‘సంవేదన’ శీలి, ఆ ‘సవ్యసాచి!’
ABN , First Publish Date - 2022-11-24T02:41:00+05:30 IST
తెలుగు కాల్పనిక సాహిత్యానికి చలం–కుటుంబరావు, కవిత్వానికి శ్రీశ్రీ–తిలక్ ఉమ్మడిగా చేసినంత సేవ, విమర్శ రంగానికి రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక్కరే చేశారు...
తెలుగు కాల్పనిక సాహిత్యానికి చలం–కుటుంబరావు, కవిత్వానికి శ్రీశ్రీ–తిలక్ ఉమ్మడిగా చేసినంత సేవ, విమర్శ రంగానికి రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక్కరే చేశారు. కథానిక, విమర్శ, పత్రికారచన, అనువాదం, బాలసాహిత్యం తదితర రంగాల్లో రా.రా. ఎన్నదగిన కృషి చేశారు. కుహనా సాహిత్య విమర్శ ప్రమాణాలను అక్షర ప్రపంచంలోంచి తరిమికొట్టడమే కాకుండా, సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను పొట్టవిప్పి చూపించారు. "సాహిత్యం ఒక స్వతంత్ర సామాజిక శక్తి. అది ఏ రాజకీయాలకూ పరిచారిక కాకూడదు" అని ఎలుగెత్తి చాటిన రా.రా., సాహిత్యంలో అంటరానితనం పాటించే ఛాందసుడూ కాడు, మడిగట్టుకున్న శ్రోత్రియుడూ కాడు. అభ్యుదయ సాహిత్యపత్రిక అంటే ఎలావుండాలో ‘సంవేదన’ ద్వారా చూపించి, తెలుగునాట మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకు కనీస ప్రమాణాలు నెలకొల్పినవాడు. రాజకీయ విధానాల విషయంలో వాదోపవాదాలూ, చర్చోపచర్చలూ చేసే పత్రికలున్నట్టే, సాహిత్య సిద్ధాంతాలను కాచివడబోసే సాహిత్య పత్రికలు సైతం ఉండాలని భావించిన రా.రా., కొందరు మిత్రులతో కలిసి, 1968 ఏప్రిల్‌లో ‘సంవేదన’ను త్రైమాసిక పత్రికగా మొదలుపెట్టారు. ‘సంవేదన’లో అచ్చయిన రా.రా. సాహిత్య వ్యాసాలు ‘సారస్వత వివేచన’ పేర గ్రంథంగా వెలువడ్డాయి. ఉత్తమ సాహిత్య విమర్శ ప్రమాణాలను నెలకొల్పిన అతి కొన్ని పుస్తకాల్లో ఇది ఒకటి. ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందింది. దాదాపు పాతికేళ్ళపాటు అనువాద రంగంలో కృషి చేసిన రా.రా. రచన ‘అనువాద సమస్యలు’ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందింది. ‘సందేశం’ పత్రికలో రా.రా. రాసిన సుదీర్ఘ వ్యాసం ‘వ్యక్తి స్వాతంత్య్రం – సమాజ శ్రేయస్సు’ స్వతంత్ర గ్రంథంగా వెలువడింది. ‘వీచిక’, ‘అభ్యు దయ’ తదితర పత్రికల్లో శిల్పప్రాముఖ్యం గురించీ, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య తత్వం గురించీ వ్యాసాలు వెలువరించారు రా.రా. కడప జిల్లాకు పరిమితమైన పత్రికగా మొదలైన ‘సవ్యసాచి’ సంపాదకుడిగా రా.రా.ను జర్నలిజం ముగ్గులోకి దింపింది గజ్జెల మల్లారెడ్డే. ఆ పత్రికలో ప్రధానంగా రాజకీయ, సామాజిక సమస్యలపై రాసిన రచనలే వచ్చేవి.
అభ్యుదయ రచయితల సంఘం నిద్రాణావస్థలో ఉన్న ఆ రోజుల్లో ‘సవ్యసాచి’తో మొదలయిన కదలిక, ‘సంవేదన’తో అత్యున్నత ప్రమాణాన్ని అందుకుంది. దానికీ, దీనికీ కూడా రా.రా.యే సంపాదకుడు కావడం యాదృచ్ఛికం కాదు! ముఖ్యంగా, ‘సంవేదన’ ఆంధ్రప్రదేశమంతటా ఓ చైతన్య తరంగాన్ని ప్రసరింపచేసింది. ‘సంవేదన’లో పుట్టపర్తి, కొడవటిగంటి, కె.వి.రమణారెడ్డి, ఎస్.వి.ఎస్.రావు, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరాం, శ్రీపతి, ఆర్వియార్, వరవరరావు, నవీన్, వి.సి.మౌళి, చేకూరి రామారావు, మిరియాల రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ తంగిరాల (సుబ్బారావు) తదితరుల రచనలు కనిపిస్తాయి. వాళ్ళందరూ ఆనాటి సాహిత్యాకాశంలో తళతళమెరిసే తారలు. ‘చుక్కలు–చీకటి’, ‘నీతి గానుగు’ లాంటి చక్కని కథలు రాసిన రా.రా.కు కథానిక ప్రక్రియమీద పట్టే కాకుండా, ప్రత్యేకమైన అభిమానం కూడా ఉందనిపిస్తుంది. సొదుం జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’పై ‘సంవేదన’లో చేసిన ప్రయోగం, తర్వాతి రోజుల్లో వర్క్‌షాప్స్ లాంటి ప్రయత్నాలకు స్ఫూర్తినిచ్చింది. జయరాంతో పాటు మరో ముగ్గురు (రా.రా.తో సహా!) అదే కథను తిరగరాసి, అన్నింటినీ కొడవటింటి కుటుంబరావు చేత విశ్లేషింపచేశారు. కుటుంబ రావు ఆ కథానికలపై చేసిన విశ్లేషణ కొత్త రచయితలకు బాలశిక్షలాంటిది!
పుస్తక సమీక్షలంటే రచయితల భుజకీర్తులు సవరించి, ఆయారచనల అమ్మకాలకు ఉపయోగపడే వాణిజ్య ప్రకటనలు కావనీ– రచనలోని తప్పాతాలూ ఎగరబోసి, గట్టిగింజల్ని మాత్రమే పాఠకుడి కందించి, అతగాడి విలువయిన సమయాన్ని ఆదాచేసే ప్రక్రియ అనీ రుజువు చేసినవాడు రా.రా. ‘మహానుభావుడు చలం’ శీర్షికతో సృజన వెలువరించిన ‘చలం ప్రత్యేక సంచిక’ను రా.రా. 1968 జులై ‘సంవేదన’లో సుదీర్ఘంగా– 24 పేజీల మేరకు– సమీక్షించారు. అందులో, కొత్త తరం విమర్శకులు చలాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నించినందుకు హర్షం ప్రకటిస్తూనే, వారి అకడమిక్ విమర్శ పద్ధతిని ఘాటుగానే విమర్శించారు. సాహిత్య పత్రిక పాఠకులపట్ల రా.రా. ఆశలూ అంచనాలూ చాలా పెచ్చు స్థాయిలో వుండేవి; అందుకే ‘సంవేదన’ సంచికలు ఆ స్థాయిలో వుండేవి! ముందే చెప్పినట్లు రాచమల్లు రామచంద్రా రెడ్డి తన సృజనాత్మక శక్తి నంతటినీ, విమర్శ రంగానికే ధారపోసినప్పటికీ, మన సాహిత్య విమర్శ రంగం ఇప్పటికీ సంస్కారపరంగా దీనావస్థలోనే కొనసాగుతోంది. వ్యక్తిగత సంబంధాల ప్రభావపరిధిలోనే విమర్శ రంగం గింగిరాలు తిరుగుతోంది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాల ప్రాతిపదికగా రచయితలకూ–విమర్శకులకూ మధ్య ‘క్విడ్ ప్రో కో’ లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయి. అసహనం ప్రాతిపదికగా రచయితలపై దుమ్మెత్తిపోయడానికి, మన విమర్శకులు తెగబడుతూనే ఉన్నారు. రచయిత యోగ్యత, దక్షత, ప్రతిభాపాటవాలపై తీర్పులు చెప్పడానికి పూనుకునే విమర్శకులకు అవసరమయిన ఆత్మవిమర్శ దృష్టి కొరవడుతూనే వుంది. ఒక్కమాటలో చెప్తే, మన విమర్శ రంగంలో నిర్మమత్వంతో నిర్మితమయిన ప్రమాణాలు ఇప్పటికీ రూపుదిద్దుకోనేలేదు. ఇందుకేనా రా.రా.లాంటి ప్రతిభావంతులు విమర్శ రంగానికి తమ సృజనాత్మక శక్తిని ధారపోసింది?
కేంద్ర సాహిత్య అకాడమీ–యోగివేమన విశ్వవిద్యాలయం–బ్రౌన్ గ్రంథాలయాల ఉమ్మడి నిర్వహణలో, ఈ నెల 24న కడపలో జరిగే రా.రా. శతజయంతి ఉత్సవాల్లోనైనా, ఈ ప్రశ్న ప్రధానంగా ముందుకొస్తే బావుండును!
మందలపర్తి కిషోర్