Vegetables Recipe : కూరగాయలతో కమ్మగా
ABN , First Publish Date - 2022-11-04T23:57:21+05:30 IST
అసలే చలికాలం.. వాతావరణం కూల్ కూల్‌గా ఉంది.
అసలే చలికాలం.. వాతావరణం కూల్ కూల్‌గా ఉంది. ఇలాంటి సమయలో వేడివేడిగా పులుసులు చేసుకుని తింటే మైమరిచిపోయి ఆహా... అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం సులువుగా పులుసులు చేసేసుకోండిలా...
అల్లం పెరుగు పులుసు
కావాల్సిన పదార్థాలు
అల్లం- 50 గ్రాములు, కారం- అర టీ స్పూన్, మెంతులు- టీస్పూన్, కొబ్బరి తరుము- సగం పచ్చి కొబ్బరి చిప్ప, పెరుగు- కప్పు, నూనె- 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు- 1 టీస్పూన్, ఆవాలు- అర టీస్పూన్, పసుపు- పావు టీస్పూన్, మినప్పప్పు- అర టీస్పూన్, పచ్చి మిర్చి- 1, ఎండు మిర్చి-1, కరివేపాకు- 1 రెబ్బ, జీలకర్ర- అర టీస్పూన్, ఇంగువ- చిటికెడు
తయారీ విధానం
ఒక ప్యాన్‌లో టీస్పూన్ మెంతులను లోఫ్లేమ్‌లో ఎర్రగా వేయించాలి. వీటితో పాటే కరివేపాకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి. ఇందులో పసుపు, తరిగిన చిన్న అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఒక ప్యాన్‌లో నూనె వేసి ఆవాలను వేయాలి. మినప్పప్పు, శనగపప్పునూ వేయాలి. తాలింపు సగం వేగాక జీలకర్ర, ఎండు మిర్చిని తుంచి వేయటంతో పాటు చిటికెడు ఇంగువ వేసి తాలింపు చేయాలి. పూర్తిగా తాలింపు గింజలు వేగాక.. అందులోకి మిక్సీ పట్టిన మెత్తని చూర్ణాన్ని వేయాలి. ప్యాన్‌లోని మిశ్రమంతో కలిసిపోయేట్లు నిముషం పాటు కలపాలి. ఆ తర్వాత కప్పు కమ్మని పెరుగుని బాగా చిలక్కొట్టాలి. ముప్పావు కప్పు నీళ్లు వేసి మజ్జిలాగా చేసుకోవాలి. అందులోకి చల్లారిన మిశ్రమాన్ని కలిపితే పులుసు తయారవుతుంది. కాస్త ఘాటుగా ఉండే అల్లం పెరుగు పులుసును అన్నంలో కలిపి తినాలి.
బీరకాయ సాంబార్
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు- అరకప్పు, ఉప్పు- రుచికి సరిపడినంత, పసుపు- చిటికెడు, బీరకాయ-400 గ్రాములు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, మినప్పప్పు- 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి- అరకప్పు, గసగసాలు- టీస్పూన్, ఎండుమిర్చి- 6, జీలకర్ర- టీస్పూన్, లవంగాలు- 4,
యాలకులు-3, ధనియాలు- 2 టేబుల్‌స్పూన్లు, నూనె-టేబుల్ స్పూన్, మెంతులు- పావుటీస్పూన్, ఆవాలు- అర టీస్పూన్, ఇంగువ- చిటికెడు, టొమాటో- 2, చింత పులుసు- 2 టేబుల్ స్పూన్లు, బెల్లం- మూడు టేబుల్ స్పూన్లు, కరివేపాకు- రెండు రెబ్బలు
తయారీ విధానం
ముందుగా కందిపప్పును నానబెట్టుకోవాలి. వంట ప్రారంభించే ముందు బీరకాయ తొక్కను తీసి సన్నగా తరగాలి. ఆ తర్వాత ఒక కుక్కర్‌లో నీళ్లుపోసి నానబెట్టిన కందిపప్పు, పసుపు, రుచికి సరిపడ ఉప్పువేసి బాగా ఉడికించాలి. దాన్ని మెత్తగా కలపాలి. ఆ తర్వాత మరిగేనీళ్లలో బీరకాయ ముక్కలు వేసి ఆరేడు నిమిషాలు ఉడికించాలి. సాంబార్ పేస్ట్‌కోసం మినప్పప్పు, మిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర వేసి లోఫ్లేమ్‌లో రంగు మారేట్లు వేయించాలి. అందులోకి పచ్చికొబ్బరి ముక్కలు, గసగసాలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో సరిపడనీళ్లు పోసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేయాలి. మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేపాలి. తాలింపు వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేసి కలియబెట్టాలి. ఇందులోకి రెండుస్పూన్ల చింత పులుసు వేసి కలుపుతుండాలి. చింతపులుసు పొంగు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ను వేయాలి. ఆ తర్వాత కందిపప్పు మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. రుచికి సరిపడిన ఉప్పు వేసి లీటరు నీళ్లుపోయాలి. ఆ తర్వాత బెల్లం వేసి గరిటెతో బాగా కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి లోఫ్లేమ్‌లో పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె, టేబుల్ స్పూన్ పల్లీలు, ఆవాలు, ఒక మిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిసేపు కలిపి ఈ మిశ్రమాన్ని మరిగే సాంబారులో వేసి కలపాలి. ఈ బీరకాయ సాంబార్‌ను అన్నంలో తింటే ఆ రుచేవేరు.
సోది కూర
కావాల్సిన పదార్థాలు
కొబ్బరి పాలు- 2 కప్పులు, ములక్కాడ- 1, టొమాటో- 2, బంగాళ దుంప- 1, అల్లం పేస్ట్- 1 టీస్పూన్, ధనియాల పొడి- 1 టీస్పూన్, కారం- 1 టీ స్పూన్, కొత్తిమీర- అరకప్పు (తరిగినది), నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత
తయారీ విధానం
కొబ్బరి పాలను తీసుకుని ఒక కప్పులో విడిగా ఉంచాలి. ములక్కాడ, బంగాళ దుంప, టొమాటోలను ఉడికించాలి. కొబ్బరిపాలల్లో ఉడికించినవన్నీ వేసి అల్లం పేస్ట్, ధనియాల పొడి, కారం వేసి ఉడికించాలి. ఇది బాగా ఉడికాక స్టౌ మీద నుంచి దింపాలి. ఆ తర్వాత నిమ్మరసం, కొబ్బరి పాలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆఖరున తాలింపు వేయాలి. ఇది అప్పంలోకి నంజుకోవటానికి బావుంటుంది.