ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు కార్పొరేట్ రాయితీలెందుకు?

ABN , First Publish Date - 2022-12-02T02:43:40+05:30 IST

అక్టోబరు మాసంలో మన దేశం తాలూకు ఎగుమతులు గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే గణనీయమైన స్థాయిలో 16.65శాతం తగ్గాయి. మన దేశంతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన పది ప్రధాన దేశాలలో...

ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు  కార్పొరేట్ రాయితీలెందుకు?

అక్టోబరు మాసంలో మన దేశం తాలూకు ఎగుమతులు గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే గణనీయమైన స్థాయిలో 16.65శాతం తగ్గాయి. మన దేశంతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన పది ప్రధాన దేశాలలో ఏడింటితో ఈ ఎగుమతులు తగ్గాయి. ఉదాహరణకు, అమెరికాకు మన ఎగుమతులు 28శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్సుకు 18శాతం, చైనాకు 47.5శాతం, బంగ్లాదేశ్‌కు 52.5 శాతం, బ్రిటన్‌కు 22శాతం, సౌది అరేబియాకు 20శాతం, హాంకాంగ్‌కు 23.6 శాతం మేరన తగ్గిపోయాయి. అంటే మన పది ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలకు 2021 అక్టోబరులో 17.72 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ ఎగుమతులు 2022 అక్టోబరుకు 13.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ధనిక దేశాలలో, ప్రజల కొనుగోలు శక్తీ, మార్కెట్‌ డిమాండ్లూ వేగంగా పడిపోతున్నాయనటానికి మన ఈ ఎగుమతుల్లో పతనమే తార్కాణం. కోవిడ్‌, లాక్‌డౌన్‌ల అనంతరం ఈ దేశాలన్నీ భారీ ఎత్తున తమతమ ఆర్థిక వ్యవస్థలకు కరెన్సీల ముద్రణ రూపంలో ఉద్దీపనలను ఇచ్చాయి. ఫలితంగా ఆ కొంతకాలం ఆ దేశాలలో ప్రజల కొనుగోలు శక్తీ, డిమాండ్లు నిలదొక్కుకున్నాయి. ఈ దేశాలన్నీ గత కొన్ని దశాబ్దాలుగా భారీ ఎత్తున నగదు ముద్రణపై ఆధారపడి తమ తమ దేశాలలోని ఆర్థిక వ్యవస్థలను నడిపించడమే ఈ కరెన్సీ ముద్రణల రూపంలో ఉద్దీపనకు కారణం. కానీ ఈ క్రమంలోనే ఈ భారీ ఉద్దీపనలు ఆయా దేశాలలో అపరిమితమైన ద్రవ్యోల్బణానికి లేదా ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. ఫలితంగా ఆ దేశాల ప్రజలలో ప్రభుత్వాల పట్ల తీవ్ర వ్యతిరేకతా, అసంతృప్తులు పెరిగాయి. దాంతో ఆ ప్రభుత్వాలు స్పందించి– ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గాను– డబ్బు చలామణీని తగ్గించేందుకు– బ్యాంకుల వడ్డీ రేట్లను పెంచసాగాయి. అయితే ఈ చర్య, అత్యంత వేగంగా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఆయా దేశాలలో ప్రజల కొనుగోలు శక్తి పతనం చెందింది. ఆర్థిక వృద్ధి రేట్లు దిగజారాయి. అంతిమంగా ఆర్థిక మాంద్యం దిశగా జారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ధనిక దేశాలన్నీ దిగుమతులను తగ్గించుకున్నాయి.

ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడే మెరుగుపడే అవకాశాలు లేవు. దానికి కారణం ఈ ధనిక దేశాలలో వడ్డీ రేట్ల పెంపుదల క్రమం తాలూకు వేగం కొంత తగ్గినప్పటికీ, మొత్తంగా ద్రవ్యోల్బణం నిర్దిష్ట స్థాయికి తగ్గే వరకూ అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుత క్రమంలో ఈ దేశాలు మాంద్యంలోకి ప్రవేశించాయన్నదీ, లేదా ప్రవేశిస్తాయన్నదీ నిజం. అంటే అనివార్యంగా ఈ దేశాలన్నింటిలోనూ రానున్న కాలంలో ప్రజల కొనుగోలు శక్తీ, డిమాండ్లు పతనం అవుతాయి. దాని వలన మన దేశం తాలూకు ఎగుమతులు కూడా ఆ మేరకు దెబ్బతింటాయి. పైగా, ప్రస్తుతం మన దేశంలో కూడా రోజురోజుకూ ప్రజల ఆర్థిక కడగండ్లు పెరుగుతున్నాయి. ఉదాహరణకు, ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ ఇటీవలి అధ్యయనం ప్రకారంగా దేశంలో నిరుద్యోగం 8శాతం పైబడే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీలూ, చిన్న వ్యాపారులలో ఇది అధిక స్థాయిలో ఉంది. ఫలితంగానే గత అనేక మాసాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఎఫ్‌ఎమ్సిజి కంపెనీల (బిస్కెట్లు, షాంపూలు, సబ్బులు... వంటి నిత్యావసరాలను సరఫరా చేసే కంపెనీలు) అమ్మకాలు గణనీయంగా పతనం అయ్యాయి. నగర ప్రాంతాల్లో కూడా పెద్దగా పరిస్థితులు బాగున్నది ఏమీ లేదు. దీనికి కారణం దేశీయంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోయి, ఇంకా దిగజారిపోతూ కూడా ఉండడమే.

ఇటువంటి స్థితిలో, ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌ను పెంచడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. కొనుగోలు శక్తీ, డిమాండ్‌ లేని ఈ పరిస్థితులలో ప్రైవేటు పెట్టుబడిదారులు కొత్తగా పెట్టుబడులు పెట్టరు. ఫలితంగా ఉపాధి కల్పనలోనూ, డిమాండ్‌ పునరుద్ధరణలోనూ ఈ ప్రైవేటు పెట్టుబడిదారుల పాత్ర పెద్దగా ఉండదు. కాబట్టి అనివార్యంగా ప్రభుత్వమే పూనుకొని పెట్టుబడులు పెట్టి, ఉపాధి కల్పన ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధ దిశలో ప్రయాణం చేసింది. 2019లో కార్పొరేట్‌ పన్ను భారీ తగ్గించింది. అలాగే నేడు ప్రొడక్టివిటీ లింక్డ్‌ ఇన్‌సెన్టీవ్‌ (పిఎల్‌ఐ) పేరిట ఉత్పత్తిని మరింత పెంచేందుకుగాను కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలకు పైగా సాయం చేస్తోంది. ఈ పద్ధతిలో కార్పొరేట్లు ఉత్పత్తిని పెంచుతాయనీ, అలాగే వాటి ఎగుమతులూ పెరుగుతాయనీ, ఈ క్రమంలో ఉపాధి కల్పన జరిగి ప్రజల కొనుగోలు శక్తీ, డిమాండ్‌లు పెరుగుతాయన్న భ్రమలో ఉంది నేటి ప్రభుత్వం. వాస్తవంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముందుగానే చెప్పుకొన్న విధంగా మన దేశీయ ఎగుమతులు పెరగడానికి బదులుగా పతనం అవుతున్నాయి. అలాగే ఉపాధి కల్పన కూడా క్షీణిస్తోంది. నిజానికి, కోవిడ్‌ కాలంలో సరుకు ఉత్పత్తి రంగంలోని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ స్థితి ఇప్పటి వరకూ కూడా పరిష్కారం కాకుండానే మిగిలిపోయింది. మరి, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వల్లనూ, అలాగే రెండేళ్ళుగా అమలవుతోన్న పిఎల్‌ఐ పథకం వల్లనూ జరిగిన ప్రయోజనమేమిటి?

అప్పట్లోనే నాటి రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ చెప్పినట్లు– ప్రస్తుతం ప్రపంచానికి మరో చైనా అవసరం లేదు. ఎందుకంటే– నాడు ప్రపంచంలో సరుకులకు ఉన్న మొత్తం డిమాండును దాదాపుగా చైనా ఒక్కటే చౌక ధరలకు పరిపూర్తి చేస్తోంది. ఇక అటువంటప్పుడు మరో దేశానికి ఈ స్థానంలోకి ప్రవేశించే అవకాశం లేదు. మరోకారణం– అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మాంద్యం పరిస్థితులు నెలకొనటం వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి సరుకులకు డిమాండ్‌ పతనం అవుతోంది. మరోపక్కన మన దేశీయ మార్కెట్లో కూడా నామమాత్రంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకూ పతనం అవుతోంది.

మరి, విషయం ఇది కాగా– మన ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించడం ద్వారా ఏటా 1.45 లక్షల కోట్ల రూపాయలను కోల్పోవటం వల్ల ఎవరికి ప్రయోజనం? అలాగే, పిఎల్‌ఐ పేరిట, ‘ఉత్పత్తిని పెంచండి–ఉపాధి కల్పించండి’ అంటూ లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం ఎందుకు? ప్రజల కొనుగోలు శక్తి బాగున్నా, లేకున్నా, కార్పొరేట్లకూ ధనవంతులకూ రాయితీలు ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందనే నయా ఉదారవాద సూత్రానికి పాశ్చాత్య దేశాలలోనే కాలం చెల్లిపోతోంది. కాగా, మన పాలకులు మాత్రం ఇంకా ఈ విధానాన్నే బలంగా అంటిపెట్టుకున్నారు. అదీ కథ!

ధనవంతులూ, వ్యాపారస్థులకు అనుకూలమైనదిగా ముద్ర పడిన మన బీజేపీ నుంచి మనం ఇంతకంటే ఏం ఆశించగలం! మన దేశాన్ని కూడా మహామాంద్యం చుట్టుముట్టక ముందే ఈ తల్లకిందులు విధానాలను మార్చుకోకపోతే మాత్రం మన దేశ ప్రజల పరిస్థితి అధోగతే కాగలదు!

డి. పాపారావు

Updated Date - 2022-12-02T02:43:50+05:30 IST