జనచేతన బాటల్లో ‘భావి భారత్’

ABN , First Publish Date - 2022-11-25T02:43:46+05:30 IST

ఈటెలీ మెడిసిన్ యుగంలో కూడా ఏ వ్యాధినైనా సరే ఏదో ఒక చూర్ణం (పుడియా)తో నయం చేస్తామనే ‘వైద్యులు’ మనకు సర్వత్రా కనిపిస్తారు. మిమ్ములను బాధిస్తున్న జబ్బు ఏమిటో చెప్పండి...

జనచేతన బాటల్లో ‘భావి భారత్’

ఈటెలీ మెడిసిన్ యుగంలో కూడా ఏ వ్యాధినైనా సరే ఏదో ఒక చూర్ణం (పుడియా)తో నయం చేస్తామనే ‘వైద్యులు’ మనకు సర్వత్రా కనిపిస్తారు. మిమ్ములను బాధిస్తున్న జబ్బు ఏమిటో చెప్పండి. వారు ఒక చిన్న పొట్లం ఇస్తారు. అందులో ఏదో చూర్ణం ఉంటుంది. దాన్ని పరగడుపున లేదా వెచ్చని పాలతో తీసుకోండి, అంతే, మీకు ఉపశమనం కలుగుతందని ఆ ‘వైద్యులు’ భరోసా ఇస్తారు. ‘బస్ ఏక్ పుడియా’ అని రోగ శాస్త్రంపై సాధికారిక స్వరంతో వారు వక్కాణిస్తారు. అవునా? సరే, శతాధిక కోట్ల ప్రజలు ఉన్న మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటా, రెండా? అసంఖ్యాకం కదా. అయినా ఏ సమస్యకు అయినా తిరుగులేని పరిష్కారాలను సూచించేవారూ సంఖ్యానేకంగా ఉన్నారు. పేదరికం? ఇద్దరు బిడ్డల నిబంధనను నిర్బంధంగా అమలుపరిస్తే సరి అని వారు వెన్వెంటనే తేలిగ్గా తీసిపారేస్తారు. కులతత్వం? కుల సూచక పేర్లు పెట్టుకోవడాన్ని నిషేధిస్తే సరిపోదూ? ప్రజాస్వామ్యం పని చేయడం లేదా? దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానాన్ని అనుసరించడం ఉత్తమోత్తమ పరిష్కారమని వేనవేల గొంతులు ఘోషిస్తాయి. నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారా? 60 ఏళ్ల వయస్సు రాగానే రాజకీయవేత్తలు తప్పనిసరిగా ప్రజా జీవితం నుంచి వైదొలిగేలా చట్టబద్ధ చర్యలు తీసుకుంటే సరి. అవినీతి? శక్తిమంతమైన లోక్పాల్ను తీసుకురావాలి. నైతిక భ్రష్టత్వమా? నైతిక విలువల బోధనను తప్పనిసరి చేయాలి. ఇలా ఏ సమస్యకైనా పరిష్కారాలు చెప్పేవారు కోకొల్లలు. ఇవన్నీ ‘పుడియా’ పరిష్కారాలు కావూ? కనుకనే నేను ఇటువంటి దేశ హితులను ‘పుడియావాలా’లు అని అంటాను.

ఇంతకు ముందు నేను ఈ దేశ హిత ‘పుడియావాలా’లతొ వాదిస్తూ ఉండేవాణ్ణి. మన ప్రజల సమస్యలు ఎంత జటిలమైనవో వివరించేందుకు ప్రయత్నించేవాణ్ణి. మీరు సూచిస్తున్న పరిష్కారాలతో అసలు సమస్య తీరక పోగా వాటి నుంచి అదనంగా చెడు ఫలితాలు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పేవాణ్ణి. రోగం కంటే మందు ప్రమాదకరం అయితే ఎలా? అయితే నాది కంఠశోషే అయింది. జాతి సమస్యలకు ‘పుడియా’ పరిష్కారాలను పలువురు తరచు ఈ–మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నా దృష్టికి తీసుకు వస్తుంటారు. వాటిలో అగ్రస్థానం ఎన్నికల, విద్యా సంస్కరణలవే. వాటికి టీవీ ద్వారా ప్రచారం కల్పించాలని పలువురు సాధారణంగా నన్ను అభ్యర్థిస్తుండడం కద్దు. పార్లమెంటు ఒక చట్టం చేసేలా కృషి చేయమని కూడా సూచిస్తుంటారు. లేదూ, సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయమని ప్రశాంత్ భూషణ్ను ప్రోత్సహించమని నన్ను కోరుతుంటారు! ఈ ‘పుడియావాలా’లలో కొంత మంది గుట్టుగా ఉంటారు. తమ అద్భుత పరిష్కారాల గురించి చెప్పనే చెప్పరు. ముఖా ముఖీ సమావేశంలో మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేస్తారు. ఎటువంటి బెడద లేని వినోదమా? ఈ వ్యాసం చివరి వరకు వేచి ఉండండి.

ఇటీవల నాకు నివేదిస్తున్న ‘పుడియా’ల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోయింది. భారత్ జోడో యాత్ర కేవలం ఒక నడక మాత్రమే కాదు. ఆ నడక వెంట ఎన్నో సంభాషణలు సాగుతున్నాయి. పరస్పరంగా, సామూహికంగా మాటలాడుకోవడం జరుగుతోంది. మాటలు, ఆలోచనలతో కూడినవి సుమా! యాత్ర విజయవంతంగా జరుగుతుందనడానికి ఆ ఎడతెగని మాటలే నిదర్శనం. ఏదో ఒక సమస్య ఉన్న వారందరూ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర నాయకులకు తమ సమస్యలను నివేదించేందుకు అందరికీ కాకపోయినా చాలా మందికి అవకాశం లభిస్తోంది. ప్రతి రోజూ వేకువనే పలువురు రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నారు. తమ సమస్యలను నివేదిస్తున్నారు. మెమోరాండం సమర్పిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం అమలుకై వేచి ఉన్న ఆదివాసీలు, అకాల వర్షాల కారణంగా కోతకు వచ్చిన పంటలు కోల్పోయినవారు, వస్తుసేవల పన్ను భారంతో కుంగిపోతున్న చిన్న వ్యాపారస్తులు, విద్వేష నేరాలకు గురవుతున్న ముస్లిం మైనారిటీలు, వివక్ష, హింసను ఎదుర్కొంటున్న మహిళలు, నిరుద్యోగులుగా కునారిల్లుతున్న యువజనులు, అసంఘటిత రంగ కార్మికులు మొదలైన వారు రాహుల్కు తమ సమస్యలను వినిపిస్తున్నారు. ప్రయోజనాత్మక చర్చలు జరుపుతున్నాకని చెప్పితీరాలి.

రాహుల్ గాంధీ వెంట కొద్ది నిమిషాల పాటు నడుస్తూ నడుస్తూ పలువురు వ్యక్తులు, బృందాలు తమ సమస్యలను ఆయనకు చెప్పుతున్నారు. రాహుల్తో నడుస్తూ తమ సమస్యలు నివేదించేందుకు అవకాశం లభించనివారు రోడ్ పక్కన నిలబడి తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు. అందరి సమస్యలనూ రాహుల్ గాంధీ సావధానంగా వింటున్నారు. అనేక అంశాలను ఆసక్తికరంగా అడిగి తెలుసుకుంటున్నారు. నిశిత ప్రశ్నలు వేస్తున్నారు.

అనేకానేక ఆందోళనలతో సతమతమవుతున్న వారి సంగమంగా, ప్రజా విధానం (పబ్లిక్ పాలసీ) పై ఒక నడుస్తున్న తరగతి గదిగా, నైరాశ్య తీరాన కదులుతున్న ఒక ఆశాజనక దీపస్తంభంలా భారత్ జోడో యాత్ర పరిణమించింది. ఉర్దూ కవితా జగత్తు ఉద్ఘోషించినట్టు మరే ఇతర బంధం కంటే బాధా బంధం (దర్ద్ కా రిష్టా) ప్రగాఢమైనది. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చోపచర్చలు జరుగుతున్నప్పుడు పుడియావాలాలు వాటిలో పాల్గొనకుండా ఉంటారా? వారు లేకపోతే జోడోయాత్ర వివర్ణమవుతుంది.

రాహుల్ గాంధీకి ఇవ్వలేక పోయిన ‘పుడియా’లు నా వద్దకు వస్తున్నాయి. దేశ సమస్యలకు వివిధ పరిష్కారాలను నాకు విపులీకరిస్తున్నారు. నేను ఓపిగ్గా వినడం తప్పనిసరి. మనం తప్పనిసరిగా కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించి, ప్రభుత్వోద్యోగాలను ప్రతి కులానికి, దేశ జనాభాలో దాని వాటాను బట్టి కేటాయించాలి. రైతులు ఈ సాంకేతికతనో లేదా సాంకేతికతనో ఉపయోగించుకుంటే వారి ఆదాయం తప్పక పది రెట్లు పెరుగుతుంది. ఈ రోజుల్లో అనేకానేక సాఫ్ట్వేర్ పుడియాలు లభిస్తున్నాయి. ఒక నిర్దిష్ట సాఫ్ట్వేర్ను ప్రభుత్వ కార్యాలయాలలోని కంప్యూటర్లలో వినియోగిస్తే అవినీతికి ఆస్కారముండదు. కస్టమర్ల వ్యక్తిగత డేటాకు కంపెనీలు చెల్లింపులు జరిపితే ద్రవ్యోల్బణమనేది ఉండదు... ఇలా ఎన్నెన్నో పరిష్కారాలను సూచిస్తున్నారు.

జాతి సమస్యలకే కాదు, దేశ రాజకీయాలకు కూడా ఎంతో మంది పుడియాలను ప్రతిపాదిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఎలా? ప్రతి ఒక్కరూ తమదైన సూచన చేశారు. దాన్ని పాటిస్తే రాజకీయ అద్భుతం సంభవిస్తుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. అదలా ఉంచితే రాహుల్ గాంధీ ఎలా కనిపించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అనే పలువురు పలు విధాలుగా నిర్దేశించారు. వీటన్నిటినీ ఓపిగ్గా వినడం నా బాధ్యత. అవకాశం లభిస్తే అన్నిటినీ రాహుల్కు నివేదిస్తానని మాట ఇస్తున్నాను మరి.

సరే, ఒక విషయమై ఈ వ్యాసం చివరివరకు వేచి ఉండమని మీకు చెప్పాను కదా. ఇప్పుడు అదే విషయానికి వస్తున్నాను. ఇది 2014 సంవత్సరాంతంలో ఫుణేలో సంభవించింది. . నాకు ఏ మాత్రం తెలియని, ఆ మాటకొస్తే అప్పట్లో చాలా మందికి సైతం తెలియని చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లతో కూడిన ఆర్థిక సలహా సంఘం ఒకటి భారతదేశ సమస్త సమస్యలకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఆ విద్యాధికులు ఆ పరిష్కారాన్ని నా దృష్టికీ తీసుకువచ్చారు. నల్లధనం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యలోటు, ఉగ్రవాదం మొదలైన వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన అది. అది నాకేమీ ఆసక్తి కలిగించలేదు. తాము స్వయంగా వచ్చి ఆ ప్రతిపాదనపై మీతో చర్చిస్తామని, అపాయింట్మెంట్ ఇవ్వమని వారు కోరారు. నేను ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను. అయితే ఆ తరువాత నేను మళ్లీ పుణేకు వెళ్లినప్పుడు వారి అభ్యర్థనను కాదనలేకపోయాను. పుణే యూనివర్శిటీ గెస్ట్హౌజ్లో ఇరవై నిమిషాల పాటు సమావేశమయ్యేందుకు అంగీకరించాను.

‘అర్థక్రాంతి సంస్థాన్’ అనే ఆ ఆర్థిక, ఇంజనీర్ల బృందం ప్రతిపాదన తీవ్రమైనది. ఇదీ ఆ ప్రతిపాదన: ‘అన్ని పన్నులనూ రద్దుచేయాలి. వాటి స్థానంలో బ్యాంకింగ్ లావాదేవీలపై ఒకే పన్ను విధించాలి. ఇందుకు నగదు రూపేణా జరిగే అన్ని లావాదేవీలను తొలగించాలి. ఇందుకు రూ. 100, అంతకు మించిన విలువ గల కరెన్సీ నోట్లు అన్నిటినీ రద్దు చేయాలి’. ఇదొక అర్థరహిత ప్రతిపాదన అని నేను భావించాను. బ్యాంకింగ్ లావాదేవీలపై పన్ను విధిస్తే ఆర్థిక కార్యకలాపాలు నల్ల బజారుకు తరలుతాయని నేను చెప్పాను. పెద్ద నోట్ల రద్దు నల్ల ధనాన్ని ఎలా తగ్గిస్తుందో నాకు అర్థం కావడం లేదని స్పష్టం చేశాను. దానివల్ల నల్ల ధనం మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుందని చెప్పాను. ప్రతి ప్రశ్నకు వారి వద్ద ఒక సమాధానం ఉంది. అయితే వారి వాదనలు నాకు సమంజసమైనవిగా కన్పించలేదు. వాదోపవాదాలు అలా సాగుతుంటే మీతో నేను మరోసారి సమావేశమయ్యేలోగా ఎవరైనా ఒక ప్రముఖ ఆర్థికవేత్తతో మీ ప్రతిపాదన గురించి కూలంకషంగా చర్చించండి అని సూచించాను. వారు వెళ్లిపోయే ముందు ఒక విషయాన్ని ప్రస్తావించారు. తమ ప్రతిపాదన గురించి నరేంద్ర మోదీతో సమగ్రంగా చర్చించారట. కేవలం తొమ్మిది నిమిషాల పాటే సమావేశమయ్యేందుకు తొలుత అంగీకరించిన మోదీజీ రెండు గంటల పాటు తాము చెప్పింది సావధానంగా విన్నారని వారు ఉత్సాహంగా చెప్పారు. నేను నిర్ఘాంతపోయాను. నరేంద్ర మోదీ అప్పటికే ప్రధానమంత్రిగా ఉన్నారు. మోదీ ఆ ‘అర్థక్రాంతి’ కారులతో సమావేశమయిన అనంతరం సంభవించిన చరిత్ర ఏమిటో మరి చెప్పాలా?!

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-11-25T02:43:50+05:30 IST