Seema Seth : బస్తీ పిల్లలకు నయీ దిశ

ABN , First Publish Date - 2022-12-04T23:00:55+05:30 IST

ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా చదువుకు నోచుకోని వందలాది పిల్లలకు ఆశాకిరణం... సీమా సేథ్‌. హరియానాలోని గురుగ్రామ్‌ బస్తీల్లో బోధన కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎందరికో దిశానిర్దేశం చేస్తున్న సీమ సేవా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

Seema Seth : బస్తీ పిల్లలకు నయీ దిశ

ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా చదువుకు నోచుకోని వందలాది పిల్లలకు ఆశాకిరణం... సీమా సేథ్‌. హరియానాలోని గురుగ్రామ్‌ బస్తీల్లో బోధన కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎందరికో దిశానిర్దేశం చేస్తున్న సీమ సేవా ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

‘‘రోడ్డుకు అడ్డంగా పరిగెడుతూ, దుమ్ములో, బురదలో కొట్లాడుకుంటున్న పిల్లలు... అది నేను రోజూ చూసే దృశ్యమే. నేను ఉద్యోగ విరమణ చేశాక, హరియానా గురుగ్రామ్‌లోని ఒక బడిలో స్వచ్ఛందంగా పాఠాలు చెబుతున్న రోజులవి. పొద్దుటి నుంచీ రాత్రి వరకూ వీధుల్లోనే ఉండే ఆ పిల్లల గురించి మా ఆటో డ్రైవర్‌ని అడిగాను. ‘‘వాళ్ళందరూ మా బస్తీ పిల్లలే మేడమ్‌. వాళ్ళ అమ్మానాన్నలు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ గురించి పట్టించుకొనే సమయం ఉండదు. వీళ్ళు బడికి వెళ్ళరు, వాళ్ళూ పంపరు’’ అన్నాడు. ‘పదుల సంఖ్యలో ఉన్న ఈ పిల్లలు పెద్దయ్యాక ఏమవుతారు? ఎలా బతుకుతారు?’ అని నాకు ఆవేదన కలిగింది. ‘‘వాళ్ళ కోసం నేను బడి ప్రారంభిస్తాను. మీ బస్తీలో రెండు గదులు అద్దెకు ఇప్పిస్తావా?’ అని అడిగాను. అతను ‘సరే’నన్నాడు. ఎనిమిదేళ్ళ కిందట... మా ‘నయీ దిశ’ కేంద్రం అలా మొదలైంది.

మొదట్లో మొరాయించారు...

టీచర్‌ కావాలన్నది నా చిన్ననాటి కల. కానీ హిస్టరీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయ్యాక, హెచ్‌ఆర్‌లో పర్సనల్‌ మేనేజిమెంట్‌ డిప్లమా చేసి, కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగిగా అడుగుపెట్టాను. అమెరికన్‌ ఎక్స్‌ప్రె్‌సతో సహా అనేక సంస్థల్లో... వివిధ హోదాల్లో దాదాపు ముప్ఫయ్యేళ్ళు పని చేశాను. ఉద్యోగ బాధ్యతల నుంచి బయటపడ్డాక... సమాజానికి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలోనే ‘నయీ దిశ’ పాఠశాలను 2014లో... ఇద్దరు టీచర్లు, 35 మంది పిల్లలతో... గుర్‌గ్రామ్‌లోని దళిత బస్తీలో మొదలుపెట్టాను. దీనికి నా కుటుంబం, మిత్రులు సహకరించారు. అయితే నా ప్రయత్నం అనుకున్నంత సులువుగా సాగలేదు. ఆ బస్తీల్లో నివసించేవారందరూ అట్టడుగువర్గాలవారు. ఇళ్ళలో పని మనుషులు, డ్రైవ్రర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు, వీధుల్లో కూరగాయలు అమ్మేవాళ్ళు... నిలకడైన వృత్తులు దాదాపు ఎవరికీ లేవు. తమ పిల్లలను చదివించే స్థోమత కానీ, వారికి చదువు ఎందుకు ముఖ్యమనే అవగాహన కానీ లేవు. పిల్లలను ఎందుకు చదివించాలో వారికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా సమయమే పట్టింది. చాలామంది పిల్లలు కూడా మొదట్లో రాబోమని మొరాయించారు. కానీ బస్తీలో... వారికి అందుబాటులోనే చదువు అందించే ఏర్పాటు చేయడంతో కొందరు రావడం మొదలుపెట్టారు.

అంతకు మించిన సంతృప్తి

వాళ్ళలో తొంభై శాతం మంది ఎప్పుడూ బడికి వెళ్ళినవారు కాదు. అక్షరాలు దిద్దించడం నుంచి ఆరంభించాల్సి వచ్చింది. అదే సమయంలో... పిల్లల హక్కుల గురించి, లైంగిక వేధింపుల నుంచి బాలికలు తమను కాపాడుకోవడం గురించి కూడా బోధించాం. పరిశుభ్రత, బడిలో చేరితే తోటివారితో మెలగాల్సిన పద్ధతులు నేర్పించాం. ఇవన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతీ యువకులు కొందరు మాతో కలిసి స్వచ్ఛందంగా పని చేయడానికి ముందుకు వచ్చారు. పాఠాలతో పాటు జీవన నైపుణ్యాలను కూడా పిల్లలకు నేర్పుతున్నాం. రెగ్యులర్‌ స్కూళ్ళలో చదివేవారి స్థాయికి ఈ బస్తీ పిల్లలు చేరుకోవడానికి లెక్కలు, సైన్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్లను, కంప్యూటర్‌ బేసిక్స్‌ను ప్రత్యేకంగా బోధిస్తున్నాం. వారిలోని కళాభిరుచుల్ని, పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నాం. పుస్తకాలు, షూలు, యూనిఫారాల్లాంటివి ఉచితంగా సమకూరుస్తున్నాం. ఇప్పటివరకూ దాదాపు 900 మందికి మేము శిక్షణ ఇచ్చాం వారిలో అధికశాతం వివిధ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. చదువులో రాణిస్తున్నారు. ఆదరణ బాగుండడంతో 2018లో... మరో బస్తీలో మా రెండో కేంద్రాన్ని తెరిచాం. ఈ రెండు కేంద్రాల్లో ఇప్పుడు 170 మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. పదిమంది టీచర్లున్నారు. మరిన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.

అన్నిటికన్నా ప్రధానంగా... ఒకప్పుడు వీధుల్లో ఎలాంటి గమ్యం లేకుండా తిరిగిన పిల్లలు... బాధ్యతగా కనిపిస్తున్నారు. తమకన్నా చిన్న వారికి చదువు చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతం ఒక ట్రస్టుగా... పలువురి సహకారంతో నడుస్తున్న ‘నయీ దిశ’ను వారు మరింత ముందుకి తీసుకుపోతారనే నమ్మకాన్ని నాలో పెంచుతున్నారు. ఇది నాకు ముప్ఫయ్యేళ్ళ కార్పొరేట్‌ కెరీర్‌ను మించిన సంతృప్తిని కలిగిస్తోంది.’’

Updated Date - 2022-12-04T23:00:58+05:30 IST