Meenakshi Chaudhary : ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు చూసేస్తారా?

ABN , First Publish Date - 2022-12-11T00:25:19+05:30 IST

మోడలింగ్‌ నుంచి వచ్చిన మీనాక్షి చౌదరి.. మంచి స్విమ్మర్‌. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌లోనూ ప్రవేశం ఉంది. కవిత్వం రాస్తుంది. ఇప్పుడు నటనపై దృష్టి పెట్టింది. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడి’ చిత్రాల్లో కథానాయికగా మెరిసింది. ‘హిట్‌ 2’తో తన

Meenakshi Chaudhary : ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు చూసేస్తారా?

మోడలింగ్‌ నుంచి వచ్చిన మీనాక్షి చౌదరి.. మంచి స్విమ్మర్‌. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌లోనూ ప్రవేశం ఉంది. కవిత్వం రాస్తుంది. ఇప్పుడు నటనపై దృష్టి పెట్టింది. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడి’ చిత్రాల్లో కథానాయికగా మెరిసింది. ‘హిట్‌ 2’తో తన ఖాతాలో హిట్టు పడిన సందర్భంగా మీనాక్షితో మాట కలిపింది ‘నవ్య’.

‘‘చిత్రసీమలో పోటీ గురించి ఎక్కువగా మాట్లాడుకొంటుంటారు. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఓ రేసు లాంటిది నడుస్తోందని అందరి భావన. పోటీ అనేది ఏ రంగంలో అయినా ఉంటుంది. దాన్ని తప్పుపట్టకూడదు. అందరికంటే నేను ఓ అడుగు ముందుండాలి అనుకోవడం తప్పేం కాదు. కథానాయికలుగా అద్భుతమైన విజయాలు సాధించినవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లందతా నాలాంటి వాళ్లకు స్ఫూర్తే. ‘అనుష్కలా స్టార్‌ డమ్‌ సంపాదించాలి. సమంతలా మంచి నటి అనిపించుకోవాలి’ అనుకొంటూ నిరంతరం ఆ దిశగా కష్టపడుతూ ముందుకు వెళ్లడమే పోటీ తత్వం అనుకొంటే.. తప్పకుండా అది మా అందరి మధ్యా ఉంది’’

‘‘నేను ఏదైనా సరే.. చాలా త్వరగా నేర్చుకొంటా. అది నా ప్లస్‌ పాయింట్‌. తెలుగు కూడా అలానే నేర్చుకొంటున్నా. ఇప్పటికైతే తెలుగు అర్థం చేసుకొంటా. మాట్లాడతా. త్వరలో నా డబ్బింగ్‌ నేనే చెప్పుకొంటా. వరుస షూటింగుల వల్ల... బ్యాడ్మింటన్‌ని చాలా మిస్‌ అవుతున్నా. కానీ.. షూటింగులు లేకపోతే, నా ఫ్రెండ్‌ బ్యాచ్‌ బ్యాట్లు పట్టుకొని రెడీ అయిపోతుంటుంది. వాళ్లతో సరదాగా ఆడుకొంటా’’

మోడలింగ్‌, నటనే కాకుండా మీలో చాలారకాలైన కళలున్నాయి. ఒక్కరిలో ఇన్ని సాధ్యమయ్యాయి?

వచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవడమే నాకు తెలిసిన విద్య. మిస్‌ ఇండియా, మోడలింగ్‌, నటన.. ఇవన్నీ ఇలానే జరిగాయి. నేను స్పోర్ట్స్‌ పర్సన్‌ని కూడా. బాట్మెంటెన్‌, టెన్నీస్‌ బాగా ఆడతాను. స్మిమ్మింగ్‌ కూడా చేస్తాను. అప్పుడప్పుడూ కవిత్వం కూడా రాస్తుంటా. ‘ఆల్‌ రౌండర్‌’ అనిపించుకోవాలని కాదు కానీ, నాకు నేను త్వరగా బోర్‌ కొట్టేస్తుంటాడు. ఒకే పని చేస్తూ వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే రకరకాల విద్యలు నేర్చుకొంటుంటా.

మరి చదవుమాటేంటి?

నేను డెంటి్‌స్టని. సినిమాల కోసం ప్ర్టాక్టీస్‌ పక్కన పెట్టాను. ఎప్పుడైనా సినిమాలు బోర్‌ కొడితే.. మళ్లీ ప్రాక్టీస్‌ మొదలెడతా. చెప్పాను కదా.. ఒకే రంగంలో ఉండాలంటే నాకు బోర్‌ అని.

కాలేజీ రోజులు ఎలా గడిచాయి.. అప్పట్లో ఏమైనా ప్రపోజల్స్‌ వచ్చాయా?

కాలేజీలో నేనంటే హడల్‌. ఎందుకంటే.. టామ్‌ బోయ్‌లా ఉండేదాన్ని. కొంతమంది ‘మగరాయుడు..’ అని పిలిచేవారు. ఎప్పుడైతే మిస్‌ ఇండియా పోటీల్లో పాలుపంచుకొన్నానో అప్పటి నుంచి నన్ను అమ్మాయిలా చూడడం మొదలెట్టారు. మా ఫీల్డులో అబ్బాయిలు చాలా తక్కువ. కాబట్టి... ప్రపోజల్స్‌ లాంటివేం జరగలేదు.

ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చారు. మీ ఇంట్లో మిలట్రీ రూల్స్‌ ఉండేవా?

మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్‌. ఇంట్లో ఆయన ఉన్నారంటే... యుద్ధరంగంలో ఉన్నట్టే. అన్నీ టైమ్‌ ప్రకారం జరిగిపోవాల్సిందే. సమయపాలన అంటే ఏమిటో నాకు ఇంట్లోనే తెలిసొచ్చింది. అది నా వృత్త్తిగత జీవితానికి చాలా హెల్ప్‌ అయ్యింది. ఇప్పటి వరకూ నేను సెట్‌కి లేట్‌గా వెళ్లింది లేదు. ‘నువ్వు కొంచెం లేట్‌గా వస్తే బాగుంటుంది’ అని దర్శకులే నాతో అంటుంటారు.

అందాల పోటీల్లో పాల్గొన్నారు కదా? అవి నటిగా మీ కెరీర్‌కు ఎంత వరకూ ఉపయోగపడ్డాయి?

నేను చాలా సిగ్గరి. నలుగురిలో మాట్లాడాలంటే భయపడిపోయేదాన్ని. అలాంటి నేను.. కెమెరా ముందు ఎలాంటి సంకోచం లేకుండా నటిస్తున్నానంటే దానికి కారణం.. అందాల పోటీలే. పోటీ ప్రపంచం అంటే ఏమిటో నాకు అర్థమైంది వీటి వల్లే. నాపై నాకు నమ్మకం పెరిగింది.

‘ఇచట వాహనాలు నిలపరాదు’, ‘ఖిలాడీ’ సరిగా ఆడలేదు కదా..? కెరీర్‌ ఏమైపోతుందో అనే టెన్షన్‌ ఉండేదా?

ఇప్పటి వరకూ నేనేం చేసినా, నాకు ఎలాంటి ఫలితాలు వచ్చినా అందుకు బాధ్యత మొత్తం నాదే. ఎందుకంటే నాకేది ఇష్టమో అదే చేశాను. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ చేయకపోతే.. ‘ఖిలాడీ’, ‘హిట్‌ 2’ సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కావు. ఇండస్ర్టీలో ఏం చేసినా.. దాని ప్రభావం ఎక్కడో చోట కనిపిస్తుంది. మనం కష్టపడ్డామంటే ప్రతిఫలం ఏదో ఓ రూపంలో వస్తుంది.

మీ హైట్‌ మీకు ప్లస్‌ అయ్యిందా? మైనస్‌ అయ్యిందా?

నా ఎత్తు.. ఆరడగులు రెండు అంగుళాలు. కథానాయికల్లో నాలా ఎత్తుగా ఉన్నవాళ్లు తక్కువే. అయితే... నా హైట్‌ నాకు ప్లస్‌ అనుకొంటా. ‘హిట్‌ 2’లో అవకాశం రావడానికి కారణం ఇదే. అడవిశేష్‌ పక్కన ఎంత పొడవున్నా.. పొట్టిగా కనిపిస్తారు. అందుకే నన్ను వెదికి వెదికి పట్టుకొన్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ‘హిట్‌ 1’ చూశా. నాకు చాలా బాగా నచ్చింది. స్వతహాగానే నాకు థ్రిల్లర్స్‌ అంటే ఇష్టం. ‘హిట్‌’ మరింత నచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నారని తెలియగానే సంతోషించా. కానీ.. కథానాయికగా నాకే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

మీ సినిమాల్లో తరచూ లిప్‌లాక్‌ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సీన్స్‌లో నటించడానికి ఇబ్బంది అనిపించదా?

నిజం చెప్పాలంటే ఇంటిమేట్‌ సీన్లలో నటించడం అంత కంఫర్ట్‌గా అనిపించదు. ‘ఈ సన్నివేశం సినిమాకి అవసరమా? కాదా’ అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. ముద్దులు ఉంటే.. సినిమాలు చూసేస్తారా? దానికి తగిన ఎమోషన్‌ ఉండాలి. ‘హిట్‌ 2’లోనూ కొన్ని ఇంటిమేట్‌ సీన్లు ఉన్నాయి. వాటి ప్రాధాన్యం ఏమిటో.. దర్శకుడు శైలేష్‌ నాకు అర్థమయ్యేలా వివరించారు. మోడ్రన్‌ జీవితాల్లోని లివింగ్‌ రిలేషన్స్‌ని ఈ కథలో చూపించాలనుకొన్నాం. దానికి తగినట్టుగానే ఆయా సన్నివేశాలు వచ్చాయి.

సహజీవనం గురించి వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏమిటి?

కలిసి బతకాలి అనుకొన్న వ్యక్తుల్ని అర్థం చేసుకోవడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. అలాంటి వాళ్లకు సహజీవనం అనే కాన్సెప్ట్‌ బాగా ఉపయోగపడుతుంది. నేనైతే.. ప్రస్తుతం సినిమాల గురించే ఆలోచిస్తున్నా. సినిమాలతోనే నా లివింగ్‌ రిలేషన్‌ కొనసాగుతోంది.

ఎవరినైనా ఇష్టపడితే.. ఆ విషయం ఇంట్లోవాళ్లకు చెప్పేంత స్వేచ్ఛ మీకు ఉందా?

తప్పకుండా చెబుతా. అంత స్వేచ్ఛ నాకు ఇంట్లో ఇచ్చారు. కొన్ని విషయాల్ని మేం ఓపెన్‌గానే మాట్లాడుకొంటాం. ప్రేమ అనేది దాచి పెట్టుకొనేంత పెద్ద తప్పు కాదు.

అన్వర్‌

Updated Date - 2022-12-11T12:36:50+05:30 IST