న్యాయవ్యవస్థకు నాటి స్వర్ణయుగం వచ్చేనా?

ABN , First Publish Date - 2022-11-16T01:00:10+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు హాజరయ్యారు. ఇద్దరు పరస్పర గౌరవాభిమానాలతో...

న్యాయవ్యవస్థకు నాటి స్వర్ణయుగం వచ్చేనా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు హాజరయ్యారు. ఇద్దరు పరస్పర గౌరవాభిమానాలతో పలకరించుకున్న తర్వాత పివి ఆయనతో మాట్లాడుతూ ‘ జస్టిస్ వెంకటాచలయ్య గారూ, మన మధ్య సుహృద్భావ సంబంధాలు ఉంటాయని భావిస్తున్నాను’ అన్నారు. జస్టిస్ వెంకటాచలయ్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘ప్రధానమంత్రి గారూ మన మధ్య సుహృద్భావ సంబంధాలు ఎలా ఉంటాయి? ఉంటాయని నేను అలా అనుకోవడం లేదు..’ అని అన్నారు. పివి చిరునవ్వు నవ్వి, ‘సరేనండీ, సుహృద్భావ సంబంధాల సంగతి అటుంచండి, పరస్పర గౌరవం ఉంటే చాలు..’ అని జవాబిచ్చారు. ఈ ఘట్టం గురించి జస్టిస్ వెంకటాచలయ్య 2017లో విశాఖపట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పివి నరసింహారావు స్మారకోపన్యాసం చేస్తూ వెల్లడించారు. పివిని రాజనీతిజ్ఞుడని, అత్యంత ప్రతిభావంతుడైన మేధావి అని అభివర్ణించిన జస్టిస్ వెంకటాచలయ్య, దివంగత ప్రధాని హయాంలో తాను ప్రభుత్వాన్ని ఎలా అగ్నిపరీక్షకు గురిచేసింది కూడా వివరించారు.

జస్టిస్ వెంకటాచలయ్య చెప్పిన ఈ ఘట్టం భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకూ, కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎలా ఉండాలో చెబుతాయి. చాలా మంది న్యాయమూర్తులు పదవీ స్వీకారం చేసిన వెంటనే జస్టిస్ వెంకటాచలయ్య తమకు ఆదర్శమని చెబుతారు కాని ఆయన అడుగుజాడల్లో తుచ తప్పకుండా నడిచిన వారు మనకు అంతగా కనపడరు.

పివి హయాంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను జస్టిస్ వెంకటాచలయ్యతో పాటు జస్టిస్ అహ్మది, జస్టిస్ జెఎస్ వర్మ తీవ్రంగా ప్రశ్నించారు. జస్టిస్ కుల్దీప్ సింగ్ పర్యావరణంపై ఎన్నో చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపులో నాటి కేబినెట్ మంత్రులు సతీశ్ శర్మ, షీలా కౌల్ నిర్ణయాలను తప్పు పట్టారు. సుప్రీంకోర్టు సిబిఐ కేసులను పర్యవేక్షించడం కూడా పివి హయాంలోనే ప్రారంభమైంది. సిబిఐ సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలి కాని రాజకీయ నాయకత్వానికి కాదని నాడు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాటి సిబిఐ డైరెక్టర్ ను కూడా సుప్రీంకోర్టు బోనులో నిలబెట్టింది. సిబిఐ పనితీరును పర్యవేక్షించే బాధ్యతను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు అప్పజెప్పింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా సుప్రీంకోర్టు మద్దతుతో స్వేచ్ఛగా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం వల్ల నరసింహారావు ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. కాని దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయన ఏనాడూ పెదవి విప్పి మాట్లాడలేదు. పార్లమెంట్ లో ఆయన నిర్ణయాలపై తీవ్ర గందరగోళం రేగినప్పుడు కూడా న్యాయవ్యవస్థపైనే ఆయన బాధ్యత మోపారు. తాను కేవలం న్యాయవ్యవస్థ నిర్ణయాలను అమలు చేస్తున్నానని చెప్పారు. తన పట్ల న్యాయవ్యవస్థ ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న విషయానికి పివి అంత ప్రాధాన్యత నీయలేదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర్రంగానే వ్యవహరించాలని ఆయన అనుకునేవారు. ఆయన స్వతహాగా న్యాయవాది కావడం ఇందుకు కారణమేమో? !

పివి యుగం ముఖ్యంగా న్యాయవ్యవస్థకు సంబంధించి స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. నాటి పరిస్థితులతో పోలిస్తే ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన 16 మందిలో 8 మంది అవినీతిపరులని మాజీ న్యాయమంత్రి , సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ 2010లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎవరినైనా కొనుగోలు చేయొచ్చు అని నాడు గుజరాత్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ జె ముఖోపాధ్యాయ అన్నారు. ఈ పరిస్థితి గత దశాబ్దంలో మారిందా, ఇంకా దిగజారిందా అన్నవిషయం న్యాయవ్యవస్థలో నిత్యసంబంధాలున్నవారే స్పష్టంగా చెప్పగలరు.

కార్యనిర్వాహక వర్గ నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ లోపాలను ఎంచుతోందా, లేక కార్యనిర్వాహక వర్గం న్యాయవ్యవస్థ ను ప్రభావితం చేస్తోందా అన్న అనుమానాలు గత కొన్నేళ్లుగా కలుగుతున్నాయి. నేరచరితులైన ప్రజా ప్రతినిధులపై విచారణను వేగవంతం చేయడంతో పాటు అనేక కీలక కేసుల విచారణ ను ప్రక్కన పెట్టారు. ఇందిరాగాంధీ వంటి నేత పదవీ గండంలో పడి ఎమర్జెన్సీ విధించడానికి ఒక హై కోర్టు ప్రధానన్యాయమూర్తి తీర్పు కారణమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్థాన్ లో కూడా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు దారితీసింది. న్యాయవ్యవస్థ తీర్పులతో వివిధ దేశాధినేతలు జైలు పాలైన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక ప్రజాస్వామ్యం పనితీరుపై ప్రజల విశ్వాసం పెరగాలంటే న్యాయవ్యవస్థ నిజాయితీగా పనిచేయడం అవసరం. న్యాయవ్యవస్థ అవినీతికి, ప్రలోభాలకు, ఒత్తిళ్లకూ అతీతం అని తేలినప్పుడు ఈ విశ్వాసం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

ఇటీవల ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హై కోర్టులకు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏపి షా గత ఎనిమిదేళ్లలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ప్రభుత్వ నియంత్రణకు లొంగిందని అభిప్రాయపడ్డారు. పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 రద్దు జోలికి ఎందుకు పోలేదన్నది చర్చనీయాంశం. కాని ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఎలెక్టోరల్ బాండ్ల పథకం, హెబియస్ కార్పస్ కేసులను పట్టించుకోలేదని, కొవిడ్ సమయంలో వలస కూలీల దుస్థితి పై ప్రభుత్వ వైఖరినే సమర్థించిందని, భావ వ్యక్తీకరణ కు సంబంధించి పది కేసుల్లో కేవలం మూడు కేసులనే పట్టించుకున్నదని జస్టిస్ షా అన్నారు. జస్టిస్ గొగోయ్ అనేక ముఖ్యమైన కేసుల్లో సమాచారాన్ని సీల్డు కవర్లలో సమర్పించమని కోరడం, ఈ కేసుల విచారణను పక్కన పెట్టడం ప్రశ్నార్థకమైందని ఆయన అన్నారు. ప్రధానమంత్రిని ప్రశంసలతో ముంచెత్తిన జస్టిస్ అరుణ్ మిశ్రా ను కూడా ఆయన తప్పు పట్టారు.వీరిద్దరిలో ఒకరు తమ పదవి ముగిసిన తర్వాత ఒకరు రాజ్యసభ సభ్యత్వాన్ని, మరొకరు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవిని స్వీకరించడం అనుచితమని, ఇది లా కమిషన్ అభిప్రాయానికి విరుద్దమని ఆయన అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగ ఆత్మ గా వ్యవహరించిన ఆర్టికల్ 32 (సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కు) క్రింద పిటిషన్లను తాను ప్రోత్సహించబోనని మరో సిజె బాబ్డే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్ రమణ ప్రధానన్యాయమూర్తి అయిన తర్వాత న్యాయవ్యవస్థపై కొంత గౌరవం పెరిగిందని ఆయన అంగీకరించారు. న్యా యపరిపాలనా వ్యవస్థను కట్టుదిట్టం చేసిన జస్టిస్ రమణ రాజద్రోహ నేరంపై స్టే విధించడం మాత్రమే కాదు, లఖీంపూర్ ఖేరీ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని అరెస్టు చేయించడం, కశ్మీర్ లో ఇంటర్నెట్ పై నిషేధాన్ని ఎత్తివేయించడం, పెగాసస్ నిఘాపై కమిటీని నియమించి ప్రభుత్వం తమకు సహకరించడం లేదని స్పష్టం చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మానవ హక్కుల పరిరక్షణకు బహిరంగంగా వత్తాసు పలికారు. జస్టిస్ రమణ న్యాయస్థానాన్ని ముందుండి నడిపించారని దుష్యంత్ దవే వంటి సీనియర్ న్యాయవాదులు మాత్రమే కాదు, సాధారణంగా ఎవరికీ సర్టిఫికెట్లు ఇవ్వని ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీలాంటి న్యాయనిపుణులు కూడా ప్రశంసించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

జస్టిస్ రమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లలిత్ కేవలం 74 రోజులు పదవిలో ఉన్నప్పటికీ తనదైన ముద్ర వేశారు. వందలాది పెండింగ్ కేసులను పరిష్కరించడం, రాజ్యాంగ బెంచ్ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయించడం, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్ వాద్, జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ లకు బెయిల్ ఇవ్వడం, సిఏఏ , పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేసులను విచారణకు స్వీకరించడం ఆయన హయాంలో జరిగిన నిర్ణయాల్లో చెప్పుకోదగ్గవి. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణకు గురైన ప్రొఫెసర్ సాయిబాబా పై బొంబాయి హై కోర్టు కేసు కొట్టివేసిన తర్వాత ఆగమేఘాలపై శనివారం నాడు సుప్రీం కేసును విచారించి ఆయన విడుదలపై స్టే విధించడం కూడా జస్టిస్ లలిత్ హయాంలోనే జరిగింది. అతి అరుదైన సందర్భాల్లో తప్ప ఒక హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడం గతంలో ఏనాడూ జరగలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ తో పాటు అనేక మంది న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు.

సాయిబాబా కేసును అర్జెంట్ గా విచారించేందుకు నిరాకరించిన జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి. రెండు సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించే జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలంలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండవ టర్మ్ చివరి ఏడాదిన్నర కాలం ముగియనుంది. మోదీ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు, తీసుకోబోయే అనేక నిర్ణయాలు ఆయన హయాంలో సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. కిస్సా కుర్సీకా కేసులో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీని జైలు కు పంపిన జస్టిస్ వై.వి చంద్రచూడ్ ఆయన తండ్రి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు తన తండ్రి మాదిరే తాను వ్యవహరిస్తానని, కొన్ని సందర్భాల్లో తండ్రి అభిప్రాయాలతో కూడా విభేదించగలనని జస్టిస్ డివై చంద్రచూడ్ ఇప్పటికే నిరూపించుకున్నారు. అత్యంత ఆధునిక భావాలు గల మేధావి, మహిళల హక్కులు, వ్యక్తి స్వేచ్చ, ప్రైవసీ హక్కు విషయంలో రాజీ పడని న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన జస్టిస్ డివై చంద్రచూడ్ హయాంలో న్యాయవ్యవస్థకు మళ్లీ స్వర్ణయుగం వస్తుందా అన్నది వేచి చూడాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-11-16T01:00:10+05:30 IST

Read more