పుణ్యభూమిలో అన్నమో రామచంద్రా!

ABN , First Publish Date - 2022-12-16T01:41:24+05:30 IST

స్వాతంత్ర్య భారతదేశంలో ఆకలితో అలమటించే అనాథలు ఉండేందుకు వీలులేదు. ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో ఉండకూడదు...

పుణ్యభూమిలో అన్నమో రామచంద్రా!

స్వాతంత్ర్య భారతదేశంలో ఆకలితో అలమటించే అనాథలు ఉండేందుకు వీలులేదు. ఏ ఒక్కరూ ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఉన్నారంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్టే. జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తప్పనిసరిగా అమలు పరచాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ఒక దేశప్రగతిలో ప్రజారోగ్యం ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకు సరైన పోషక విలువలు కలిగిన సంతులిత ఆహారం అత్యంత ప్రధానం. మన దేశంలో ఎంతమంది ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందుతుంది అనేది ప్రశ్న.

ప్రపంచ ఆకలి సూచీలో గత ఎనిమిదేళ్ళుగా భారతదేశ ర్యాంకు అధోపాతాళానికి పోతున్నది. వజ్రోత్సవాలు జరుపుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు ‘అన్నవస్త్రాలు అడిగితే ఉన్న వస్త్రాలు పోయినట్లు’ 2014లో ఆకలి సూచీలో 55వ స్థానంలో ఉన్న మన దేశం 2022లో 107వ స్థానానికి దిగజారడం విడ్డూరమే! అందునా దక్షిణాసియా దేశాలన్నింటిలోకెల్లా చివరి స్థానంలో నిలవడం దేశ దీనస్థితికి పరాకాష్ఠ. ఇటీవల తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ అన్నట్టు ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయి. 40కోట్ల ఎకరాల సాగు భూమికి 35వేల టీఎంసీల నీరు సరిపోగా, 35వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. మనం మనకున్న ప్రకృతి, మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం. అందుకే నేటికీ ఈ దేశంలో ఆకలి మంటలు రగులుతూనే ఉన్నాయి.

ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడన్తో మాట్లాడుతూ భారతదేశంలో మరో మూడేళ్ళకు సరిపడా ఆహార నిల్వలున్నాయి అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే ప్రపంచ దేశాలకు సైతం ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల దృష్ట్యా ఇతర దేశాలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మంచిదే. అదే సమయంలో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం ఆర్టికల్ 39(ఎ) ప్రకారం దేశంలోని పౌరులందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి. దేశంలోని ప్రతి పౌరునికీ నాణ్యమైన ఆహారం అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దేశంలో ఆహారానికి కొరత లేకపోయి ఉంటే, ఆకలి చావుల సంఖ్య శూన్యంగా ఉండాలి కదా! కానీ నేటికీ దేశంలో ఆకలి చావులు నమోదవుతూనే ఉన్నాయి.

ఆకలితో చనిపోతున్న ప్రజలకు ఆహరం అందించడమే సంక్షేమ రాజ్య ప్రధాన బాధ్యత అని గతంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కానీ గత జూలైలో ఐక్యరాజ్యసమితి సంస్థలు యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ సంయుక్తంగా ప్రచురించిన ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ (SOFI)’ నివేదికలో 2019–21మధ్య భారతదేశంలో 56 కోట్ల మంది (40.6శాతం) మితమైన లేదా తీవ్రమైన ఆహార అభద్రతతో ఉన్నారు అని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార అసురక్షిత జనాభాలో 37శాతం భారతీయులేనని తెలిపింది. పోనీ అధిక జనాభానే ఇందుకు ప్రధాన కారణం అనుకుందామంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ఆహార భద్రతలో ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది.

అయితే ఇక్కడ రెండు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి అసలు ఆహారమే దొరకని స్థాయి, రెండోది తినే ఆహారంలో పోషకాహార విలువలు తక్కువ స్థాయిలో ఉండటం. 1960ల్లో మన దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ఈ సమస్య పరిష్కారానికి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ నేతృత్వంలో హరిత విప్లవం ప్రారంభమైంది. నూతన వంగడాలు అభివృద్ధి చెందాయి. దీంతో ఉత్పాదక సామర్థ్యం అమాంతంగా పెరిగింది. అయినప్పటికీ నేటికీ దేశంలో తినడానికి తిండిలేక, ఆకలిని తట్టుకోలేక నీళ్ళు తాగుతూ, పొత్తికడుపును మోకాళ్ళతో ఒత్తుకుంటూ అలమటిస్తున్న ప్రజలు కోకొల్లలు. దేశంలో ప్రతి రోజూ దాదాపు 19కోట్ల మంది ఆకలి కడుపుతో నిద్రిస్తున్నారని, ఏటా 3లక్షల మంది బాలలు పోషకాహార లోపానికి గురై మరణిస్తున్నారని, 2020 జాతీయ ఆరోగ్య నివేదిక తెలిపింది. ఒకవైపు ఉత్పత్తి, ఉత్పాదక సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వాలు చెప్పుతున్నప్పటికీ, ఈ ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తున్న నిరుపేదలు ఇంకా ఎందుకు బక్కచిక్కిపోతున్నారో, ఆకలి చావులు ఎందుకు పెరుగుతున్నాయో నేటికీ పసిగట్టలేకపోతున్నాం.

పౌష్టికాహారం అంటేనే సగటు మానవునికి గుర్తొచ్చేది పాలు, గుడ్లు, మాంసం, పండ్లు. దేశంలో క్షీర విప్లవం తర్వాత పాడి పరిశ్రమ అద్భుత వృద్ధిని సాధించింది. పాల ఉత్పత్తిలో 2020 నాటికి భారతదేశం 19.84 కోట్ల టన్నులతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో రెండవ స్థానంలో, పౌల్ట్రీ కోళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు నిజమైతే ప్రపంచంలో పోషకాహార సూచీలో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలబడాలి. కానీ పరిస్థితి అలా లేదు. మన దేశంలో నేటికీ ఇంతటి భారీ స్థాయిలో పోషకాహారలోప బాధితులు ఉండడానికి పేదరికమే ప్రధాన కారణం. ఆకాశాన్నంటుతున్న ధరలతో, కొనే తాహతు లేక, అల్పవేతన జీవులు, నిరుపేదలు పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఇది వారి ఆయు ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. ఇవాళ దేశంలో ప్రతి ఇద్దరిలో ఒక మహిళ రక్తహీనతతో బాధపడుతున్నది. వారిలో అత్యధిక శాతం అట్టడుగు వర్గాలు, నిరుపేద వర్గాల స్త్రీలే!

బాలబాలికల్లో, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి, మెరుగైన ఆహారం అందించడానికి 1976లో సమగ్ర బాలల అభివృద్ధి పథకం ప్రారంభించబడింది. కానీ నేటికీ పిల్లల ఆరోగ్య పరిస్థితులు పెద్దగా మెరుగుపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. చైల్డ్ వేస్టింగ్ రేట్ (పోషకాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల లోపించడంలో) 19.3శాతంతో మూడవ ప్రపంచ దేశాలను సైతం వెనక్కినెట్టి భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలలో అత్యంత వెనుకబడిన 23 దేశాలలో భారతదేశం సైతం ఉన్నది. పిల్లల్లో ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని మారుమూల ప్రాంతాలు, ఆదివాసి, గిరిజన గూడాల్లో, పారిశ్రామిక, నగర మురికివాడల్లో స్పష్టంగా చూడవచ్చు. పోషకాహార లోపాన్ని నియంత్రించాలి అంటే ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతోపాటు, పోషక విలువలు కలిగిన ఆహార ఉత్పత్తినీ పెంచాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్–నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, న్యూఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేసి బన్సల్ దేశంలో ఎక్కువగా నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. దాని తాలూకు సమగ్ర దృక్పథాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ పోషకాహార లోపం తీరాలంటే అన్ని రకాల పంటల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేశానికి నియంత్రిత సాగు అత్యంత అవశ్యకం.

దేశంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి ఐక్యరాజ్యసమితి విధించిన ప్రపంచ పౌష్టిక ఆహార లక్ష్యాలను గాని, 2030 నాటికి రెండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన ‘జీరో హంగర్’ను గానీ చేరుకోవడం భారతదేశానికి పెను సవాలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు తేరుకొని వ్యవసాయం, ఆహార భద్రత, పౌష్టికాహార పంపిణీపై దృష్టి సారించాలి.

ప్రొ. తాటికొండ రమేష్

ఉపకులపతి, కాకతీయ విశ్వవిద్యాలయం

Updated Date - 2022-12-16T01:41:35+05:30 IST