జంకు లేని నయవంచన

ABN , First Publish Date - 2022-12-07T01:03:01+05:30 IST

మాటతప్పం, మడమ తిప్పం అని జగన్మోహనరెడ్డి అదేపనిగా వల్లె వేస్తారు. కాని అధికారమే పరమావధిగా అబద్ధాలు ఆడుతున్నట్లు...

జంకు లేని నయవంచన

మాటతప్పం, మడమ తిప్పం అని జగన్మోహనరెడ్డి అదేపనిగా వల్లె వేస్తారు. కాని అధికారమే పరమావధిగా అబద్ధాలు ఆడుతున్నట్లు ఆయన ప్రభుత్వమే తేల్చి చెబుతోంది. 28 నవంబరు 2022వ తేదీన రైతన్నలకు జమ చేస్తున్న ఇన్ పుట్ సబ్సిడీ, ఇంకా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పేరుతో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలు చూస్తే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం మరోటి లేదన్న భ్రమ కలుగుతుంది. గత ప్రభుత్వం – మన ప్రభుత్వం అంటూ చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏమిటి? రాష్ట్రంలో 85.14లక్షల మంది రైతులు ఉండగా వీరిలో ఐదు ఎకరాల లోపు రైతులు 75.5 లక్షలు. వీరిలో పంట రుణాలు తీసుకునే రైతులు 52 లక్షల పైన ఉంటారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో లక్ష వరకు ఉన్న రుణాలకు సున్నా వడ్డీ పథకం, లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉన్న పంట రుణాలకు పావలా వడ్డీ పథకం వర్తించేది. కానీ ఈ వైకాపా ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ రాయితీని లక్ష రూపాయలకే పరిమితం చేసి, పావలా వడ్డీని రద్దు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే వారికి సున్నా వడ్డీ వర్తించడం లేదు. సున్నా వడ్డీ క్రింద ఏడాదికి రూ.3000 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని జగన్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. నిజానికి 2019 నుండి 2022 వరకు రాష్ట్రంలో తీసుకున్న రూ.1,46,261కోట్ల పంట రుణాలకు 4శాతం వైఎస్సార్ సున్నా వడ్డీ లెక్కిస్తే రూ. 5850.44 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం వెచ్చించింది కేవలం రూ.653.89 కోట్లు మాత్రమే. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీ క్రింద రూ.1719.36 కోట్లు చెల్లించి 35 లక్షల రైతన్నలకు లబ్ధి చేకూర్చారు.

ఇక ఇన్ పుట్ సబ్సిడీ విషయానికి వస్తే ‘మన జగనన్న ప్రభుత్వం’ 21.31 లక్షల మంది రైతులకు రూ.1,834.78 అందిస్తే, ‘గత చంద్రన్న ప్రభుత్వం’ 40 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్ పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.3759.51 కోట్లు. పంటల బీమా ప్రీమియం సొమ్ము చెల్లించకుండా చెల్లించామని అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సమయంలో, ఆర్టీఐ సమాచారంతో అసెంబ్లీలో నేలమీద బైఠాయించి చంద్రన్న నిరసన తెలిపితే, రాత్రికి రాత్రి రూ.590కోట్లు ప్రీమియం చెల్లించిన ‘మన’ ప్రభుత్వానిదే కిందపడ్డా పైచేయి అందాం. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్లు ‘మన ప్రభుత్వం’ 41 నెలల్లో రైతన్నలకు అందించిన సాయం రూ.లక్షా 37 వేల 975 కోట్లు అని ఇచ్చిన ప్రకటన మోసపూరితం. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్‍సిఐకి అమ్ముకుంటున్నారు, సొమ్ము కేంద్రం చెల్లిస్తోంది. కానీ ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు దాదాపు రూ.56వేల కోట్లు రైతు సాయం కింద చూపడం హాస్యాస్పదం. ధాన్యం కొనుగోళ్ల సొమ్మును రైతుల కోసం చేసిన ఖర్చుగా చూపించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. తెలంగాణలో ఎకరాకు రూ.10వేలు రైతుబంధు పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంటే, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న రూ.6 వేలు పోగా మిగతా రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఇక ‘మన’ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతకు భరోసా దక్కడం లేదని రైతు భరోసా కేంద్రాల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ బృందాలు విస్తృత తనిఖీల సమయంలో గుర్తించాయి. ఆర్బికేల ద్వారా అమ్మిన ధాన్యానికి రవాణా చార్జీలు చెల్లించడం లేదని, రాష్ట్రంలో 90శాతం పైగా రైతులు నేటికీ మిల్లర్లకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని గమనించారు. గతంలో దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన రాష్ట్ర ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి దాపురించింది. ఈ కష్టాలు కాకుండా మోటార్లకు మీటర్లు పెట్టినా, 1 హెచ్ పీ మోటారును రూ.233 ఫిక్స్‌డ్ చార్జీలు వేసి రైతు వెన్ను విరచినా, మైక్రో ఇరిగేషన్, బిందుసేద్యం, సూక్ష్మ పోషకాల పంపిణీ, రైతు రథం పథకాలను నిర్వీర్యం చేసినా అది రైతుల పట్ల జగన్రెడ్డికి ఉన్న నిబద్ధత అని సరిపెట్టుకోవాలి.

ఆర్భాటంగా రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించాలనే లక్ష్యంతో రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ కింద రూ.33,862 కోట్ల భారీ ప్రణాళికతో 23 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కేవలం రూ.1,650 కోట్లు పనులు చేసి, దానిలో రూ.వెయ్యి కోట్లపైన బిల్లులు చెల్లించనందున కాంట్రాక్టరు పనులు ఆపేసినా ‘మన ప్రభుత్వం’ గొప్పదే అనుకోవాలి!

దేశవ్యాప్తంగా ఉన్న 9,30,93,500 రైతు కుటుంబాలపై సగటున రూ.74,121 రుణభారం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 31,58,700 రైతు కుటుంబాలపై సగటున ఒక్కో కుటుంబం పైనా రూ.2,45,554 మేర రుణభారం ఉంది. అంటే ఏపీ రైతులు 221శాతం అధిక రుణభారాన్ని మోస్తున్నారు. ఇంత భారీస్థాయి తలసరి అప్పు మరే రాష్ట్రంలోని రైతు కుటుంబాలపైనా లేదు. రైతు ఆత్మహత్యలలో దేశంలో మూడవ స్థానం, కౌలురైతు ఆత్మహత్యలలో రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో భరోసా కలిపించాలంటే ‘గత ప్రభుత్వం – మన ప్రభుత్వం’ అంటూ అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయటం మానేసి, చిత్తశుద్ధితో సాయం చేయాలి. పంటలకు మద్దతు ధర లభించేటట్లు చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలతోనే రైతులను నమ్మించవచ్చు అనుకుంటే ‘మన ప్రభుత్వం’ ప్రజాగ్రహ సునామీలో కొట్టుకుపోక తప్పదు.

లింగమనేని శివరామ ప్రసాద్

Updated Date - 2022-12-07T01:03:07+05:30 IST