కొబ్బరి చిప్పలే వంట పాత్రలు
ABN , First Publish Date - 2022-11-09T01:14:33+05:30 IST
కేరళ సంస్కృతిలో కీలక భూమిక పోషించే కొబ్బరికాయలు ఆ రాష్ట్రంలో 30 శాతం పంటభూమిని ఆక్రమిస్తున్నాయి.
కేరళ సంస్కృతిలో కీలక భూమిక పోషించే కొబ్బరికాయలు ఆ రాష్ట్రంలో 30 శాతం పంటభూమిని ఆక్రమిస్తున్నాయి. అంత సమృద్ధిగా పండుతున్నప్పటికీ, ఖాళీ కొబ్బరి చిప్పలు వృథా అయిపోతూ ఉంటాయి. ఇది నచ్చని మారియా కురియకోస్ అనే అమ్మాయి వాటితో వంట గిన్నెల తయారీకి పూనుకుంది. ఆ ఇకో ఫ్రెండ్లీ కొబ్బరి గిన్నెల కథ ఆమె మాటల్లోనే...
‘‘కేరళలో 90ు కొబ్బరి చెట్లు ఇళ్ల పెరట్లోనే పెరుగుతూ ఉంటాయి. నా ‘తెంగ’ కథ మూలాలు కూడా అక్కడే మొదలయ్యాయి. తెంగ అంటే కేరళ భాషలో కొబ్బరి అని అర్థం. ఎకనామిక్స్ అండ్ బిజినెస్ గ్రాడ్యుయేట్‌ను అయిన నేను, ముంబయిలోని ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేశాను. అయితే సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే కోరిక నన్ను వెంటాడుతూ ఉండేది. అలాగే కేరళ వ్యవసాయ రంగం పురోభివృద్ధి చెందవలసిన ఆవశ్యకత ఉందని నాకు తెలుసు. కొబ్బరి విస్తృతంగా పండే రాష్ట్రంలో కొబ్బరికాయలతోనే నా వ్యాపారం ఎందుకు మొదలుపెట్టకూడదు అనే ఆలోచన కలిగింది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి త్రిశూర్ వచ్చేశాను. తర్వాత అదే ప్రాంతంలో ఉన్న కొబ్బరి నూనె మిల్లులను పరిశీలించాను. కొబ్బరి విభిన్నమైన పంట. ఆ పంటలోని ప్రతి పదార్థాన్నీ ఉపయోగించుకోవచ్చు. కానీ కొబ్బరి చిప్పలను నేరుగా కాకుండా, యాక్టివేటెడ్ చార్కోల్‌గా మార్చి, ఇంధనంగా ఉపయోగించుకుంటూ ఉండడం నాకు నచ్చలేదు. కొబ్బరి పీచు, ఆకులను ఉపయోగించుకున్నట్టే కొబ్బరి చిప్పలను కూడా నేరుగా ఉపయోగించవలసిన అవసరం నాకు కనిపించింది. నిజానికి కొందరు చేతివృత్తి కళాకారులు కొబ్బరి చిప్పలతో గరిటెలను తయారుచేస్తూ ఉంటారు. కానీ వాటితో దక్కే రాబడి తక్కువ కాబట్టి, వాళ్లందరూ భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారు. దాంతో ఆ చేతి వృత్తి అంతరించే దశకు చేరుకుంది. ఆ కళను కాపాడడంతో పాటు, కొబ్బరి చిప్పలకు కొత్త రూపాన్నిచ్చి, ఆ కళాకారులకు భృతి కల్పించాలని సంకల్పించాను.
అమ్మానాన్నల తోడ్పాటుతో...
కొబ్బరి చిప్పలను పాత్రలుగా ఉపయోగించుకోవాలంటే వాటికి పాలిష్ పట్టాలి. పదార్థాల నిల్వకు ఉపయోగపడేలా ఉండాలి. ఆకర్షణీయంగా కూడా కనిపించాలి. అందుకోసం రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ అయిన నాన్నగారి సహాయం తీసుకున్నాను. ఆయన కొన్ని పనిముట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, కొబ్బరి చిప్పల లోపల, బయట పాలిష్ పట్టడం కోసం శాండింగ్ మెషిన్‌ను తయారుచేశారు. అలాగే ఇంట్లో ఉన్న డ్రిల్‌కు ‘బఫర్, డిస్క్ శాండర్’ అనే కొన్ని విడిభాగాలను జోడించారు. అమ్మ జాలీ కురియకోస్, దగ్గర్లోని నూనె మిల్లులు, ఇరుగు పొరుగు పెరట్లలో, వేర్వేరు పరిమాణాల్లోని కొబ్బరి చిప్పలను సేకరించారు. అలా అమ్మానాన్నల సహకారంతో స్వయంగా ఉపయోగించుకోడానికి వీలుండే కొబ్బరిచిప్పల తయారీకి పూనుకున్నాను. ఆ ఉత్పత్తుల మీద లోగోలను లేజర్ ప్రింటింగ్‌తో ముద్రించాను. వార్నిష్ లాంటి రసాయన ఆధారిత పదార్థాలకు బదులుగా కొబ్బరినూనెతోనే పాలిష్ చేశాను. అలా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాను. నెమ్మదిగా ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. ఇ కామర్స్, సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్డర్లు పెరిగిన తర్వాత, త్రిశూర్, కొట్టాయం, వయనాడ్ ప్రాంతాల్లోని చేతివృత్తి కళాకారులను నియమించుకుని, భిన్నమైన కొబ్బరి ఉత్పత్తుల తయారీకి పూనుకున్నాను.
కొబ్బరి చిప్పల కొరత
ఆర్డర్లు పెరిగేకొద్దీ ముడిసరుకైన కొబ్బరి చిప్పల కొరత కూడా పెరిగిపోయింది. దాంతో కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాకుండా పెద్ద సైజుల కోసం వియత్నాం నుంచి కొబ్బరిచిప్పలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ కొబ్బరి చిప్పలు 950 మిల్లీలీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అలా 150 మిల్లీలీటర్ల నుంచి 900 మిల్లీలీటర్ల సామర్ధ్యాలున్న నాలుగు రకాల కొబ్బరి చిప్పల ఉత్పత్తులను తయారుచేసి విక్రయించడం మొదలుపెట్టాను.
ప్రస్తుతం తెంగ బ్రాండ్‌తో సలాడ్ బౌల్స్, టీకప్పులు, క్యాండిల్స్, వంట పాత్రలు, గరిటెలు, మొక్కలను పెంచే ప్లాంటర్లు తయారవుతున్నాయి. గిన్నెలను సలాడ్లు, స్మూదీలు, సూప్స్ కోసం వాడుకోవచ్చు. క్యాండిల్స్ కొబ్బరి వాసనలు వెదజల్లుతాయి. 2019లో రూపుదిద్దుకున్న తెంగ బ్రాండ్ ద్వారా ఇప్పటివరకూ 8 వేల ఉత్పత్తులను తయారుచేసి విక్రయించాను. ప్రధానంగా కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే ఆర్డర్లు ఎక్కువగా అందుతూ ఉంటాయి. మరికొద్ది రోజుల్లో అమేజాన్ ద్వారా జర్మనీలో కూడా తెంగ బ్రాండ్‌ను లాంచ్ చేయబోతున్నాను.’’
అమ్మానాన్నల సహకారంతో స్వయంగా ఉపయోగించుకోడానికి వీలుండే కొబ్బరిచిప్పల తయారీకి పూనుకున్నాను. ఆ ఉత్పత్తుల మీద లోగోలను లేజర్ ప్రింటింగ్‌తో ముద్రించాను. వార్నిష్ లాంటి రసాయన ఆధారిత పదార్థాలకు బదులుగా కొబ్బరినూనెతోనే పాలిష్ చేశాను. అలా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాను.