విశ్వగురువుకు విషమ పరీక్ష!

ABN , First Publish Date - 2022-11-29T02:23:32+05:30 IST

ప్రపంచానికి విశ్వగురువుగా దేశం మారిపోతోందని వినటానికి మనం బాగా అలవాటు పడిపోయాం. మన కుటుంబ విలువలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రకృతి వైద్యం, గణిత మేధ, యోగ, పొదుపు గుణం, విదేశీ గడ్డపై ఒదిగి ఎదిగే అణకువ..

విశ్వగురువుకు విషమ పరీక్ష!

ప్రపంచానికి విశ్వగురువుగా దేశం మారిపోతోందని వినటానికి మనం బాగా అలవాటు పడిపోయాం. మన కుటుంబ విలువలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రకృతి వైద్యం, గణిత మేధ, యోగ, పొదుపు గుణం, విదేశీ గడ్డపై ఒదిగి ఎదిగే అణకువ... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెరిగిపోతూనే ఉంటుంది. ఇవన్నీ విశ్వగురువు పాత్రకు అవసరమైనవే! జాతి అస్తిత్వానికి గొప్పతనాన్ని ఆపాదించుకునే ఇలాంటి విషయాలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. అంతర్జాతీయంగా మన గురించి గొప్పగా ప్రచారం అవుతున్న ఈ లక్షణాలు నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే మనం అంతర్గతంగా నిగ్గుతేల్చుకోవల్సిన విషయాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కులాల స్థితిగతులు, జనాభా లెక్కలు ఆధారంగా అధికారంలో సముచిత వాటా కోసం పెరుగుతున్న డిమాండ్లను ఎలా పరిష్కరించాలో తెలియని సందిగ్ధంలో విశ్వగురు దేశం ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్న మాట నిజమే. ఎంత గొప్ప రాజ్యాంగమైనా అనర్హులచేతిలో పడితే అధోగతి తప్పదని అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్తులోనే వ్యాఖ్యానించారు. శతాబ్దాలపాటు రాజ్యమేలిన కులవ్యవస్థ, బ్రిటీషు పాలనలో పెరిగిన మతవాద విభజన ధోరణుల స్థానంలో వ్యక్తి శక్తిసామర్థ్యాలను గౌరవించి గుర్తింపునిచ్చే సమాజం ఏర్పాటన్నది రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. దీనికి గండిపడటం రెండో సాధారణ ఎన్నికల నాటికే మొదలైంది. ఎన్నికల్లో కులాల బలాలనుబట్టి టిక్కెట్లను కేటాయించటం, కుల పెద్దలను మచ్చిక చేసుకుని గంపగుత్తగా ఓట్లను పొందటం చూసి 1960ల్లోనే సామాజిక శాస్త్రవేత్తలు కంగుతిన్నారు. అప్పటినుంచి ఇప్పటి దాకా కులం నిర్వహిస్తున్న పాత్ర గురించి మహామహులనదగిన వారు ఎన్నోచోట్ల లోతైన పరిశీలనలు చేశారు. గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాల వారీ పోకడలను ఎన్నిటినో వెలుగులోకి తెచ్చారు. ఆ పరిశీలనల తర్వాత చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కులం పాత్రలేని ఎన్నికలను, రాజకీయాలను భారత్ లో ఊహించలేమన్న నిర్ణయానికి వచ్చేశారు. పరస్పరం పైచేయి సాధించటానికి పెనుగులాడే కులాల వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతోందనీ, కులాలకు అతీతంగా ఏదో ఒక అతివాద భావజాలం చుట్టూ రాజకీయాలు పూర్తిగా కేంద్రీకృతమై ఉంటే మనం ఎప్పుడో నియంతృత్వంలోకి జారుకునే వాళ్లమని సూత్రీకరణలు చేశారు.

ఈ సూత్రీకరణల మంచిచెడులు ఎలా ఉన్నప్పటికీ కులాల జనాభా ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో, చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లు బాగా ఊపందుకుంటున్నాయి. వీటికి తోడు ఇస్లాం–, క్రైస్తవంలోకి మారిన దళితులకు ఎస్సీ కేటగిరిలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండు చాలాకాలం కిందటే మొదలైంది. సుప్రీంకోర్టులో పిటీషన్లు పడ్డాయి. ఈ సమస్యపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. తొలుత పరస్పరం పొసగని ప్రస్తావనలు చేసినప్పటికీ చివరికి మాత్రం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని దళితులకు తప్ప అన్య మతాల్లోకి మారిన వారికి ఎస్సీల కింద రిజర్వేషన్లను ఇవ్వటం సమ్మతంకాదని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటైన జస్టిస్‌ రంగనాథ్‌మిశ్రా కమిషన్ దళిత ముస్లింలు, క్రిస్టియన్లకు ఎస్సీ కేటగిరిలో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సూచించింది. మతం మారిన దళితుల సామాజిక స్థాయి దుర్భరంగానే ఉందనీ విద్య, ఉద్యోగాల్లో పెద్ద మెరుగుదల లేదని పేర్కొంది. సామాజికంగా వారి పట్ల చిన్నచూపు కొనసాగుతోందని చెప్పింది. మత మార్పిడులపై ఎప్పటినుంచో కఠినంగా ఉన్న బీజేపీ ఆ సిఫార్సులను అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఆనాడు ఉన్నది ప్రతిపక్షంలో. ఇప్పుడున్నది అధికార పీఠంపై. అధికారంలో ఉన్నప్పుడు అనేక కోణాలు కనపడతాయి. రాజకీయ లాభనష్టాల తూనికలు ఉంటాయి. అందుకే సమస్యలోని సంక్లిష్టతను అంచనా వేసుకుని విషయాన్ని ఆమూలాగ్రంగా పరిశీలించటానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ వేసింది.

దళిత ముస్లిం,– క్రిస్టియన్ల సామాజిక పరిస్థితులను పరిశీలించటానికి సైద్ధాంతికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కొన్ని వాస్తవాలను ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. దళితుల అణచివేత హిందూ సామాజిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉందని పేర్కొంది. ఇతర మతాల్లో ఈ పరిస్థితి ఉందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఉన్నా నిరూపించటం సాధ్యం కాదని పేర్కొంది. మత మార్పిడులు వందలేళ్ల నుంచి జరుగుతున్నాయనీ ఏదో కాలావధిని పెట్టుకుని అన్యాయాలను పరిశీలించటం అసాధ్యమని స్పష్టం చేసింది. మరోవైపు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న వారి వాదనల్లో కొత్తదనం ఏదీ లేదు. సామాజిక వెలివేతలు, చిన్నచూపులు, అధ్వాన పరిస్థితులు ఆధారంగా రిజర్వేషన్లను కల్పించారు కాబట్టి వాటి కింద ఇంకా నలిగిపోతున్న దృశ్యాలు దేశమంతా ఉన్నాయని వాదించారు. ఈ వాదనను బలపరిచే లోతైన స్టడీలు చాలానే ఉన్నాయి. కొత్త కమిషన్ వేశారు కాబట్టి వాటిని ఇప్పుడు పట్టించుకునే అవకాశాల్లేవు.

ఒక విషయం మాత్రం స్పష్టం. ఏ మతంలోకి మారినా రిజర్వేషన్లు భద్రంగా కొనసాగుతాయనుకుంటే మార్పులు అనూహ్యంగా జరగొచ్చు. విశాల సమూహంలో సమాన గౌరవం, సమాన గుర్తింపు కోసం మనిషిలోని తహతహ ఈనాటిది కాదు. ఈ తహతహే చరిత్రలో అనేక సామాజిక ఉద్యమాలకు ఊతమైంది. ఈ తహతహ ఎక్కడ తీరుతుందని అనుకుంటే అక్కడికి మానవ ప్రవాహాలు చేరుకోవటం సహజం. ఇదొక విశ్వజనీన మానవ స్వభావం. అందుకే మతం మార్పిడులకు దోహదం చేసే పరిస్థితుల్లో పరివర్తన తేకుండా గౌరవం, గుర్తింపు కోసం అట్లా మారితే రిజర్వేషన్లను ఉండవని ధీమాగా చెప్పే పరిస్థితి ఎల్లకాలం ఉండదు.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లల్లో ఊహించని డిమాండ్లు ఇప్పుడెన్నో చూస్తున్నాం. కులాల మధ్య ఇంత పోటీని ఆనాడు ఊహించిన వారి సంఖ్య చాలా స్వల్పం. అభివృద్ధి పరుగులు తీస్తే కులం బక్కచిక్కిపోతుందని ఆనాడు అనుకున్నారు. జరుగుతున్నది పూర్తిగా భిన్నం. పదేళ్లకు ఒకసారి కులాల లెక్కలు తీసి బ్రిటీష్‌ పాలకులు పెద్ద తప్పు చేశారని వాదించే సామాజిక శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. కుల భావనలు పెరగటానికి, కులాల మధ్య పోటీకి ఆనాటి ఆ లెక్కలే కారణంగా చెప్పే సిద్ధాంతాలు చాలానే ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం. బ్రిటీష్‌ పాలకులు మనల్ని ఒక జాతిగా ఎప్పుడూ భావించలేదు. జాతీయతా భావం బలంగా ఏర్పడటానికి కావాల్సిన ఒకే భాష, ఒకే సంస్కృతి, ఉమ్మడి చారిత్రక వారసత్వం, ఏక ప్రాదేశిక విధేయత.. వీటి నుంచి ఉమ్మడిగా పొందే నిరంతరాయ ఉత్తేజం మనకు లోపించిందనే వాళ్లు భావించారు. బహు కులాలు, జాతులు, మతాల సమూహంగానే భారతీయ గడ్డను గణించారు. మత, కుల పరమైన రిజర్వేషన్లను వారు ఆ దృష్టితోనే ప్రవేశపెట్టారు. ప్రత్యేక వర్గాలు మాత్రమే ఓటు వేసే ప్రత్యేక నియోజకవర్గాలను ఆ ఆలోచనతోనే ఏర్పాటు చేశారు.

బ్రిటీష్‌ పాలన ఎన్నడో ముగిసింది. వాళ్లు సృష్టించిన విభజన గీతలు మాత్రం ఇంకా చెదరిపోలేదు. అందుకే 75 ఏళ్ల తర్వాత కూడా కులాల లెక్కలు తేల్చాలనే డిమాండ్‌ బలపడుతోంది. లెక్కలు తేల్చటం కష్టం కాదు. ఆ లెక్కలతో ఎలాంటి సామాజిక వ్యవస్థను నిర్మిస్తామన్నది పెద్ద ప్రశ్న. విద్య, ఉద్యోగ, చట్టసభల పదవులకు కులమే ప్రాతిపదికైతే అది ఎట్లాంటి సౌభృతృత్వానికి దారితీస్తుంది? ఏ సౌహార్దతను నెలకొల్పుతుంది? విద్య, ఉద్యోగ, అధికార పదవులను పొందటానికి కుల కొలమానాలను ఎంత దాకా అనుమతించాలి? ఎక్కడ నిలువరించాలి? ఎంత కాలంలో ఆపాలి. మనుగడకు ప్రాణాధారమైన రంగాలకు కులం సుదీర్ఘకాలం ఆలంబనైతే మన ఆలోచనల్లో విశాల దృక్పథానికి తావుంటుందా? ప్రస్తుతం ఎన్నో కులాల సమాహారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే పెద్ద కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీల పరంగా కాకుండా ప్రతి కేటగిరీలోనూ విడివిడి కులాల సంఖ్యను బట్టి ఉద్యోగ, రాజకీయ పదవులను పంచితే, ఆ ప్రక్రియ నిరవధికంగా కొనసాగితే మన ఆలోచనలు ప్రబలంగా ఆ కులాల పరిధుల్లోనే పరిభ్రమించవా? ప్రస్తుతం అమలుచేస్తున్న 10 శాతం అగ్రకులాల రిజర్వేషన్లకూ ఇదే ప్రాతిపదిక అనుకుంటే విపరిణామం తలెత్తదా? కులవ్యవస్థ కలిగించిన అన్యాయాలపై లోతుగా పరిశీలించినవాళ్లు సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉంది. దేశాన్ని వెనుకపట్టు పట్టించిందనుకున్న సామాజిక వ్యవస్థ మళ్లీ కొత్తరూపంలో పాత సారంతో పునర్జన్మ కోసం పాకులాడటం మనం ఎదుర్కొంటున్న పెను సవాల్‌. మన విశ్వగురు ఇమేజ్‌కు ఇది కఠిన పరీక్ష. ఏ ఐడియాలజీ దీనికి విరుగుడో తేల్చుకోలేని విపత్కర పరిస్థితి ఇప్పటి కఠోర వాస్తవం.

రాహుల్‌ కుమార్‌

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2022-11-29T02:23:35+05:30 IST