సభపెట్టి ఊదరగొట్టేంత సాయం బీసీలకు ఏం చేశారు?

ABN , First Publish Date - 2022-12-07T01:00:57+05:30 IST

తెలుగుదేశం నినాదమైన ‘జయహో బీసీ’ని కాపీ కొట్టి జగన్ ముఠా తామేదో బీసీలను ఉద్ధరించినట్లు చెప్పుకొనేందుకు సభ నిర్వహించడం సిగ్గుచేటు...

సభపెట్టి ఊదరగొట్టేంత సాయం బీసీలకు ఏం చేశారు?

తెలుగుదేశం నినాదమైన ‘జయహో బీసీ’ని కాపీ కొట్టి జగన్ ముఠా తామేదో బీసీలను ఉద్ధరించినట్లు చెప్పుకొనేందుకు సభ నిర్వహించడం సిగ్గుచేటు. ‘జయహో బీసీ’ సభ నిర్వహించి బీసీలకు ఏం చెబుతారు: 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పైసా ఖర్చు చెయ్యకుండా వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చామని చెబుతారా? గత ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన 28 పథకాలను రద్దు చేశామని చెబుతారా? బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించామని చెబుతారా? సంపద లభించే పదవులను, ఆర్థికంగా పటిష్టంగా ఉండే శాఖలను, ఆదాయ వనరులు ఉన్న శాఖల నామినేటెడ్ పదవులను రెడ్డి సామాజిక వర్గానికి వెయ్యికి పైగా ఇచ్చి, ఆదాయమూ పనీ లేని పదవులను మాత్రం బీసీలకు ఇచ్చామని చెబుతారా?

జగన్ రెడ్డి దుర్మార్గమైన ప్రజాకంఠక పాలనతో రాష్ట్రంలోని బీసీలు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అన్ని ప్రధాన శాఖల్లోను రెడ్డి సామాజిక వర్గం వారితోనే నియామకాలను పూర్తి చేశారు. ఉన్నత ఉద్యోగాల్లోనూ వారికే అవకాశం ఇచ్చారు. కీలక విభాగాలకు చెందిన అధిపతులు– స్టేట్ పోలీసు అధిపతి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రధాన సలహదారు, రాయలసీమ ఉత్తరాంధ్రల ఇన్‍చార్జులు, ఆప్కాబ్‌, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, ప్రాజెక్టులు, మీడియా, టెంపుల్ కమిటీలు, మార్కెట్ కమిటీలు... ఇలాంటి పదవులూ రంగాలన్నింటిలో కీలకమైన బాధ్యతలన్నీ రెడ్డి సామాజిక వర్గానికే అప్పగించారు. ఏపీఐఐసీ, ఫైబర్‌నెట్‌, డిజిటల్‌ కార్పొరేషన్‌, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌, పౌర సరఫరాల కార్పొరేషన్‌, సీడ్‌ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌, ఏపీ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌, స్కిల్‌ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌, స్పోర్ట్స్ అథారిటీ, ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్‌... ఇవన్నీ రాష్ట్రస్థాయిలో బలమైన, కీలకమైన కార్పొరేషన్లు. వీటన్నింటినీ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలకే అప్పగించారు. ఇప్పడు బీసీలు పట్ల మొసలి కన్నీరు కారుస్తూ బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నామని ‘జయహో బీసీ’ సభ నిర్వహిస్తున్నారు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉండాల్సిన 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి పరిమితం చేశారు వేలమంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారు. రిజర్వేషన్లు తగ్గించి 140 వెనుకబడిన కులాలకు అన్యాయం చేశారు. అత్యంత వెనుకబడిన కులాలను, సంచార జాతులను, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను విస్మరించారు. తాను అన్ని వర్గాలకూ, అన్ని కులాలకూ ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయి ఒక కులానికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు. ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియని, ఉన్నా ఎక్కడున్నాయో తెలియని కార్పొరేషన్లను ఏరి కోరి బీసీలకు అప్పగించారు. బీసీలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ విజయవాడలోని గొల్లపూడిలో ఒక అపార్టుమెంటు తీసుకుని అందులో నింపేశారు. ఐదారు కార్పొరేషన్లకు కలిపి ఒక అధికారిని నియమించి ఒకరో ఇద్దరో ఆఫీసు సిబ్బందిని కేటాయించారు. నవరత్నాల కింద తమ కులం వారికి జరిగిన లబ్ధిని లెక్కలెయ్యడమే ఆ కార్పొరేషన్ల బాధ్యత. అంతేతప్ప, నిధులూ విధులూ ఉండవు. ఒక్క లబ్ధిదారుడిని కూడా ఎంపిక చేసే అధికారం వీటికి లేదు. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు నెలకోసారి కూడా అటువైపు చూడరు.

బీసీలకు పది మంత్రి పదవులిచ్చి మొత్తం బీసీలందరినీ ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకొంటున్నారు. ఆ బీసీ మంత్రులకు కూడా స్వేచ్ఛగా, సొంతంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... వీళ్ళు ఆడమన్నట్లు ఆడే తోలుబొమ్మలుగా మిగిలిపోయారు. బీసీ మంత్రులను డమ్మీలను చేసి అసెంబ్లీలోనూ బయటా తనకు భజన చేయించుకొంటున్నారు. పంచాయితీల్లో నిధులు కాజేసి బీసీ సర్పంచులను రాజ్యాధికారానికి దూరం చేశారు. బడుగు బలహీనవర్గాల్లో స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయకుండా ఉండటం కోసం పంచాయితీలకు ఎన్నికైన వెనుకబడిన వర్గాల వారిపై తన సామాజిక వర్గీయులతో దాడులు చేయిస్తున్నారు.

అసలు జయహో బీసీ సభ ఎందుకు నిర్వహిస్తున్నారో జగన్ గ్యాంగ్ చెప్పాలి. మూడున్నరేళ్లలో సుమారు రూ.35వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించినందుకా? జీఓనెం217తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15లక్షల మంది మత్స్యకారుల్ని రోడ్డున పడేసినందుకా? దాదాపు 15.74 లక్షలమంది మత్స్యకారులు ఉండగా ‘మత్స్యకార భరోసా’ను లక్ష మందికే పరిమితం చేసినందుకా? 3.50 లక్షల మందికి పైగా చేనేతకారులు ఉంటే ‘నేతన్న నేస్తం’ పేరుతో 81 వేల మందికే 24 వేలు ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేసినందుకా? గత తెలుగుదేశ ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా 124 కులవృత్తుల వారికి రూ.964 కోట్ల విలువైన 341 రకాల పనిముట్లను 90 శాతం సబ్సిడీకి అందిస్తే అలాంటి పథకాన్ని రద్దు చేసినందుకా? ఎప్పటి నుంచో బీసీల అధీనంలో ఉన్న అసైన్డ్ భూమి 8వేల ఎకరాలను సెంటు స్థలం పేరుతో బలవంతంగా గుంజుకొన్నందుకా? డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ నోటిఫికేషన్లను, ఇతర ఖాళీలను భర్తీచేయకుండా బీసీ యువతను రోడ్డున పడేసినందుకా? బీసీ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య (రూ.10లక్షల ఆర్థిక సాయం), విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను రద్దు చేసినందుకా? ‘నాడు–నేడు’ పేరుతో రాష్ట్ర విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసినందుకా? ఇసుక పాలసీని రద్దు చేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడవేసినందుకా?... ఎందుకు, ‘జయహో బీసీ’ సభ?

రాష్ట్ర యూనివర్శిటీల్లో దాదాపు పది యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్లుగా జగన్ సామాజిక వర్గం వారినే నియమించుకొన్నారు. బీసీలు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లుగా పనికిరారా? ప్రభుత్వ సలహాదారులలో ఎంత మంది బీసీలు ఉన్నారో చెప్పగలరా? వెయ్యికి పైగా నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో చెప్పగలరా? తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో టీటీడీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇవ్వగా, జగన్ రెడ్డి టీటీడీ బోర్డ్ మొత్తాన్ని తన సామాజిక వర్గంతో నింపింది. ప్రభుత్వ న్యాయవాదులతో సహా రాష్ట్రంలోని అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను నియమిస్తే జగన్ ప్రభుత్వం వాటిని మొత్తం రెడ్లతో నింపింది.

బీసీలపై ఉక్కుపాదం మోపుతూ, వారి హక్కులు కాలరాస్తూ, ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులుగా మచ్చలేని జీవితం గడిపిన బీసీ నాయకుల ఇళ్లపైకి అర్ధరాత్రి వందలమంది పోలీసులను పంపించి వారిని దొంగల్లాగా బయటకు లాక్కొస్తూ, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ, వారి ఇళ్లను కూలగొట్టి ఆస్తులను ధ్వంసం చేస్తూ, మూడున్నరేళ్లలో 26మంది బీసీ నేతలను హతమార్చి ఇంకా వారిని ఏదో ఉద్ధరించినట్లు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ సభ నిర్వహించడం జగన్రెడ్డి వంచనకి నిలువెత్తు నిదర్శనం.

యనమల రామకృష్ణుడు

(టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు)

Updated Date - 2022-12-07T01:01:00+05:30 IST