దేశ పటాన్ని మార్చిన గాంధేయ యోధుడు

ABN , First Publish Date - 2022-12-15T00:51:50+05:30 IST

ఆంధ్రుల్ని మదరాసీలుగా పిలవడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి, ఆత్మార్పణగావించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. గాంధేయ సిద్ధాంతాలు పరమార్థంగా...

దేశ పటాన్ని మార్చిన గాంధేయ యోధుడు

ఆంధ్రుల్ని మదరాసీలుగా పిలవడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టి, ఆత్మార్పణగావించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. గాంధేయ సిద్ధాంతాలు పరమార్థంగా భావించిన గొప్ప సంఘసంస్కర్త, నిస్వార్ధ ప్రజాసేవకుడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్ని మార్గాలున్నా ప్రాయోపవేశం మార్గాన్ని ఎంచుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే ఆయన ప్రాణాలు విడిచారు. శ్రీరాములు ఆత్మశక్తికి ప్రపంచం నివ్వెరపోయింది. ప్రజలంతా శోకసముద్రంలో మునిగిపోయారు. తెలుగు ప్రాంతమంతా ఉద్రిక్తతతో అట్టుడికిపోయింది. ఆ మహనీయుని త్యాగఫలంతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాలకు పొట్టి శ్రీరాములే ఆద్యులు. శ్రీరాములు కార్యస్థలి నెల్లూరు కావడంతో ఆ మహనీయుని పేర నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం జరిగింది.

శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలో స్వాతంత్య్రం సాధించవచ్చున్నారు గాంధీజీ. ఈ మాటలు పొట్టి శ్రీరాములులోని కర్తవ్యపరాయణతకు, కార్యదక్షతకు, ధృడసంకల్పానికి నిదర్శనం. భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు ఏకధాటిగా నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు, నాటి పాలకుల నిర్లక్ష్య ధోరణికి ప్రతీకగా నిలిచి ఆత్మార్పణ గావించారు. ఓ ఆదర్శం కోసం, బృహత్తర ఆశయం కోసం ప్రాయోపవేశం చేయగల్గిన అరుదైన వ్యక్తిత్వం శ్రీరాములుది. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రావతరణ భగీరథులు. గాంధేయ సిద్ధాంతానుసరణ మహారథులు. నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక. నిస్వార్థప్రజాసేవకు పతాక. ఆయన దేశాభిమానం అనన్యసామాన్యం ఆ దీక్షా విధానం అచంచలం. గాంధేయ సిద్ధాంతమే పరమార్థంగా భావించిన సంఘసంస్కర్త శ్రీరాములు. మద్యపాన నిషేధం కోసం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేవాదక్షులు. గాంధేయ సిద్ధాంతాన్ని తన బాటగా, బాసటగా భావించి నడిచిన సంస్కరణశీలి. తన ఆత్మార్పణతో ఆనాటి పాలకులకు గుణపాఠం నేర్పిన మహర్షి శ్రీరాములు. తనలోని కర్తవ్య నిర్వహణా యజ్ఞాన్ని, నిబద్ధతను, నిష్ఠను నిరుపమానంగా లోకానికి చాటిన అనితరసాధ్యమైన వ్యక్తిత్వం శ్రీరాములుది.

భార్య, తల్లీ దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాములును గాంధీజీ సాగిస్తున్న స్వాతంత్య్ర పోరాటం ఆకర్షించింది. ఆయనలో దేశభక్తి పెల్లుబికింది. దాస్యశృంఖలాలతో సజలనేత్రాలతో భరతమాత శ్రీరాములుకు అతిదీనంగా కనిపించింది. స్వాతంత్య్ర సమరయోధుల అరుణ రక్తధారలు తళుక్కున మెరిశాయి. దేశమాత దాస్యశృంఖలాలు తెంచడానికి గాంధీ చేస్తున్న సత్యాగ్రహ పోరాటాలు శ్రీరాముల్ని బాగా ఆకర్షించాయి. ఎలాగయినా గాంధీజీని కలవాలనుకున్నారాయన. తాను ఆరాధించే గాంధీజీ సిద్ధాంతాల పట్ల సమ్మోహితుడై, చేస్తున్న శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ఉద్యోగాన్ని వదిలేసి, 1938 ప్రాంతంలో గాంధీజీ సలహా మేరకు సబర్మతీ ఆశ్రమానికి చేరారాయన. మహాత్ముని ఆశయాల మేరకు సబర్మతీ ఆశ్రమంలో సేవ చేశారు. అక్కడే ఆయనకు సర్వోదయ నాయకులు ఆచార్య వినోబా భావే, రామ మనోహర్ లోహియా, జయప్రకాష్‌ నారాయణ్‌ వంటి ఉద్దండులతో పరిచయం, స్నేహం కుదిరింది.

‘‘మీరంతా నా చుట్టూ చేరి భజన చేయడం కాదు, దేశ సేవ కోసం పర్యటనలు చేయండి, స్వాతంత్య్ర దీక్షను ప్రజలకు బోధించండి, సమరశంఖారావం పూరించండ’’ని గాంధీజీ ఉద్భోదించేవారు. ఆయన అనుజ్ఞతో పర్యటనలు చేపట్టాడు శ్రీరాములు. శ్రీరాములులో కులమతాల పట్టింపు ఉండేదికాదు. దళితుల సంక్షేమానికి చట్టాలు చేయమని మద్రాసు ప్రభుత్వంపై ఒత్తిడి తేసాగాడు. దాంతో మద్రాసు ప్రభుత్వం నెలకోరోజు దళిత జనోద్ధరణకై కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించింది. కాళ్ళకు చెప్పులు లేకుండా, గొడుగు లేకుండా ఎర్రటి ఎండలో పలక నినాదంతో హరిజనోద్ధరణ కోసం ఉద్యమించారాయన. గాంధీజీ సమాజంలో అట్టడుగువర్గమైన దళిత జనోద్ధరణకు పూనుకొన్నాడు. ఆ ప్రభావం శ్రీరాములులో బలంగా నాటుకొంది. తమ నిర్మాణ కార్యక్రమంలో అస్పృశ్యతా నివారణను, హరిజనోద్ధరణను సమ్మిళితం గావించి కుల వర్గ రహిత సమాజస్థాపనకై కృషి చేయాలని దీక్షపట్టాడు శ్రీరాములు.

హరిజనులకు దేవాలయ ప్రవేశం కోసం ప్రతినబూనాడు. దేవాలయ ప్రాంగణం అందరికీ సమానమని, దైవ మందిరాలలో హరిజనులకు దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించుకొన్నాడు. దానికి గాంధీజీని ఆహ్వానించాడు. కార్యభారం ఎక్కువ కావడంతో, హరిజన దేవాలయ ప్రవేశం శ్రీరాములునే చేయమని తంతి పంపారు గాంధీజీ. బాపూజీ ఆశీర్వాదం లభించగానే నెల్లూరులో వేణుగోపాలస్వామి ఆలయంలోకి హరిజన ప్రవేశానికి దేవాలయ పాలకధర్మకర్త ఏ.సి.సుబ్బారెడ్డిని ఉపవాసదీక్షతో, మౌనవ్రతంతో అంగీకరింపజేసిన దక్షత శ్రీరాములుది. అలాగే వితంతు వివాహానికి కూడా తనదైన శైలిలో ప్రయత్నించి సఫలమైన గొప్ప సంఘసంస్కర్త, సేవామూర్తి. సహపంక్తి భోజనాలు చేయించాలని, కులమతాల్ని రూపుమాపాలని స్థిరనిశ్చయంతో పనిచేసేవారాయన. గాంధీజీ మార్గంలో అస్పృశ్యతా నివారణకు కృషి చేశారు. పొట్టి శ్రీరాములులోని ఆ అంకితభావమే గాంధీజీని విశేషంగా ఆకర్షించింది. ఆయన అజరామరపోరాటం అబ్బురపరచింది.

భారత జాతీయోద్యమం గాంధీజీ నాయకత్వంతో పటిష్ఠమై పరాకాష్ఠనందుకొంది. స్వాతంత్య్రోద్యమ బలిపీఠమెక్కడానికి స్త్రీ పురుష భేదం లేకుండా ముందుకు వచ్చారు. ప్రజల్లో పిరికితనం తొలగి జైళ్ళంటే భయం తీరింది. ఆత్మార్పణ చేయాలనే భావం పరవళ్ళు తొక్కింది. అహింసాత్మక శాంతిపథంతో తమ లక్ష్యసాధన జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో ప్రబలింది. గాంధీజీ చేత ప్రభావితులైన దేశభక్తుల్లో పొట్టి శ్రీరాములు అగ్రగామి. భారతదేశ రాజకీయ పటంలో మార్పులు జరగడానికీ, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణం పొట్టి శ్రీరాములు బలిదానమే. ఆశయాలను, ఆకాంక్షలను వల్లెవేయడం వరకే పరిమితమైన కాలంలో వాటిని అక్షరాలా ఆచరించి చూపిన ఆదర్శప్రాయుడాయన. సమాజం కోసం ప్రాణాన్ని పణంగాపెట్టిన అసమాన, అసాధారణ త్యాగశీలి. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైంది.

మానవుడు దేన్నైనా జయించగలడు, ఏ ధర్మాన్నైనా ఆచరించగలడు. కాని ఆకలి సమయంలో ధర్మాధర్మాల్ని మరచిపోవడం సహజం. కార్యదీక్షాపరుడు దీనికి అతీతంగా నిలుస్తాడు. శ్రీరాములు ఆర్తులు అర్ధించకపోయినా పరమోత్తమమైన ఉపవాసదీక్ష చేసి 1952, డిసెంబరు 15న ఆత్మత్యాగం చేశాడు.

చిన్ని నారాయణరావు

(నేడు పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి)

Updated Date - 2022-12-15T00:51:55+05:30 IST