మొరాకో చిన్న దేశం, పెద్ద సందేశం!

ABN , First Publish Date - 2022-12-16T01:53:38+05:30 IST

మహాశక్తిశాలిని ఒక బక్కవాడు మట్టి కరిపించడం ఎంత ఆసక్తిదాయకం! ఇటువంటి అనూహ్యాలే ప్రస్తుత ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్లో సంభవిస్తున్నాయి...

మొరాకో చిన్న దేశం, పెద్ద సందేశం!

మహాశక్తిశాలిని ఒక బక్కవాడు మట్టి కరిపించడం ఎంత ఆసక్తిదాయకం! ఇటువంటి అనూహ్యాలే ప్రస్తుత ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్లో సంభవిస్తున్నాయి. వర్తమాన ప్రపంచం గురించి, అవి, ఒక నిర్దిష్ట సత్యాన్నీ వెల్లడిస్తున్నాయి: ఫుట్బాల్ ప్రపంచం ఇప్పుడు ఒక ‘సమతల జగత్తు’గా అవుతోంది. ఆటల్లో అత్యంత పోటీదాయక క్రీడ అయిన సాకర్లో ప్రతి ఒక్కరికీ విజయావకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఖేలావనిలో ఇంతకంటే ఆశించదగిన మార్పు మరేముంటుంది?

ఫుట్బాల్ ప్రపంచంలో మొరాకో ఇప్పుడు ఒక కొత్త సూపర్ పవర్. ఫిఫా కప్ సెమీఫైనల్స్కు చేరుకున్న ప్రప్రథమ ఆఫ్రికా దేశమది. ఒకనాడు తనను పాలించిన సామ్రాజ్యవాది ఫ్రాన్స్ను చిత్తుగా ఓడించిన మొరాకో, ఆటల అవనిలో ఆవిర్భవిస్తోన్న కొత్త వ్యవస్థకు ఒక ప్రతీక. ద్రవాధునికతలా ఉన్న ప్రపంచీకరణ తీరు తెన్నులతో ముడివడి ఉన్న శక్తులతో ప్రభవిస్తోన్న వినూత్న వ్యవస్థ అది.

ఒక బడుగు దేశం, నిన్న మొన్నటిదాకా బానిసత్వంలో మగ్గిన జాతి ఇప్పుడు సాకర్ సమరాంగణంలో అగ్రగామి పోటీదారు స్థాయికి చేరింది. అవునా? అయితే ఇదేమీ కొత్త విశేషం కాదు సుమా! 2002లో దక్షిణ కొరియా ఆశ్చర్యకరంగా ఫిఫా కప్ సెమీ– ఫైనల్ కు చేరింది. ఎవరూ దృష్టి పెట్టని టర్కీ మూడో స్థానాన్ని సాధించుకున్నది. కామెరూన్, సెనెగల్, అల్జీరియా మొదలైన ఆఫ్రికన్ దేశాలు సైతం గతంలో ప్రపంచ అత్యుత్తమ సాకర్ టీమ్లను చిత్తుచేశాయి. ఇంచుమించు ఆరు దశాబ్దాలు వెనక్కి వెళితే ఉత్తర కొరియా మహాశక్తిమంతమైన ఇటాలియన్లను ఒట్టి చేతులతో ఇంటికి పంపించివేసింది. సందేహం లేదు, అవన్నీ గొప్ప విజయాలు. అయినా ఆ అసాధారణ సాఫల్యాలలో చాలా వాటిని నడమంత్రపు విజయాలుగానే చూశారు. ఎందుకని? అవి, ఫుట్బాల్ క్రీడ సంబంధిత వ్యవహారాలలో ఒక కొత్త మౌలిక మార్పునకు కారణమవ్వలేదు, దారితీయలేదు కనుక. కానీ, మొరాకో అపురూప విజయం భిన్నమైనది. ఫుట్బాల్ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న సరికొత్త మార్పులను సూచిస్తున్న ఒక వ్యవస్థ ఆలంబనతో అది సంభవించింది.

ఏమిటి మొరాకో విజయగాథ విలక్షణత? 26 మంది సభ్యులుగల మొరాకో సాకర్ టీమ్లో 14 మంది ఆ దేశానికి వెలుపల జన్మించిన వారే! వీరిలోనూ అత్యధికులు ఐరోపా, ఇంకా దానికి ఆవల ఉన్న పాశ్చాత్య దేశాలలో పెరుగుతోన్న వలసదారుల సమూహాల నుంచి వచ్చిన వారే!! ఖతార్లో ఫిఫా టోర్నమెంట్ ప్రారంభం కాకమునుపు, బహుశా, ప్రపంచవ్యాప్త విఖ్యాతుడుగా చెప్పదగ్గ ఏకైక మొరాకో ఫుట్బాల్ క్రీడాకారుడు హకీమ్ జియేష్ మాత్రమే. అతడు సైతం లండన్లోని చెల్సియా అనే బ్లూ చిప్ క్లబ్కు చెందినవాడే కావడం విశేషం. మరి ఇప్పుడో? కెనడాలో జన్మించిన గోల్కీపర్ యూనెస్ బౌనౌ, మాడ్రిడ్లో పుట్టిన అచ్రఫ్ హక్మీ, డచ్ గడ్డపై కన్ను తెరిచిన సొఫ్యానె బౌషాల్ తమ తమ సొంత రీతుల్లో సాకర్ సూపర్ స్టార్లు అయ్యారు. మొరాకో జట్టు అనితర సాధ్యమైన ఆటతీరుకు వారు పరిపూర్ణ ప్రమాణాలు. ఆ ప్రతిభా సమన్విత క్రీడా విన్యాస అజేయ స్పూర్తికి వారు నిలువెత్తు నిదర్శనాలు.

ఫుట్బాల్లో మొరాకో వలసదారు అమోఘ సాఫల్యం ఒక వాస్తవాన్ని ప్రకాశింపజేస్తోంది. మనుషుల మధ్య అనేకానేక అంతరాలను అధిగమించేందుకు రాజకీయాలు తరచు తర్జన భర్జనలు చేస్తాయి, ప్రయాస పడతాయి. అయితే రాజకీయాలు విఫలమైన విషయంలో ఆటలు సఫలమవుతున్నాయి. జాతుల మధ్య సమైక్యతకు అవరోధంగా ఉన్న హద్దులు అన్నిటినీ ఆటలు అధిగమిస్తున్నాయి. ‘ఎల్లలోకము ఒక ఇల్లై’ అనే లక్ష్యాన్ని సాధిస్తున్నాయి. ఒక్క ఐరోపాలోనే యాభై లక్షల మంది మొరాకో వలసదారులు ఉన్నట్టు ఒక అంచనా. ఆ భూఖండమంతటా రెండున్నర కోట్ల మందికి పైగా ఉన్న అరబ్ వలసదారులలో వారూ ఒక భాగం. ఇంతమంది భిన్న మతస్థులు తమ మధ్య జీవనయానం చేయడాన్ని యూరోపియన్లు అంగీకరించలేకున్నారు. కరడుగట్టిన మితవాద రాజకీయవేత్తలు ఆ అసంతృప్తుల మనోభావాలను ఆధారం చేసుకుని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరబ్ ముస్లింలు, యూరోపియన్ ప్రధాన స్రవంతి మధ్య పరస్పర అనుమానాలు, విరోధ భావాన్ని సృష్టిస్తున్నారు. అరబ్ ముస్లిం వలసదారుల నుంచి యూరోపియన్ జాతుల అస్తిత్వానికి, భద్రతకు, సామాజిక సమైక్యతకు ఒక పెను ముప్పు వాటిల్ల నున్నదనే కథనం ఒకటి యూరోపియన్లను ప్రభావితం చేస్తోంది.

తనువును పులకరింపజేసి, మనసులో భావోద్రేకం కలిగించే ఫుట్బాల్ క్రీడకు అటువంటి వికృత గతానుగతికాలను పట్టించుకునే స్వభావం, సమయం లేనే లేవు. ప్రతిభాపాటవాలు, సమా నావకాశాలకు ఒక రంగస్థలంగా తనకు తాను ఉపయోపడేందుకే సాకర్ ప్రాధాన్యమిస్తోంది. ఖతార్లో ఫిఫా టోర్నమెంట్లో ఆడుతున్న క్రీడాకారులలో 125 మంది ఏ దేశం తరఫున అయితే ఆడుతున్నారో ఆ దేశంలో పుట్టినవారు కాదు. ఐరోపా దేశాలు సైతం తమ క్రీడా జట్టులలో జాతిపరమైన వైవిధ్యం ప్రతిబింబించేందుకు ప్రాధాన్యమిచ్చాయి. స్విట్జర్లాండ్ టీమ్ కెప్టెన్ గ్రానిట్ ఝాకా అల్బేనియన్ సంతతివాడు. అదే జట్టు మిడ్ ఫీల్డర్ హెర్డాన్ షక్రి కూడా అల్బేనియన్ మూలాల నుంచి వచ్చిన వారే. ఇంకా పలువురు స్విస్ ఫుట్బాల్ ఆటగాళ్లు విదేశాలలో పుట్టినవారే. వివక్షలకు తావివ్వని కొత్త వలస విధానాలు వివిధ సమాజాలను ఎలా పునర్ నిర్వచిస్తున్నాయో ఆ జాతి వైవిధ్య క్రీడా బృందాలు సూచిస్తున్నాయి.

2018లో ఫిఫా ప్రపంచ కప్ను గెలుచుకున్న ఫ్రెంచ్ టీమ్లో అత్యధికులు వలసదారులు లేదా వలసదారుల సంతానమే. 2022 జట్టు కూడా భిన్నమైనదేమీ కాదు. ఈ జట్టులోని పలువురు ఆఫ్రికన్ మూలాల నుంచి వచ్చినవారే. ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ సూపర్ స్టార్ ఎమ్ బప్పె తండ్రి కామెరూన్లో పుట్టినవాడు కాగా తల్లివి అల్జీరియన్ మూలాలు. 1966 ప్రపంచకప్ను గెలుచుకున్న ఇంగ్లాండ్ టీమ్లోని క్రీడాకారులు అందరూ శ్వేత జాతీయులే. 2022 ఇంగ్లాండ్ సాకర్ టీమ్ను చూడండి. ఎంత తేడా! బ్రెజిల్, అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారులు మాత్రమే ఇప్పటికీ చాలవరకు ఇంట పుట్టి, పెరిగిన వారుగా ఉన్నారు. మిగతా ప్రపంచమంతా ఫుట్బాల్ క్షేత్రంలో జాతీయ సరిహద్దులను చెరిపివేస్తోంది. ఈ పరిణామాలు అనివార్యంగా ఒక ప్రశ్నను పురిగొల్పుతున్నాయి: బహు సాంస్కృతిక విలువలు, వలస అస్తిత్వాలను ప్రోత్సహించడం ద్వారా ఫుట్బాల్ లబ్ధి పొందగలిగినప్పుడు మిగతా సమాజం ఎందుకు వెనుకబడివుంది? వలసదారులకు అనుకూలంగా అనుసరిస్తున్న స్వేచ్ఛాయుత సరిహద్దుల విధానాలను ఐరోపా దేశాలలోని మితవాద రాజకీయవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సరే, మన దేశంలో సైతం చాలా మంది స్థానిక, జాతీయ రాజకీయవేత్తలు సంకుచిత, ప్రాంతీయ ధోరణులను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రాలు, సమాజాల మధ్య గోడలు కడుతున్నారు. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండి, పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ‘భూమిపుత్రుల’కు ప్రాధాన్యమివ్వడం ఒక రాజకీయ, ఆర్థిక అనివార్యత కావచ్చు. అయితే దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణ కార్మికుల పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపడమనేది ఒక అన్లులంఘనీయ విశ్వాసంగా పరిణమించినప్పుడు ‘భూమిపుత్రుల’ విధానం మేలు చేస్తుందా? ఎన్నికల ప్రయోజనాలకు సమాజాన్ని విభజించే వినాశక శక్తిగా మాత్రమే అది పని చేస్తుంది. 2008లో ముంబైలో రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సమితి కార్యకర్తలు యూపీ, బిహార్ నుంచి వలసవచ్చిన వారిపై ఎలా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారో గుర్తు చేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో కన్నడ భాష మాట్లాడనందుకు ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను ఎలా వేధించారో జ్ఞాపకమున్నదా? దేశంలోని వివిధ ప్రాంతాలలో కశ్మీరీలు ఎలా విద్వేషం, మతోన్మాదానికి బాధితులు అవుతున్నారో మీరు గమనించడం లేదా?

ఒక సత్యాన్ని నొక్కి చెప్పుతాను. అంతర్ –రాష్ట్ర, ప్రపంచ వలసలు ఆయా రాష్ట్రాలలోనూ ఇరుగు పొరుగు సుదూర దేశాలలోనూ సిరిసంపదల సృష్టికి విశేషంగా దోహదం చేస్తున్నాయి. ముంబై మహానగరంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, సేవల రంగాన్ని నిర్వహిస్తోన్న ఉత్తర భారతావని వలసదారులు ఉత్తర్ ప్రదేశ్, బిహార్లలో చాలా కుటుంబాలను పేదరికం నుంచి బయట పడవేస్తున్నారు. గల్ఫ్ రాజ్యాలకు భారతీయుల వలస వెళ్లుతున్నారు. ఆ దేశాలలో మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా తమ నిరంతర ప్రేషక ధనం (కుటుంబాలకు పంపే డబ్బు)తో దేశీయ ఆర్థిక రంగంలో ఇతోధిక పురోభివృద్ధికి కారణమవుతున్నారు. ఈ అభివృద్ధి ఎలాంటిదో కేరళలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విదేశాలకు వలసపోయిన భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు ప్రపంచంలోనే చాలా అత్యధికంగా ఉంటోంది. ఇలా భారతీయులు స్వదేశంలోని కుటుంబాలకు పంపిన డబ్బు ౨021లో భారత్ జీడీపీలో 3 శాతం (89 బిలియన్ డాలర్లు)గా ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

ఫుట్బాల్ వలసదారు విజయోత్సవం భారత్కూ ప్రపంచానికీ ఒక శక్తిమంతమైన సందేశాన్ని ఇస్తోంది: సమీప, సుదూర ప్రాంతాల మధ్య నిపుణ శ్రామికుల, మేధో ప్రతిభామూర్తుల చలన శీలతను; జాతుల మధ్య ఆదాన ప్రదానాలను సృజనాత్మకంగా ప్రోత్సహించే దేశాలే ఆర్థికంగా అభివృద్ధి చెంది, సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయి. మొరాకో ఫుట్బాల్ నేడు ఏమి చేసిందో మిగతా దేశాలూ రేపు సకల జీవన రంగాలలో అదే చేసి తీరాలి.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2022-12-16T01:53:43+05:30 IST