ప్రపంచం ముందు పరువు పోగొట్టుకున్నాం!

ABN , First Publish Date - 2022-11-23T01:14:50+05:30 IST

ఐక్యరాజ్యసమితిలోని ‘మానవ హక్కుల మండలి’ 193 దేశాలలో పౌర, మానవహక్కుల పరిస్థితిపై అయిదేళ్లకొకసారి సమీక్ష జరుపుతుంది. మానవ హక్కుల మండలిలో ఉన్న 43 దేశాలు, ఐక్యరాజ్యసమితిలో...

ప్రపంచం ముందు పరువు పోగొట్టుకున్నాం!

ఐక్యరాజ్యసమితిలోని ‘మానవ హక్కుల మండలి’ 193 దేశాలలో పౌర, మానవహక్కుల పరిస్థితిపై అయిదేళ్లకొకసారి సమీక్ష జరుపుతుంది. మానవ హక్కుల మండలిలో ఉన్న 43 దేశాలు, ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్న 193 దేశాలు సమర్పించిన ఆయా దేశాలలోని మానవ హక్కుల పరిస్థితి నివేదికలపై సమీక్ష చేస్తాయి. సభ్య దేశాల నుంచి మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రజాస్వామిక వాదులు హక్కుల పరిస్థితిపై పొందుపరచిన నివేదికపై ఈ సమీక్షలు ఉంటాయి. ఈ ఏడాది నవంబరు 10వ తేదీన మూడున్నర గంటల పాటు భారతదేశంలోని హక్కుల పరిస్థితిపై సమీక్ష జరిగింది.

ఈ సమీక్షలో భారత అటార్నీ జనరల్‌ తుషార్‌ మెహతా నాయకత్వంలో పదిమంది సభ్యుల భారత బృందం పాల్గొన్నది. సమీక్షలో ఎత్తిచూపిన మానవ హక్కుల ఉల్లంఘన అంశాలపై ఈ బృందం వివరణలు ఇస్తూ జవాబులు చెప్పింది. గత మూడు తడవల సమీక్షల్లో చేసినట్టుగానే ఈసారి కూడా నిస్సిగ్గుగా అసత్యాల చిట్టా విప్పి ప్రపంచ వీక్షకుల ముందు పెట్టింది. అమెరికా ప్రతినిధి మన దేశంలో ‘ఉపా’ చట్టం అమలు తీరును ప్రశ్నించారు. ఇక్కడి మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, జర్నలిస్టులను అక్రమంగా జైళ్లలో పెట్టి మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న వైనాన్ని ఎత్తి చూపారు. ఈ విషయంపై కెనడాతో సహా యూరోపియన్‌ దేశాలన్నీ భారత్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. భారత దేశం ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒప్పందాలన్నింటినీ తుంగలో తొక్కి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించాయి. మానవ హక్కుల రక్షణ కార్యకర్తలకు (హ్యూమన్‌ రైట్స్‌ డిఫెండర్స్‌) రక్షణ కల్పించే విషయంలో భారత్‌ పూర్తిగా విఫలమైందనీ, గత సమీక్షల సందర్భంలో మానవ హక్కుల మండలికి భారత్‌ ఇచ్చిన హామీలను అమలుపరచలేదని చాలా దేశాలు అభిప్రాయపడ్డాయి. లాటిన్‌ అమెరికన్‌ భాగంలోని చిన్న దేశాలైన కోస్టారికా, క్యూబా, మెక్సికో, సౌత్‌ జార్జియా, వెనిజులా, బ్రెజిల్‌, హైతీలు కూడా ఈ విషయంలో భారత్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా భారత్‌ మానవ హక్కుల కార్యకర్తల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు చేసి అమలులోకి తేవాలని కోరాయి.

విదేశాల నుంచి ప్రభుత్వేతర సంస్థలకు అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన చట్టం (ఎఫ్.సి.ఆర్.ఎ) విషయంపై కూడా చాలా చర్చ జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక సమస్యలపై ప్రజలతో పనిచేస్తున్న సంస్థలపై నిర్బంధం అమలవుతున్నదని, విదేశాల నుంచి నిధులు పొందే విషయంలో అడ్డంకులు కలిపిస్తూ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్నదని పలు దేశాలు ఎత్తి చూపాయి. ఐరిష్‌ దేశ ప్రతినిధి ఈ విషయంలో ఇంకా లోతుగా విశ్లేషణ చేస్తూ, చట్టాన్ని సులభతరం చేస్తానన్న భారత్‌, ఎఫ్‌సిఆర్‌ఏ చట్టాన్ని ఇంకా బలోపేతం చేసిందని, ఆరువేల ప్రభుత్వేతర సంస్థల లైసెన్సులను రద్దు చేసిందని, ఇంకా చాలా సంస్థలు రిజిస్ట్రేషన్‌ అనుమతుల కోసం వేచి చూస్తున్నాయని వివరించారు. ఈ అంశంపై భారత ప్రతినిధుల బృందం నాయకుడు జవాబిస్తూ– విదేశీ నిధులతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించే కొన్ని సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోవడం లేదని, వాళ్ల కార్యక్రమాలు దేశ సంస్కృతికి, ప్రతిష్టకు భంగకరంగా ఉంటున్నాయని, అందువల్లనే వాటి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ఇంకా వ్యవహరిస్తున్నదని అన్నారు. ‘ఉపా’ చట్టం గురించి మాట్లాడుతూ దేశంలో తలెత్తుతున్న విధ్వంసం, టెర్రరిస్టు కార్యక్రమాలను అదుపు చేయడానికే ఈ చట్టాన్ని వాడుతున్నామని, దీనితోబాటు నేషనల్‌ సెక్యూరిటీ ఆక్ట్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ చట్టాలు కూడా దేశ సమైక్యత, భద్రత కోసమే వాడుతున్నామని, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన జాగ్రత్తలు ఈ చట్టాలలోనే పొందుపరచి ఉన్నాయని, దేశ భద్రత, సమైక్యత విషయంలో రాజీపడదల్చుకోలేదని అన్నారు.

చాలా యూరోపియన్‌ దేశాలు భారత్‌లో భావ ప్రకటన హక్కు, సమావేశాలు నిర్వహించుకునే అంశాలపై అభిప్రాయాలు తెలిపాయి. లిథూనియా భావప్రకటనపైన, శాంతియుతంగా ధర్నాలు నిర్వహించుకునే విషయంలోనూ అడ్డంకిగా ఉన్న చట్టాలను సమీక్షించుకోవాలని కోరింది. చెకొస్లోవియా రాజద్రోహ నేరం, నేరస్మృతి లాంటి చట్టాలు అంతర్జాతీయ చట్టాల వెలుగులో ఉండాలని కోరింది. గ్రీస్‌ జర్నలిస్టులకు, పౌరసమాజంలో కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు తగినంత వెసులుబాటు ఉండాలని అభిప్రాయపడింది. జమ్మూ కశ్మీర్‌లో చాలాకాలం ఇంటర్‌నెట్‌ నిలిపివేయడం విషయంలో చాలా దేశాలు భారత్‌ను విమర్శించాయి. ఈ స్పందనలకు భారత ప్రతినిధి సమాధానం చెప్తూ, భారత రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించినప్పటికి సహేతుకమైన అజమాయిషీ పెట్టవలసి వస్తుందని, ఈ ఆంక్షలు అంతర్జాతీయ ప్రకరణలోని పౌర, రాజకీయ హక్కుల చట్రంలోకి లోబడే ఉన్నాయని తెలిపారు. తన వాదనకు సమర్థనగా కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలను ఉటంకించారు.

మతమార్పిడి, మైనార్టీలపై అణచివేత, సామూహిక దాడులు వంటి అంశాలపై కూడా చాలా దేశాలు తీవ్రంగా స్పందించాయి. మహిళలపై అత్యాచారాలు, వారి అక్రమ రవాణా, బాలకార్మికుల పరిస్థితి తదితర అంశాలపై భారత్‌ చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా లేవని, ఇంకా చాలా నిబద్ధతతో వ్యవహరించాలని అన్నాయి.

60కి పైగా దేశాలు ‘చిత్రహింసల నిరోధక ఒడంబడిక’ విషయాన్ని ప్రస్తావించాయి. గత మూడు విడతలలో జరిగిన సమీక్షల్లో ఈ విషయాన్ని పలు దేశాలు ఎత్తి చూపాయి. భారతదేశం ఐక్యరాజ్యసమితిలో ఈ ఒడంబడికపై సంతకం చేసింది గానీ, అందుకు అనుగుణంగా పార్లమెంటులో చట్టం ఇంకా చేయలేదు.

ఐక్యరాజ్యసమితికి సమర్పించిన నివేదికలోని హక్కుల అంశాలన్నీ భారత రాజ్యాంగంలో నిర్దేశించిన గౌరవంగా జీవించే హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, జీవనోపాధుల రక్షణ చట్రంలోనివే. భారత ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఐక్యరాజ్యసమితి–మానవ హక్కుల మండలికి సమర్పించిన నివేదికలో హక్కుల అమలుకు సంబంధించిన 122 అంశాలను ప్రస్తావించి, వివరణ ఇచ్చింది. దేశంలో జాతీయ స్థాయిలో 9 మానవ హక్కుల కమీషన్లు, రాష్ట్రాలలో 180 రాష్ట్ర స్థాయి కమీషన్లు పనిచేస్తున్నాయని, ఈ సంస్థలన్నీ పౌరుల హక్కులు ఎప్పటికప్పుడు కాపాడుతున్నాయని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగిస్తుందని భారత ప్రభుత్వం చెప్పుకుంది. కశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘనపై వచ్చిన అభిప్రాయాలపై స్పందిస్తూ రాజ్యాంగ సవరణ తర్వాత కశ్మీరులో ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్న పెద్ద అబద్ధం చెప్పింది.

అంతర్జాతీయంగా దేశంలో హక్కుల అమలు విషయంలో ఇంతపెద్ద ఒత్తిడి వస్తుంటే, హక్కుల సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా మనం కూడా స్థానికంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. భారత ప్రభుత్వం ఐరాస–మానవ హక్కుల మండలిలో చేసిన ప్రకటనలకు, ఒప్పందాలకు అనుగుణంగా చట్టాలు చేసే విధంగా, ప్రజల మానవ హక్కులు కాపాడలనే దిశగా మనం మరింత పని చేయాలి

యస్‌. జీవన్‌కుమార్‌

మానవ హక్కుల వేదిక

Updated Date - 2022-11-23T01:14:55+05:30 IST