శీతల తుఫానులో ధిక్కార స్వరాలు
ABN , First Publish Date - 2022-12-28T01:27:01+05:30 IST
ఉత్తర భారతదేశం ఇప్పుడు దట్టమైన మంచు గాలుల మధ్య గడ్డకట్టుకుపోయిన వాతావరణంలో వణికిపోతున్నది. స్తంభించిపోయిన దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతావరణాన్ని ఇది తలపిస్తోంది...
ఉత్తర భారతదేశం ఇప్పుడు దట్టమైన మంచు గాలుల మధ్య గడ్డకట్టుకుపోయిన వాతావరణంలో వణికిపోతున్నది. స్తంభించిపోయిన దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతావరణాన్ని ఇది తలపిస్తోంది. ఉదయాస్తమయాల వేళ పేరుకుపోయిన పొగ మంచు మధ్య రహదారి కనపడనట్లే 2023 సంవత్సరంలో ఏమి జరుగుతుందో అన్న విషయంలో కూడా స్పష్టత కనపడడం లేదు. ముఖ్యంగా దేశమంతటా నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపి ఒక శీతల తుఫానులా చుట్టుముడుతూ కల్పిస్తున్న బీభత్స వాతావరణంలో కూడా దేశంలో ఎక్కడో ఒక చోట ధిక్కార స్వరాలు ఏదో రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.. దేశమంతటా తనదైన శైలిలో కలయ తిరుగుతూ, లేవనెత్తాల్సిన ప్రశ్నలు లేవనెత్తుతూ వార్తల్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పదధ్వనులు, బిహార్‌లో బిజెపి ప్రభుత్వాన్ని వదిలించుకుని మహాకూటమి సర్కార్ ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ప్రతిఘటనా గర్జనలు, ఢిల్లీలో బిజెపి ఉధృతిని అడ్డుకుని, గుజరాత్‌లో కూడా ఉనికిని చాటుకున్న అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తుతున్న ప్రశ్నలు, తన ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ఏర్పర్చి తనను తక్కువ అంచనా వేయకూడదని కేసీఆర్ పంపుతున్న వినూత్న సంకేతాలు, తమను అంతం చేయడం అంత సులభం కాదని ఉప ఎన్నికల ఫలితాలతో తేల్చిన ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ తదితరుల గళాలు, వీటన్నిటితో పాటు దేశంలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, తటస్థుల నిరసనలు విస్మరించగదిన పరిణామాలు కావు.
రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ వీర విజృంభణను దేశం చవి చూచింది. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి అయిదు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) విజయం సాధించింది. యూపీ, బిహార్, ఉత్తరాఖండ్, అస్సాం, హర్యానా, త్రిపుర రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా బిజెపిది పై చేయిగా కనపడింది. హిమాచల్ ప్రదేశ్‌లో తప్ప ఎక్కడా బిజెపి అధికారం కోల్పోలేదు. 2023లో కూడా పది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి, తెలంగాణలో బిఆర్ఎస్ నుంచి అధికారాన్ని కైవశం చేసుకునేందుకు బిజెపి ఉవ్విళ్లూరుతోంది. ఈ విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకునేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయనడంలో సందేహం లేదు కనుక బిజెపి తన పూర్తి దృష్టినీ ఇప్పుడు ఈ రాష్ట్రాలపై కేంద్రీకరించింది.
గత 8 సంవత్సరాల్లో ప్రతిపక్షాలు నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపితో హోరాహోరీగా పోరాడాయి. 2014లో బిజెపి కేవలం ఏడు రాష్ట్రాల్లో, కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. 2022 డిసెంబర్ నాటికి బిజెపి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. వీటిలో పది రాష్ట్రాల్లో బిజెపి స్వంతంగా అధికారం చేజిక్కించుకుంది. ఈ 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ పది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లోనే అధికారంలో ఉన్నది. 2024 నాటికి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బిజెపితో తలపడేందుకు సన్నద్ధం కాగలుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే కాంగ్రెస్ విముక్త భారత్ అంత తేలిగ్గా జరగదని ఆ పార్టీ 2022లో నిరూపించుకోగలిగింది. హిమాచల్ ఎన్నికల ఫలితాలను బట్టి చెప్పడం కాదు కాని 2022లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తన అంతర్గత సంక్షోభాన్ని దాదాపు నివారించుకోగలిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడంతో ఒక రకంగా నాయకత్వ సమస్యపై చర్చ లేకుండా చేసింది. మరో వైపు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో పార్టీకి అసలైన నేత తానే అని నిరూపించుకున్నారు. రాజకీయ విజయాల సంగతి అటుంచితే ఇవాళ దేశమంతటా భారత్ జోడో యాత్ర ఒక విస్మరించలేని పరిణామంగా మిగిలిపోయిందనడంలో సందేహం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే కాదు. ఒక తటస్థ వర్గమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఒక రకంగా వారికి రాహుల్ జోడో యాత్ర ఒక వేదికను ఇచ్చింది. నర్మదా బచావో ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్, రైతుల ఆందోళనా సారథి యోగేంద్ర యాదవ్, సమాచార హక్కుల కార్యకర్త అరుణా రాయ్, లాల్ కృష్ణ ఆడ్వాణీ సలహాదారుగా ఉన్న సుధీంద్ర కులకర్ణి, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ రాజన్, ప్రముఖ దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్, దళిత కార్యకర్త భంవర్ మేఘవంశీ, గాంధేయవాది పి.వి. రాజగోపాల్, ప్రముఖ విద్యావేత్త శైల్ మాయారామ్, ఛత్తీస్‌గఢ్ సామాజిక కార్యకర్త అలోక్ శుక్లా, తెలంగాణలో దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, అమోల్ పాలేకర్, కమల్ హాసన్‌తో పాటు అనేక మంది కళాకారులు, రచయితలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇలాంటి వారినే కొద్ది రోజుల క్రితం బిజెపి అగ్రనేతలు ‘తుక్డే తుక్డే గ్యాంగ్’గా అభివర్ణించారు. వారంతా ఇవాళ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనడంతో ఒక తటస్థ, ప్రత్యామ్నాయ భావజాలాన్ని కాంగ్రెస్ భావజాలంతో ఆయన మమేకం చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ బిజెపి ఎందుకో తనదంటూ ఒక ప్రత్యేకమైన, ప్రగతిశీలంగా ఆలోచించే మేధో వర్గాన్ని రూపొందించుకోలేకపోయింది.
నిజానికి భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రశ్నకూ, శాస్త్రీయ ఆలోచనా విధానానికీ, హేతుబద్ధతకూ స్థానం లేకుండా పోలేదు. కాని ఈ సంప్రదాయాన్ని విశ్వసించే బిజెపి ప్రాచీనతకూ, ఆధునికతకూ మధ్య వారధిని నిర్మించలేకపోయింది. మూఢ విశ్వాసాలు, గుడ్డిగా వాదించే భక్తుల్నీ, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడాన్ని, బూటకపు ప్రచారాలు చేసేవారిని ప్రోత్సహించడం మూలంగా మధ్యయుగాల్లోకి నెట్టివేసే ప్రయత్నాలు మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పెరిగిపోతున్నాయడంలో సందేహం లేదు. రాహుల్ జోడో యాత్ర ఒకరకంగా 1999 ఫిబ్రవరిలో అటల్ బిహారీ వాజపేయి తలపెట్టిన లాహోర్ బస్ యాత్రను తలపిస్తోంది. ఈ యాత్రలో కపిల్‌దేవ్, దేవానంద్, శతృఘ్న సిన్హా, జావేద్ అఖ్తర్, మల్లికా సారాభాయ్, కుల్దీప్ నాయర్ వంటి క్రీడాకారులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులతో పాటు ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. లాహోర్‌లో జరిగిన అద్భుత కార్యక్రమాన్ని ప్రముఖ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూతురు సలీమా హష్మీ రూపొందించారు. బహుశా వాజపేయి సంప్రదాయాన్ని గుర్తు చేసేందుకే రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలో అటల్ బిహారీ వాజపేయి సమాధిని కూడా సందర్శించారేమో. ఆ రకంగా వాజపేయిని అభిమానించే ఒకప్పటి బిజెపి అభిమానుల్నీ ఆయన ఆకట్టుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, వసుదైవ కుటుంబకాన్ని ఉపన్యాసాల్లో మాత్రమే చెప్పే బిజెపి భిన్న స్వరాల్ని ఎందుకు ఆకట్టులేకపోతున్నదో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అకాడమీలను, వ్యవస్థల్నీ స్వాధీనం చేసుకోవడంపై ఉన్న దృష్టి సమాజ హితం కోరే ప్రగతిశీల మేధావుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ, తటస్థుల్నీ ఆకట్టుకోవడంపై ఎందుకు లేదో అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో భక్తిగీతాలు, వందిమాగధ ఆలాపనలూ పారవశ్యం కలిగించవచ్చు కాని ప్రశ్నించే గొంతులు వినబడకపోతే ప్రజాస్వామ్య ఉనికే ప్రశ్నార్థకమవుతుందని బిజెపి వర్గాలు గ్రహించలేకపోతున్నాయి.
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర తక్షణ రాజకీయ ప్రయోజనాలు ఇవ్వలేకపోవచ్చు కాని ఒక రకంగా ప్రత్యామ్నాయ ఆలోచనా విధానంపై చర్చ రేకెత్తించింది. ఇది నేటి కాలపు ప్రజాస్వామిక చారిత్రక అవసరం అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. రాహుల్ విషయం అటుంచితే బిజెపిని ఢీకొనేందుకు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తులు సమాయత్తమవుతున్నాయి. మమతా బెనర్జీ తన రాష్ట్ర ప్రస్తుత అవసరాలు, బలహీనతల రీత్యా మౌనం పాటించి ఉండవచ్చు. నితీశ్ కుమార్, కేసీఆర్, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్ తదితరులకు బిజెపిని ఢీకొనడం మినహా వేరే మార్గం లేదు. బిహార్, మహారాష్ట్రలో బిజెపిని ఢీకొనాలంటే సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టే కూటమి లేకుండా సాధ్యపడదని ప్రతిపక్షాలు గ్రహించాయి. కేసిఆర్ భారత రాష్ట్ర సమితి శంఖారావం అయితే పూరించారు గానీ ఆయన రథం ఎక్కడికి ప్రయాణిస్తుందో, ఎంతమందిని ఎక్కించుకోగలుగుతుందో కొత్త ఏడాదే తేలుతుంది. 2024 ఎన్నికలకు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక పక్షాలు ఏ రూపంలో సమ్మిళితమవుతాయో, ఏ వాతావరణాన్ని కల్పిస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం.
కొత్త ఏడాదిలో మరింత ఉధృతంగా, విశృంఖలంగా సర్వశక్తులూ కూడగట్టుకుని, సామదానభేదదండోపాయాలతో వ్యవహరించేందుకు సిద్ధమన్న సంకేతాల్ని బిజెపి ఇప్పటికే పంపింది. సిబిఐ, ఈడీలతో పాటు అనేక వ్యవస్థల్నీ బిజెపి పెద్ద ఎత్తున ఉపయోగించుకుని ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ సేన సిద్ధమవుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలుపై సిబిఐ, ఈడీల పంజా మరింత విస్తృతం కానున్నదనడంలో సందేహం లేదు. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై పాత అవినీతి కేసులు మళ్లీ తెరిచారు. ఇవాళ ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలపైనే 95 శాతం పైగా సిబిఐ కేసులున్నాయి. ప్రతిపక్షాలే కాదు, అనేక ఇతర వర్గాలు కూడా ఏజెన్సీల దాడులకు భయోత్పాతానికి గురవుతున్నాయి. ‘అన్నీ పణంగా పెట్టాను. ఇక ఆగే ప్రసక్తే లేదు, విరిగి పడొచ్చు, ఒరిగి పడొచ్చు కాని తలవంచే ప్రసక్తే లేదు’ అన్న అటల్ బిహారీ వాజపేయి వాక్యాలే నేడు ప్రత్యామ్నాయ శక్తులకు స్ఫూర్తి కావాలి.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)