‘జయహో’ అనగానే బీసీలు పొంగిపోవాలా?

ABN , First Publish Date - 2022-12-07T00:54:00+05:30 IST

రాష్ట్ర అధికార పార్టీ వైకాపా ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని ఈ రోజు విజయవాడలో బహు ఆర్భాటంగా నిర్వహిస్తోంది...

‘జయహో’ అనగానే బీసీలు పొంగిపోవాలా?

రాష్ట్ర అధికార పార్టీ వైకాపా ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని ఈ రోజు విజయవాడలో బహు ఆర్భాటంగా నిర్వహిస్తోంది. మరోవైపు తెదేపా నాయకత్వం అసలు తమ పార్టీయే ‘బీసీల పార్టీ’ అని ప్రచారం చేసుకొంటోంది. ఇంకోవైపు బీజేపీ కూడా బీసీల కోసం పెద్దఎత్తున గాలం విసురుతోంది. ఇక జనసేన నాయకులు కొందరైతే తామే బీసీలమంటూ ప్రచారం చేస్తోంటారు. వీళ్లందరినీ మించి కాంగ్రెస్‌ తమ పార్టీ మొత్తంగానే బలహీన వర్గాలకు అంకితమైనదంటూ ఇల్లెక్కి అరుస్తూంటుంది. ఈ పార్టీలన్నీ బీసీలపైన ఇంత పెద్ద ఎత్తున ప్రేమ ఒలకబోయటానికి ముఖ్యమైన కారణం జనాభాలో వారు 50శాతానికి మించి ఉండటమే. ఎన్నికల్లో గెలిచి, అధికారం చేపట్టాలంటే, అత్యధిక సంఖ్యాకులైన బీసీల ఓట్లను హెచ్చుసంఖ్యలో కొల్లగొట్టవలసిందే.

దండాలూ, దండ ప్రయోగాలే గాక, శుష్క వాగ్దానాలూ, ప్రలోభాలూ, వంచనలూ, భ్రమ కల్పనలు ఇవన్నీ బీసీలను లోబర్చుకునేందుకు ఈ పార్టీల అంబులపొదిలో ఉన్న అస్త్రాలు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలయించినవే. అలాగే కాంగ్రెస్‌తోబాటు, తెలుగుదేశం, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వారసత్వంగా పుట్టుకొచ్చిన వైసీపీ కూడా రాష్ట్రంలో అధికారాన్ని పరోక్షంగా వెలగబెట్టినవే. మరి 75ఏళ్లలో ఈ పార్టీలు తమ పరిపాలనల కాలంలో అమలు జరిపిన పథకాల ఫలితంగా బీసీల వెనుకబాటుతనం రద్దయిపోయి, ఓసీలుగా మారిపోయి ఉండాల్సింది గదా! నలభై సంవత్సరాల కాలంలో బీసీలను బీసీలుగానే ఉంచిన కాంగ్రెస్‌ వారసత్వ పార్టీ వైసీపీ గత మూడేళ్ళ కాలంలో బీసీలను నిధులూ విధులూ లేని కులాల కార్పొరేషన్లకే పరిమితం చేసింది. మరో ఐదేళ్ల కాలం అధికారం కోసం ‘జయహో బీసీ’ అనగానే బీసీలు పొంగిపోవాలా?

బీసీలు సమస్యల సుడిలో ఉన్నారు. సాంఘిక అణచివేత, పీడనలతోబాటు వృత్తులు కోల్పోయి భయంకరమైన నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం వంటి ప్రధాన జీవన రంగాల్లో బీసీల స్థానం నామమాత్రంగానే ఉంటోంది. అన్ని రంగాలనూ శాసించే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేవు. జనాభాలో 50శాతానికి మించివున్న బీసీలకు చట్టసభల్లో మూడో వంతు స్థానాలు మాత్రమే దక్కుతున్నాయి. ఉద్యోగ రంగంలో రాష్ట్రంలో 25 శాతం, కేంద్రంలో 27 శాతం రిజర్వేషన్లు చట్టం ప్రకారం కల్పించినప్పటికీ, ఉన్నత ఉద్యోగాల్లో 10శాతం కన్నా మించి బీసీలు లేరు. ఇక ఉన్నత న్యాయ వ్యవస్థలో ఆ మాత్రం శాతం బీసీలకు ప్రాతినిధ్యం లేదు. ఒక్క మాటలో ఏ జీవన రంగంలోనూ బీసీలకు రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం దక్కడం లేదు. ప్రస్తుత రాష్ట్ర అధికార నాయకత్వం బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తున్నదన్న ప్రచారం ఈ దశాబ్దపు జోకుగా భావించాలి.

వాస్తవానికి నేటి బీసీల తక్షణ కోర్కెలేమిటి– 1) చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, 2) జనగణనతోబాటు బీసీల కులాలవారీ జనగణన, 3) జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, 4) ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, 5) జాతీయ మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా, 6) నామినేషన్‌ పదవుల్లో రిజర్వేషన్లు, 7) సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, 8) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ కేటాయింపుల్లో రైతులకు మొత్తం బడ్జెట్‌లో ఎంత శాతం కేటాయిస్తున్నారో, అదే దామాషా ప్రకారం బీసీలకు కేటాయింపులు, 9) ప్రభుత్వ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్లు, జాతీయ బ్యాంకులు మంజూరు చేసే ఋణాల్లో బీసీలకు 50 శాతం కేటాయింపు, 10) పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వ భూమి, ఆర్థిక తదితరాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అందజేయడం... ఒక్క మాటలో సమస్త జీవన రంగాల్లో ప్రభుత్వం తరఫున అందించే ప్రతి సహాయంలోను రాయితీలోనూ బీసీలకు సామాజిక న్యాయం కల్పించడం. వీటిల్లో ఏ ఒక్కటీ నేడు జరుగనున్న ‘జయహో బీసీ’ ఎజెండాలో లేదు. వాస్తవంలో అమలుకాని ఊకదంపుడు వాగ్దానాలకూ, ‘జయహో’లకూ బీసీలు ఇక ఎంత మాత్రమూ మోసపోరు!

వై.కె.

సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టీస్‌ రాష్ట్ర కన్వీనర్‌

Updated Date - 2022-12-07T00:54:02+05:30 IST