చెల్లదని తెలిసీ ఎందుకు ఈ బిల్లు?

ABN , First Publish Date - 2022-12-07T01:05:10+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క యూనివర్సిటీలోనూ బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను...

చెల్లదని తెలిసీ ఎందుకు ఈ బిల్లు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క యూనివర్సిటీలోనూ బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఐదువేలకు పైనే ఖాళీలు పేరుకుపోయాయి. ఒక్క ఉస్మానియా యూనివర్శిటీలోనే మూడు వేల ఖాళీలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 2017లో నవంబరు 22న నేటి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలోనూ ఖాళీగా ఉన్న 1061 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటన చేసి ఐదేళ్లయినా నేటికి అతీగతీ లేదు. తాజాగా ప్రభుత్వం యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని, దాని కోసం కామన్‌ రిక్రూట్ మెంటు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నరు ఆమోద ముద్ర లభించిన వెంటనే భర్తీ చేస్తామంటుంది. కానీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లులో చాలా లొసుగులు ఉన్నాయి.

గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో సెలెక్షన్‌ కమిటీలో కొన్ని మార్పులు చేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం సెలెక్షన్‌ కమిటీలో ఉండాల్సిన కొందరు మెంబర్లను తొలగించి వారి స్థానంలో సంబంధిత ప్రిన్సిపాల్స్‌ను, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌లను సభ్యులుగా చేర్చి సెలక్షన్లను నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఆ సెలెక్షన్లు యూజీసీ నిబంధనలకు విరుద్ధమని రద్దు చేసింది. దాంతో యూనివర్సిటీ అధికారులు యూజీసీ నిబంధనల ప్రకారం సెలెక్షన్‌ కమిటీని తిరిగి ఏర్పరిచి సెలెక్షన్లు చేయాల్సివచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టం ప్రకారం సెలక్షన్‌ కమిటీలో విద్యాశాఖ, ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండబోతున్నారు. కౌన్సిల్‌ ఫర్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్ చైర్మన్ సెలెక్షన్‌ కమిటీ చైర్మనుగా ఉండబోతున్నారు. ఇదంతా యూజీసీ నిబంధనలకు విరుద్ధమే. అలాంటపుడు ఈ చట్టం న్యాయసంస్థల ముందు చెల్లుబాటు అవుతుందా? రిజ్వరేషన్ల విషయంలో విధిగా పాటించాల్సిన రోస్టర్‌ పాయింట్లు ఒక్కో యూనివర్సిటీకీ ఒక్కో విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ కామన్‌ రిక్రూట్ మెంటు బోర్డు ఏ రోస్టర్‌ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తుందన్నది ప్రశ్న.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజ్వరేషన్లకు గొడ్డలిపెట్టుగా మారబోతున్న ఈ బిల్లు స్థానికులకు ఏ మేరకు న్యాయం చేకూర్చబోతుందనేది ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగాలన్నింటిలో స్థానికులకు 95శాతం రిజ్వరేషన్‌ కల్పించాం అని చెపుతూనే ఆచరణలో మాత్రం స్థానికేతరులకే అవకాశం కల్పిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో స్పష్టమైంది. గత పదిహేనేళ్ల నుంచి నెలకు రూ.7వేల జీతంతో పనిచేసిన స్థానిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగుల్లో దాదాపు 300మందిని నిర్దాక్షిణ్యంగా ఊడదీసి, నెలకు రూ.21వేల జీతంతో స్థానికేతరులను నియమించింది. ప్రస్తుతం బోధనా సిబ్బంది నియామకాలలో కూడా స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టాలనే లక్ష్యంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కనబడుతుంది. గత 15–20 సంవత్సరాల కాలం నుంచి కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ఈ కామన్‌ రిక్రూట్ మెంటు బోర్డు నియామకాల్లో ఏమైనా వెయిటేజ్‌ ఉంటుందో లేదో తెలియదు. ఈ బోర్డు ద్వారా భర్తీ అయిన వారిని భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు అంతర్‌ బదిలీ చేసే ఆస్కారం ఉంది. ఇది అవాంఛనీయం. కావాలనే ఇలాంటి లొసుగులతో కూడిన చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వం యూనివర్సిటీలలోని నియామకాలకు తిలోదకాలు ఇవ్వాలని చూస్తున్నట్టుంది.

జీవన్

ఏబీవీపీ స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్

Updated Date - 2022-12-07T01:05:16+05:30 IST