పత్రికల స్థానం పత్రికలదే!

ABN , First Publish Date - 2022-12-16T01:47:09+05:30 IST

‘జాతీయ పత్రికా దినోత్సవం’ (నవంబర్‌ 16) సందర్భంగా ‘ప్రింట్‌ మీడియా’ పలు చర్చలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఇదివరకటికంటే తగ్గిన పత్రికల విస్తృతి...

పత్రికల స్థానం పత్రికలదే!

‘జాతీయ పత్రికా దినోత్సవం’ (నవంబర్‌ 16) సందర్భంగా ‘ప్రింట్‌ మీడియా’ పలు చర్చలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఇదివరకటికంటే తగ్గిన పత్రికల విస్తృతి, ఆ రంగం భవిష్యత్తులపైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ‘మూడో పారిశ్రామిక విప్లవ’మైన ‘డిజిటల్‌ రివల్యూషన్‌’ ఫలితంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాలు వ్యాప్తిలోకి రావటం, దానికితోడు కరోనా వ్యాప్తి... ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాల తర్వాత ప్రింట్ మీడియా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

అంతకంతకూ సర్క్యులేషన్ తగ్గుతూవస్తోన్న వార్తా పత్రికలకు మరలా నిలదొక్కుకునే పరిస్థితులు వస్తాయా? టైప్‌ మిషన్లను కంప్యూటర్లు మింగేసినట్లు, పత్రికా రంగం స్థానాన్ని డిజిటల్‌ పరికరాలు (వెబ్‌, సోషల్‌ మీడియా) పూర్తిగా ఆక్రమిస్తాయా? మన ప్రజాస్వామిక వ్యవస్థలో ‘ప్రింట్‌ మీడియా’ అవసరం సన్నగిల్లిందా? నిజమైన, నిఖార్సయిన పాత్రికేయులు, యాజమాన్యాలు ఈ అవాంఛిత పరిణామాన్ని చూస్తూ ఊరుకోవలసిందేనా?

కరోనా సమయంలో దిన, వార పత్రికలను ప్రజలు చేతితో ముట్టుకోవడానికే భయపడ్డారు. కొత్త పుస్తకాలకూ ఇదే దుస్థితి ఏర్పడింది. అన్ని పత్రికల సర్క్యులేషన్లు, ప్రకటనల రెవెన్యూలు గత మూడేళ్ల కాలంలో (2019–2021) దారుణంగా పడిపోయాయి. స్మార్ట్‌ ఫోను ప్రభావంతో జనం సోషల్‌ మీడియాకు బాగా అలవాటు పడిపోవడంతో ‘ప్రింట్‌ మీడియా’ తీవ్ర సంక్షోభంలో పడింది. నిన్న మొన్నటి వరకు కూడా పత్రికలు దాదాపు ఇదే స్థితిలో కొట్టుమిట్టాడాయి. ఈ ఏడాది మొదటి నుంచి కొంచెం ధైర్యంగా, దర్జాగా ప్రజల చేతిలో దర్శనమివ్వగలుగుతున్నాయి. అలాగని, అవి ఇంకా పూర్తిగా తాము కోల్పోయిన స్థానాన్ని పొందలేదు. కరోనా సమయంలో ఆపేసిన లేదా మూసేసిన టాబ్లాయిడ్స్‌, మేగజైన్స్‌, స్పెషల్స్‌ మళ్లీ తెరుచుకోలేదు. రిపోర్టింగులో ప్రత్యేక విలక్షణ నిష్పాక్షిక పంథా, ఆరోగ్యకరమైన పరిశోధనాత్మకత వంటి ట్రెండ్స్ పూర్తిగా వెనక్కు రాలేదు. కారణం, పాఠకుల ఆదరణ ఉండదన్న అనుమానం.

పుస్తక పఠనం ఈ తరం వారికి అప్రాధాన్యమైన నేపథ్యంలో ‘గ్రంథాలయోద్యమం’ ఎంత కీలకమో, ‘పత్రికల పునరుద్ధరణ’ కూడా అంతే ముఖ్యం. స్మార్ట్‌ లైఫ్‌లో భాగంగా వచ్చిన ఈ ఆధునిక సాంకేతికత (సోషల్‌ మీడియా)కు ప్రజలు అలవాటు పడుతున్న సమయంలో వార్తాపత్రికలకు ఆ మిగిలిన కొద్దిపాటి ఆయువునూ కాపాడేందుకు యాజమాన్యాలు నానా అవస్థలూ పడాల్సి వస్తున్నది. తెలుగులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలావరకు వార్తాపత్రికలు ‘ఈ–పేపర్స్‌’గా మారాయి. కొన్నైతే పూర్తిగా మూతపడ్డాయి. మరికొన్ని పత్రికలు పేజీలు తగ్గించుకున్నాయి. ఆదివారం, ఆధ్యాత్మికం, హెల్త్‌, సైన్స్‌, పిల్లలు... మొదలైన ప్రత్యేక అనుబంధాలను నిలిపివేశాయి. ఏవో కొద్ది పేజీలతో రాజకీయ వార్తలు, విశేషాలనే ప్రచురిస్తూ నెట్టుకువస్తున్నాయి.

వార్తా పత్రికలు పూర్తిగా ‘మటుమాయం’ కాకముందే ప్రజాస్వామిక వాదులు, రాజకీయ వేత్తలు, నిజమైన మేధావులు మేల్కొని వాటి కొనసాగింపు, పునరుద్ధరణల దిశగా సరికొత్త పంథాల్లో పునరావిష్కరణలకు పూనుకోవలసి ఉంది. పత్రికలు ఈ కాలంలో ఎవరికి కావాలి? వాటిని చదివేవారేరి? అనుకొంటే, మనం ఒక చార్రితాత్మక తప్పిదానికి పాల్పడుతున్నట్టే లెక్క. ఎందుకంటే, ఈ డిజిటల్‌ శకంలో కూడా ‘ప్రింట్‌ మీడియా’ విలువ దానికి ఉంది. భౌతిక రూపంలో ఉండటం, దీర్ఘకాలికంగా నిలవగలగటం వంటి అదనపు ప్రత్యేక విలక్షణ ప్రయోజనాలను చాలామంది గుర్తించలేకపోతున్నారు. కాగితం వినియోగం, నిరక్షరాస్యత, ముద్రణ, కొనుగోలు, పంపిణీ, ప్రచురణ అనంతరం మార్పులకు అవకాశం లేకపోవటం వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ సాంప్రదాయిక ప్రజావిశ్వాసం (బ్రాండ్‌), ఇంద్రియ (స్పర్శ) అనుభూతి, సుస్థిర ప్రచారం, పటిష్ట ప్రామాణికత, తక్కువ పోటీదారులు వంటి సౌలభ్యాలూ ప్రింట్‌ మీడియాకు ఉన్నాయి. ప్రచురణ రూపంలో కాగితంపై కొలువుదీరిన అక్షరాలకు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఆహ్లాదభరితంగా చదువుకొనే వెసులుబాటు ఉంటుంది. ఆ మాధ్యమం పట్ల పాఠకులలో ఇప్పటికీ ఒక ఆరాధనా భావం ఉంది. ప్రభుత్వాల పనితనం, మౌలిక సమాచారం, పాలకుల – అధికారుల తీరుతెన్నులు, రాజకీయ పక్షాల లోటుపాట్లు, వివిధ వర్గాల ప్రజల అవసరాలు... ఇటువంటివన్నీ ప్రింట్‌ మీడియాలో అయితేనే మరింత విపులంగా, స్పష్టంగా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది.

దోర్బల బాలశేఖరశర్మ

Updated Date - 2022-12-16T01:47:12+05:30 IST