OHRK Adiseshagiri Rao : నాకు ఆయన పెట్టిన పేరే... ‘బంగారు’!

ABN , First Publish Date - 2022-12-04T23:09:06+05:30 IST

అన్నకు అండగా చిత్రపరిశ్రమలోకిఅడుగుపెట్టారు. సోదరుడిని సూపర్‌స్టార్‌గా నిలిపేందుకు తెరవెనుక చెమటోడ్చారు. హీరో కృష్ణ సంచలన విజయాల వెనుక కనిపించని సూత్రధారిగా నిలిచారు.

OHRK Adiseshagiri Rao :  నాకు ఆయన పెట్టిన పేరే... ‘బంగారు’!

అన్నకు అండగా చిత్రపరిశ్రమలోకిఅడుగుపెట్టారు. సోదరుడిని సూపర్‌స్టార్‌గా నిలిపేందుకు తెరవెనుక చెమటోడ్చారు. హీరో కృష్ణ సంచలన విజయాల వెనుక కనిపించని సూత్రధారిగా నిలిచారు. ఆయనే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో... అన్నయ్యతో తన అనుబంధం, సినీ, రాజకీయ జీవిత విశేషాలెన్నో పంచుకున్నారు...

ఆర్కే: నమస్తే బంగారు గారు...

ఆదిశేషగిరిరావు: నమస్తే

ఆర్కే: కృష్ణగారి సోదరుడిగా జీవితమంతా ఆయనతోనే ప్రయాణించారు. ఇప్పుడు చాలా వెలితి వచ్చుండాలి కదా!

ఆది: వెలితి కాదు... ఇప్పుడు అంతా శూన్యంలా అనిపిస్తోంది. నాకు మూడేళ్ల వయసు నుంచి ఆయనతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. మా ఊరు తెనాలికి మూడు కిలోమీటర్లు. అక్కడి నుంచి నన్ను సైకిల్‌ మీద సినిమాకు తీసుకువెళ్లేవాడు. అప్పటి నుంచి మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది. నాకు ఆయన పెట్టిన పేరే... ‘బంగారు’! మా ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నవాడిని. అందుకే నన్ను చాలా గారాబంగా చూసుకొనేవాడు.

ఆర్కే: చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లు కలిసి నడిచిన అన్నదమ్ములు మీరే అనుకొంటా?

ఆది: అవునండి.

ఆర్కే: ఎక్కడా మీ ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రాలేదా?

ఆది: తొంభై శాతం నేను చెప్పిన దానికి ఓకే అనేవారు. ఎప్పుడన్నా ఒకసారి అలా కాదని ఆయనే నిర్ణయం తీసుకొనేవారు. ఇప్పటికీ నన్ను అన్నయ్య నుంచి విడగొట్టి చూడలేరు. సినిమాల్లో బిజీగా ఉండడంవల్ల 1970ల్లో ఆయన కుటుంబాన్ని నాకు అప్పగించారు. అప్పటి నుంచి పిల్లలు ఏది కావాలన్నా నన్నే అడుగుతుండేవారు. అన్నీ నేనే చూసేవాడిని. నా పెళ్లి కూడా మా అన్నయ్యే చేశారు.

ఆర్కే: మీ కుటుంబం గురించి ఎక్కడా బయటకు రాదు..! అసలు ఎంతమంది పిల్లలు మీకు?

ఆది: నాకు ఒక్కడే అబ్బాయి. లేటుగా పుట్టాడు. ఇప్పుడు వాడికి 34 ఏళ్లు. కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నాడు. సీబీఐటీలో ఇంజనీరింగ్‌ చదివాడు. లండన్‌లో ఎంఎస్‌ చేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ‘సినిమాల్లో ఏమైనా చేస్తావా’ అంటే వద్దన్నాడు. వాడి ఫ్రెండ్స్‌లో కొంతమంది నిర్మాతలున్నారు. వాళ్లు పడే బాధలు చూసి వద్దన్నాడు.

ఆర్కే: మీరు 1970లోనే నిర్మాత అయ్యారు. కానీ మీకు ఎప్పుడూ నటించాలని అనిపించలేదా?

ఆది: లేదు. నా దృష్టంతా ప్రొడక్షన్‌ మీదే ఉండేది. ‘రామారావు గారికి ‘ఎన్‌ఏటీ’ బ్యానర్‌ ఉండేది. ‘ఆయన సంవత్సరానికి ఒక సొంత సినిమా చేసి కెరీర్‌ నిలబెట్టుకున్నారు. మనం కూడా అలా సొంత బ్యానర్‌ పెట్టి, నిలదొక్కుకోవాల’నే అన్నయ్య ఆలోచనతో ‘పద్మాలయ’ ప్రారంభించాం.

ఆర్కే: కృష్ణ గారికి... రామారావు గారికి అభిప్రాయ బేధాలకు కారణం?

ఆది: జై ఆంధ్రా ఉద్యమానికి కృష్ణ మద్దతునిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. దాంతో ఎన్టీఆర్‌ మనస్తాపం చెందారు. హైదరాబాద్‌లో తమకు థియేటర్లు ఉండడంవల్ల రామారావు గారు, నాగేశ్వరరావు గారు కొంచెం ఇబ్బంది పడ్డారు... అటు మద్దతునివ్వలేక... ఇటు వ్యతిరేకించలేక! తరువాత ‘సీతారామరాజు’తో అది మరింత ముదిరింది. ఆ పాత్ర చేయాలని ఎన్టీఆర్‌కు బలంగా ఉండేది. ‘జయసింహ’ పాటల పుస్తకంలో ‘మా రాబోవు చిత్రం... అల్లూరి సీతారామరాజు’ అని వేసుకున్నారు. అది 1958లో. మేం తీసింది దాదాపు పధ్నాలుగు పదిహేనేళ్ల తరువాత. హనుమంతరావు, కృష్ణను పిలిచి... ‘అందులో పెద్ద సబ్జెక్ట్‌ లేదు. నేను ఎందుకు మానేశానో మీరు అర్థం చేసుకోవాలి’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ‘మేం రాసుకున్న స్ర్కిప్ట్‌ మీద మాకు నమ్మకం ఉంది’ అన్నారు కృష్ణ. ‘మీరు తీస్తానంటే మేం విరమించుకొంటాం’ అన్నాం అప్పటికీ. ‘నేను తీయను... మీరూ తీయద్దు. ఆలోచించుకోండి... ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. తీస్తే నష్టపోతారు’ అన్నారు ఎన్టీఆర్‌. మేం వినలేదు. షూటింగ్‌ స్టార్ట్‌ చేయగానే డైరెక్టర్‌ రామచంద్రరావు ఆసుపత్రిపాలయ్యారు. తరువాత హనుమంతరావు, మా అమ్మ కూడా ఆసుపత్రిలో చేరారు. ఇవన్నీ షూటింగ్‌ మొదలు పెట్టిన వారంలోనే జరిగాయి. దీంతో వేరే డైరెక్టర్‌ని పెడదామనుకున్నాడు అన్నయ్య. ‘చేస్తే నువ్వు చెయ్యి... లేదంటే ఆపేద్దాం’ అన్నాను నేను. అలా ఆ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు.

ఆర్కే: తరువాత ఎన్టీఆర్‌ ఏమన్నారు?

ఆది: చాలా కాలం ఆయనతో మాటలు లేవు. అయితే ఆ తరువాత ‘అల్లూరి సీతారామరాజు’ తీద్దామని పరుచూరి గోపాలకృష్ణని స్ర్కిప్ట్‌ రాయమని అడిగారట. ఆయన ఓకే అని చెప్పి... ‘ఒకసారి కృష్ణ గారు తీసిన సినిమా కూడా మీరు చూస్తే బాగుంటుందండి’ అన్నారట. అప్పుడే అన్నయ్య అక్కడ వాహిని స్టూడియోలో కలిస్తే... ‘ఎన్టీఆర్‌ మీ సినిమా చూడాలన్నారు’ అని చెప్పారు. కృష్ణ దగ్గరుండి చూపించారు. ‘బ్రహ్మాండంగా తీశారు. బ్రహ్మాండంగా చేశావ్‌. ఇంతకన్నా చేయగలిగింది ఏముంది ఈ సినిమాలో’ అన్నారు ఎన్టీఆర్‌. ఆలోచన విరమించుకున్నారు. అన్నయ్యకు మొదటి నుంచి రామారావు గారంటే అభిమానం. ఆయన నుంచి అంతటి అభినందన రావడం సంతోషమే కదా!

ఆర్కే: కృష్ణ గారు పరిశ్రమలో అంత బోల్డ్‌గా ఎలా ఉండగలిగారు?

ఆది: రామారావు గారు అయినా, కృష్ణ అయినా ఏదైనా ఉంటే ముఖం మీద అనేస్తారు. లోపల ఏదీ దాచుకోరు. వాళ్లిద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చినా... మళ్లీ కలిసిపోయేవారు. కానీ రాజకీయాల్లో కూడా తేడాలు వచ్చాయి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదు.

ఆర్కే: వాళ్లిద్దరికే తేడాలు వచ్చాయి. ఏఎన్నార్‌, శోభన్‌బాబు ఎక్కడా గొడవపడలేదు కదా!

ఆది: అవును.

ఆర్కే: పౌరాణిక చిత్రాలకు ఎన్టీఆర్‌ పెట్టింది పేరు. కృష్ణను ఆ పాత్రల్లో ఊహించుకోలేం. మరి ఎందుకు తలపడ్డారు?

ఆది: నిజమే! కానీ అది మా చేతుల్లో లేదు అప్పుడు. మధ్యలో ఇరుక్కున్నాం. ఆంజనేయులు గారికి కమిట్‌మెంట్‌ ఇచ్చారు కనుక వెనక్కి తీసుకోలేకపోయారు. అయినా అర్జునుడిగా కృష్ణ బానే చేశారు.

ఆర్కే: మరి రాజకీయంగా తేడా ఎక్కడ వచ్చింది?

ఆది: నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు... అన్నయ్య పేరు మీద ఆయనకు తెలియకుండా ఎంఎస్‌ రెడ్డి గారు ప్రకటన ఒకటి వేశారు... నాదెండ్లను అభినందిస్తూ! అది ఎన్టీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. పదవి నుంచి దిగిపోయాక ఒకసారి మద్రాసు వచ్చారు. అన్నయ్య, నేను వెళ్లి పలకరించాం. ‘నాకు తెలియకుండా వేశారు అన్నగారు... అపార్థం చేసుకోవద్దు’ అని అన్నయ్య చెప్పాడు. ‘దట్స్‌ ఆల్‌రైట్‌’ అన్నారు కానీ... అది మనసులో నుంచి పోలేదు. ఎన్టీఆర్‌- కృష్ణ అభిమానుల మధ్య మొదటి నుంచి ఎక్కడో అక్కడ విరోధం వస్తూ ఉండేది... సినిమాల పరంగా!

ఆర్కే: కాంగ్రెస్‌తో ఎలా కుదిరింది?

ఆది: రామారావు సీఎం అవడంతో రాజకీయంగా కూడా ఆయనకు అభిమానులు పెరిగారు. కృష్ణ అభిమానులు వీక్‌ అవుతున్నారు. అదే సమయంలో ఇందిరాగాంధీ చనిపోవడంతో రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. ‘రాజీవ్‌ను పలకరించి వద్దాంరా’ అని అన్నయ్య అన్నారు. కోన ప్రభాకర్‌ వెంటబెట్టుకుని మమ్మల్ని రాజీవ్‌ దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆయన బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ‘యు హావ్‌ టు సపోర్ట్‌ మీ’ అన్నారు. దాంతో పరామర్శకు వెళ్లిన కృష్ణ అప్పటికప్పుడు కాంగ్రె్‌సలో చేరారు. అది ముందుగా నిర్ణయించుకున్నది కాదు. రాజీవ్‌... అన్నయ్యను ఎంతో గౌరవించేవారు. ఫోన్‌ చేస్తుండేవారు. ఢిల్లీ రమ్మనేవారు.

ఆర్కే: విజయనిర్మలను పెళ్లి చేసుకున్నప్పుడు ఇంట్లో గొడవలు ఏమీ అవ్వలేదా?

ఆది: అప్పుడు నేను చిన్నవాడిని... పద్ధెనిమిదేళ్లు ఉంటాయి. వ్యవహారాలన్నీ మా అమ్మ చూసుకొనేవారు. ‘చేసుకొంటే చేసుకో కానీ... వీళ్లను వదలద్దు’ అని అన్నయ్యకు చెప్పారు అమ్మ. తరువాత ఆ బాధ్యత నేను తీసుకున్నా... పిల్లలు, వాళ్ల చదువులు, బాగోగులు అన్నీ! ఎప్పుడైనా సరే... ఆవిడ (విజయనిర్మల) విషయంలో నేను జోక్యం చేసుకోను... మా విషయాల్లో ఆవిడ జోక్యం చేసుకోకూడదనేది ఒప్పందం.

ఆర్కే: పద్మాలయ స్టూడియో భూమి విషయంలో వచ్చిన వివాదాలన్నీ పరిష్కారమయ్యాయా?

ఆది: మా వరకు పరిష్కరించుకున్నాం. ‘జీ’ వాళ్లకు సమస్య.

ఆర్కే: పద్మాలయ బ్యానర్‌లో కానీ, స్టూడియోల్లో కానీ మీకు వాటా ఉందా?

ఆది: కృష్ణకు 50 శాతం, నాది 25 శాతం, హనుమంతరావుకు 25 శాతం. మా ముగ్గురు అన్నదమ్ములకూ వాటా ఉంది.

ఆర్కే: సినిమాలు పక్కన పెడితే... ఇక మిగిలింది రాజకీయం. మీరు వైసీపీలోకి వెళ్లారు. అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. టీడీపీలో ఉన్నారా... లేరా అంటే చెప్పలేని పరిస్థితి. మరి ఇప్పుడు అడుగులు ఎటు వైపు?

ఆది: వైసీపీలో చేరి 2019 వరకు పని చేశాను. చిన్న అభిప్రాయం బేధం వచ్చింది. ఏంటంటే... నన్ను అద్దంకిలో పోటీ చేయమని అడిగారు. నాకు మనస్కరించలేదు. దాంతో బయటకు వచ్చాను. వాళ్లేమో నేను ఇంకా అందులోనే ఉన్నానని అనుకుంటున్నారు. చంద్రబాబు సోదరి మనవరాలు మా కోడలు. అలా ఆయనతో బంధుత్వం ఉండడంతో ఇంట్లో వాళ్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు. టీడీపీలో నేను చేరతానని చెప్పాను కానీ... యాక్టివ్‌గా ఎప్పుడూ పని చేసింది లేదు. వాళ్లు చేయించుకున్నదీ లేదు.

ఆర్కే: ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందా?

ఆది: చేయాలనీ లేదు... చేయకూడదనీ లేదు. ఏదైనా పర్లేదు. యాక్టివ్‌గా ఉండాలని కోరుకొంటున్నా అంతే! ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎంపీలకు విలువ లేదు. ఢిల్లీలో పట్టించుకోరు.

ఆర్కే: రాజకీయాల్లో మీరు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ థ్యాంక్యూ వెరీమచ్‌!

ఆది: థాంక్యూ!

ఆర్కే: ఇప్పుడు మీ లక్ష్యం ఏమిటి?

ఆది: పిల్లలంతా స్థిరపడ్డారు. మా అబ్బాయి కూడా వాడి వ్యాపారం వాడు చేసుకొంటున్నాడు. ఎప్పుడో యాభై ఏళ్ల కిందట అన్నయ్య అప్పజెప్పిన బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నేను ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. సినిమా కావచ్చు... రాజకీయం కావచ్చు. ఎప్పుడూ ఏదో వ్యాపకం ఉండాల్సిందే.

ఆర్కే: కృష్ణ గుండె పోటుతో చనిపోయారు కదా! చివరగా చెకప్‌ ఎప్పుడు చేయించారు?

ఆది: పదిహేనేళ్ల కిందట స్టంట్‌ వేశారు. ఆరు నెలల కిందట స్కాన్‌ చేశారు. అందులో అంతా బానే ఉంది. ఆహారం లంగ్స్‌లోకి వెళ్లుంటుందనే సందేహం. నగరంలో ఆయనకు తెలియని డాక్టర్‌ లేరు. అందరితో తనే ఫోన్‌ చేసి మాట్లాడతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చాలా తీసుకొంటారు.

Updated Date - 2022-12-05T11:27:22+05:30 IST