నేతలు దోచేస్తుంటే కేంద్ర సంస్థలు చోద్యం చూడాలా?

ABN , First Publish Date - 2022-12-07T01:06:59+05:30 IST

గతనాలుగైదేళ్ళ నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకుల చేతుల్లోని కార్పొరేట్ వ్యాపార, విద్య, వైద్య సంస్థల లావాదేవీలు విస్తృతంగా...

నేతలు దోచేస్తుంటే కేంద్ర సంస్థలు చోద్యం చూడాలా?

గతనాలుగైదేళ్ళ నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకుల చేతుల్లోని కార్పొరేట్ వ్యాపార, విద్య, వైద్య సంస్థల లావాదేవీలు విస్తృతంగా పెరిగాయి. దాంతో వారు పన్నుల పరిధిలో చూపించని డబ్బు, ఆస్తుల గురించి ఇటీవల ఐటీ, ఈడీ అధికారులు సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తమ విధి నిర్వహణలో భాగంగానే అధికారులు ఈ దాడులు చేస్తున్నప్పటికీ, రాజకీయ వ్యాపారస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అనేకమంది పాలకపక్ష ముఖ్య నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కాములో నిందితులుగా తాఖీదులు అందుకుంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ ఉత్పత్తిదారులకు డీలర్లు మరింత ప్రయోజనాలు పొందేవిధంగా మద్యం పాలసీని మన రాష్ట్రంలోనే రూపొందించి వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కామ్ తెలంగాణ నుంచే పురుడు పోసుకొని గంజాయి మొక్కవలె ఇతర రాష్ట్రాలకు విస్తరించిందనే విషయం గమనించాలి.

ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను ఎండబెట్టి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన కార్పొరేట్ దిగ్గజాలకు ప్రైవేటు రంగంలో లక్షలాదిమంది విద్యార్థులు చదవడానికి కార్పొరేటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలను సంతర్పణ చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల డబ్బంతా కొన్ని విద్యాసంస్థలకే చేరుతున్నదనేది పచ్చి నిజం. అదేవిధంగా వైద్యరంగంలో కూడా కళాశాలలను, కార్పొరేట్ దవాఖానాలను నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి స్థాపించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ, ఈడీ లాంటి సంస్థలు కార్పొరేట్ సంస్థలను వదిలిపెట్టి బిచ్చగాళ్ల గుడిసెలు సోదాలు చేయాలా?

గతంలో టీడీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ఉంటూ విద్యా, వైద్య, గ్రానైట్, హౌసింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడిపే కార్పొరేట్ సంస్థల అధినేతలు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తమ సాధన సంపత్తితో పాలక పార్టీలోకి ప్రవేశించారు. అధికారంలో ఉంటే తమ లావాదేవీలు, వ్యాపారాలు నిరాటంకంగా, యథేచ్ఛగా కొనసాగించవచ్చని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారులను లొంగదీసుకోవడం, అక్రమ సంపాదనకు తెరలేపడం సులభమవుతుందని అధికార పార్టీలో చేరి కీలకమైన స్థానాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అన్ని పార్టీల్లో ఎంతో కొంత ఎదిగిన కార్పొరేట్ నాయకులు వ్యూహాత్మకంగా టీఆర్‍ఎస్లో చేరి త్యాగాలు చేసిన నాయకులను, ఉద్యమకారులను బయటకు నెట్టేశారు. కొత్త నీళ్లు రావడంతో పాత నీళ్లు వైదొలిగిపోయినట్లే జరిగింది పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.

గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, బీసీ కులాలు, ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురయ్యారు. ప్రజలు పాలక పార్టీకి దూరం కావడాన్ని బీజేపీ గమనించింది. ఆ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకాలం చేసిన అవినీతి, అక్రమాలను ఏకరువు పెడుతోంది. ముఖ్యంగా పార్టీలు ఫిరాయించిన నాయకులు ప్రభుత్వ అండతో అక్రమ సంపాదనకు తెరతీసి అనేక రకాల దందాలకు పాల్పడుతున్నారని గత రెండు మూడేళ్లుగా మీడియా ద్వారా చర్చకు పెట్టింది. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత ఏర్పడి ఇటీవల ఎన్నికల్లో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. నాయకుల వ్యాపార సంస్థలపై కేంద్ర సంస్థలు చేస్తున్న తనిఖీలను తెలంగాణ రాజకీయాలకు ముడిపెట్టడం సబబు కాదు. అక్రమార్కులంతా అధికార పార్టీ అండ చూసుకొని దూకుడు ప్రదర్శిస్తుంటే కేంద్ర సంస్థలు దూకుడు పెంచడంలో తప్పేముంది. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై రాజకీయ కక్షతోటే ఐటీ, ఈడీతో దాడి చేయిస్తున్నదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను నిశితంగా పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక, గ్రానైట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రైవేటు కళాశాలలు, మెడికల్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మద్యం వ్యాపారాలు, మెగా కాంట్రాక్టులు, విదేశాల్లో క్యాసినో వ్యవహారాలు, పబ్బుల విస్తరణ, ఎస్టేటుల నిర్మాణం, ఫాంహౌస్ కల్చర్ టీఆర్ఎస్ నాయకులతోనే విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే ఈ దందాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గత ఏడేండ్లుగా తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆవేదన తెలంగాణ ప్రజానీకంలో ఉంది. మన రాష్ట్రం నుంచి అనేకమంది లండన్, ఆఫ్రికా, దుబాయిలో ఆస్తులను కూడబెట్టుకుంటున్నా కేంద్రం గుర్తించలేకపోతున్నదనే విమర్శలు కూడా వచ్చాయి.

మన తెలంగాణలో ఓటు ధనవంతుల చేతిలో కొనుగోలు వస్తువుగా మారిపోయింది. 2018 శాసనసభ ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ చేయబడిందో, అంగడి సరుకుగా మారిందో, ప్రజాప్రతినిధులే నోటుకు ఓటు మార్కెట్ విధానాన్ని ఎంత పకడ్బందీగా అమలుపరిచారో చూశాం. ప్రజాస్వామ్య ఖూనీకి రాష్ట్ర రాజకీయాలు పరాకాష్ఠగా మారాయి. ధనవంతులంతా ఒక్క పార్టీలో చేరి రాష్ట్రంలోని సహజ వనరులు, ఆర్థిక వనరులను దోపిడీ చేస్తూ వైద్య, విద్య, వ్యాపార సంస్థలు, వేలాది ఎకరాల భూములు, ఎస్టేట్లు, ఫామ్హౌస్లు సమకూర్చుకుంటుంటే ఈడీ, ఇన్కంటాక్స్ అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవాలా? అధికారం, దోపిడీ వ్యవస్థలు ఏకమైతే నియంత్ర సంస్థలు చోద్యం చూడాలా?

ఉద్యోగులను, సాధారణ వినియోగదారులను, చిరు వ్యాపారులను, చిన్న లఘు పరిశ్రమల యజమానులను ముక్కు పిండి లక్షలాది కోట్ల ఆదాయపు పన్ను, జీఎస్టీ వసూలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రజాధనాన్ని కొల్లగొట్టే కార్పొరేట్ దిగ్గజాలను, రాజకీయ వ్యాపారస్థుల పన్ను ఎగవేతలను ఉపేక్షిస్తున్నదనే ఆరోపణల నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మరింత పకడ్బందీగా పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

కఠినమైన నియంత్రణలతో ఈ కార్పొరేట్ దిగ్గజాల నుంచి లక్షల కోట్ల ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వసూలు చేసినట్లయితే సాధారణ వినియోగదారులపై నిత్యం కత్తి పెట్టి వసూలు చేసే జీఎస్టీ భారం కొంత తగ్గుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడినప్పుడే ఇలాంటి ఒత్తిడిలు, తనిఖీలు చేయడం కాదు. అక్రమాలు జరుగుతున్న సంస్థలపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే రాజకీయ కక్షతో అనే అపవాదులు కూడా మోయాల్సిన అవసరం రాదన్న సంగతి కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. దీంతో రాజకీయాల్లో తిరిగి కొంత నిజాయితీని పునరుద్ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది. పేద మధ్యతరగతి ప్రజలకు కూడా రాజకీయాల్లో అవకాశం దక్కుతుంది. ప్రాంతీయ పార్టీలు పాలించిన అనేక రాష్ట్రాల్లో అక్రమ సంపాదన, ఆదాయ పన్ను ఎగవేత, వేలకోట్ల రూపాయల కుటుంబ ఆస్తులు, కుటుంబ, వారసత్వ నిరంకుశ సంస్కృతి ఏర్పడినట్లు గత 30 ఏళ్లలో రాజకీయ చరిత్ర వెల్లడిస్తోంది. ఈ విషయం కేంద్రాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలియనిది ఏమి కాదు. అందుకే ఈ అడపాదడపా సోదాలు, ఈడీ, ఐటీ దాడులు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదనీ, ఇది నిరంతరం నిఘాగా కొనసాగాలని కేంద్రం అర్థం చేసుకోవాలి.

ఆచార్య కూరపాటి వెంకట్ నారాయణ

Updated Date - 2022-12-07T01:07:06+05:30 IST