ప్రజా పాలనలో గవర్నరు జోక్యం ఎందుకు?

ABN , First Publish Date - 2022-12-07T01:09:15+05:30 IST

బీజేపీ యేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్‌...

ప్రజా పాలనలో గవర్నరు జోక్యం ఎందుకు?

బీజేపీ యేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్‌ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నరు వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా పెండిగులో ఉన్నాయి. అలాగే కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులను, తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఇరవై బిల్లులను నెలల తరబడి ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా చట్టసభల్లో చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుకోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం విధానసభ ఆమోదం తరువాత తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్‌ ‘శీఘ్రగతిన’ ఆమోదం తెలపడమో, లేదా రాష్ట్రపతికి పంపడమో, అభిప్రాయం జోడించి తిరిగి పంపడమో చేయాలి. అందులో నిర్ణీత గడవు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనేది విస్పష్టం.

బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలలోనే గవర్నర్‌లతో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఇక్కడ గవర్నర్లుగా నియమితులైన వారంతా దాదాపుగా బీజేపీ లేదా ఆరెస్సెస్ నుంచి వచ్చినవారే. కేంద్రం తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్లను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమి కాదు. కానీ మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోయడంలోను, ఇబ్బంది పెట్టడంలోను గవర్నర్‌లు క్రియాశీలక పాత్ర పోషించారు. గతంలో గోవా, మణిపూర్‌, ఉత్తరాఖంఢ్‌ వంటి రాష్ట్రాలలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి గవర్నర్లు సహకరించారు. అరుణాచల్ప్రదేశ్‌లోనైతే 2016లో గవర్నర్‌ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్‌లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన ఉదంతాన్ని ఎలా మరుస్తాం? పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురిచేసిన గవర్నరుకు ఎలా పదోన్నతి లభించిందో చూశాం. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిన నామినేటెడ్‌ ఎంఎల్‌ఏల జాబితాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తొక్కి పెట్టిన వైనం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తయితే గవర్నర్‌లు హద్దు మీరి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రజల అభిప్రాయాలు, వాస్తవాలతో పని లేకుండా సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విమోచనా దినమేనంటూ బీజేపీ పాట పాడారు. ఆమె స్వంత రాష్ట్రమైన తమిళనాడులో సైతం రాజకీయ వ్యాఖ్యానాలు చేయడమే కాకుండా, తెలుగు భాషను కించపరిచేలా మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరించిన సి.రంగరాజన్‌ ఇటీవల తాను రచించిన ‘ఫోర్క్స్‌ ఇన్‌ ద రోడ్‌’ పుస్తకంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు ఉండడమనేది రాజ్యాంగం ఆశించలేదని, కాబట్టి గవర్నర్లు తమకు తాము నియంత్రించుకోవాలని పేర్కొనడం ప్రస్తుత గవర్నర్లకు ఒక పాఠం లాంటిది.

సర్కారియా కమిషన్తో పాటు, అనేక కమిషన్‌లు గవర్నర్‌ వ్యవస్థ ప్రస్తుత తీరును తప్పుబట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. పార్టీ ఏదైనా తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే చేసే పని ఒకటి కావడమే ఇందుకు కారణం. అన్నిటికి మించి బిల్లులను తొక్కిపెట్టడం అత్యంత అప్రజాస్వామికం. ఎన్నిక ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ఆ పని చేస్తే కొంత అర్థం ఉంది. నామినేటెడ్‌ పద్ధతిలో నియమితులైన గవర్నర్లు ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాల ఆధ్వర్యంలో శాసనసభలో ఆమోదింపబడిన బిల్లులను నెలల తరబడి నాన్చడం దుర్మార్గం. ఇవన్నీ పరిశీలిస్తే గవర్నర్‌ వ్యవస్థ ఆరవ వేలు లేదా అపెండిక్స్‌ లాంటిది. ఈ వ్యవస్థను రద్దు చేయడమే ఏకైక మార్గం.

గవర్నర్‌ వ్యవస్థ రద్దయితే తలెత్తే పరిణామాలపై న్యాయ వ్యవస్థకు ఎక్కువ బాధ్యతను అందించాలి. మెజారిటీ లేని సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రిగా ఎవరిని ఆహ్వానించడం, ప్రమాణ స్వీకారం వంటి అంశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్‌ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్‌ కమిటీలను నియమించి, వాటికి నియమించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతిపాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నరు జోక్యం ఇక అవసరం ఉండదు.

కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

(నేడు సీపీఐ ఆధ్వర్యంలో ‘చలో రాజ్‌భవన్’)

Updated Date - 2022-12-07T01:09:17+05:30 IST