టులో ప్రదర్శితమైంది.

Updated Date - 2022-10-27T06:00:14+05:30 IST