పెదాలు దాటని మాటలు

ABN , First Publish Date - 2022-11-25T02:41:13+05:30 IST

ఈఏడాది, ఏప్రిల్ నెల, ఓ సాయంత్రం. హైదరాబాద్లో ఒక సాహిత్య కార్యక్రమం. నా చిన్ననాటి మిత్రుడి తమ్ముడు తన అనుభవాలు వివరించుకున్న, విరచించిన పుస్తకాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకునే అవకాశం...

పెదాలు దాటని మాటలు

ఈఏడాది, ఏప్రిల్ నెల, ఓ సాయంత్రం. హైదరాబాద్లో ఒక సాహిత్య కార్యక్రమం. నా చిన్ననాటి మిత్రుడి తమ్ముడు తన అనుభవాలు వివరించుకున్న, విరచించిన పుస్తకాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకునే అవకాశం. స్వయంగా బతుకు పోరాడిన జీవి అని మిత్రుడి ద్వారా తెలుసుకుని, ఆ పుస్తక ఆవిష్కరణ సభకు వెళ్ళాను. విద్వాంసులు ప్రసంగించారు, నేనూ మాట్లాడాను.

కాని.... ఆ తరువాత మాటలు అర్థం కావడం లేదు. భోజన సమయంలో కూడా అయోమయంగా ఉంటున్నది. నాకేమయింది అంటున్నాను. మాట్లాడి అలసిపోయారేమో అన్నారు నా శ్రీమతి. నోటికి మాటలు రావడం లేదు. కారులో ఇంటికి ఎలా చేరుకున్నానో తెలియదు. ఆ తరువాత ఏమయింది? ఏమో...కొన్ని రోజులపాటు నేనెక్కడున్నాను, ఉన్నానా, ఆ జీవితం ఏ విధంగా నడిచింది, నాకు కష్టాలు ఏమైనా వచ్చాయా..తెలియదు. అమ్మ అనడం తప్ప మరేమీ అనలేను. తనను (శ్రీమతి) కల్యాణి అని అనుకోవడం తప్ప మరేదీ రాదు నాకు.

కడుపులో సూదులు పొడిచారని తెలియదు. కాస్సేపు కాళ్లు పడిపోవడం, వంకర అవడం... జీవితంలో నెలరోజులు శూన్యం. కడుపులో గుచ్చినది ఏమిటో, ఏం చేసారో! హాస్పిటల్, డాక్టర్లు, మందులు తెలియదు. బాగున్నారా... మిత్రుల పలకరింపులు. వారెవ్వరో తెలియటం లేదు.

మార్చు, ఛేంజ్.. చదువుల తల్లి వాగ్దేవి నాకు ఈ రెండు చెప్పింది ముందు. అదొక్కటే మాట. ‘మార్చు’ అంటే కల్యాణికే అర్థం అవుతుంది. దీపం ఆర్పాలన్నా, దీపాలు వెలిగించాలన్నా అదే మాట. ‘లైట్’.. ఆ తరువాత తెలిసింది. లైట్... అంటే చాలు, తీసేయడం. మళ్లీ అదే అంటే మళ్లీ వేయడం. కల్యాణికి మాత్రం పూర్తిగా తెలుస్తున్నది. తిన్నా, నీళ్లు తాగినా, కడిగినా, వస్త్రాలు ఇచ్చినా, మార్చినా, చేర్చినా, తీర్చినా, తీర్చిదిద్దినా, కళ్లతో చెప్పినా... భార్య అయినా అమ్మయైనా తానే. నా అమ్మే ఆమే. అన్నీ తనే, అందరితో మాట్లాడాల్సిందే ఆమెనే. మరి, నవ్వుతూ ఉండడమే కాక మరేమీ లేదు.

‘నవనీతం’.. ఇది రెండో మాట. ఈ మాట నాకు ఏమని, తెలుసో, సొంతంగా పుట్టిందో, తెలియదు. నాకు వచ్చిన, తెలిసిన మాట అదే. అన్నం పెట్టినా, అడిగినా అదే అదే పదం. కల్యాణికి ఏడిచే అవకాశం లేదు. హర్ష నన్ను చూసి తట్టుకోలేకపోయేవాడు. ‘నాన్నను నిలబెట్టే పనిచేయడం తప్ప నీకు మరేమీ లేదు. నిలబడు. పోరాడు. నాన్న మళ్లీ జ్ఞాపకాలు తెచ్చుకోవాలి. అదే నీ కర్తవ్యం’ అని కల్యాణి ధైర్యం ఇచ్చింది. కొడుకు నిలదొక్కుకోవాల్సిందే.

హాస్పటల్ కిటికిలో నుంచి చూస్తే, అది ఏమిటో తెలియదు. కిటికి వెనుక 8 అంతస్తు లున్నాయని, అది కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) అనే ఒక పెద్ద హస్పటల్ అని నాకు 3 నెలల వరకు తెలియదు.

బంధువులు మిత్రులు అంతా నన్ను పడిపోకుండా గట్టిగా పట్టుకున్నారు.. స్కాన్ చేయించడానికి. అసలు స్కాన్ చేయడం సాధ్యమేనా. చాలాసేపు తరువాత చేయగలిగారు. నేను చాలా ఇబ్బందిపడ్డానట. తెలియకపోవడం ఎంతో హాయి కదూ.

విచిత్రం. పెదాలు దాటని భాషలు ఉంటాయని తేలింది. కొన్ని వారాల దాకా నాకు చాలా తెలియదు. అంతకుముందు చేసే పూజలు, స్తోత్రాలు ఎక్కడికి పోయాయో. భగవద్గీత అంటే ఏమిటో చెప్పే టివి ప్రసంగాలు అర్థం కావడం లేదు. భగవంతుడెవరు? ఓ యాభై పుస్తకాలు రచించానని వారు అంటూ ఉంటే అవునా అంటున్నాను. పెదాలు దాటని అక్షరాలు ఇంకా వెతుక్కుంటున్నాయి. మెదడులో పలికెంచే సరస్వతి స్వరం వినపడడం లేదు. మెదడు పనిచేయడం మొదలవుతుందా? రెండు నెలలు దాటిన తరువాత కూడా కొన్ని చిన్నఅక్షరాలు కూడా అర్థం కావడం లేదే!

పెద్ద అక్షరాలు ఒకటో రెండో గుర్తొస్తున్నాయి. కాని చదవలేను. చెప్పలేను. తెలిసినా మాట్లాడలేని శక్తి. ఓ నాలుగు నెలల నాటికి మరికొన్ని అక్షరాలు, పలికిన పదాలు. ఓ రోజు పెద్ద డాక్టరుగారు నన్ను చూడడానికి వచ్చినపుడు కల్యాణి నాలుగు విష్ణు సహస్రనామాలు చెప్పి, చెప్పించడం చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇంకేం.. వస్తుందిలేండి. విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉండండి, అదే సరైన నేర్చుకునే ప్రయత్నం’ అన్నారు. ఎంత ఆశ్చర్యం. కొన్నిపదాలు సొంతంగా నేనే చెప్పలేను. కాని రికార్డు చెప్పే సహస్ర నామాలు కొన్ని చెప్పగలిగితే అదే ఆశ్చర్యం. కొన్ని నెలల దాకా ధ్వనులు వినలేకపోయాను. చిత్రహింస భరించలేను. కాని హాయిగా సాగే మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, విప్రనారాయణ, అప్పుచేసి పప్పు కూడు వంటి సినిమాలు మాత్రమే కాలక్షేపం. స్ట్రోక్ అని తేల్చారు. డాక్టర్ లు బతికించారు. నాకు కాళ్లు చేతులు అన్ని అంగాలు మేలుగానే ఉన్నాయి. కాని ఉండవలసిన ఆలోచనలు, పలుకులు, మాటలు, పెదాలు దాటని అక్షరాల వల్ల మౌని కాకతప్పలేదు. గొంతు విప్పి అరిచే వీల్లేదు. రాయడం సాగదు. పాఠాలు, ఉపన్యాసాలు కొన్నాళ్లు మరిచిపోవలసిందే. పత్రికలు చూడలేను, పుస్తకాలు చదవలేను, ఇంకా మరెన్నో పరిమితులు.

నన్ను బతికించిన వారెవరంటే, రోజూ నాకు కావలసిన చికిత్స చేసిన వారు వైద్యులు. కాని హాస్య నటులే వైద్యులై నవ్వులు పంచారు. యాక్టర్లే, వారే అసలు డాక్టర్లు. ప్రముఖులెవరంటే ‘డాక్టర్’ బ్రహ్మనందం, ‘సర్జన్’ రాజేంద్రప్రసాద్, న్యూరో ఫిజీషియన్ ‘బిత్తిరి సత్తి’ వంటి పెద్దలు నా ట్రీట్ మంట్ నిపుణులు. యాక్టర్లు, కాదు కాదు డాక్టర్లు నన్ను బతికించారు. అంటే డాక్టర్లు కాదని కాదు. ఆ తరువాత దశలో వారి సాయం చాలా గొప్పది.

అమ్మకు ఇతడు తన కన్నకొడుకు అని ఎప్పుడో జ్ఞాపకం పోయింది. ఓ రెండు మూడునెలల నుంచి అమ్మవలెనే కొడుక్కి కూడా ఏమీ తెలియదు. ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి తెలియదు.. ఏ బాధా లేదు. కుమారునికి కొన్ని కొన్ని జ్ఞాపకాలు కొంచెంగా వస్తున్నాయని... అమ్మకు ఇంకా జ్ఞాపకం రావడంలేదు.

అక్కడ... వార్ధక్యంలో, జ్ఞాపకాలన్నీ కోల్పోయిన అమ్మ. ఇక్కడ... ఆ అమ్మ కుమారుని జీవనంలో ఓ నెల, లేదా రెండు నెలలు కాలం ఆగిపోయింది. కాని కల్యాణికి కాలం ఆగిపోలేదు. కష్టమైనా కాదన్నా కాలాన్ని నడిపించక తప్పదు.

ఎంత హాయి. తెలియకపోవడం హాయి అనాలా లేక బాధని అందామా? మా నాన్నగారు పరమపదించడానికి ముందు అమ్మకు అన్నీ తెలుసు. అందుకే బాధపడింది ఆ కష్టాలకు. మా నాన్న మధ్య మధ్య అంటూ ఉండేవాడు... జ్ఞాపకం నాకు శాపమో, వరమో? గుర్తుంచుకోవడం నాకు వరమా. ఒక్కోసారి శాపమే అంటే, మరోసారి కాదనే వారు. నేను ఆలోచించేవాడిని.. వరమా శాపమా? భగవద్గీతలో ఓ దశలో జ్ఞాపకాలు, జ్ఞానం, మరుపు కృష్ణుడు తానే అందరికీ ఇస్తాడు అని చెప్పినట్టు లీలగా గుర్తుంది.

ప్రస్తుతం, ఇప్పుడొక చరిత్ర నడుస్తున్నది, కొంత కొంత తెలిసి వస్తున్న విషయాలు. ఇంకా వచ్చిరాని, వచ్చీవస్తుండి, రాని విషయాలు. అర్థం కాని అక్షరాలు కొన్ని, పదాలు కొన్ని, మాటలు కొన్ని, వచ్చినవి కొన్ని. కాళిదాసు, మహాకవి కన్న ముందు తీవ్ర అమాయకుడు. కొమ్మపైన ఎక్కి దాన్నే నరికే మేధావి. నా మిత్రుడు జి. రాధాకృష్ణ చాలా వ్యంగ్యంతో మాటలు కలిపేవాడు. నేను సెకండ్ హాఫ్లో వచ్చే కాళిదాసునట. అతను మహాఅసాధ్యుడు. కాని నేను ఫస్ట్ హాఫ్ కాళిదాసుగా సగంవత్సరం సాగిపోయింది. సెకండ్ హాఫ్ కాళిదాసు నాలికపై కాళికాదేవి బీజాక్షరాలు రాస్తుంది కదూ. చదవతాను కదూ, చెప్పగలను కదూ?

వేదకల్యాణి చేయూతతో...

మాడభూషి శ్రీధర్

Updated Date - 2022-11-25T02:41:15+05:30 IST