విద్యా సమానత్వం ఎండమావేనా?

ABN , First Publish Date - 2022-11-08T01:04:08+05:30 IST

పౌరులలో కనీస అక్షరాస్యత, జ్ఞానం లేకుండా సుస్థిర ప్రజాస్వామ్య సమాజం సాధ్యమవుతుందా? అసంభవమని మిల్టన్ ఫ్రైడ్ మాన్...

విద్యా సమానత్వం ఎండమావేనా?

పౌరులలో కనీస అక్షరాస్యత, జ్ఞానం లేకుండా సుస్థిర ప్రజాస్వామ్య సమాజం సాధ్యమవుతుందా? అసంభవమని మిల్టన్ ఫ్రైడ్ మాన్ (ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత ) స్పష్టం చేశారు. అక్షరాస్యత, జ్ఞాన సాధనకు ‘విద్య’ ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలానే సామాజిక మార్పులు సాధించడంలోనూ సమాజంలో అసమానతలను నిర్మూలించడంలోనూ విద్య పోషించగలిగే పాత్ర విషయమై ప్రపంచమంతా ఏకాభిప్రాయం ఉంది. అందుకనే పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించడాన్ని సకల సమాజాలు తమ కనీస బాధ్యతగా స్వీకరించాయి.

మన దేశంలో అయితే విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో 1990 దశకం నుంచీ చైతన్య యాత్రలు, పాద యాత్రలు, సదస్సులు జరుగుతూ వచ్చాయి. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా ‘నేషనల్ అలయన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీ’ అనే పేరుతో వేదిక ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేధావులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఉద్యమమే నడిపారు, ఢిల్లీ ముట్టడి, పార్లమెంట్ ఘెరావ్‌లు సైతం జరిగాయి. ఈ ఒత్తిడిలు అన్నీ పని చేసి భారతదేశంలోని పిల్లందరికీ వారి ఆర్థిక, కుల నేపథ్యంతో సంబంధం లేకుండా పాఠశాలల నుంచి నెట్టివేయబడిన వారితో సహా అందరికీ నాణ్యమైన ప్రాథమిక విద్యను పొందేలా చేయడం లక్ష్యంగా ‘ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం–2009’లో ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. దీనినే వాడుక భాషలో విద్యాహక్కు చట్టం అని పిలుస్తారు. ఈ చట్టం ‘ఉచిత నిర్బంధ విద్య’కు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థి–ఉపాధ్యాయ–నిష్పత్తి, తరగతి గదులు, బాలికలు, బాలురకు ప్రత్యేక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పాఠశాల–పని దినాల సంఖ్య, ఉపాధ్యాయుల పని వేళలు, మొదలైన నిబంధనలను–ప్రమాణాలను నిర్దేశిస్తుంది. భారతదేశంలోని ప్రతి ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్ + మిడిల్ స్కూల్) విద్యా హక్కు చట్టం నిర్దేశించిన కనీస ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. అలానే ప్రతి బిడ్డ సర్వతోముఖాభివృద్ధికి భరోసానిచ్చే పాఠ్యాంశాల అభివృద్ధి పిల్లల జ్ఞానం, సామర్థ్యం, ప్రతిభకు తోడ్పాటు అందించడం ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం–2009’ సెక్షన్ 12(1)(సి) ప్రస్తుత అమలు తీరును నిశితంగా పరిశీలిద్దాం. ఈ సెక్షన్ ప్రకారం బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అడ్మిషన్లలో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో తప్పనిసరి. విద్యా హక్కు చట్ట ప్రకారం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు (అనాథలు, హెచ్‌ఐవి రోగుల పిల్లలు, వికలాంగులు) ఐదు శాతం సీట్లు, ఎస్సీ విద్యార్థులకు 10 శాతం, ఎస్టీ విద్యార్థులకు 4 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, మైనారిటీ, ఓసీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. ఐతే చట్టం వచ్చి పన్నెండేళ్ళు దాటినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి కూడా అణగారిన వర్గాలకు అందాల్సిన విద్యా ఫలాలు అందలేదు. అధికారంలో ఉన్న పార్టీలకు చిత్తశుద్ధిలేకపోవడంతో పాటు పౌరసమాజం నుంచి ఒత్తిడిలేకపోవడమే అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాహక్కు చట్టం అమలు కాకుండా గతంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టు కెక్కాయి, ఐతే రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో యువ న్యాయవాది యోగేష్ తాండవ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంకు కోర్టు ఇటీవల స్పందించడంతో ఒత్తిడికి తలొగ్గి జగన్ ప్రభుత్వం జూలై 15 , 2022న ప్రయివేటు, అన్ ఎయిడెడ్, మైనారిటీ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి జీఓ నంబర్ 129ని విడుదల చేసింది. దానిని సవరిస్తూ జీఓ 20ని జారీ చేసింది. ఈ జీఓల ప్రకారం అర్హులైన పిల్లలు ప్రైవేటు, కార్పొరేటు, ఎయిడెడ్ విద్యాలయాలలో విద్య హక్కు చట్టం కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. కానీ దరఖాస్తులు చేసుకోవడానికి ఆగస్టు 16 నుంచి 26 వరకు అంటే కేవలం 10 రోజులు మాత్రమే గడువు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 86 వేల సీట్లు కేటాయించామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ప్రవేశాలకు ఆఖరు తేదీ ముగిసిన తర్వాత చూస్తే ప్రభుత్వం ప్రకటించిన సీట్లలో కేవలం 2,600 పిల్లలకు మాత్రమే విద్య హక్కు చట్టం క్రింద పాఠశాలలో ప్రవేశం పొందగలిగారు. అంటే కేవలం మూడు శాతం సీట్లు మాత్రమే నిండాయి.

ఆనాధలు, హెచ్ఐవి, వికలాంగులకు 17వేల సీట్లు కేటాయిస్తే 122 సీట్లు మాత్రమే నిండాయి. షెడ్యూల్డ్ కులాల పిల్లలకు 34 వేల సీట్లకు గాను 155 సీట్లు, షెడ్యూల్డ్ తెగల పిల్లలకు దాదాపు 14 వేలకు గాను 900, బలహీన వర్గాల పిల్లలకు 20 వేల సీట్లకు గాను కేవలం 900 సీట్లు మాత్రం నిండాయి.

ఈ దుస్థితికి కారణం ఏమిటి? ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో చదవుకోవడానికి పిల్లలు ఎందుకు ముందుకు రాలేదు? ఈ ప్రశ్నకు జవాబు కోసం మేం పిల్లల తల్లితండ్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్య హక్కు చట్టం అమలుకై పని చేస్తున్న పౌర సమాజ సంస్థల కార్యకర్తలతో మాట్లాడాము.

అసలు జూలై నెలలో పాఠశాలల ప్రవేశాలు ముగిసిన వరకూ వేచి ఉండి ఆగస్టు నెలలో విద్యా హక్కు చట్టం క్రింద ప్రవేశాలకు పూనుకోవడం వెనుక ఔచిత్యాన్ని పలువురు ప్రశ్నించారు. అలానే ప్రవేశాల గడువుకు కేవలం 10 రోజులు మాత్రమే కేటాయించడం సరికాదని విద్యాశాఖ అధికారులకు ముందుగానే చెప్పామని, అయితే గ్రామ వాలంటీర్ల సహాయంతో సులువుగా విద్య హక్కు చట్టం క్రింద ఉచిత సీట్లను నింపుతామని ప్రభుత్వం జవాబు ఇచ్చినట్లు పౌర సమాజ ప్రతినిధుల కథనం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విషయమై వందలాది గ్రామ వాలంటీర్లను అడిగితే అసలు విద్యా హక్కు చట్టం ఏమిటో కూడా తమకు తెలియదని పిల్లల తల్లితండ్రులకు చట్టం గురించి అవగాహన కల్పించమని కానీ, ఉచిత ప్రవేశాలకు సంబంధించి వారికి సహాయం చేయమని కానీ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని వారు అన్నారు. అలాగే వార్తా పత్రికలలో తాము ప్రవేశపెట్టే పథకాల గూర్చి మొదటి పేజీలలో అధికంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం అణగారిన వర్గాల పిల్లల ఉచిత విద్యా ప్రవేశాల గురించి మాత్రం ఎలాంటి ప్రచారానికీ పూనుకోలేదు.

ఉచిత ప్రవేశాల సంగతి దేవుడెరుగు అసలు విద్యా హక్కు చట్టం అనేది ఒకటి ఉన్నట్లు కూడా తమకు తెలియదని పలువురు తల్లితండ్రులు మాతో అన్నారు. అలానే కేవలం మూడు శాతం సీట్లు మాత్రమే నిండాయి కాబట్టి, మరల ఉచిత ప్రవేశాలకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరితే అక్టోబర్ నెలలో ప్రవేశాలు తిరిగి చేపడతామని ప్రభుత్వ పెద్దలు వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోలేదని పౌర సమాజ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

దీనిని బట్టి విద్య హక్కు చట్టం క్రింద ఉచిత ప్రవేశాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే అని అర్థమవుతుంది. అలానే ప్రభుత్వ చిత్తశుద్ధిపై కూడా చాలా ప్రశ్నలు ఉదయించక మానవు. సెప్టెంబరు నెలలో విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నాణ్యమైన విద్య పేదల హక్కు’ అని ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటించారు. ‘గత మూడు సంవత్సరాలలో విద్యకు సంబంధించి తాము విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చామని’ కూడా ఆయన అన్నారు. అయితే విద్యా హక్కు చట్టం అమలును చూస్తే మాత్రం ముఖ్యమంత్రి మాటలని విశ్వసించడం కష్టం. అలానే విద్య హక్కు చట్టం స్ఫూర్తిని కొంత వరకూ ప్రతిబింబిస్తూ గత ప్రభుత్వం పేద విద్యార్థులు ఉచితంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించేందుకై ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకాన్ని సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్న విషయం గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాదు. ఈ స్థితిలో విద్యాహక్కు చట్టం క్రింద మిగిలిపోయిన సీట్లను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. గ్రామ/వార్డు వాలంటీర్లు, సచివాలయాలలో అర్హులైన విద్యార్థుల నుంచి ఉచిత ప్రవేశాల దరఖాస్తులను స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి.

‘పిల్లలు, అందులోనూ లక్షలాది పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించగలిగే, జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలిగే విద్య అందుబాటులో లేనప్పుడు మనలో ఎవరికీ సంతృప్తి ఉండకూడద’ని నెల్సన్ మండేలా అన్నారు. ఆయన మాటలు నిజం కావాలంటే దళిత, బహుజనులకు, మైనారిటీలకు, ఆడపిల్లలకు విద్యా సంస్కరణలు అందేలా ప్రభుత్వాల విధానాలు రూపొందాలి.

విద్యాహక్కు మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సుగల బాలలు అందరికీ అన్వయించిన నాడు, ఆ ఫలాలు అందరికీ అందిన రోజు బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణా, బాల కార్మికత సమూలంగా రూపుమాప వచ్చు. గొంతెత్తి అరుస్తున్న పిల్లల గోడు అందరూ వినాలి.

హరి వెంకటరమణ

నిరుతి బుద్ధ

Updated Date - 2022-11-08T01:04:13+05:30 IST